ఆర్‌బీఐ రూటు ఎటు..? | RBI rate cut at next week’s monetary policy review isn’t a given | Sakshi
Sakshi News home page

ఆర్‌బీఐ రూటు ఎటు..?

Published Mon, Feb 6 2017 2:20 AM | Last Updated on Tue, Sep 5 2017 2:58 AM

ఆర్‌బీఐ రూటు ఎటు..?

ఆర్‌బీఐ రూటు ఎటు..?

రేట్ల కోతపై ఉత్కంఠ...
యథాతథమేనని ఫిక్కీ అంచనా
►  తగ్గించే చాన్స్‌ ఉందంటున్న బ్యాంకర్లు
►  8న పాలసీ సమీక్ష  


న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు(డీమోనిటైజేషన్‌) ప్రక్రియ దాదాపు పూర్తయిన నేపథ్యంలో ఈ నెల 8న (బు«ధ వారం) చేపట్టనున్న ఆర్‌బీఐ పాలసీ సమీక్షపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా నోట్ల రద్దు తర్వాత బ్యాంకుల్లోకి వెల్లువెత్తిన డిపాజిట్‌ నిధుల ప్రభావం, అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు ఎగబాకుతుండటంతో ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం పొంచిఉండటం వంటి అంశాలతో పాలసీ రేట్లను ఆర్‌బీఐ యథాతథంగా కొనసాగించే అవకాశాలు ఉన్నాయన్న అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే, సేవల రంగం వరుసగా మూడో నెలలోనూ(జనవరి) క్షీణించడం చూస్తే.. రేట్ల కోత ఉండొచ్చని కొందరు బ్యాంకర్లు, విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా, నోట్ల రద్దుతో భారీగా నిధులు వచ్చిచేరడంతో బ్యాంకులు గత నెలలో రుణ రేట్లను ఒక శాతం వరకూ తగ్గించిన సంగతి తెలిసిందే.

ఆర్‌బీఐ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి పాలసీ సమీక్షలో ఉర్జిత్‌ పటేల్‌ రెపో రేటును పావు శాతం తగ్గించి 6.25 శాతానికి చేర్చారు. ఆరుగురు సభ్యుల పరపతి విధాన కమిటీ(ఎంపీసీ) తొలి భేటీలోనే ఈ నిర్ణయం వెలువడింది. అయితే, నవంబర్‌ 8న రూ.1,000; రూ.500 నోట్లను రద్దు చేస్తున్న ప్రధాని మోదీ ప్రకటించిన నేపథ్యంలో డిసెంబర్‌లో జరిగిన భేటీలో కచ్చితంగా పావు శాతం కోత ఉండొచ్చని ఎక్కువ మంది అంచనా వేశారు. దీనికి భిన్నంగా ఆర్‌బీఐ మాత్రం పాలసీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. కానీ జనవరిలో బ్యాంకులు వరుసగా రుణ రేట్లను భారీగా తగ్గించడంతో ఆర్‌బీఐపై ఒత్తిడి కాస్త తగ్గినట్లయింది. ప్రస్తుతం రెపో రేటు(ఆర్‌బీఐ నుంచి తీసుకునే స్వల్పకాలిక రుణాలపై బ్యాంకులు చెల్లించే వడ్డీ రేటు) 6.25%, రివర్స్‌ రెపో(ఆర్‌బీఐ వద్ద ఉంచే నిధులపై బ్యాంకులకు లభించే వడ్డీ రేటు) 5.75 శాతం, నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్‌ఆర్‌– బ్యాంకులు తమ డిపాజిట్‌ నిధుల్లో ఆర్‌బీఐ వద్ద కచ్చితంగా ఉంచాల్సిన పరిమాణం) 4 శాతంగా కొనసాగుతున్నాయి.

అంతర్జాతీయ పరిణామాల ప్రభావం...
ఆర్‌బీఐ రేట్ల కోత నిర్ణయానికి ప్రధానంగా అంతర్జాతీయ పరిణామాలే అడ్డంకిగా భావిస్తున్నారు. ముడి చమురు ధర ఎగబాకుతుండటం.. అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అమలు చేస్తున్న పలు రక్షణాత్మక వాణిజ్య విధానాలు భారత్‌తోపాటు అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపనున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.  పారిశ్రామిక మండలి ఫిక్కీ... ఆర్‌బీఐ రానున్న పాలసీ సమీక్షలో రేట్లను యథాతథంగా ఉంచుతుందని పేర్కొంది. అయితే, 2017–18 ప్రథమార్ధంతో రేట్లను తగ్గించే అవకాశం ఉందని అంటోంది.

బ్యాంకర్లు అటూఇటూ...
బ్యాంకుల వద్దకు భారీగా డిపాజిట్‌ నిధులు వచ్చి చేరిన నేపథ్యంలో ఆర్‌బీఐ రానున్న పాలసీలో రేట్లను తగ్గించకపోవచ్చని బంధన్‌ బ్యాంక్‌ ఎండీ చంద్ర శేఖర్‌ఘోష్‌ అభిప్రాయపడ్డారు. అయితే, మరికొందరు బ్యాంకర్లు మాత్రం కోతకు ఆస్కారం ఉందని భావిస్తున్నారు. ‘ద్రవ్యలోటు, ద్రవ్యోల్బణం వంటి స్థూల ఆర్థిక అంశాలన్నీ రెపో తగ్గింపునకు అనుకూలంగానే ఉన్నాయి. వృద్ధికి చేయూతనిచ్చేవిధంగా కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌ చర్యలు ప్రకటించింది. ఇక ఆర్‌బీఐ కూడా దీనికి అనుగుణంగానే పాలసీ నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నాం. 8న సమీక్షలో పావు శాతం రెపో కోతను అంచనా వేస్తున్నాం’ అని బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర ఈడీ ఆర్‌కే గుప్తా వ్యాఖ్యానించారు. బ్యాంకింగ్‌ వ్యవస్థలో అధిక ద్రవ్య సరఫరా(లిక్విడిటీ) ఉండటంతో పావు శాతం రెపో కోతకు ఆస్కారం ఉందని యూకో బ్యాంక్‌ ఎండీ సీఈఓ ఆర్‌కే టక్కర్‌ పేర్కొన్నారు.

ముప్పావు శాతం తగ్గించాలి: అసోచామ్‌
డీమోనిటైజేషన్‌తో చౌక డిపాజిట్‌ నిధుల రూపంలో బ్యాంకులకు భారీగా లాభం చేకూరిందని.. దీన్ని రుణగ్రహీతలకు పూర్తిస్థాయిలో బదలాయించాల్సిన అవసరం ఉందని పారిశ్రామిక మండలి అసోచామ్‌ పేర్కొంది. ‘ఆర్‌బీఐ రెపో రేటును 0.5–0.75 శాతం మేర తగ్గించాల్సిందే. ఈ కోతను బ్యాంకులు కూడా రుణ గ్రహీతలకు బదలాయించేలా ఆర్‌బీఐ, ఆర్థిక శాఖ చర్యలు తీసుకోవాలి. రుణవృద్ధి మందగమనం.. వినియోగ డిమాండ్‌ పడిపోయిన నేపథ్యంలో పెట్టుబడులకు పునరుత్తేజం కల్పించాలంటే వడ్డీ రేట్ల తగ్గింపు చాలా కీలకం’ అని ఆసోచామ్‌ ప్రెసిడెంట్‌ సునీల్‌ కనోరియా ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఈ ఏడాదికి పావు శాతమే..: నోమురా
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌.. ద్రవ్యోల్బణం విషయంలో మధ్యకాలానికి సానుకూలంగానే(ద్రవ్యలోటు లక్ష్యాలకు కట్టుబడి ఉండటం ఇతరత్రా ఆర్థిక క్రమశిక్షణ చర్యలు) ఉందని.. ఈ నేపథ్యంలో రానున్న సమీక్షలో ఆర్‌బీఐ పావు శాతం రెపో రేటును తగ్గించొచ్చని జపాన్‌ ఆర్థిక సేవల దిగ్గజం నోమురా పేర్కొంది. అధిక క్రూడ్‌ ధరలు ఇతరత్రా విదేశీ అంశాల ప్రభావం ఉన్నప్పటికీ.. ఆర్‌బీఐ కోతకే మొగ్గుచూపొచ్చని అభిప్రాయపడింది. అయితే, దీనితర్వాత ఈ ఏడాదిలో(2017) ఇక తగ్గింపులు ఉండకపోవచ్చనేది నోమురా అంచనా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement