ఇప్పట్లో ఆర్‌బీఐ రేట్లు తగ్గవ్
పాలసీ రేట్లు యథాతథం
• రేట్లలో మార్పు లేకపోవడం ఇది వరుసగా రెండవసారి
• ఇక ముందు తగ్గింపు కష్టమని సూచన
• ద్రవ్యోల్బణం, నోట్ల రద్దు ప్రభావాలపై మరింత స్పష్టత కోసం ఎదురుచూపు
• వృద్ధి అంచనా 7.1 శాతం నుంచి 6.9 శాతానికి కోత
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) బుధవారంనాటి తన ద్రవ్యపరపతి విధాన సమీక్షలో కీలక రేట్లకు సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. దీనితో రెపో, రివర్స్ రెపో, నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్‌ఆర్) వంటి కీలక రేట్లు యథాతథంగా కొనసాగనున్నాయి.
ఎందుకంటే...
విధానం యథాతథంగా కొనసాగించడానికి పలుకారణాలనూ కమిటీ సూచించింది. ద్రవ్యోల్బణంపై అలాగే రూ.500, రూ.1,000 నోట్ల రద్దు ప్రభావాలపై మరింత స్పష్టత రావాలన్నది వీటిలో కీలకమైనవి. ఉత్పత్తి, సరఫరాల పరిస్థితి కూడా పరిశీలించాల్సిన అవసరం ఉందని ఆర్‌బీఐ పేర్కొంది. మొత్తంమీద ఇప్పటి వరకూ రేట్ల తగ్గింపునకు సంబంధించి సరళతర విధానాన్ని అవలంబించిన ఆర్‌బీఐ ఇక ఈ విధానానికి స్వస్తి చెప్పినట్లేననీ సూచించింది. దీనితో రేట్ల తగ్గింపునకు సంబంధించి ఆర్‌బీఐ విధానం ‘‘తగిన ధోరణి’’ నుంచి ‘‘తటస్థం’’ వైపునకు మారినట్లయ్యింది.
ముఖ్యాంశాలు చూస్తే...
⇔ బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు 6.25 శాతంగా కొనసాగనుంది. ఇది ఆరేళ్ల కనిష్ట స్థాయి. 2015 జనవరి నుంచీ ఆర్‌బీఐ 175 బేసిస్ పాయింట్లు (1.75 శాతం)రెపో రేటును తగ్గించింది.
⇔ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటును 7.1 శాతం నుంచి 6.9 శాతానికి తగ్గించింది. అయితే వచ్చే ఆర్థిక సంవత్సరం ఈ రేటు 7.4 శాతానికి పెరుగుతుందని భావిస్తున్నట్లూ వివరించింది.
⇔ వచ్చే ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో ద్రవ్యోల్బణం శ్రేణి 4 నుంచి 4.5 శాతంగా ఉంటుంది. తరువాత ఆరు నెలలో 4.5 శాతం నుంచి 5 శాతంగా ఉండవచ్చు. నాలుగు శాతం వద్ద ద్రవ్యోల్బణం కట్టడికి కట్టుబడి ఉన్నట్లు ఆర్‌బీఐ తెలిపింది. అలాగే పెద్ద నోట్ల రద్దు ప్రభావం నిత్యావసరాలు, ఇతర ఆహార ధరలపై పడలేదనీ గవర్నర్ ఉర్జిత్ పటేల్ పేర్కొన్నారు. చమురు, కరెన్సీ ధరల్లో ఒడిదుడుకులు ద్రవ్యోల్బణానికి సవాలని వివరించింది.
⇔ తన నిర్వహణ, పర్యవేక్షణా చర్యలు పటిష్టంగా అమలయ్యేలా చూడడం కోసం ప్రత్యేక కార్యాచరణ బృందం ఏర్పాటుకు ఆర్‌బీఐ నిర్ణయం.
⇔ 2017లో ప్రపంచ వృద్ధి ఒక మోస్తరుగా ఉండే వీలుంది.
⇔ అభివృద్ధి చెందిన దేశాల్లో రక్షణాత్మక విధానాల అమలు పెరగడం వల్ల ప్రపంచ వాణిజ్యం తగ్గే అవకాశాలు ఉన్నాయి.
⇔ పెద్ద నోట్ల రద్దు ప్రభావం సేవలు, దేశీయ విమాన, రైల్వే రవాణా, ఆటోమొబైల్ అమ్మకాలు, సిమెంట్ ఉత్పత్తిపై ప్రభావం చూపినట్లు హై ఫ్రీకెన్సీ ఇండికేటర్స్ సూచిస్తున్నాయి. అయితే స్టీల్ వినియోగం, పోర్ట్ ట్రాఫిక్, విదేశీ పర్యాటకుల రాక, అంతర్జాతీయ విమాన రవాణా విభాగాలు ఇబ్బందులను తట్టుకుని నిలబడ్డాయి.
⇔ మొండిబకాయిల సమస్య త్వరగా తగ్గడం, బ్యాంకులకు పెద్ద ఎత్తున మూలధన కల్పన వంటి అంశాలు రుణాలపై వడ్డీ రేటును మరింత దిగివచ్చేలా చేయడానికి దోహదపడతాయి.
⇔ తదుపరి ఆర్‌బీఐ పాలసీ సమీక్ష ఏప్రిల్ 5, 6 తేదీల్లో జరుగుతుంది.
నిర్ణయం ఏకగ్రీవం...
రెపో రేటు యథాతథంగా కొనసాగించాలన్న అంశంపై ఎంపీపీలోని ఆరుగురు సభ్యులూ ఏకాభిప్రాయానికి వచ్చారు. గత ఏడాది సెప్టెంబర్‌లో ఎంపీపీ ఏర్పాటయిన తర్వాత జరిగిన ప్రతి పాలసీ సమీక్షలోనూ ఆరుగురు సభ్యులు ఏకాభిప్రాయ ప్రాతిపదికన నిర్ణయం తీసుకుంటుండడం గమనార్హం. తన తొలి సమావేశంలో కమిటీ వడ్డీరేట్లను 0.25 శాతం తగ్గించింది. డిసెంబర్‌లోనూ అలాగే తాజా సమీక్షల్లో రేట్లను మార్చలేదు.
► ఎవరేమన్నారంటే..
బ్యాంకుల రేట్లు తగ్గాలి
ఇప్పుడు బ్యాంకులు తమ రుణ రేటును తగ్గించాలి. రుణ మంజూరీలో ప్రత్యేకించి చిన్న తరహా పరిశ్రమలు, హౌసింగ్, వ్యక్తిగత రుణాలవైపు దృష్టి సారించాలి. ద్రవ్యలోటు 3.2% లక్ష్యం సాధ్యమవుతుంది. – శక్తికాంత్‌దాస్, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి
ఊహించిన విధంగానే..
ఆర్‌బీఐ విధానం ఊహించిన విధంగానే ఉంది. ఇక రేట్లు తగ్గించలేని పరిస్థితికి విధానం మారింది. దేశీ, అంతర్జాతీయ పరిస్థితులు దీనికి కారణం. ఎన్‌పీఏలు తగ్గడం, మూలధన కల్పన, పొదుపురేట్ల పెరుగుదల ద్వారా రుణ రేట్లు మరింత తగ్గుతాయన్న ఆర్‌బీఐ అంచనాలు తగిన విధంగా ఉన్నాయి. – అరుంధతీ భట్టాచార్య, ఎస్‌బీఐ చీఫ్
సమతుల్యతను సూచిస్తోంది...
అంతర్జాతీయంగా, దేశీయంగా నెలకొన్న ఇబ్బందుల రీత్యా ఆర్‌బీఐ తగిన పాలసీ విధానాన్ని అవలంబించింది. కమోడిటీ ధరలు, ద్రవ్యోల్బణం ఒడిదుడుకులను పరిగణనలోకి తీసుకుంది. ద్రవ్యోల్బణం– వృద్ధి మధ్య సమతుల్యం అవసరమని పాలసీ సూచి స్తోంది. ఇది దీర్ఘకాలిక వృద్ధికి దారితీసే అంశం. – చందా కొచర్, ఐసీఐసీఐ బ్యాంక్
ద్రవ్యోల్బణమే కీలకం
ఆర్‌బీఐ నిర్ణయానికి ద్రవ్యోల్బణం అం శాలే కీలకం. మొండిబకాయిల సమస్య పరిష్కారానికి చర్యలు, ప్రభుత్వ రంగ బ్యాంకులకు తాజా మూలధన కల్పన, ప్రభుత్వ సెక్యూరిటీలకు అనుగుణంగా చిన్న పొదుపు స్కీమ్‌లకు వడ్డీరేట్ల నిర్ణయం... ఇవన్నీ బ్యాంకింగ్‌కు సానుకూల అంశాలు. – రాజీవ్ రిషి, ఐబీఏ చైర్మన్