రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశం సోమవారం ప్రారంభమైంది. ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కమిటీ రెపోరేటు(ఆర్‌బీఐ బ్యాంకులకు ఇచ్చే రుణాలపై వసూలుచేసే వడ్డీరేటు-ప్రస్తుతం 6.5 శాతం)ను తగ్గించాలా? వద్దా అనే నిర్ణయంపై ఈ సమావేశంలో స్పష్టత రానుంది. కమిటీ తీసుకునే నిర్ణయాలను గవర్నర్ శక్తికాంతదాస్ ఈ నెల 9వ తేదీన వివరిస్తారు.
యథాతథ స్థితికే ఓటు..!
కమిటీ కీలక వడ్డీరేట్లను యథాతథ స్థితిలోనే కొనసాగించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం, దాంతో పొంచిఉన్న ద్రవ్యోల్బణం భయాలు ఇందుకు ప్రధాన కారణమని చెబుతున్నారు. అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్, యూరోపియన్ సెంట్రల్ బ్యాంకులు సరళతర రేటు విధానాన్ని అనుసరిస్తున్నప్పటికీ దేశీయంగా ఆర్‌బీఐ ఆ తరహా నిర్ణయాలు తీసుకోకపోవచ్చని నిపుణుల అంచనా. 2023 ఫిబ్రవరి నుంచి ఆర్‌బీఐ యథాతథంగా 6.5 శాతం రెపో రేటును కొనసాగిస్తోంది. పరిస్థితులు అనుకూలిస్తే, డిసెంబర్‌లో జరిగే ఎంపీసీ సమావేశంలో రేటు తగ్గింపు ఉండవచ్చని అభిప్రాయ పడుతున్నారు.
ఇదీ చదవండి: కస్టమర్ల నుంచి 10 వేల ఫిర్యాదులు
భేటీలో ముగ్గురు కొత్త సభ్యులు
ఆర్‌బీఐ తాజా ద్రవ్య పరపతి విధాన కమిటీని ప్రభుత్వం ఈ నెలారంభంలో పునర్‌వ్యవస్థీకరించిన సంగతి తెలిసిందే. ఎక్స్‌టర్నల్ సభ్యులుగా రామ్ సింగ్, సౌగత భట్టాచార్య, నగేష్ కుమార్‌లను కేంద్రం ఈ నెల ప్రారంభంలో నియమించింది. పదవీ కాలం ముగిసిన అషిమా గోయల్, శశాంక భిడే, జయంత్ ఆర్ వర్మ స్థానంలో వీరి నియామకం జరిగింది. గత ద్వైమాసిక సమావేశాల్లో అషిమా గోయల్, జయంత్ ఆర్ వర్మలు రేటు తగ్గింపునకు ఓటు వేసిన సంగతి తెలిసిందే. తాజాగా నియమితులైన వారితో పాటు కమిటీలో అంతర్గత (ఆర్‌బీఐ తరఫున) సభ్యులుగా గవర్నర్ శక్తికాంతదాస్, డిప్యూటీ గవర్నర్ మైఖేల్ దేబబ్రత పాత్ర, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఆర్‌బీఐ పరపతి విధాన విభాగం) రాజీవ్ రంజన్‌లు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment