నోట్ల రద్దు ప్రభావంపై అస్పష్టతే అడ్డుపడింది: పటేల్
• ధరల పెరుగుదల సంకేతాలు కారణమే
• రుణ రేట్లను ఇంకా తగ్గించేందుకు బ్యాంకులకు అవకాశం ఉందని వెల్లడి
ముంబై: ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) బుధవారం నాటి సమీక్షా సమావేశంలో తప్పకుండా కీలక రేట్ల కోత ఉంటుందని అధిక శాతం అంచనాలున్నాయి. కనీసం పావు శాతమైనా కోత ఉంటుందని ఆశించారు. కానీ, రేట్లు యథాతథంగా కొనసాగిస్తూ ఆర్‌బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ ఆధ్వర్యంలోని ఎంపీసీ కమిటీ నిర్ణయం తీసుకుని ఆశ్చర్యపరిచింది. నిజానికి ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందో ఉర్జిత్ వివరించారు.
స్పష్టత లేదు...
పెద్ద నోట్ల రద్దు తర్వాత స్థూల ఆర్థిక రంగంపై దాని ప్రభావం ఏ మేరకు అన్న స్పష్టమైన సమాచారం లేకపోవడం వల్లే రేట్ల కోత నిర్ణయాన్ని తీసుకోలేకపోయినట్టు పటేల్ చెప్పారు. అలాగే, ధరల పెరుగుదలకు అనుకూలంగా అంతర్జాతీయ సంకేతాలు ఉండడం, ద్రవ్యోల్బణ కట్టడిపై ప్రధానంగా దృష్టి పెట్టడం వంటివి సైతం యథాతథ స్థితిని కొనసాగించేలా చేసినట్టు చెప్పారు. ఈ అస్థిరమైన ప్రభావాలను పరిగణనలోకి తీసుకుంటూనే ద్రవ్యోల్బణానికి సంబంధించి స్పష్టమైన అంచనాల కోసం వేచిచూస్తున్నట్లు ఉర్జిత్ పటేల్ విలేకరులకు తెలిపారు.
వృద్ధి ప్రాధమ్యాలను దృష్టిలో ఉంచుకుని వినియోగ ధరల ఆధారిత ద్రవ్యోల్బణం 4 శాతం లక్ష్యాన్ని సాధించేందుకు ఎంపీసీ కట్టుబడి ఉన్నట్టు చెప్పారు. డిసెంబర్ నెల రిటైల్ ద్రవ్యోల్బణం 3.4 శాతానికి దిగొచ్చినప్పటికీ, చమురేతర, ఆహారేతర ద్రవ్యోల్బణం 4.8 శాతం స్థాయిలో కొనసాగుతున్న విషయాన్ని పటేల్ గుర్తు చేశారు. బ్యాంకులు ఇటీవల రుణాలపై వడ్డీ రేట్లను కొంత తగ్గించినప్పటికీ, రేట్లను మరింత తగ్గించేందుకు అవకాశం ఉన్నట్టు పటేల్ అభిప్రాయపడ్డారు.