Diminutization
-
నోట్ల రద్దు చెత్త ఆలోచన!
న్యూయార్క్: మోదీ సర్కారు 2016 నవంబర్‌లో తీసుకున్న పెద్ద నోట్ల రద్దు(డీమోనిటైజేషన్) నిర్ణయంపై ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ మరోసారి విమర్శల బాణం ఎక్కుపెట్టారు. అది మంచి ఆలోచన కాదని అప్పుడే తాను ప్రభుత్వానికి స్పష్టంగా చెప్పానని వెల్లడించారు. అంతేకాకుండా వ్యవస్థలో ఉన్న 87.5 శాతం విలువైన కరెన్సీ నోట్లను రద్దు చేసే ప్రక్రియను తగిన ప్రణాళిక లేకుండా చేపట్టారని కూడా ఆయన కుండ బద్దలుకొట్టారు. విఖ్యాత హార్వర్డ్ కెనడీ స్కూల్లో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, డీమోనిటైజేషన్ నిర్ణయాన్ని అమలు చేసేముందు ప్రభుత్వం ఆర్బీఐని సంప్రదించలేదన్న వాదనలను రాజన్ తోసిపుచ్చారు. 2016 నవంబర్ 8న మోదీ ప్రభుత్వం రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. వీటి స్థానంలో కొత్తగా మళ్లీ రూ.2,000, రూ.500 నోట్లను వెంటనే ప్రవేశపెట్టారు. తర్వాత రూ.200 నోటును కూడా తీసుకొచ్చారు. అయితే, తగినన్ని నోట్లు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు పడరాని పాట్లుపడ్డారు. రాజన్ హయాంలోనే నోట్ల రద్దుపై ప్రభుత్వం కార్యాచరణను మొదలుపెట్టినప్పటికీ, 2016 సెప్టెంబర్‌లో ఆయన పదవీకాలం పూర్తయ్యాక ప్రస్తుత గవర్నర్ ఉర్జిత్ పటేల్ హయాంలో దీన్ని అమలు చేసింది. అప్పట్లో తాను రెండోసారి గవర్నర్‌గా కొనసాగాలని భావించినా ప్రభుత్వం మొగ్గుచూపలేదని కూడా రాజన్ చెప్పడం తెలిసిందే. నోట్ల రద్దు ఇతరత్రా అంశాల్లో మోదీ సర్కారుతో తలెత్తిన విభేదాలే దీనికి ప్రధాన కారణం. ప్రస్తుతం రాజన్ షికాగో యూనివర్సిటీలోని బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్‌గా తన పాత విధుల్లో కొనసాగుతున్నారు. తగినన్ని నోట్లు సిద్ధం కాకుండానే... ‘వ్యవస్థలో ఉన్న 87.5 శాతం విలువైన నోట్లను రద్దు చేయాలంటే ముందుగా దానికి తగ్గట్టుగా కరెన్సీ నోట్లను ముద్రించి చలామణీలోకి తీసుకొచ్చేందుకు సిద్ధపడాలి. ఏ ఆర్థికవేత్త అయినా ఇదే చెబుతారు. అయితే, భారత ప్రభుత్వం ఇలాంటి కసరత్తును పూర్తిగా చేయకుండానే ఆదరాబాదరాగా డీమోనిటైజేషన్ను ప్రకటించింది. దీనివల్ల ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది. ఈ నిర్ణయంతో ప్రజలు నల్ల ధనాన్ని నేలమాళిగల్లోంచి బయటకు తెచ్చేసి, లెంపలేసుకొని పన్నులు కట్టేస్తారనేది ప్రభుత్వం ఆలోచన. అయితే, ఇది అవివేకమైన నిర్ణయం అనేది నా అభిప్రాయం. ఎందుకంటే ప్రజలు కొత్త వ్యవస్థలకు వేగంగా అలవాటుపడిపోయి, కొత్త దారులు వెతుక్కుంటారన్న విషయాన్ని ప్రభుత్వం మరిచిపోయింది. రద్దు చేసిన నోట్లకు సమానమైన మొత్తం వ్యవస్థలోకి మళ్లీ తిరిగివచ్చేసిందంటే, ప్రభుత్వం ఏ ఉద్దేశంతో దీన్ని చేపట్టిందో అది నెరవేరనట్టే లెక్క. ప్రత్యక్షంగా దీని ప్రభావంలేదని తేటతెల్లమైంది. కరెన్సీకి కటకటతో ప్రజలు ఇబ్బందుల పాలు కావడం ఒకెత్తు అయితే, ఆర్థిక కార్యకలాపాలు స్తంభించడంతో అసంఘటిత రంగంలో భారీగా ఉద్యోగాలు ఊడిపోయాయి. అయితే, దీర్ఘకాలంలో దీనివల్ల ఎలాంటి ప్రభావం పడుతుందనేది వేచి చూడాలి. ప్రధానంగా పన్నుల వసూళ్లపై ప్రభుత్వం గనుక సీరియస్‌గా దృష్టిసారిస్తే... ఖజానాకు ఆదాయం పెరుగుతుంది. ఇది నెరవేరిందని బలంగా నిరూపితం అయితేనే సానుకూల ప్రభావం ఉన్నట్లు లెక్క. నా వరకూ అయితే, ఆ సమయంలో నోట్ల రద్దు అనేది నిరుపయోగమని భావించా’ అని రాజన్ వివరించారు. జీఎస్టీ మంచిదే, కానీ... వస్తు, సేవల పన్ను(జీఎస్టీ)ను మెరుగ్గా అమలు చేయగలిగితే భారత్ ఆర్థిక వ్యవస్థకు మంచిదేనని రాజన్ వ్యాఖ్యానించారు. ‘ఇదేమీ సరిదిద్దలేనంత పెద్ద సమస్య కాదు. అయితే, మరింతగా కసరత్తు చేయాల్సి ఉంటుంది. జీఎస్టీపై నాకు ఇంకా విశ్వాసం ఉంది’ అని పేర్కొన్నారు. -
ఆర్బీఐ రూటు ఎటు..?
► రేట్ల కోతపై ఉత్కంఠ... ► యథాతథమేనని ఫిక్కీ అంచనా ► తగ్గించే చాన్స్ ఉందంటున్న బ్యాంకర్లు ► 8న పాలసీ సమీక్ష న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు(డీమోనిటైజేషన్) ప్రక్రియ దాదాపు పూర్తయిన నేపథ్యంలో ఈ నెల 8న (బు«ధ వారం) చేపట్టనున్న ఆర్బీఐ పాలసీ సమీక్షపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా నోట్ల రద్దు తర్వాత బ్యాంకుల్లోకి వెల్లువెత్తిన డిపాజిట్ నిధుల ప్రభావం, అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు ఎగబాకుతుండటంతో ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం పొంచిఉండటం వంటి అంశాలతో పాలసీ రేట్లను ఆర్బీఐ యథాతథంగా కొనసాగించే అవకాశాలు ఉన్నాయన్న అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే, సేవల రంగం వరుసగా మూడో నెలలోనూ(జనవరి) క్షీణించడం చూస్తే.. రేట్ల కోత ఉండొచ్చని కొందరు బ్యాంకర్లు, విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా, నోట్ల రద్దుతో భారీగా నిధులు వచ్చిచేరడంతో బ్యాంకులు గత నెలలో రుణ రేట్లను ఒక శాతం వరకూ తగ్గించిన సంగతి తెలిసిందే. ఆర్బీఐ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి పాలసీ సమీక్షలో ఉర్జిత్ పటేల్ రెపో రేటును పావు శాతం తగ్గించి 6.25 శాతానికి చేర్చారు. ఆరుగురు సభ్యుల పరపతి విధాన కమిటీ(ఎంపీసీ) తొలి భేటీలోనే ఈ నిర్ణయం వెలువడింది. అయితే, నవంబర్ 8న రూ.1,000; రూ.500 నోట్లను రద్దు చేస్తున్న ప్రధాని మోదీ ప్రకటించిన నేపథ్యంలో డిసెంబర్లో జరిగిన భేటీలో కచ్చితంగా పావు శాతం కోత ఉండొచ్చని ఎక్కువ మంది అంచనా వేశారు. దీనికి భిన్నంగా ఆర్బీఐ మాత్రం పాలసీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. కానీ జనవరిలో బ్యాంకులు వరుసగా రుణ రేట్లను భారీగా తగ్గించడంతో ఆర్బీఐపై ఒత్తిడి కాస్త తగ్గినట్లయింది. ప్రస్తుతం రెపో రేటు(ఆర్బీఐ నుంచి తీసుకునే స్వల్పకాలిక రుణాలపై బ్యాంకులు చెల్లించే వడ్డీ రేటు) 6.25%, రివర్స్ రెపో(ఆర్బీఐ వద్ద ఉంచే నిధులపై బ్యాంకులకు లభించే వడ్డీ రేటు) 5.75 శాతం, నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్ఆర్– బ్యాంకులు తమ డిపాజిట్ నిధుల్లో ఆర్బీఐ వద్ద కచ్చితంగా ఉంచాల్సిన పరిమాణం) 4 శాతంగా కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ పరిణామాల ప్రభావం... ఆర్బీఐ రేట్ల కోత నిర్ణయానికి ప్రధానంగా అంతర్జాతీయ పరిణామాలే అడ్డంకిగా భావిస్తున్నారు. ముడి చమురు ధర ఎగబాకుతుండటం.. అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమలు చేస్తున్న పలు రక్షణాత్మక వాణిజ్య విధానాలు భారత్‌తోపాటు అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపనున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. పారిశ్రామిక మండలి ఫిక్కీ... ఆర్బీఐ రానున్న పాలసీ సమీక్షలో రేట్లను యథాతథంగా ఉంచుతుందని పేర్కొంది. అయితే, 2017–18 ప్రథమార్ధంతో రేట్లను తగ్గించే అవకాశం ఉందని అంటోంది. బ్యాంకర్లు అటూఇటూ... బ్యాంకుల వద్దకు భారీగా డిపాజిట్ నిధులు వచ్చి చేరిన నేపథ్యంలో ఆర్బీఐ రానున్న పాలసీలో రేట్లను తగ్గించకపోవచ్చని బంధన్ బ్యాంక్ ఎండీ చంద్ర శేఖర్ఘోష్ అభిప్రాయపడ్డారు. అయితే, మరికొందరు బ్యాంకర్లు మాత్రం కోతకు ఆస్కారం ఉందని భావిస్తున్నారు. ‘ద్రవ్యలోటు, ద్రవ్యోల్బణం వంటి స్థూల ఆర్థిక అంశాలన్నీ రెపో తగ్గింపునకు అనుకూలంగానే ఉన్నాయి. వృద్ధికి చేయూతనిచ్చేవిధంగా కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ చర్యలు ప్రకటించింది. ఇక ఆర్బీఐ కూడా దీనికి అనుగుణంగానే పాలసీ నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నాం. 8న సమీక్షలో పావు శాతం రెపో కోతను అంచనా వేస్తున్నాం’ అని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఈడీ ఆర్కే గుప్తా వ్యాఖ్యానించారు. బ్యాంకింగ్ వ్యవస్థలో అధిక ద్రవ్య సరఫరా(లిక్విడిటీ) ఉండటంతో పావు శాతం రెపో కోతకు ఆస్కారం ఉందని యూకో బ్యాంక్ ఎండీ సీఈఓ ఆర్కే టక్కర్ పేర్కొన్నారు. ముప్పావు శాతం తగ్గించాలి: అసోచామ్ డీమోనిటైజేషన్‌తో చౌక డిపాజిట్ నిధుల రూపంలో బ్యాంకులకు భారీగా లాభం చేకూరిందని.. దీన్ని రుణగ్రహీతలకు పూర్తిస్థాయిలో బదలాయించాల్సిన అవసరం ఉందని పారిశ్రామిక మండలి అసోచామ్ పేర్కొంది. ‘ఆర్బీఐ రెపో రేటును 0.5–0.75 శాతం మేర తగ్గించాల్సిందే. ఈ కోతను బ్యాంకులు కూడా రుణ గ్రహీతలకు బదలాయించేలా ఆర్బీఐ, ఆర్థిక శాఖ చర్యలు తీసుకోవాలి. రుణవృద్ధి మందగమనం.. వినియోగ డిమాండ్ పడిపోయిన నేపథ్యంలో పెట్టుబడులకు పునరుత్తేజం కల్పించాలంటే వడ్డీ రేట్ల తగ్గింపు చాలా కీలకం’ అని ఆసోచామ్ ప్రెసిడెంట్ సునీల్ కనోరియా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఏడాదికి పావు శాతమే..: నోమురా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్.. ద్రవ్యోల్బణం విషయంలో మధ్యకాలానికి సానుకూలంగానే(ద్రవ్యలోటు లక్ష్యాలకు కట్టుబడి ఉండటం ఇతరత్రా ఆర్థిక క్రమశిక్షణ చర్యలు) ఉందని.. ఈ నేపథ్యంలో రానున్న సమీక్షలో ఆర్బీఐ పావు శాతం రెపో రేటును తగ్గించొచ్చని జపాన్ ఆర్థిక సేవల దిగ్గజం నోమురా పేర్కొంది. అధిక క్రూడ్ ధరలు ఇతరత్రా విదేశీ అంశాల ప్రభావం ఉన్నప్పటికీ.. ఆర్బీఐ కోతకే మొగ్గుచూపొచ్చని అభిప్రాయపడింది. అయితే, దీనితర్వాత ఈ ఏడాదిలో(2017) ఇక తగ్గింపులు ఉండకపోవచ్చనేది నోమురా అంచనా. -
నోట్ల రద్దు విశిష్ట ప్రయోగం
దీని మీద 100 పీహెచ్డీ థీసిస్‌లు రావొచ్చు రీమోనిటైజేషన్తో వృద్ధికి ఊతం ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు (డీమోనిటైజేషన్)ను ’ద్రవ్య చరిత్రలోనే ఒక విశిష్ట ప్రయోగం’గా అభివర్ణించారు ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్. అయిదేళ్ల తర్వాత దీనిపై 50–100 పీహెచ్డీ థీసిస్‌లు రాసే అవకాశాలు ఉన్నాయంటూ వ్యాఖ్యానించారు. అంతా భావించిన దానికి భిన్నంగా డీమోనిటైజేషన్ ప్రకటించిన నవంబర్‌లో నగదు కొరత చాలా తక్కువగానే కనిపించిందని పేర్కొన్నారు. నెలా రెణ్నెల్లలో వ్యవస్థలోకి నగదు సరఫరా (రీమోనిటైజేషన్) ప్రక్రియ పూర్తయిపోగలదని, ఆ తర్వాత వృద్ధి మళ్లీ పుంజుకోగలదని సుబ్రమణియన్ అభిప్రాయపడ్డారు. ‘రీమోనిటైజేషన్ జరిగే కొద్దీ ఎకానమీ మళ్లీ పుంజుకుంటుంది. రీమోనిటైజేషన్ వేగంగా జరగాలన్నది నా అభిప్రాయం. నగదుపై పరిమితులను ఎంత తొందరగా ఎత్తివేస్తే అంత శ్రేయస్కరం’ అని సుబ్రమణియన్ వివరించారు. నగదుపై నియంత్రణ కన్నా ప్రోత్సాహకాల ద్వారానే డిజిటల్ చెల్లింపులకు ప్రాచుర్యం కల్పించవచ్చన్నారు. రియల్టీ రేట్ల తగ్గుదల.. రియల్టీ ధరలను నేలపైకి తేవడం కూడా డీమోనిటైజేషన్ లక్ష్యాల్లో ఒకటని సుబ్రమణ్యన్ చెప్పారు. ’రియల్ ఎస్టేట్ రంగంలో ధరలు, విక్రయాలు, కొత్త ప్రాజెక్టులు రావడంలో కొంత తగ్గుదల కనిపిస్తూనే ఉంది. ఇది ఎకానమీకి కాస్త ప్రతికూలమే అయినప్పటికీ.. దీర్ఘకాలంలో కొంత మంచే జరగగలదు. ఎందుకంటే రియల్టీ ధరలను తగ్గించడం కూడా డీమోనిటైజేషన్ లక్ష్యాల్లో ఒకటి’ అని ఆయన పేర్కొన్నారు. అమితాబ్ సినిమాలా చేద్దామనుకున్నాం.. ఎప్పుడూ నిరాసక్తంగా, నిస్సారంగా అనిపించే ఆర్థిక సర్వేకు కాస్త అమితాబ్ బచ్చన్ బ్లాక్ బస్టర్ సినిమా తరహా హంగులు అద్దే ప్రయత్నం చేశామన్నారు ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్. కాస్తంత డ్రామా, కాసింత ట్రాజెడీ, మరికాస్తంత కామెడీని జోడించేందుకు యత్నించామని వివరించారాయన. ’అమితాబ్ బచ్చన్ చెబుతుంటారు కదా.. ఇస్మే డ్రామా హోనా చాహియే.. ట్రాజెడీ హోనా చాహియే .. కామెడీ హోనా చాహియే.. సబ్ కుచ్ హోనా చాహియే అని.. (కథలో డ్రామా ఉండాలి, ట్రాజెడీ ఉండాలి, కామెడీ ఉండాలి.. అన్నీ ఉండాలి). నేను కూడా దాదాపుగా అదే విధంగా సర్వే ఉండేందుకు ప్రయత్నించానని అనుకుంటున్నాను’ అంటూ ఎకనమిక్ సర్వే రూపకల్పన గురించి చమత్కరించారు. ‘సర్వే అనేది వివిధ అంశాల అరుదైన మేళవింపుగా ఉండాలి. ఇందులో గణితం, చరిత్ర, వేదాంతం, రాజనీతిజ్ఞత మొదలైనవన్నీ తగుపాళ్లలో ఉండాలి. సంకేతాలను అర్ధం చేసుకుని.. వాటిని పదాల రూపంలో వ్యక్తపర్చగలగాలి. నిగూఢమైన అంశాలను, వాస్తవికతను ఒకే తీరుగా స్పృశించగలగాలి’ అన్న ప్రఖ్యాత ఆర్థికవేత్త జాన్ మేనార్డ్ కీన్జ్ వ్యాఖ్యలను ఈ సందర్భంగా సుబ్రమణియన్ ఉటంకించారు. సర్వే అనేది.. భవిష్యత్ అవసరాలపై దృష్టితో.. గతకాలపు అనుభవాలను పరిగణనలోకి తీసుకుని వర్తమానాన్ని అధ్యయనం చేసే విధంగా ఉండాలన్నారు. మరోవైపు, సర్వేలో డీమోనిటైజేషన్ అంశం గురించి ప్రస్తావించడాన్ని కూడా సుబ్రమణియన్ వివరించారు. దీన్ని గాని స్పృశించకుండా ఉండి ఉంటే .. డెన్మార్క్ రాకుమారుడు (షేక్స్పియర్ రాసిన హామ్లెట్ నవలలో కథానాయకుడు) లేని హామ్లెట్ నవలలాగా సర్వే ఉండేదని ఆయన పేర్కొన్నారు. -
నగదు బదిలీ... పన్నుల కోత!
2016–17 ఆర్థిక సర్వే చెబుతోందిదే... పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి జైట్లీ పేదరిక నిర్మూలనకు కనీస ఆదాయ ప్రతిపాదన సబ్సిడీల స్థానంలో అమలు చేయాలని సూచన ఆదాయపన్ను, కార్పొరేట్ పన్ను రేట్లను తగ్గించాలి... రియల్ ఎస్టేట్‌పై స్టాంప్ డ్యూటీలో కోత విధించాలి... మరింత మంది పన్ను పరిధిలోకి ... ఆర్థిక వృద్ధికి నోట్ల రద్దు షాక్... 6.5 శాతానికి పడిపోవచ్చు వచ్చే ఏడాది 6.75–7.5 శాతంగా అంచనా జీఎస్టీ అమలు, డీమోనిటైజేషన్ ఫలాలు, నిర్మాణాత్మక సంస్కరణలతో భవిష్యత్తులో వృద్ధి పరుగులే జీఎస్టీ పరిధిలోకి భూ, ఇతర స్థిరాస్తి లావాదేవీలు... పన్ను పరిధిలోకి ఇక వ్యవసాయ ఆదాయం! నోట్ల రద్దు(డీమోనిటైజేషన్) కారణంగా నెలకొన్న ప్రజావ్యతిరేకతను తగ్గించేందుకు మోదీ సర్కారు ఈసారి బడ్జెట్లో ప్రజాకర్షక తాయిలాల మంత్రాన్ని ప్రయోగించనుందా? అరుణ్ జైట్లీ అటు సామాన్యులు, వేతన జీవులకు.. ఇటు కార్పొరేట్ వర్గాలకూ తీపి కబురు అందిస్తారా? సంస్కరణ మోత మోగుతుందా? ఆర్థిక సర్వే నివేదికను చూస్తే నేడు ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో వీటికి పెద్దపీటవేస్తారన్న సంకేతాలు వెలువడ్డాయి. సామాజిక పథకాల రూపంలో పేదలకు కల్పిస్తున్న సబ్సిడీలన్నింటినీ ఎత్తివేసి... దీని స్థానంలో నగదు బదిలీ(సార్వత్రిక కేనీస ఆదాయం–యూబీఐ)ని ప్రవేశపెట్టాలంటూ సర్వే సూచించింది. అంతేకాదు.. వ్యక్తిగత ఆదాయపన్ను(ఐటీ)తో పాటు కార్పొరేట్ పన్ను రేట్లను తగ్గించాలని పేర్కొంది. మరిన్ని నిర్మాణాత్మక సంస్కరణలపై దృష్టిపెట్టాలని స్పష్టం చేసింది. నోట్ల రద్దుతో ఆర్థిక వ్యవస్థకు షాక్ తప్పదని తేల్చిచెప్పింది. జీడీపీ వృద్ధి రేటు ఈ ఆర్థిక సంవత్సరంలో మందగించినప్పటికీ.. వచ్చే ఏడాది మళ్లీ భారీగా పుంజుకోనుందని అభిప్రాయపడింది. మొత్తంమీద చూస్తే.. జైట్లీ ‘డ్రీమ్ బడ్జెట్’పై నెలకొన్న అంచనాలు ఎంతవరకు నిజమవుతాయనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. న్యూఢిల్లీ: పేదరిక నిర్మూలనే లక్ష్యంగా నగదు బదిలీ పథకాన్ని కేంద్రం తెరపైకి తీసుకొచ్చింది. మంగళవారం ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2016–17 ఆర్థిక సర్వేలో ప్రధానంగా దీన్ని ప్రస్తావించారు. జాతిపిత మహాత్మా గాంధీ కలలుగన్నట్లుగా... ప్రజల కడగండ్లను తుడిచిపెట్టాలంటే పేదలందరికీ కనీస ఆదాయాన్ని(యూబీఐ) అందించాలంటూ సర్వేలో సూచించారు. ప్రస్తుతం ఉన్న సబ్సిడీలన్నింటినీ తొలగించి.. యూబీఐని ప్రవేశపెట్టాలని, దీనిపై విస్తృతంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందని పేర్కొంది. నోట్ల రద్దు ప్రభావంతో ఈ ఏడాది(2016–17) వృద్ధి రేటు కనీసం అర శాతం మేర దిగజారి 6.5 శాతానికి మందగించవచ్చని సర్వే అంచనా వేసింది. అయితే, వచ్చే ఏడాది మాత్రం తిరిగి వృద్ధి 6.75–7.5 శాతం స్థాయికి పుంజుకునే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. ఈ అంచనాల ప్రకారం చూసినా.. ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధిచెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలుస్తుందని తెలిపింది. ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ నేతృత్వంలోని బృందం ఈ ఆర్థిక సర్వేను రూపొందించింది. వ్యవసాయ ఆదాయంపైనా పన్ను...? ప్రభుత్వం పన్నుల తగ్గింపు విషయంలో సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకోవాల్సిందేనని సర్వే సూచించింది. వ్యక్తిగత ఆదాయపన్ను(ఐటీ) రేట్ల తగ్గింపునకే పరిమితం కాకుండా.. కార్పొరేట్ పన్నుల కోతకు సంబంధించిన కార్యాచరణ(టైమ్‌టేబుల్)ను వేగవంతం చేయాలని పేర్కొంది. అంతేకాదు ‘అధిక ఆదాయం కలిగిన వారందరూ’ పన్నులు కట్టేవిధంగా పన్నుల పరిధిని మరింత విస్తృతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తేల్చిచెప్పింది. అయితే, ఈ అధిక ఆదాయం కలిగినవారందరూ అంటే ఎవరనేది మాత్రం నిర్వచించలేదు. ప్రస్తుతం పన్నుల పరిధిలో లేని వ్యవసాయ ఆదాయాన్ని ఈ విధంగా ప్రస్తావించి ఉండొచ్చని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. సంస్కరణల జోరు పెంచాలి... వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) అమలు, డీమోనిటైజేషన్ ఫలాలతో పాటు నిర్మాణాత్మక సంస్కరణలన్నీ అమలు చేయగలిగితే.. స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి రేటు పరుగులు తీయడం ఖాయమని సర్వే నొక్కిచెప్పింది. మన ఆర్థిక వ్యవస్థకున్న వాస్తవ సామర్థ్యం ప్రకారం మధ్యకాలికంగా 8–10 శాతం వృద్ధిని అందుకోవడం సాధ్యమేనని తెలిపింది. 2015–16లో జీడీపీ వృద్ధి 7.6 శాతంగా నమోదైంది(తాజాగా సవరించిన అంచనాల ప్రకారం 7.9 శాతం). ఈ ఏడాది వృద్ధి రేటు 7.1 శాతానికి తగ్గొచ్చనేది ప్రభుత్వం గతంలో అంచనా వేసింది. అయితే, డీమోనిటైజేషన్ ప్రతికూల ప్రభావాన్ని ఈ అంచనాల్లో పూర్తిగా లెక్కలోకి తీసుకోలేదు. సంస్కరణల అమలు, విధానాత్మక చర్యల విషయంలో వెనకడుగు వేస్తే.. మాత్రం వచ్చే ఆర్థిక సంవత్సరం(2017–18)లో కూడా డీమోనిటైజేషన్ ప్రతికూలతలను ఆర్థిక వ్యవస్థ చవిచూడాల్సి వస్తుందని ఆర్థిక సర్వే హెచ్చరించింది. రిస్కులపై అప్రమత్తత అవసరం... ‘నోట్ల రద్దు కారణంగా తలెత్తిన నగదు కొరతతో కొన్ని వ్యవసాయోత్పత్తుల సరఫరాలు దెబ్బతిన్నాయి. ప్రధానంగా పాలు, చక్కెర, బంగాళదుంపలు, ఉల్లిపాయల ఉత్పాదకత దిగజారింది. 2015–16 ఆర్థిక సంవత్సరంలో పప్పుదినుసుల విషయంలో ఎదురైన తీవ్ర పరిస్థితులు(ఉత్పత్తి పడిపోయి ధరలు ఆకాశాన్నంటడం) ఇప్పుడు ఇతర వ్యవసాయోత్పత్తులపై పడకుండా ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలి’ అని సర్వే సూచించింది. ఇక అంతర్జాతీయంగా ముడిచమురు(క్రూడ్) ధర ఎగబాకుతుండటం... అగ్ర దేశాల మధ్య వాణిజ్యపరమైన ఉద్రిక్తతలు వంటి రిస్కులు కూడా మన ఆర్థిక వ్యవస్థకు పొంచిఉన్నాయని గుర్తుచేసింది. ‘క్రూడ్ ధర బ్యారెల్‌కు 60–65 డాలర్లకు గనుక ఎగబాకితే.. దేశీయంగా వినియోగం తగ్గేందుకు దారితీస్తుంది. అదేవిధంగా ప్రభుత్వ పెట్టుబడులకు ఆస్కారం తగ్గుతుంది. కార్పొరేట్ కంపెనీల మార్జిన్లు పడిపోవడంతో ప్రైవేటు పెట్టుబడులను కూడా దెబ్బతీస్తుంది. అధిక క్రూడ్ ధర కారణంగా ద్రవ్యోల్బణం పెరుగుదల రిస్క్ అధికమవుతుంది. దీంతో ఆర్బీఐ వడ్డీరేట్ల తగ్గింపు అవకాశాలు సన్నగిల్లుతాయి’ అని వివరించింది. సాధారణ స్థాయికి నగదు సరఫరా... నోట్ల రద్దు కారణంగా నెలకొన్న కరెన్సీ కొరత క్రమంగా తగ్గుము ఖం పడుతోందని సర్వే పేర్కొంది. కొత్త కరెన్సీ నోట్లు తగినంతగా అందుబాటులోకి వస్తుండటంతో ఆర్థిక వృద్ధి కూడా మళ్లీ సాధారణ స్థితికి చేరుకోవచ్చని అంచనా వేసింది. ‘డీమోనిటైజేషన్ అనేది ద్రవ్యపరంగా అత్యంత అసాధారణ పరిణామాలకు కారకమైంది. నగదు సరఫరా, చలామణీని వ్యవస్థ నుంచి భారీగా తగ్గించేయగా.. బ్యాంకుల్లో డిపాజిట్ల రూపంలో మరోరకంగా కరెన్సీ భారీగా పెరిగింది. దీర్ఘకాలంలో డీమోనిటైజేషన్ ఆర్థిక వ్యవస్థకు మేలుచేకూరుస్తుందన్న విశ్వాసం పెంచాలంటే.. పన్ను చెల్లింపులను ప్రోత్సహించే చర్యలు చేపట్టాలి. దీనివల్ల పన్ను ఎగవేతదారులకు ఇస్తున్న ప్రోత్సాహకాలు తగ్గుముఖం పడతాయి’ అని సర్వేలో పేర్కొన్నారు. డీమోనిటైజేషన్ వల్ల స్వల్పకాలంలో భారం పడినప్పటికీ.. దీర్ఘకాలికంగా అనేక ప్రయోజనాలు ఉంటాయని తేల్చిచెప్పింది. జీఎస్టీ పరిధిలోకి రియల్ ఎస్టే్టట్... డీమోనిటైజేషన్ చాలా శక్తివంతమైన ప్రక్రియ అని.. దీని ప్రయోజనాలు కనబడాలంటే తగిన చర్యలు అవసరమని సర్వే ఐదంచెల వ్యూహాన్ని నిర్దేశించింది. ఇందులో భాగంగా జీఎస్టీ పరిధిని మరింత విస్తృతం చేయాలని పేర్కొంది. ముఖ్యంగా నల్లధనం పోగుపడేందుకు మూలకారణంగా నిలుస్తున్న భూ క్రయవిక్రయాలు, ఇతరత్రా స్థిరాస్తి లావాదేవీలు, కార్యకలాపాలను జీఎస్టీ కిందికి తీసుకురావాలని సూచించింది. వ్యక్తిగత ఆదాయపన్ను రేట్లతో పాటు రియల్ ఎస్టేట్ స్టాంప్ డ్యూటీలను కూడా తగ్గించాల్సిందేనని పేర్కొంది. ఐటీ పరిధిని నెమ్మదిగా విస్తరించాలని.. దీనికి రాజ్యాంగపరంగా తగిన విధానాలను పాటించాలని సూచించింది. అసమానతలను తగ్గించి, జవాబుదారీతనాన్ని పెంచేందుకు వీలుగా పన్నుల యంత్రాంగాన్ని మెరుగుపరచాలని పేర్కొంది. ఈ ఏడాది చేపట్టిన అత్యంత కీలకమైన పాలసీ చర్యల్లో జీఎస్టీ రాజ్యాంగ సవరణ బిల్లుకు ఆమోదం... రూ.1,000; రూ.500 నోట్ల రద్దు నిలుస్తాయని తెలిపింది. జీఎస్టీ వల్ల భారత్‌లో ఏకీకృత మార్కెట్‌ను సృష్టిస్తుంది. పన్ను చెల్లింపులు, పరిపాలన మెరుగుపడటంతో పెట్టుబడులు, వృద్ధికి చేయూత లభిస్తుంది. రాష్ట్రాలు, కేంద్రం మధ్య సహకారం(కోపరేటివ్ ఫెడరలిజమ్) కొత్త పుంతలు తొక్కుతుంది’ అని పేర్కొంది. ఇతర ముఖ్యాంశాలివీ... ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన(పీఎంజీకేవై– నల్లధనాన్ని స్వచ్ఛందంగా వెల్లడించేందుకు తాజా స్కీమ్)తో ప్రభుత్వానికి భారీగానే ఆదాయం లభించనుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రంగం వృద్ధి రేటు 4.1 శాతానికి ఎగబాకనుంది. గతేడాది ఈ వృద్ధి 1.2 శాతమే. పారిశ్రామిక రంగం వృద్ధి మాత్రం 7.4 శాతం నుంచి 5.2 శాతానికి తగ్గొచ్చు. జీడీపీలో పెట్టుబడుల నిష్పత్తి తగినంతగా లేకపోవడమే కాకుండా గత కొన్నేళ్లుగా తగ్గుముఖం పడుతుండటం ఆందోళనకరం. పొదుపులను ప్రోత్సహించాలి. దీనివల్ల విదేశీ రుణాలపై అధికంగా ఆధారపడకుండా పెట్టుబడి నిధులు అందుబాటులోకి వస్తాయి. బ్యాంకింగ్‌లో మొండిబకాయిల తీవ్రత దృష్ట్యా ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వ రంగంలోనే ఒక అసెట్ రికన్స్ట్రక్షన్ కంపెనీ, అసెట్ రీహెబిలిటేషన్ ఏజెన్సీ (పీఏఆర్‌ఏ)ని ఏర్పాటు చేయాలి. సామాజికపరమైన మార్పులకు దీర్ఘకాలంగా పరిష్కృతం కాకుండా ఉన్న మూడు కీలకమైన సవాళ్లను భవిష్యత్తులో మనం అధిగమించాల్సి ఉంటుంది. సంపద పంపిణీలో అసమర్థతలు, ప్రైవేటు రంగం–ప్రాపర్టీ హక్కుల విషయంలో నెలకొన్న అనిశ్చితి, సామర్థ్యానికి అనుగుణంగా దేశ ఆర్థిక వృద్ధి పుంజుకోలేకపోతుండటం వీటిలో ఉన్నాయి. ప్రతికూలతలను గుర్తించింది.. పరిశ్రమ వర్గాలు, విశ్లేషకులు .. ఎకానమీ ఎదుర్కొంటున్న ఎదురుగాలులను ఆర్థిక సర్వే స్పష్టంగా గుర్తించిందని విశ్లేషకులు, నిపుణులు వ్యాఖ్యానించారు. బడ్జెట్లో సాహసోపేతమైన ప్రతిపాదనలు ఉండొచ్చని పేర్కొన్నారు. సంస్కరణలతో బడ్జెట్.. సర్వే బట్టి చూస్తే బడ్జెట్ సాహసోపేతంగా, సంస్కరణలతో కూడుకున్నదిగా ఉండొచ్చని తెలుస్తోంది. మౌలిక రంగ అభివృద్ధి, ఉపాధి కల్పన, వ్యాపారాల నిర్వహణకు అనువైన పరిస్థితుల కల్పనపై ప్రధానంగా దృష్టి పెట్టే అవకాశం ఉంది. – రిచర్డ్ రేఖీ, సీఈవో, కేపీఎంజీ ఇండియా సవాళ్లు.. అవకాశాలు.. ఎకానమీ ఎదుర్కొం టున్న సవాళ్లు.. ముందున్న అవకాశాలను సర్వేలో స్పష్టంగా ప్రస్తావించారు. డిమాండ్‌కు ఊతమివ్వడం, పన్ను రేట్లు తగ్గించడం, పన్ను విధానాలను సంస్కరించడం తదితర చర్యలతో పెద్ద నోట్ల రద్దు దీర్ఘకాలిక ప్రయోజనాలు పూర్తి స్థాయిలో సాధించడంపై దృష్టి పెట్టాలి. మొండిబకాయిల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక బ్యాంకు ఏర్పాటు ప్రతిపాదన మంచిదే. – పంకజ్ పటేల్, ప్రెసిడెంట్, ఫిక్కీ ఎగుమతులకు ఊతమిచ్చే చర్యలుండాలి.. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు, జీఎస్టీ అమలు ద్వారా ఎగుమతులకు మరింత ఊతమివ్వాలి. నోట్ల రద్దుతో దెబ్బతిన్న ఎకానమీకి మళ్లీ ఊపిర్లూదేలా.. ఉపాధి కల్పనపై మరింత దృష్టి పెట్టాలి. అపారెల్ తదితర విభాగాల్లాగానే లెదర్, ఫుట్‌వేర్ రంగాలకూ సమగ్రమైన ప్యాకేజీ ఇవ్వాలి. – ఎస్సీ రాల్హన్, ప్రెసిడెంట్, ఎఫ్ఐఈవో డిమాండ్‌కు తోడ్పాటు ఉండాలి.. డిమాండ్‌కు ఊతమిచ్చే లా బడ్జెట్ ఉండగలదని ఆశిస్తున్నాం. వ్యక్తిగత ఆదాయ పన్ను, కార్పొరేట్ ట్యాక్సేషన్ వంటి ప్రత్యక్ష పన్నులను కొంత సడలిస్తే ఉపయోగకరంగా ఉండగలదని భావిస్తున్నాం. – చంద్రజిత్ బెనర్జీ, డైరెక్టర్ జనరల్, సీఐఐ ఆందోళనకరంగా రక్షణాత్మక ధోరణులు.. ప్రపంచ ఎకానమీకి పొంచి ఉన్న రిస్కులు.. వాటి ఫలితంగా చమురు రేట్ల పెరుగుదల, వాణిజ్య సమస్యలS రూపంలో భారత్‌పై పడే ప్రతికూల ప్రభావాలను సర్వే గుర్తించింది. భారతీయ ఎగుమతులను దెబ్బతీసేలా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో రక్షణాత్మక ధోరణులు పెరుగుతుండటం కచ్చితంగా ఆందోళన కలిగించే అంశం. – సునీల్ కనోడియా, ప్రెసిడెంట్, అసోచాం -
నగదు డిపాజిట్ చేసినంత మాత్రాన...నలుపు.. తెలుపైపోదు!
►డీమోనిటైజేషన్‌తో కరెన్సీ గోప్యత తొలగిపోయింది ►నల్లధనం ఎవరిదో బయటికొస్తుంది... ►భారీ డిపాజిట్లతో వడ్డీరేట్లు దిగొస్తున్నాయి ►ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యలు న్యూఢిల్లీ: బ్యాంకుల్లో నగదును డిపాజిట్ చేసినంతమాత్రాన నల్లధనం చట్టబద్ధమైనదిగా మారిపోదని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ హెచ్చరించారు. నోట్ల రద్దు(డీమోనిటైజేషన్)తో కరెన్సీ గోప్యత అనేది పూర్తిగా తొలగిపోయిందని.. ఇప్పుడు నల్లధనం ఎవరిదనేది బయటపడుతుందని పేర్కొన్నారు. ‘డీమోనిటైజేషన్.. గత రెండు నెలల పరిస్థితి’ పేరుతో జైట్లీ ‘ఫేస్బుక్’లో చేసిన పోస్ట్‌లో పలు అంశాలను ప్రస్తావించారు. వ్యవస్థలో ఉన్న రూ.500, రూ.1,000 నోట్లలో 97 శాతం బ్యాంకుల్లోకి వెనక్కివచ్చేసినట్లు అంచనాలు వెలువడిన సంగతి తెలిసిందే. దీంతో నల్లధనాన్ని ఏరిపారేయడంలో నోట్ల రద్దు సమర్థతపై పలువురు ఆర్థికవేత్తలు, విశ్లేషకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో జైట్లీ తాజా వ్యాఖ్యలు చేయడం గమనార్హం. పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రజల ఇబ్బందులు ఇక తొలగిపోయినట్లేనని... ఆర్థిక కార్యకలాపాలు మళ్లీ పుంజుకుంటున్నాయని జైట్లీ పేర్కొన్నారు. వడ్డీరేట్లు దిగొస్తున్నాయ్... డీమోనిటైజేషన్ కారణంగా బ్యాంకుల్లో డిపాజిట్లు వెల్లువెత్తడంతో వడ్డీరేట్లు దిగొచ్చేందకు దోహదం చేసిందని ఆర్థిక మంత్రి చెప్పారు. రుణ లభ్యత పెరగడంవల్ల ఆర్థిక వ్యవస్థ వృద్ధి మరింత పుంజుకుంటుందని జైట్లీ వివరించారు. ‘86 శాతం కరెన్సీని(జీడీపీలో దీని వాటా 12.2 శాతం) మార్కెట్ నుంచి వెనక్కిలాగేసి.. దీని స్థానంలో కొత్త కరెన్సీని చేర్చడం అనేది సాధారణమైన విషయమేమీ కాదు. ఈ నిర్ణయంతో గణనీయమైన పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. ఇది ఎంతో సాహసోపేతమైన, శక్తియుక్తులతో కూడుకున్న చర్య. తాత్కాలికంగా కొన్ని సమస్యలు, విమర్శలు రావడం సహజం. ఆర్థిక కార్యకలాపాలపైనా ప్రతికూలత ఉంటుంది. అయితే, బ్యాంకులు, ఏటీఎంల ముందు ప్రజల బారులు ఇప్పుడు కనబడటంలేదు. కొత్త కరెన్సీ సరఫరా(రీమోనిటైజేషన్) ప్రక్రియ జోరందుకోవడమే దీనికి కారణం’ అని జైట్లీ పేర్కొన్నారు. పన్ను ఎగవేతను అనైతికంగా భావించడంలేదు... ప్రభుత్వానికి పన్ను చెల్లించకపోయినా ఏమీ కాదులే అన్న ధోరణి కారణంగా దేశానికి చాలా నష్టం వాటిల్లిందనన్నారు. ‘125 కోట్లకుపైగా ప్రజలున్న ఇంత పెద్ద దేశంలో గత ఆర్థిక సంవత్సరం(2015–16) కేవలం 3.7 కోట్లమంది మాత్రమే పన్ను రిటర్నులు దాఖలు చేశారు. పన్ను ఎగవేతల కారణంగా ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతుంది. పేదరిక నిర్మూలన, జాతీయ భద్రత, ఆర్థికాభివృద్ధి విషయంలో రాజీపడాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. పన్ను ఎగవేత అనేది అనైతికంగా ఎవరూ భావించడంలేదు. జీవితంలో ఇదో భాగమైపోయింది. చాలా ప్రభు త్వాలు దీన్ని సర్వసాధారణమైన విషయంగానే కొనసాగిస్తూ వచ్చాయి. అయితే, ప్రధాని మోదీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం ఈ ‘సాధారణ’ అంశంలో మార్పువస్తుంది. అంతేకాదు మన దేశ ప్రజల వ్యయ ధోరణులు కూడా మారతాయి. సంస్కరణలు ఏవైనాకూడా విధ్వంసపూరితంగానే ఉంటాయి. తిరోగమన పంథాలో మార్పునకు దోహదం చేస్తాయి. డీమోనిటైజేషన్‌తో నిజాయితీపరులకు ప్రయోజనం లభిస్తుంది. మోసపూరితంగా వ్యవహరించేవారికి శిక్ష తప్పదు’అని జైట్లీ పేర్కొన్నారు. త్వరలో ‘రంగు’ తేలుతుంది.. బ్యాంకుల్లోకి భారీస్థాయిలో వచ్చిన డిపాజిట్లను వడపోసే ప్రక్రియ జరుగుతోందని.. ఇందులో నల్లధనం గనుక బయటపడితే సంబంధిత వ్యక్తులను బయటికి లాగుతామని జైట్లీ చెప్పారు. ‘లెక్కచూపని సొమ్మును స్వచ్ఛందంగా వెల్లడిస్తే తక్కువ పన్నుతో బయటపడొచ్చు. అదే ఐటీ శాఖ గనుక పట్టుకుంటే భారీగా పన్ను, జరిమానా కక్కాల్సిందే’నని జైట్లీ స్పష్టం చేశారు. డీమోనిటైజేషన్ ప్రక్రియ మొదలయ్యాక ప్రజలు చాలా ఓపిక, సహనంతో వ్యవహరించారని.. అశాంతి అనేది ఎక్కడా కనబడలేదన్నారు. అదే వారిద్దరికీ తేడా... ‘ప్రధాని మోదీ భావితరం శ్రేయస్సు కోసం ఆలోచిస్తుంటే.. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆలోచనంతా వచ్చే పార్లమెంటు సమావేశాలను ఎలా అడ్డుకోవాలనేదానిపైనే ఉంది. అదే వారిద్దరి మధ్య తేడా’ అని జైట్లీ విమర్శలు గుప్పించారు. ‘నోట్ల రద్దు అంశంపై ప్రతిపక్షాల ఆందోళనలన్నీ కొరగాకుండా పోయాయి. ఆర్థిక వ్యవస్థ కుదేలయిపోతుందంటూ వాళ్లు చేసిన గగ్గోలు తప్పని తేలింది. ప్రతిపక్షాల వైఖరివల్ల పార్లమెంటు సమావేశాల్లో ఒక సెషన్ మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. సాంకేతికత, మార్పు, సంస్కరణలకు కాంగ్రెస్ వ్యతిరేకంగా వ్యవహరించడం దురదృష్టకరం. నల్లధనానికి అనుకూలంగా వాళ్లు పనిచేస్తున్నారనేందుకు ఇదే నిదర్శనం’ అని జైట్ల పేర్కొన్నారు. -
ఒక్కసారి ‘చెక్’ చేసుకోండి..!
పెద్ద నోట్ల రద్దు(డీమోనిటైజేషన్) నేపథ్యంలో ఇప్పుడు ఎక్కడ చూసినా కరెన్సీ కష్టాలే! కరెన్సీ కొరతతో విత్‌డ్రా, చేయాలన్నా.. ఎవరికైనా చెల్లింపులు జరపాలన్నా నానాతంటాలు పడాల్సివస్తోంది. దీంతో ప్రత్యామ్నాయాల్లో ఒకటిగా బ్యాంక్ చెక్కులు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో చెక్కుల వినియోగంలో జాగ్రత్తలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి చెక్కువైపు చూస్తే... ఇలా చేయండి... తేదీ, ఎవరికి చెల్లిస్తున్నారన్న విషయం, ఆ మొత్తం అక్షరాలు, అంకెలు సహా అన్నీ సరిగ్గా నింపిన తర్వాతే చెక్కును మీరు ఇవ్వాలనుకున్న వ్యక్తికి ఇవ్వండి. మీ చెక్కు ఏదైనా పోతే, ఆ విషయాన్ని వెంటనే బ్యాంకుకు తెలియజేయండి. ఆ నంబరుకు సంబంధించి చెక్కుకు డబ్బు చెల్లించవద్దని లిఖితపూర్వకంగా రిజిస్టర్ చేయండి. ఒకటికాకుండా పెద్ద సంఖ్యలో పోతే, ఆ సిరీస్ మొత్తంపై ఎటువంటి డబ్బూ చెల్లించవద్దని మీ బ్యాంక్ బ్రాంచీకి రిక్వస్ట్ పెట్టండి. ఏదైనా చెక్కుపై పొరపాటున ఏదైనా రాస్తే... అది పూర్తిగా చెల్లని విధంగా దానిపై స్పష్టంగా అడ్డంగా ‘క్యాన్సిల్డ్’ అని రాయండి. మీరు చెక్కు ఎవరికైనా ఇచ్చేముందు మీ అకౌంట్లో అందుకు సంబంధించి తగిన డబ్బు ఉండేలా చూసుకోండి. చెక్కును ఎప్పుడూ మీకు మీరుగానే రాయండి. చెక్కు రాసిన తర్వాత ఏదైనా మార్పులు, చేర్పులు చేయాల్సివస్తే... అదే చెక్కుపై అక్షరాలు దిద్దకండి. కొత్త చెక్కును వినియోగించండి. చెక్కుపై చెల్లింపులకు సంబంధించి అంకెలను రాసిన తర్వాత ‘/–’ గుర్తును తప్పనిసరిగా ఉంచండి. అకౌంట్ హోల్డర్‌గా మీ పేరు ఉన్న పై భాగంలోనే చెక్కుపై సంతకం చేయండి. ఇక వెనకవైపూ సంతకం తప్పనిసరి. చెక్కుపై ఏదైనా పేరు రాస్తాం.. లేక అంకెలు వేస్తాం. అయితే తరువాత అక్కడ ఏదైనా స్పేస్ (ఖాళీ) ఉండిపోతే తప్పనిసరిగా ఒక గీత గీసేయండి. దీనివల్ల ఎవ్వరూ అనధికార చేర్పులకు వీలుండదు. మీ చెక్కు ఎక్కడా దుర్వనియోగం కాకుండా తప్పనిసరిగా చెక్కు ఎడమవైపు పైన మూలగా అడ్డంగా ‘అకౌంట్ పేయీ‘ అని రాయండి. దీనితో మీరు ఏ అకౌంట్‌కు డబ్బు చెల్లించాలనుకుంటారో ఆ అకౌంట్లోకే మీ డబ్బు చేరుతుంది. బ్లూ లేదా బ్లాక్ కలర్ పెన్నులతో మీరు చెక్కుపై రాయాలనుకున్న అక్షరాలను స్పష్టంగా రాయండి. ఇక సంతకాల విషయంలో చాలా జాగ్రత్త. మీ బ్యాంక్ బ్రాంచీ అకౌంట్‌కు సంబంధించి మీ సంతకం ఎలా ఉందో అలానే చెక్కుపై సైతం సంతకం చేయాలి. ఎటువంటి తేడా ఉన్నా... చెక్కు బౌన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. రుణం లేదా బీమా ఆఫరింగ్స్‌కు ఉద్దేశించి చెక్కును ఇచ్చేటప్పుడు, థర్డ్ పార్టీ గుర్తింపును స్పష్టంగా నిర్ధారించుకోండి. ఇవి చేయొద్దు... చెక్కులపై ముందుగానే సంతకాలు పెట్టేసుకోవద్దు. చెక్కు దిగువ ఉండే ఎంఐసీఆర్ కోడ్ పాడయిపోయే పొరపాట్లు చేయొద్దు. చెక్కుపై ఏదైనా పేరు లేదా అంకెలు రాసిన తర్వాత, పక్కన మిగిలిన ఖాళీని అలానే వదిలేయకండి. అలాంటి ఏదైనా స్పేస్ (ఖాళీ) ఉండిపోతే తప్పనిసరిగా ఒక గీత కొట్టండి. దీనివల్ల ఎవ్వరూ అనధికార చేర్పులు చేయలేరు. చెక్కుపై దిద్దుళ్లు, కొట్టేసి మళ్లీ రాయడం వంటి తప్పులు చేయకండి.