న్యూయార్క్: మోదీ సర్కారు 2016 నవంబర్‌లో తీసుకున్న పెద్ద నోట్ల రద్దు(డీమోనిటైజేషన్) నిర్ణయంపై ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ మరోసారి విమర్శల బాణం ఎక్కుపెట్టారు. అది మంచి ఆలోచన కాదని అప్పుడే తాను ప్రభుత్వానికి స్పష్టంగా చెప్పానని వెల్లడించారు. అంతేకాకుండా వ్యవస్థలో ఉన్న 87.5 శాతం విలువైన కరెన్సీ నోట్లను రద్దు చేసే ప్రక్రియను తగిన ప్రణాళిక లేకుండా చేపట్టారని కూడా ఆయన కుండ బద్దలుకొట్టారు. విఖ్యాత హార్వర్డ్ కెనడీ స్కూల్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, డీమోనిటైజేషన్ నిర్ణయాన్ని అమలు చేసేముందు ప్రభుత్వం ఆర్‌బీఐని సంప్రదించలేదన్న వాదనలను రాజన్ తోసిపుచ్చారు. 2016 నవంబర్ 8న మోదీ ప్రభుత్వం రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. వీటి స్థానంలో కొత్తగా మళ్లీ రూ.2,000, రూ.500 నోట్లను వెంటనే ప్రవేశపెట్టారు. తర్వాత రూ.200 నోటును కూడా తీసుకొచ్చారు. అయితే, తగినన్ని నోట్లు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు పడరాని పాట్లుపడ్డారు. రాజన్ హయాంలోనే నోట్ల రద్దుపై ప్రభుత్వం కార్యాచరణను మొదలుపెట్టినప్పటికీ, 2016 సెప్టెంబర్‌లో ఆయన పదవీకాలం పూర్తయ్యాక ప్రస్తుత గవర్నర్ ఉర్జిత్ పటేల్ హయాంలో దీన్ని అమలు చేసింది. అప్పట్లో తాను రెండోసారి గవర్నర్‌గా కొనసాగాలని భావించినా ప్రభుత్వం మొగ్గుచూపలేదని కూడా రాజన్ చెప్పడం తెలిసిందే. నోట్ల రద్దు ఇతరత్రా అంశాల్లో మోదీ సర్కారుతో తలెత్తిన విభేదాలే దీనికి ప్రధాన కారణం. ప్రస్తుతం రాజన్ షికాగో యూనివర్సిటీలోని బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్‌గా తన పాత విధుల్లో కొనసాగుతున్నారు.
తగినన్ని నోట్లు సిద్ధం కాకుండానే...
‘వ్యవస్థలో ఉన్న 87.5 శాతం విలువైన నోట్లను రద్దు చేయాలంటే ముందుగా దానికి తగ్గట్టుగా కరెన్సీ నోట్లను ముద్రించి చలామణీలోకి తీసుకొచ్చేందుకు సిద్ధపడాలి. ఏ ఆర్థికవేత్త అయినా ఇదే చెబుతారు. అయితే, భారత ప్రభుత్వం ఇలాంటి కసరత్తును పూర్తిగా చేయకుండానే ఆదరాబాదరాగా డీమోనిటైజేషన్‌ను ప్రకటించింది. దీనివల్ల ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది. ఈ నిర్ణయంతో ప్రజలు నల్ల ధనాన్ని నేలమాళిగల్లోంచి బయటకు తెచ్చేసి, లెంపలేసుకొని పన్నులు కట్టేస్తారనేది ప్రభుత్వం ఆలోచన. అయితే, ఇది అవివేకమైన నిర్ణయం అనేది నా అభిప్రాయం. ఎందుకంటే ప్రజలు కొత్త వ్యవస్థలకు వేగంగా అలవాటుపడిపోయి, కొత్త దారులు వెతుక్కుంటారన్న విషయాన్ని ప్రభుత్వం మరిచిపోయింది. రద్దు చేసిన నోట్లకు సమానమైన మొత్తం వ్యవస్థలోకి మళ్లీ తిరిగివచ్చేసిందంటే, ప్రభుత్వం ఏ ఉద్దేశంతో దీన్ని చేపట్టిందో అది నెరవేరనట్టే లెక్క. ప్రత్యక్షంగా దీని ప్రభావంలేదని తేటతెల్లమైంది. కరెన్సీకి కటకటతో ప్రజలు ఇబ్బందుల పాలు కావడం ఒకెత్తు అయితే, ఆర్థిక కార్యకలాపాలు స్తంభించడంతో అసంఘటిత రంగంలో భారీగా ఉద్యోగాలు ఊడిపోయాయి. అయితే, దీర్ఘకాలంలో దీనివల్ల ఎలాంటి ప్రభావం పడుతుందనేది వేచి చూడాలి. ప్రధానంగా పన్నుల వసూళ్లపై ప్రభుత్వం గనుక సీరియస్‌గా దృష్టిసారిస్తే... ఖజానాకు ఆదాయం పెరుగుతుంది. ఇది నెరవేరిందని బలంగా నిరూపితం అయితేనే సానుకూల ప్రభావం ఉన్నట్లు లెక్క. నా వరకూ అయితే, ఆ సమయంలో నోట్ల రద్దు అనేది నిరుపయోగమని భావించా’ అని రాజన్ వివరించారు.
జీఎస్‌టీ మంచిదే, కానీ...
వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ)ను మెరుగ్గా అమలు చేయగలిగితే భారత్ ఆర్థిక వ్యవస్థకు మంచిదేనని రాజన్ వ్యాఖ్యానించారు. ‘ఇదేమీ సరిదిద్దలేనంత పెద్ద సమస్య కాదు. అయితే, మరింతగా కసరత్తు చేయాల్సి ఉంటుంది. జీఎస్‌టీపై నాకు ఇంకా విశ్వాసం ఉంది’ అని పేర్కొన్నారు.
నోట్ల రద్దు చెత్త ఆలోచన!
Published Fri, Apr 13 2018 12:41 AM | Last Updated on Sat, Apr 14 2018 2:04 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment