భారత్ అభివృద్ధి చెందుతున్నప్పటికీ.. తగినన్ని ఉద్యోగాలు సృష్టించడం లేదని రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు. ఉపాధి కల్పనకు కార్మిక ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించారు.
దిగువ స్థాయిలో వినియోగం పెరుగుతున్నప్పటికీ కరోనా మహమ్మారి పూర్వ స్థాయి నుంచి పూర్తిగా కోలుకోలేకపోతున్నారు. దేశంలో నిరుద్యోగం పోవాలంటే.. ఉపాధి కల్పన తప్పకుండా జరగాలి. తయారీ రంగాలను తప్పకుండా ప్రోత్సహించాలని రాజన్ పేర్కొన్నారు.
ఏడు శాతం వృద్ధి సాధిస్తున్న భారత ఆర్థిక వ్యవస్థ తగినన్ని ఉద్యోగాలను సృష్టిస్తోందా? అనే ప్రశ్నకు, రఘురామ్ రాజన్ సమాధానమిస్తూ.. ఎక్కువ పెట్టుబడితో కూడిన పరిశ్రమలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి, కానీ శ్రమతో కూడిన పరిశ్రమలు పెరగడం లేదని అన్నారు. అంతే కాకుండా ప్రభుత్వ ఉద్యోగాల కోసం వచ్చిన దరఖాస్తుల సంఖ్యను గమనిస్తే నిరుద్యోగం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుందని పేర్కొన్నారు.
ఈ ఏడాది బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి ప్రకటించిన అప్రెంటిస్‌షిప్ పథకాలను స్వాగతిస్తున్నామని రాజన్ అన్నారు. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO)లో ఎన్‌రోల్‌మెంట్ ఆధారంగా ప్రభుత్వం మూడు ఉపాధి ఆధారిత పథకాలను ప్రారంభిస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ FY25 కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించారు.
ఇదీ చదవండి: వివాద్ సే విశ్వాస్ పథకం 2024: రేపటి నుంచే అమల్లోకి..
వియత్నాం, బంగ్లాదేశ్‌లను ఉదాహరణలుగా చెబుతూ.. వస్త్రాలు, తోలు పరిశ్రమలో వృద్ధి సాధిస్తున్నాయని రాజన్ పేర్కొన్నారు. భారత్ కూడా ఇలాంటి అవకాశాలను ఉపయోగించుకోవాలని సూచించారు. మూలధన వ్యయానికి సంబంధించినంతవరకు ప్రైవేట్ రంగం ఇంకా ఎందుకు వెనుకబడి ఉందని అడిగిన ప్రశ్నకు రాజన్, ఇది ఒక చిన్న మిస్టరీ అని అన్నారు.
యుఎస్ ఫెడరల్ రిజర్వ్ బెంచ్ మార్క్ వడ్డీ రేటు తగ్గింపుపై అడిగిన ప్రశ్నకు రాజన్ స్పందిస్తూ.. ఫెడ్ 50 బేసిస్ పాయింట్ల రేటు తగ్గించడం వల్ల సెంట్రల్ బ్యాంకులు సముచితంగా భావించే వేగంతో ముందుకు సాగడానికి మరింత అవకాశం లభించిందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment