ఒక్కసారి ‘చెక్‌’ చేసుకోండి..! | focus on checks | Sakshi
Sakshi News home page

ఒక్కసారి ‘చెక్‌’ చేసుకోండి..!

Published Mon, Jan 2 2017 12:02 AM | Last Updated on Wed, Aug 29 2018 7:09 PM

ఒక్కసారి ‘చెక్‌’ చేసుకోండి..! - Sakshi

ఒక్కసారి ‘చెక్‌’ చేసుకోండి..!

పెద్ద నోట్ల రద్దు(డీమోనిటైజేషన్‌) నేపథ్యంలో ఇప్పుడు ఎక్కడ చూసినా కరెన్సీ కష్టాలే! కరెన్సీ కొరతతో విత్‌డ్రా, చేయాలన్నా.. ఎవరికైనా చెల్లింపులు జరపాలన్నా నానాతంటాలు పడాల్సివస్తోంది. దీంతో ప్రత్యామ్నాయాల్లో ఒకటిగా బ్యాంక్‌ చెక్కులు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో  చెక్కుల వినియోగంలో జాగ్రత్తలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి చెక్కువైపు చూస్తే...

ఇలా చేయండి...
తేదీ, ఎవరికి చెల్లిస్తున్నారన్న విషయం, ఆ మొత్తం అక్షరాలు, అంకెలు సహా అన్నీ సరిగ్గా నింపిన తర్వాతే చెక్కును మీరు ఇవ్వాలనుకున్న వ్యక్తికి ఇవ్వండి.

మీ చెక్కు ఏదైనా పోతే, ఆ విషయాన్ని వెంటనే బ్యాంకుకు తెలియజేయండి. ఆ నంబరుకు సంబంధించి చెక్కుకు డబ్బు చెల్లించవద్దని లిఖితపూర్వకంగా రిజిస్టర్‌ చేయండి. ఒకటికాకుండా పెద్ద సంఖ్యలో పోతే, ఆ సిరీస్‌ మొత్తంపై ఎటువంటి డబ్బూ చెల్లించవద్దని మీ బ్యాంక్‌ బ్రాంచీకి రిక్వస్ట్‌ పెట్టండి.

ఏదైనా చెక్కుపై పొరపాటున ఏదైనా రాస్తే... అది పూర్తిగా చెల్లని విధంగా దానిపై స్పష్టంగా అడ్డంగా ‘క్యాన్సిల్డ్‌’ అని రాయండి.

మీరు చెక్కు ఎవరికైనా ఇచ్చేముందు మీ అకౌంట్‌లో అందుకు సంబంధించి తగిన డబ్బు ఉండేలా చూసుకోండి. చెక్కును ఎప్పుడూ మీకు మీరుగానే రాయండి.

చెక్కు రాసిన తర్వాత ఏదైనా మార్పులు, చేర్పులు చేయాల్సివస్తే... అదే చెక్కుపై అక్షరాలు దిద్దకండి. కొత్త చెక్కును వినియోగించండి.

చెక్కుపై చెల్లింపులకు సంబంధించి అంకెలను రాసిన తర్వాత ‘/–’ గుర్తును తప్పనిసరిగా ఉంచండి.

అకౌంట్‌ హోల్డర్‌గా మీ పేరు ఉన్న పై భాగంలోనే చెక్కుపై సంతకం చేయండి. ఇక వెనకవైపూ సంతకం తప్పనిసరి.

చెక్కుపై ఏదైనా పేరు రాస్తాం.. లేక అంకెలు వేస్తాం. అయితే తరువాత  అక్కడ ఏదైనా స్పేస్‌ (ఖాళీ) ఉండిపోతే తప్పనిసరిగా ఒక గీత గీసేయండి. దీనివల్ల ఎవ్వరూ అనధికార చేర్పులకు వీలుండదు.

మీ చెక్కు ఎక్కడా దుర్వనియోగం కాకుండా తప్పనిసరిగా చెక్కు ఎడమవైపు పైన మూలగా అడ్డంగా ‘అకౌంట్‌ పేయీ‘ అని రాయండి. దీనితో మీరు ఏ అకౌంట్‌కు డబ్బు చెల్లించాలనుకుంటారో ఆ అకౌంట్లోకే మీ డబ్బు చేరుతుంది.

బ్లూ లేదా బ్లాక్‌ కలర్‌ పెన్నులతో మీరు చెక్కుపై రాయాలనుకున్న అక్షరాలను స్పష్టంగా రాయండి.

ఇక సంతకాల విషయంలో చాలా జాగ్రత్త. మీ  బ్యాంక్‌ బ్రాంచీ అకౌంట్‌కు సంబంధించి మీ సంతకం ఎలా ఉందో అలానే చెక్కుపై సైతం సంతకం చేయాలి. ఎటువంటి తేడా ఉన్నా... చెక్కు బౌన్స్‌ అయ్యే అవకాశం ఉంటుంది.

రుణం లేదా బీమా ఆఫరింగ్స్‌కు ఉద్దేశించి చెక్కును ఇచ్చేటప్పుడు, థర్డ్‌ పార్టీ గుర్తింపును స్పష్టంగా నిర్ధారించుకోండి.

ఇవి చేయొద్దు...
చెక్కులపై ముందుగానే సంతకాలు పెట్టేసుకోవద్దు.
చెక్కు దిగువ ఉండే ఎంఐసీఆర్‌ కోడ్‌ పాడయిపోయే పొరపాట్లు చేయొద్దు.
చెక్కుపై ఏదైనా పేరు లేదా అంకెలు రాసిన తర్వాత, పక్కన మిగిలిన ఖాళీని అలానే వదిలేయకండి. అలాంటి ఏదైనా స్పేస్‌ (ఖాళీ) ఉండిపోతే తప్పనిసరిగా ఒక గీత కొట్టండి. దీనివల్ల ఎవ్వరూ అనధికార చేర్పులు చేయలేరు.
చెక్కుపై దిద్దుళ్లు, కొట్టేసి మళ్లీ రాయడం వంటి తప్పులు చేయకండి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement