నగదు డిపాజిట్ చేసినంత మాత్రాన...నలుపు.. తెలుపైపోదు!
►డీమోనిటైజేషన్‌తో కరెన్సీ గోప్యత తొలగిపోయింది
►నల్లధనం ఎవరిదో బయటికొస్తుంది...
►భారీ డిపాజిట్లతో వడ్డీరేట్లు దిగొస్తున్నాయి
►ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: బ్యాంకుల్లో నగదును డిపాజిట్ చేసినంతమాత్రాన నల్లధనం చట్టబద్ధమైనదిగా మారిపోదని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ హెచ్చరించారు. నోట్ల రద్దు(డీమోనిటైజేషన్)తో కరెన్సీ గోప్యత అనేది పూర్తిగా తొలగిపోయిందని.. ఇప్పుడు నల్లధనం ఎవరిదనేది బయటపడుతుందని పేర్కొన్నారు. ‘డీమోనిటైజేషన్.. గత రెండు నెలల పరిస్థితి’ పేరుతో జైట్లీ ‘ఫేస్‌బుక్’లో చేసిన పోస్ట్‌లో పలు అంశాలను ప్రస్తావించారు. వ్యవస్థలో ఉన్న రూ.500, రూ.1,000 నోట్లలో 97 శాతం బ్యాంకుల్లోకి వెనక్కివచ్చేసినట్లు అంచనాలు వెలువడిన సంగతి తెలిసిందే. దీంతో నల్లధనాన్ని ఏరిపారేయడంలో నోట్ల రద్దు సమర్థతపై పలువురు ఆర్థికవేత్తలు, విశ్లేషకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో జైట్లీ తాజా వ్యాఖ్యలు చేయడం గమనార్హం. పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రజల ఇబ్బందులు ఇక తొలగిపోయినట్లేనని... ఆర్థిక కార్యకలాపాలు మళ్లీ పుంజుకుంటున్నాయని జైట్లీ పేర్కొన్నారు.
వడ్డీరేట్లు దిగొస్తున్నాయ్...
డీమోనిటైజేషన్ కారణంగా బ్యాంకుల్లో డిపాజిట్లు వెల్లువెత్తడంతో వడ్డీరేట్లు దిగొచ్చేందకు దోహదం చేసిందని ఆర్థిక మంత్రి చెప్పారు. రుణ లభ్యత పెరగడంవల్ల ఆర్థిక వ్యవస్థ వృద్ధి మరింత పుంజుకుంటుందని జైట్లీ వివరించారు. ‘86 శాతం కరెన్సీని(జీడీపీలో దీని వాటా 12.2 శాతం) మార్కెట్ నుంచి వెనక్కిలాగేసి.. దీని స్థానంలో కొత్త కరెన్సీని చేర్చడం అనేది సాధారణమైన విషయమేమీ కాదు. ఈ నిర్ణయంతో గణనీయమైన పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. ఇది ఎంతో సాహసోపేతమైన, శక్తియుక్తులతో కూడుకున్న చర్య. తాత్కాలికంగా కొన్ని సమస్యలు, విమర్శలు రావడం సహజం. ఆర్థిక కార్యకలాపాలపైనా ప్రతికూలత ఉంటుంది. అయితే, బ్యాంకులు, ఏటీఎంల ముందు ప్రజల బారులు ఇప్పుడు కనబడటంలేదు. కొత్త కరెన్సీ సరఫరా(రీమోనిటైజేషన్) ప్రక్రియ జోరందుకోవడమే దీనికి కారణం’ అని జైట్లీ పేర్కొన్నారు.
పన్ను ఎగవేతను అనైతికంగా భావించడంలేదు...
ప్రభుత్వానికి పన్ను చెల్లించకపోయినా ఏమీ కాదులే అన్న ధోరణి కారణంగా దేశానికి చాలా నష్టం వాటిల్లిందనన్నారు. ‘125 కోట్లకుపైగా ప్రజలున్న ఇంత పెద్ద దేశంలో గత ఆర్థిక సంవత్సరం(2015–16) కేవలం 3.7 కోట్లమంది మాత్రమే పన్ను రిటర్నులు దాఖలు చేశారు. పన్ను ఎగవేతల కారణంగా ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతుంది. పేదరిక నిర్మూలన, జాతీయ భద్రత, ఆర్థికాభివృద్ధి విషయంలో రాజీపడాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. పన్ను ఎగవేత అనేది అనైతికంగా ఎవరూ భావించడంలేదు. జీవితంలో ఇదో భాగమైపోయింది. చాలా ప్రభు త్వాలు దీన్ని సర్వసాధారణమైన విషయంగానే కొనసాగిస్తూ వచ్చాయి. అయితే, ప్రధాని మోదీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం ఈ ‘సాధారణ’ అంశంలో మార్పువస్తుంది. అంతేకాదు మన దేశ ప్రజల వ్యయ ధోరణులు కూడా మారతాయి. సంస్కరణలు ఏవైనాకూడా విధ్వంసపూరితంగానే ఉంటాయి. తిరోగమన పంథాలో మార్పునకు దోహదం చేస్తాయి. డీమోనిటైజేషన్‌తో నిజాయితీపరులకు ప్రయోజనం లభిస్తుంది. మోసపూరితంగా వ్యవహరించేవారికి శిక్ష తప్పదు’అని జైట్లీ పేర్కొన్నారు.
త్వరలో ‘రంగు’ తేలుతుంది..
బ్యాంకుల్లోకి భారీస్థాయిలో వచ్చిన డిపాజిట్లను వడపోసే ప్రక్రియ జరుగుతోందని.. ఇందులో నల్లధనం గనుక బయటపడితే సంబంధిత వ్యక్తులను బయటికి లాగుతామని జైట్లీ చెప్పారు. ‘లెక్కచూపని సొమ్మును స్వచ్ఛందంగా వెల్లడిస్తే తక్కువ పన్నుతో బయటపడొచ్చు. అదే ఐటీ శాఖ గనుక పట్టుకుంటే భారీగా పన్ను, జరిమానా కక్కాల్సిందే’నని జైట్లీ స్పష్టం చేశారు. డీమోనిటైజేషన్ ప్రక్రియ మొదలయ్యాక ప్రజలు చాలా ఓపిక, సహనంతో వ్యవహరించారని.. అశాంతి అనేది ఎక్కడా కనబడలేదన్నారు.
అదే వారిద్దరికీ తేడా...
‘ప్రధాని మోదీ భావితరం శ్రేయస్సు కోసం ఆలోచిస్తుంటే.. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆలోచనంతా వచ్చే పార్లమెంటు సమావేశాలను ఎలా అడ్డుకోవాలనేదానిపైనే ఉంది. అదే వారిద్దరి మధ్య తేడా’ అని జైట్లీ విమర్శలు గుప్పించారు. ‘నోట్ల రద్దు అంశంపై ప్రతిపక్షాల ఆందోళనలన్నీ కొరగాకుండా పోయాయి. ఆర్థిక వ్యవస్థ కుదేలయిపోతుందంటూ వాళ్లు చేసిన గగ్గోలు తప్పని తేలింది. ప్రతిపక్షాల వైఖరివల్ల పార్లమెంటు సమావేశాల్లో ఒక సెషన్ మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. సాంకేతికత, మార్పు, సంస్కరణలకు కాంగ్రెస్ వ్యతిరేకంగా వ్యవహరించడం దురదృష్టకరం. నల్లధనానికి అనుకూలంగా వాళ్లు పనిచేస్తున్నారనేందుకు ఇదే నిదర్శనం’ అని జైట్ల పేర్కొన్నారు.