యూపీఐ పేమెంట్స్ అందుబాటులోకి వచ్చాక డిజిటల్ చెల్లింపుల్లో ఎప్పటికప్పుడు సరికొత్త మార్పులు వస్తున్నాయి. ఎవరికి నగదు పంపాలన్నా యూపీఐ యాప్‌ల ద్వారా క్షణాల్లో పంపించేస్తున్నాం. మరి క్యాష్ డిపాజిట్ అయితే ఏం చేస్తాం.. నేరుగా సంబంధిత బ్యాంకుకు వెళ్లి అకౌంట్‌లో వేయడమో లేదా ఆ బ్యాంకు ఏటీఎం మెషీన్‌లో డిపాజిట్ చేయడమో చేస్తాం. కానీ బ్యాంకుతో సంబంధం లేకుండా కేవలం యూపీఐ యాప్‌తో ఏ బ్యాంకు ఖాతాకైనా భౌతిక నగదును డిపాజిట్ చేసే అవకాశం ఉంటే బాగుంటుంది కదా.. అలాంటి కొత్త ఫీచర్ ఇప్పుడు వచ్చింది.
ఏ బ్యాంక్ ఖాతాకైనా..
యూపీఐ ఇంటర్‌ఆపరబుల్ క్యాష్ డిపాజిట్ (UPI-ICD) అనే కొత్త ఫీచర్ ఏటీఎంలలో నగదు డిపాజిట్ చేసే విధానాన్ని మరింత సులువుగా మార్చనుంది. ఈ వినూత్నమైన ఫీచర్‌లో ఏ యూపీఐ యాప్‌ను ఉపయోగించైనా, ఏ బ్యాంక్ ఖాతాలోకైనా నగదును డిపాజిట్ చేయవచ్చు. యాక్సిస్ బ్యాంక్, యూనియన్ బ్యాంకులకు చెందిన ఎంపిక చేసిన ఏటీఎంలలో ప్రస్తుతానికి ఈ ఫీచర్ అందుబాటులో ఉన్నప్పటికీ, సమీప భవిష్యత్తులో మరిన్ని బ్యాంకులు ఈ సౌలభ్యాన్ని అందించే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: ఈ బ్యాంకులో ఎఫ్‌డీ.. మంచి వడ్డీ!
డిపాజిట్ ఇలా..
» యూపీఐ-ఐసీడీని సపోర్ట్ చేసే అధునాతన నగదు రీసైక్లర్ మెషీన్‌లతో కూడిన ఏటీఎంలను గుర్తించండి.
» మీ యూపై యాప్‌ని తెరిచి ఏటీఎం స్క్రీన్‌పై వచ్చే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయండి.
» మీరు డిపాజిట్ చేయాలనుకుంటున్న మొత్తాన్ని నమోదు చేసి, లబ్ధిదారు ఖాతాను ఎంచుకోండి.
» డిపాజిట్ స్లాట్‌లో నగదు పెట్టండి.
» వివరాలను ధ్రువీకరించి యూపీఐ పిన్ ఉపయోగించి లావాదేవీని పూర్తి చేయండి.
ప్రయోజనాలు
» నగదు తక్షణమే లబ్ధిదారుల ఖాతాకు జమవుతుంది.
» ఏటీఎం నగదు రీసైక్లర్ యంత్రం డిపాజిట్ చేసిన నోట్ల ప్రామాణికతను ధ్రువీకరిస్తుంది.
» ఒక్కో లావాదేవీకి గరిష్టంగా రూ.50,000 డిపాజిట్ చేసేందుకు వీలు.
» మొత్తం ప్రక్రియ డిజిటల్‌గా జరగుతుంది. ఎలాంటి కార్డ్స్, భౌతిక స్లిప్‌ల అవసరం ఉండదు.
» ఇతర యూపీఐ లావాదేవీల మాదిరిగానే వీటికీ భద్రత ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment