Union Bank of India
-
యూనియన్ బ్యాంక్‌పై భారీ జరిమానా
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపై ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (FIU) చర్యలు చేపట్టింది. అనుమానాస్పద లావాదేవీలను నివేదించడంలో విఫలమైనందుకు, ముంబై శాఖలలోని కొన్ని ఖాతాలపై మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం తగిన జాగ్రత్తలు తీసుకోనందుకు రూ.54 లక్షల జరిమానా విధించింది.మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) సెక్షన్ 13 కింద అక్టోబరు 1న యూనియన్ బ్యాంక్‌కు పెనాల్టీ నోటీసును జారీ చేసిన ఎఫ్ఐయూ బ్యాంక్ చేసిన రాతపూర్వక, మౌఖిక సమర్పణలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత యూనియన్ బ్యాంక్‌పై అభియోగాలు నిరూపితమైనవిగా గుర్తించింది.ఎఫ్ఐయూ ఈ మేరకు బ్యాంక్ కార్యకలాపాల సమగ్ర సమీక్ష చేపట్టబడింది. కేవైసీ/ఏఎంఎల్ (యాంటీ మనీ లాండరింగ్)కి సంబంధించిన కొన్ని "వైఫల్యాలను" వెలికితీసింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముంబై హిల్ రోడ్ బ్రాంచ్‌లో నిర్దిష్ట కరెంట్ ఖాతాలపై చేసిన స్వతంత్ర పరిశీలనలో ఒక ఎన్బీఎఫ్సీ దాని అనుబంధ సంస్థల ఖాతాల నిర్వహణలో అవకతవకలు ఉన్నట్లు వెల్లడైందని పబ్లిక్ ఆర్డర్ సారాంశంలో ఎఫ్ఐయూ పేర్కొంది. -
కొత్త ఫీచర్: చేతిలోని క్యాష్.. ఈజీగా అకౌంట్లోకి..
యూపీఐ పేమెంట్స్ అందుబాటులోకి వచ్చాక డిజిటల్ చెల్లింపుల్లో ఎప్పటికప్పుడు సరికొత్త మార్పులు వస్తున్నాయి. ఎవరికి నగదు పంపాలన్నా యూపీఐ యాప్‌ల ద్వారా క్షణాల్లో పంపించేస్తున్నాం. మరి క్యాష్ డిపాజిట్ అయితే ఏం చేస్తాం.. నేరుగా సంబంధిత బ్యాంకుకు వెళ్లి అకౌంట్లో వేయడమో లేదా ఆ బ్యాంకు ఏటీఎం మెషీన్లో డిపాజిట్ చేయడమో చేస్తాం. కానీ బ్యాంకుతో సంబంధం లేకుండా కేవలం యూపీఐ యాప్‌తో ఏ బ్యాంకు ఖాతాకైనా భౌతిక నగదును డిపాజిట్ చేసే అవకాశం ఉంటే బాగుంటుంది కదా.. అలాంటి కొత్త ఫీచర్ ఇప్పుడు వచ్చింది.ఏ బ్యాంక్ ఖాతాకైనా..యూపీఐ ఇంటర్ఆపరబుల్ క్యాష్ డిపాజిట్ (UPI-ICD) అనే కొత్త ఫీచర్ ఏటీఎంలలో నగదు డిపాజిట్ చేసే విధానాన్ని మరింత సులువుగా మార్చనుంది. ఈ వినూత్నమైన ఫీచర్లో ఏ యూపీఐ యాప్‌ను ఉపయోగించైనా, ఏ బ్యాంక్ ఖాతాలోకైనా నగదును డిపాజిట్ చేయవచ్చు. యాక్సిస్ బ్యాంక్, యూనియన్ బ్యాంకులకు చెందిన ఎంపిక చేసిన ఏటీఎంలలో ప్రస్తుతానికి ఈ ఫీచర్ అందుబాటులో ఉన్నప్పటికీ, సమీప భవిష్యత్తులో మరిన్ని బ్యాంకులు ఈ సౌలభ్యాన్ని అందించే అవకాశం ఉంది.ఇదీ చదవండి: ఈ బ్యాంకులో ఎఫ్డీ.. మంచి వడ్డీ!డిపాజిట్ ఇలా.. » యూపీఐ-ఐసీడీని సపోర్ట్ చేసే అధునాతన నగదు రీసైక్లర్ మెషీన్లతో కూడిన ఏటీఎంలను గుర్తించండి.» మీ యూపై యాప్‌ని తెరిచి ఏటీఎం స్క్రీన్‌పై వచ్చే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయండి.» మీరు డిపాజిట్ చేయాలనుకుంటున్న మొత్తాన్ని నమోదు చేసి, లబ్ధిదారు ఖాతాను ఎంచుకోండి.» డిపాజిట్ స్లాట్‌లో నగదు పెట్టండి.» వివరాలను ధ్రువీకరించి యూపీఐ పిన్ ఉపయోగించి లావాదేవీని పూర్తి చేయండి.ప్రయోజనాలు» నగదు తక్షణమే లబ్ధిదారుల ఖాతాకు జమవుతుంది.» ఏటీఎం నగదు రీసైక్లర్ యంత్రం డిపాజిట్ చేసిన నోట్ల ప్రామాణికతను ధ్రువీకరిస్తుంది.» ఒక్కో లావాదేవీకి గరిష్టంగా రూ.50,000 డిపాజిట్ చేసేందుకు వీలు.» మొత్తం ప్రక్రియ డిజిటల్‌గా జరగుతుంది. ఎలాంటి కార్డ్స్, భౌతిక స్లిప్‌ల అవసరం ఉండదు.» ఇతర యూపీఐ లావాదేవీల మాదిరిగానే వీటికీ భద్రత ఉంటుంది. -
టయోటా వాహనాలకు యూనియన్ బ్యాంక్ రుణం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ టయోటా కిర్లోస్కర్ మోటార్ తాజాగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా టయోటా వాహనాల కొనుగోలుకై కస్టమర్లకు సమగ్ర రుణ సౌకర్యాన్ని బ్యాంకు కల్పించనుంది.ఆన్‌రోడ్ ధరపై 90 శాతం వరకు లోన్ సమకూరుస్తారు. యూనియన్ వెహికిల్ స్కీమ్ కింద 84 నెలల వరకు ఈఎంఐ సౌకర్యం ఉంది. యూనియన్ పరివాహన్ స్కీమ్‌లో భాగంగా వాణిజ్య వాహనాలకు 60 నెలల వరకు వాయిదాలు ఆఫర్ చేస్తారు. అన్ని రకాల టయోటా వాహనాలకు కొత్త స్కీమ్ వర్తిస్తుందని కంపెనీ తెలిపింది. -
Nizamabad: పోలీసుల అదుపులో బ్యాంక్ మేనేజర్?
ఖలీల్‌వాడి: ఖాతాదారుల నుంచి డబ్బులు కాజేసిన బ్యాంక్ మేనేజర్ అజయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. నగరంలోని పెద్దబజార్ యూనియన్ బ్యాంకులో ఖాతాదారులను మచ్చిక చేసుకొని వారి రుణాలను, డబ్బులను తీసుకొని బ్యాంక్ మేనేజర్ పరారైన విషయం తెలిసిందే. కేసులో బ్యాంక్ మేనేజర్‌పై ఇప్పటి వరకు 26 మంది నాలుగో టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీస్‌శాఖ మూడు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టింది. ఒక పోలీసు బృందం హైదరాబాద్‌లో నాలుగు రోజులుగా మకాం వేసి మేనేజర్ అజయ్ ఆచూకీకి కోసం వాకబు చేశారు. దీంతోపాటు సాంకేతిక రంగాన్ని ఆధారం చేసుకొని కుటుంబ సభ్యులకు సంబంధించిన వివరాల ద్వారా అజయ్ ఎక్కడ ఉన్నారనే దానిపై ఆరా తీశారు. పక్కా సమాచారం మేరకు ఆదివారం హైదరాబాద్‌లో బ్యాంక్ మేనేజర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. శనివారం రాత్రే అదుపులోకి తీసుకుని బ్యాంకులో ఖాతాదారులకు సంబంధించిన లావాదేవీలపై విచారణ చేపట్టినట్లు తెలిసింది. -
మారుతీ సుజుకీ డీలర్లకు బ్యాంక్ రుణాలు
న్యూఢిల్లీ: వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా తాజాగా యూనియన్ బ్యాంక్‌తో ఒక అవగాహన ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా మారుతీ సుజుకీ డీలర్లకు యూనియన్ బ్యాంక్ రుణ సాయం చేస్తుంది. దేశవ్యాప్తంగా 4,000 పైచిలుకు మారుతీ విక్రయ శాలల్లో వాహనాల నిల్వకు కావాల్సిన నిధుల సమీకరణ అవకాశాలను ఈ భాగస్వామ్యం మెరుగుపరుస్తుందని సంస్థ మంగళవారం ప్రకటించింది. డీలర్ నెట్‌వర్క్‌ను పెంపొందించడంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు మారుతీ సుజుకీ ఇండియా మార్కెటింగ్, సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. 2008 నుంచి మారుతీ సుజుకీ, యూనియన్ బ్యాంక్ మధ్య బంధం కొనసాగుతోంది. 3,00,000 పైచిలుకు కస్టమర్లకు యూనియన్ బ్యాంక్ వాహన రుణం సమకూర్చింది. -
యూనియన్ బ్యాంక్ లాభం రెట్టింపు
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెపె్టంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి (క్యూ2) మెరుగైన పనితీరు చూపించింది. నికర లాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు రెట్టింపై రూ.3,511 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో లాభం రూ.1,848 కోట్లుగానే ఉంది. మొత్తం ఆదాయం రూ.22,958 కోట్ల నుంచి రూ.28,282 కోట్లకు దూసుకుపోయింది. నిర్వహణ లాభం సైతం రూ.6,577 కోట్ల నుంచి రూ.7,221 కోట్లకు పెరిగింది. వడ్డీ ఆదాయం రూ.19,682 కోట్ల నుంచి రూ.24,587 కోట్లకు చేరగా, నికర వడ్డీ ఆదాయం 10 శాతం వృద్ధితో రూ.9,126 కోట్లుగా నమోదైంది. నికర వడ్డీ మార్జిన్ 3.15 శాతం నుంచి 3.18 శాతానికి పెరిగింది. బ్యాంకు ఆస్తుల (రుణాలు) నాణ్యత మెరుగుపడింది. స్థూల ఎన్పీఏలు 6.38 శాతానికి క్షీణించాయి. క్రితం ఏడాది ఇదే త్రైమాసికం చివరికి ఇవి 8.45 శాతంగా ఉన్నాయి. నికర ఎన్పీఏలు సైతం 1.30 శాతానికి పరిమితమయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలానికి ఇవి 2.64 శాతంగా ఉన్నాయి. బ్యాంక్ క్యాపిటల్ అడెక్వెసీ రేషియో 16.69 శాతానికి మెరుగుపడింది. కాసా రేషియో (కరెంట్, సేవింగ్స్ ఖాతాలు) 35.64 శాతం నుంచి 34.66 శాతానికి తగ్గింది. సెపె్టంబర్ క్వార్టర్లో అర్హులైన సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల కేటాయింపు (క్యూఐపీ) ద్వారా రూ.5,000 కోట్లను సమీకరించినట్టు బ్యాంక్ తెలిపింది. దీంతో బ్యాంక్‌లో కేంద్ర ప్రభుత్వం వాటా 83.49 శాతం నుంచి 76.99 శాతానికి తగ్గింది. -
రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు ప్రాధాన్యత
సాక్షి, అమరావతి: రాష్ట్ర లీడ్ బ్యాంక్‌గా రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నితేష్ రంజన్ చెప్పారు. రిటైల్ రుణాల మంజూరులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కీలకపాత్ర పోషిస్తోందని తెలిపారు. వడ్డీరేట్లు గరిష్ట స్థాయిలో ఉన్నా రిటైల్ రుణాలకు డిమాండ్ బాగుందని చెప్పారు. విజయవాడలో జరుగుతున్న రెండు రోజుల మెగా రిటైల్ ఎక్స్పోను ఆయన శుక్రవారం ప్రారంభించి పలువురికి రుణం మంజూరు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా నితేష్ రంజన్ ‘సాక్షి’ ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఇంటర్వ్యూలో ముఖ్యాంశాలు.. ప్రశ్న: స్టేట్ లెవెల్ బ్యాంకింగ్ కమిటీలో లీడ్ బ్యాంకర్‌గా ఉన్న యూనియన్ బ్యాంక్ ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధిలో ఏ విధంగా భాగస్వామ్యం అవుతోంది? జవాబు: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్త వ్యాపార విస్తరణలో ఆంధ్రప్రదేశ్ కీలకపాత్ర పోషిస్తోంది. లీడ్ బ్యాంకర్‌గా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి పథకాలను నిర్దేశించిన వారికి సక్రమంగా అందించడానికి ప్రాధాన్యత ఇస్తున్నాము. రాష్ట్రంలో రిటైల్ బ్యాంకింగ్ కార్యకలాపాలు వేగంగా విస్తరిస్తున్నాయి. ఈ పండుగల సీజన్ కోసం సత్వరం రుణాలను మంజూరు చేసేలా విజయవాడలో మెగా రిటైల్ లోన్ ఎక్స్పో నిర్వహిస్తున్నాం. 25 మంది బిల్డర్లు, 12 మంది వాహన డీలర్లు, 7 ఎడ్యుకేషన్కన్సల్టెన్సీలను ఒకే వేదిక మీదకు తీసుకొచ్చాం. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా టైలర్ మేడ్ రుణ పథకాలను ఆఫర్ చేసి, అక్కడిక్కడే తక్షణం రుణాలు మంజూరు చేసేలా వ్యవస్థను ఏర్పాటు చేశాం. ప్రశ్న: ప్రస్తుతం వడ్డీ రేట్లు గరిష్ట స్థాయిలో ఉన్నాయి. రుణ మార్కెట్‌పై వడ్డీ రేట్ల పెరుగుదల ప్రతికూల ప్రభావం చూపుతుందా? జవాబు: వడ్డీ రేట్లు గరిష్ట స్థాయిలో ఉన్న మాట వాస్తవమే. కానీ దీనికి భిన్నంగా దేశవ్యాప్తంగా రిటైల్ రుణాలకు భారీగా డిమాండ్ ఏర్పడుతోంది. ఆటో, ఎడ్యుకేషన్, హోమ్ లోన్స్ వంటి రుణాలకు డిమాండ్ బాగుంది. గతేడాది యూనియన్ బ్యాంక్ రిటైల్ రుణాలు 17.19 శాతం పెరిగి రూ.1,60,595 కోట్లకు చేరాయి. ఈ ఏడాది కూడా రిటైల్ రుణాల్లో 10 నుంచి 12 శాతం వృద్ధిని అంచనా వేస్తున్నాం. ప్రశ్న: వడ్డీ రేట్లు ఎప్పటి నుంచి తగ్గుతాయి? జవాబు: ప్రస్తుతం ద్రవ్యోల్బణం అధిక స్థాయిలో ఉండటంతో వడ్డీ రేట్లు గరిష్టస్థాయిలో ఉన్నాయి. మరో రెండు మూడు త్రైమాసికాల వరకు వడ్డీ రేట్లు గరిష్టస్థాయిలో కొనసాగుతాయని అంచనా వేస్తున్నాం. ఆ తర్వాత నుంచి క్రమేపీ తగ్గే అవకాశం ఉంది. ప్రశ్న: ఇతర బ్యాంకుల పోటీని తట్టుకోవడానికి యూనియన్ బ్యాంక్ ఏమైనా ప్రత్యేక ఆఫర్లను ప్రకటించిందా? జవాబు: ప్రస్తుతం అన్ని బ్యాంకులకంటే తక్కువ రేటుకే రుణాలు అందిస్తున్నాం. అంతేకాకుండా పండుగుల సీజన్ దృష్టిలో పెట్టుకొనిఅన్ని రిటైల్ రుణాలపై ప్రాసెసింగ్ ఫీజును రద్దు చేశాం. విదేశాల్లో విద్య కోసం రుణాలు తీసుకునే వారికి రూ.40 లక్షల వరకు ఎటువంటి తనఖా అవసరం లేకుండా రుణాలిస్తున్నాం. ఆన్లైన్, యాప్‌ల ద్వారా క్షణాల్లో రుణాలు మంజూరు చేస్తున్నాం. ప్రశ్న: దేశవ్యాప్తంగా నెలకొన్న వర్షాభావ పరిస్థితులు రుణాల మార్కెట్‌పై ఎటువంటి ప్రభావం చూపుతాయి? జవాబు: ప్రస్తుతానికి దేశవ్యాప్తంగా అటువంటి వాతావరణం కనిపించడం లేదు. రుణాల మార్కెట్‌పై ఎటువంటి ప్రభావం లేదు. ఇప్పటికే పండుగుల సీజన్ మొదలైంది. ఇది నాలుగో త్రైమాసికం వరకు కొనసాగుతుంది. అప్పటివరకు ఇదే విధమైన డిమాండ్ కొనసాగుతుందని అంచనా వేస్తున్నాం. -
బ్యాంక్ ఖాతాదారులకు శుభవార్త.. లోన్ ప్రాసెసింగ్ నిబంధనల్లో మార్పులు
హోం లోన్, టూ వీలర్‌లోన్ తీసుకున్న వారికి భారీ ఉపశమనం కలిగింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు 100 శాతం ప్రాసెసింగ్ ఛార్జీలను మాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే, ఈ ఆఫర్ సిబిల్ స్కోర్ 700పైన ఉన్న వారికి మాత్రమే వర్తిస్తుందని షరతు విధించింది. ఆగస్టు 16, 2023 నుంచి నవంబర్ 15, 2023 మధ్య కాలానికి ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. అంతే కాదు, ఇతర ఆర్థిక సంస్థలు, బ్యాంకుల నుంచి గృహ రుణాలను తీసుకునేందుకు సైతం ఈ ఆఫర్‌ను పొడిగించారు. మరోవైపు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2022-2023 ఆర్థిక సంవత్సరానికి రూ.2022,23 కోట్ల డివిడెండ్‌ను ప్రకటించింది. ఏ ఆర్థిక సంవత్సరంలోనైనా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన అత్యధిక డివిడెండ్ ఇదేనని బ్యాంక్ తన ప్రకటనలో పేర్కొంది. -
యూనియన్ బ్యాంక్ రికార్డు డివిడెండ్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ యూనియన్ బ్యాంక్ రికార్డు స్థాయి లో రూ. 1,712 కోట్ల డివిడెండ్‌ను ప్రభుత్వానికి అందజేసింది. 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ మేరకు ఒక డివిడెండ్ చెక్కును కేంద్రానికి సమరి్పంచినట్లు బ్యాంక్ ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. ఈ స్థాయిలో డివిడెండ్‌ను యూనియన్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరాల్లో ఎన్నడూ సమరి్పంచలేదని కూడా ప్రకటన వివరించింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ ఎ మణిమేఖలై డివిడెండ్ చెక్కును ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు అందజేశారు. జాయింట్ సెక్రటరీ (బ్యాంకింగ్) సమీర్ శుక్లా తదితర అధికారులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. -
రూ. 3,000 కోట్ల మొండి పద్దుల విక్రయానికి యూనియన్ బ్యాంక్
న్యూఢిల్లీ: బ్యాడ్ బ్యాంక్ ఎన్ఏఆర్సీఎల్కు విక్రయించేందుకు రూ. 3,000 కోట్ల విలువ చేసే 8 మొండి పద్దులను (ఎన్పీఏ) గుర్తించినట్లు యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరంలో రూ. 900 కోట్ల విలువ చేసే మూడు ఖాతాలను విక్రయించినట్లు తెలిపింది. తాజాగా దాదాపు రూ. 10,000 కోట్ల బాకీలు ఉన్న మొత్తం 42 సమస్యాత్మక ఖాతాలను గుర్తించినట్లు బ్యాంకు సీఈవో ఎ మణిమేఖలై తెలిపారు. వీటిలో కనీసం ఎనిమిది ఖాతాలను ఈ ఆర్థిక సంవత్సరం విక్రయించగలమని ఆశిస్తున్నట్లు వివరించారు. -
50 శాతం ఏయూఎం వృద్ధిపై యూనియన్ ఎంఎఫ్ గురి
ముంబై: యూనియన్ మ్యూచువల్ ఫండ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తన నిర్వహణ ఆస్తులను (ఏయూఎం) 50 శాతం మేర పెంచుకోనున్నట్టు ప్రకటించింది. 2023 మార్చి నాటికి ఈ సంస్థ ఏయూఎం రూ.9,853 కోట్లుగా ఉంటే, 2024 మార్చి నాటికి రూ.15,000 కోట్లకు తీసుకెళ్లాలనే లక్ష్యాన్ని పెట్టుకుంది. ఎప్పుడో 2012లోనే ఈ సంస్థ మ్యూచువల్ ఫండ్స్ సేవలు ప్రారంభించినప్పటికీ ఇంతకాలం ఆస్తుల్లో వృద్ధి చెప్పుకోతగినంత లేదు. ప్రభుత్వరంగ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన యూనియన్ మ్యూచువల్ ఫండ్‌లో, 39.64 శాతం వాటాను జపాన్‌కు చెందిన దైచీలైఫ్ 2018లో కొనుగోలు చేయడం గమనార్హం. ఈ సంస్థ ఏయూఎంలో టాప్–30 పట్టణాల వాటా 68 శాతంగా ఉంటే, బీ30 (బియాండ్ 30) పట్టణాల నుంచి 32 శాతం ఆస్తులను కలిగి ఉంది. ‘‘మార్చి చివరికి ఉన్న ఏయూఎం రూ.9,853 కోట్లు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికం చివరికి రూ.10,700 కోట్లకు చేరుకుంది. వచ్చే మార్చి నాటికి ఇది రూ.15,000 కోట్లకు చేరుతుందని భావిస్తున్నాం. పెద్ద థీమ్యాటిక్ ఫండ్‌ను వచ్చే నెలలో ప్రారంభించనున్నాం. దీని ద్వారా రూ.500 కోట్లు సమీకరించగలమని అంచనా వేస్తున్నాం. మార్కెట్‌పైనే ఇది ఆధారపడి ఉంటుంది’’అని యూనియన్ మ్యూచువల్ ఫండ్ సీఈవో జి.ప్రదీప్‌కుమార్ తెలిపారు. కొత్త భాగస్వామి మద్దతుతో ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్నప్పటికీ ఏయూఎంలో వృద్ధి పెద్దగా లేకపోవడానికి బెల్జియంకు చెందిన కేబీసీ తొలుత భాగస్వామిగా ఉండడమేనని ప్రదీప్‌కుమార్ వెల్లడించారు. థర్డ్ పార్టీ విక్రయాలకు ఆ సంస్థ సమ్మతించకపోవడంతో, కేవలం యూనియన్ బ్యాంక్ శాఖల ద్వారానే విక్రయాలు చేయాల్సి వచి్చందన్నారు. 2018లో దైచీ రాకతో అప్పటికీ కేవలం రూ.4,500 కోట్లుగానే ఉన్న ఏయూఎం, ఐదేళ్లలో రెట్టింపైనట్టు చెప్పారు. ఇక ముందూ ఇదే విధంగా వృద్ధిని సాధిస్తామన్నారు. -
యూనియన్ బ్యాంకులో ఆస్తుల రిజిస్ట్రేషన్ ఫీజులు
సాక్షి, అమరావతి: ఆస్తుల రిజిస్ట్రేషన్ ఫీజులు, అన్ని రకాల యూజర్ చార్జీలను ఇకపై యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ)లోనూ చెల్లించొచ్చు. అన్ని రకాల స్టాంప్ పేపర్లు కూడా ఈ బ్యాంకు శాఖల్లో లభిస్తాయి. ఇప్పటివరకు ఈ సేవలు ఎస్బీఐ ట్రెజరీ బ్యాంకుల్లోనే ఉన్నాయి. శనివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని యూబీఐ శాఖల్లో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. బ్యాంకులో ఇచ్చే ఈ స్టాంప్ పేపర్ ఆధారంగా రాష్ట్రంలో అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన అన్ని రకాల లావాదేవీలను నిర్వహించుకోవచ్చు. ఈ మేరకు స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌తో యూబీఐ శుక్రవారం అవగాహన ఒప్పందం చేసుకుంది. స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ రీజనల్ మేనేజర్ సత్యేంద్రకుమార్ తివారీ, యూబీఐ స్టేట్ ఫీల్డ్ జనరల్ మేనేజర్ నవనీత్ కుమార్ల మధ్య విజయవాడలో ఈ ఒప్పందం జరిగింది. ఈ కార్యక్రమంలో యూబీఐ ఉన్నతాధికారులు మురళీపార్థసారథి, శారదామూర్తి, పీవీజేఎన్ మూర్తి పాల్గొన్నారు. రాష్ట్రంలోని 120 యూబీఐ బ్రాంచ్‌లలో శనివారం నుంచి ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని యూబీఐ ఎఫ్‌జీఎం నవనీత్ కుమార్ వివరించారు. చదవండి: Fact Check: వాస్తవాలకు మసిపూసి ‘ఈనాడు’ విష ప్రచారం -
ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలకు చేయూత
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలకు చేయూతనిస్తూ..ఖాతాదారులు ‘ఇష్టపడే బ్యాంకు’గా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ముందుకెళ్తున్నట్టు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీఈవో మణిమేఖలై అన్నారు. విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం, ఒంగోలు, నరసరావుపేట రీజియన్ల సమావేశం శుక్రవారం విజయవాడ టౌన్ హాలులో జరిగింది. సీఈవో మాట్లాడుతూ మారుమూల ప్రాంతాల్లో సైతం బ్యాంకును విస్తరించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. ఖాతాదారుల ఆధారంగా వ్యాపార విస్తరణ, మార్కెట్ వాటా, లాభదాయకతను పెంచుకునేందుకు ఫోకస్డ్ విధానంతో కార్యాచరణ రూపొందించామని తెలిపారు. 2024 మార్చి నాటికి 21.50 ట్రిలియన్ల గ్లోబల్ వ్యాపారాన్ని సాధించి అంతర్జాతీయంగా 3వ అతిపెద్ద బ్యాంకుగా అవతరించాలని లక్ష్యంగా ముందుకెళ్తున్నామన్నారు. ఇందుకోసం 100 రోజుల అజెండాతో, నాలుగు ముఖ్య లక్ష్యాలను నిర్ధేశించుకున్నామన్నారు. అబ్ నారీ కి బారీ పథకం కింద 2023 జూలై 31 నాటికి 1.25 లక్షల మíహిళా పారిశ్రామికవేత్తలకు, కృషి కే సాథ్ మహిళా వికాస్ పేరిట కనీసం 50 వేల మంది వ్యవసాయ ఔత్సాహికులకు పెద్ద ఎత్తున ఆర్థిక చేయూతనివ్వనున్నామని చెప్పారు. క్యూఆర్, పీవోఎస్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కనీసం 25 శాతం సీడీ ఖాతాలను డిజిటలైజేషన్ చేయనున్నామన్నారు. ఆయా జిల్లాల్లో డిజిటల్ లైబ్రరీల ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. సమావేశంలో సీజీఎం లాల్ సింగ్, హెచ్ఆర్ జోనల్ హెడ్ నవనీత్‌కుమార్ పాల్గొన్నారు. -
యూనియన్ బ్యాంక్ నంబర్ వన్!
హైదరాబాద్: ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ప్రకటించిన ఈజ్ రీఫార్మ్స్ ఇండెక్స్‌లో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొదటి ర్యాంక్ దక్కించుకుంది. ప్రభుత్వరంగ బ్యాంకులకు నిర్దేశించిన సంస్కరణల అమలులో అన్ని బ్యాంకుల్లోకి యూనియన్ బ్యాంక్ ముందుంది. అనలైటిక్స్ సామర్థ్యాలు, కస్టమర్లతో సంబంధాలు బలోపేతం, సమర్థవంతంగా రుణాల పర్యవేక్షణ, సమగ్రమైన డిజిటల్ వసూళ్ల నిర్వహణ విధానం, మోసాలు, సైబర్ దాడుల నుంచి తగిన రక్షణ చర్యలు, బ్యాంకింగ్ సేవలను అందించే విషయంలో ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకోవడం తదితర విభాగాల్లో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మంచి పనితీరు చూపించింది. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో మొదటి ర్యాంక్‌ను సొంతం చేసుకోవడం ఇదే మొదటిసారి అని బ్యాంక్ ప్రకటించింది. -
విద్యార్థిని వేధించిన బ్యాంకుపై హైకోర్టు ఆగ్రహం
సాక్షి, అమరావతి: విద్యారుణం కోసం దరఖాస్తు చేసే సమయంలో ఓ విద్యార్థి సమర్పించిన ఆస్తి ఒరిజినల్ డాక్యుమెంట్లను అతడికి తిరిగి ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేసిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపై హైకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. ఇది ఆ విద్యార్థిని వేధించడమేనన్న హైకోర్టు.. ఇందుకు బ్యాంకు మూల్యం చెల్లించుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. ఆ విద్యార్థికి ఖర్చుల కింద రూ.25 వేలు చెల్లించాలని బ్యాంకును ఆదేశించింది. ఆ మొత్తాన్ని డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో 15 రోజుల్లో హైకోర్టు రిజిస్ట్రార్ (జ్యుడిషియల్) వద్ద డిపాజిట్ చేయాలని ఆదేశించింది. లేనిపక్షంలో తమ ఆదేశాల అమలుకు చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రార్‌కు స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రవినాథ్ తిల్హరీ ఇటీవల తీర్పు చెప్పారు. ఇదీ పిటిషన్.. మచిలీపట్నానికి చెందిన విద్యార్థి నిశ్చల్.. విద్యారుణం కోసం ఆంధ్రాబ్యాంకుకు (తరువాత ఇది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనమైంది) దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తుతో అవసరమైన డాక్యుమెంట్లను, అతడి తల్లి ఇచ్చిన ఆస్తి ఒరిజినల్ గిఫ్ట్ డీడ్‌ను బ్యాంకు అధికారులకు సమర్పించారు. అయితే కొల్లేటరల్ సెక్యూరిటీకి సంబంధించిన ఒరిజినల్ డీడ్‌ను సమర్పించలేదంటూ నిశ్చల్‌కు రుణం మంజూరు చేసేందుకు బ్యాంకు అధికారులు నిరాకరించారు. దీంతో నిశ్చల్ తాను సమర్పించిన ఒరిజినల్ గిఫ్ట్ డీడ్‌ను తిరిగి ఇచ్చేయాలని బ్యాంకు అధికారులను కోరారు. దీనికి బ్యాంకు అధికారులు సానుకూలంగా స్పందించలేదు. తమకు ఒరిజినల్ డాక్యుమెంట్ ఇవ్వలేదని చెప్పారు. దీంతో నిశ్చల్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ తిల్హరీ విచారించారు. ఒరిజినల్ డీడ్‌ను ఇచ్చేస్తాం.. నిశ్చల్ న్యాయవాది శిఖరం కృష్ణమోహన్ వాదనలు వినిపిస్తూ.. దరఖాస్తుతో పాటు ఒరిజినల్ గిఫ్ట్ డీడ్‌ను సమర్పించినప్పటికీ బ్యాంకు అధికారులు ఇవ్వలేదంటూ చెప్పడం దారుణమన్నారు. దరఖాస్తుతో పాటు ఒరిజినల్ డీడ్‌ను సమర్పించామంటూ అందుకు సంబంధించిన ఆధారాలను ఆయన కోర్టు ముందుంచారు. ఈ సమయంలో బ్యాంకు న్యాయవాది వి.ద్యుమని పూర్తివివరాలను తెలుసుకుని కోర్టు ముందుంచేందుకు గడువు కోరారు. ఇందుకు అంగీకరించిన న్యాయమూర్తి విచారణను వాయిదా వేశారు. తిరిగి ఇటీవల ఈ వ్యాజ్యం విచారణకు రాగా.. ద్యుమని స్పందిస్తూ దరఖాస్తుతో పాటు పిటిషనర్ ఒరిజినల్ డీడ్‌ను సమర్పించారని తెలిపారు. వాటిని తిరిగి ఇచ్చేందుకు బ్యాంకు సిద్ధంగా ఉందన్నారు. ఆ డీడ్ ద్వారా తనఖాపెట్టిన ఆస్తిని 15 రోజుల్లో విడిపిస్తామని చెప్పారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి బ్యాంకు తీరును తప్పుపట్టారు. ఇది పిటిషనర్‌ను వేధించడమేనన్నారు. అందుకే పిటిషనర్ మరో గత్యంతరం లేక న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వచ్చిందని తెలిపారు. ఇందుకుగానూ రూ.25 వేలను ఖర్చుల కింద పిటిషనర్‌కు చెల్లించాలని బ్యాంకును ఆదేశించారు. -
ఈ బ్యాంకును నడిపించేది ఆమే.. ఏకైక మహిళా చీఫ్!
భారత బ్యాంకింగ్ రంగంలో మహిళలు కీలక స్థానాలను అధిరోహించారు. ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులను విజయవంతంగా నడిపిస్తున్నారు. అయితే ప్రస్తుతం ప్రభుత్వ రంగ బ్యాంక్.. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు మాత్రమే మహిళ అధినేత్రిగా ఉన్నారు. కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ వంటి కొన్ని ఇతర బ్యాంకుల్లో డైరెక్టర్, మేనేజ్మెంట్ స్థానాల్లో మహిళలు కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఏకైక మహిళా సీఈవో, ఎండీ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ప్రస్తుతం మణిమేఖలై సీఈవో, ఎండీగా ఉన్నారు. చురుకైన నిర్ణయాలతో బ్యాంకును విజయవంతంగా నడిపిస్తున్నారు. 1988లో విజయా బ్యాంక్‌లో కెరీర్‌ను ప్రారంభించిన ఆమె అక్కడ ఆమె పలు కీలక పదవులు నిర్వహించారు. 2019లో బ్యాంక్ ఆఫ్ బరోడాలో విజయా బ్యాంక్ విలీనం అయిన తర్వాత ప్రభుత్వం ఆమెను కెనరా బ్యాంక్‌లో మూడేళ్లపాటు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా నియమించింది. ఇందులో ఆమె వ్యూహాత్మక ప్రణాళిక, క్రెడిట్ సంబంధిత అంశాలు, తనిఖీ, మార్కెటింగ్, ఫైనాన్సియల్ ఇన్‌క్లూషన్, రాష్ట్ర స్థాయి లీడ్ బ్యాంక్ బాధ్యతలు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల పనితీరును పర్యవేక్షించారు. కెనరా బ్యాంక్, సిండికేట్ బ్యాంక్‌ల విలీనంలో కీలక పాత్ర పోషించారు. కాన్‌బ్యాంక్ ఫ్యాక్టర్స్, కాన్‌బ్యాంక్ కంప్యూటర్ సర్వీసెస్, కెనరా హెచ్ఎస్బీసీ ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ లైఫ్ ఇన్సూరెన్, జనరల్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీలలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్‌గా ఆమెకు విశేష అనుభవం ఉంది. అలాగే కెనరా రోబెకో అసెట్ మేనేజ్మెంట్ సంస్థకు ట్రస్టీగా వ్యవహరించారు. మణిమేఖలై బెంగళూరు విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (మార్కెటింగ్) పట్టా పొందారు. ముంబైలోని నర్సీ మోంజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్‌లో హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్లో డిప్లొమా పూర్తి చేశారు. ఇతర బ్యాంకుల్లో.. కొటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ వంటి మరికొన్ని బ్యాంకుల్లో డైరెక్టరియల్, మేనేజ్మెంట్ వంటి కీలక స్థానాల్లో మహిళలు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ బిజినెస్ ఫైనాన్స్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ గ్రూప్ హెడ్‌గా అషిమా భట్ సేవలు అందిస్తున్నారు. కోటక్ మహీంద్రా బ్యాంక్ వినియోగదారుల బ్యాంకింగ్ గ్రూప్ ప్రెసిడెంట్‌గా శాంతి ఏకాంబరం ఉన్నారు. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ డైరెక్టర్లలో బృందా జాగీర్దార్ ఒకరు. గతంలోనూ అరుంధతీ భట్టాచార్య, ఉషా అనంతసుబ్రమణియన్, పద్మజ చుండూరు, శిఖా శర్మ, చందా కొచర్ వంటి వారు పలు బ్యాంకులకు నాయకత్వం వహించారు. ఇదీ చదవండి: Ola Holi Offer: తక్కువ ధరకు ఓలా స్కూటర్లు.. రూ.45,000 వరకు తగ్గింపు! -
యూనియన్ బ్యాంక్‌కు కొత్త అధికారి
న్యూఢిల్లీ: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పార్ట్ టైమ్ నాన్ అఫీషియల్ డైరెక్టర్, నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా శ్రీనివాసన్ వరదరాజన్ నియమితులయ్యారు. మూడేళ్లపాటు ఆయన ఈ పదవిలో ఉంటారు. వరదరాజన్‌కు బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసుల్లో మూడు దశాబ్దాలకు పైగా అనుభవం ఉంది. యాక్సిస్ బ్యాంక్ డిప్యూటీ ఎండీగా సేవలు అందించారు. -
ఫిక్స్డ్ డిపాజిట్లపై ఖాతాదారులకు గుడ్‌న్యూస్
సాక్షి, ముంబై: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఖాతాదారులకు గుడ్ న్యూస్ అందించింది. ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్ల 7 శాతం దాకా వడ్డీని అందిస్తుంది. గత రెండు నెలల్లో, పలు బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతూ వస్తున్నాయి. తాజాగా ఈ కోవలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఈ జాబితాలో చేరింది. రూ. 2 కోట్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లన పెంచుతూ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయించింది. కంపెనీ వెబ్సైట్ ప్రకారం, సవరించిన ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు అక్టోబర్ 17 నుండి అమలులోకి వచ్చాయి. 7 - 14 రోజుల మధ్య మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 3 శాతం, 599 రోజుల ఫిక్స్డ్ డిపాజిట్లపై గరిష్టంగా ఏడు శాతం వడ్డీ లభిస్తుంది. 45 రోజులకు మెచ్యూర్ అయ్యే డిపాజిట్లకు 3 శాతం వడ్డీ లభిస్తుండగా, 46 -90 రోజులలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లకు 4.05శాతం వడ్డీ లభిస్తుంది. 91-120 రోజుల డిపాజిట్ 4.3 శాతం, 121-180 రోజులకు 4.4శాతం వడ్డీని అందిస్తుంది. 181 రోజుల నుండి ఒక ఏడాది లోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై, 5.25శాతం వడ్డీ రేటును అందిస్తోంది. ఒక సంవత్సరం మెచ్యూరిటీ కాలానికి, రాబడి రేటు 6.30 శాతం. సంవత్సరం - 443 రోజుల కంటే ఎక్కువ మెచ్యూరిటీ ఉన్న FDలకు వడ్డీ రేటు 6.6 శాతంగా ఉంది. అయితే 600 రోజుల నుండి 10 సంవత్సరాల మెచ్యూరిటీ డిపాజిట్లపై 6.6 - 6.7 శాతం మధ్య వడ్డీ లభిస్తుంది. -
యూనియన్ బ్యాంక్ ఎథికల్ హ్యాకింగ్ ల్యాబ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైదరాబాద్‌లో ఎథికల్ హ్యాకింగ్ ల్యాబ్‌ను ప్రారంభించింది. బ్యాంక్‌నకు చెందిన సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో దీనిని ఏర్పాటు చేసింది. బ్యాంక్ సమాచార వ్యవస్థలు, డిజిటల్ ఆస్తులు, విభా గాలను సైబర్ దాడుల నుండి రక్షించడానికి రక్షణ యంత్రాంగాన్ని రూపొందించడం ఈ ల్యా బ్ లక్ష్యం. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండీ, సీఈవో ఏ.మణిమేఖలై శుక్రవారం ఈ కేంద్రాన్ని వర్చువల్‌గా ప్రారంభించారు. కార్యక్రమంలో సంస్థ ఈడీలు నితేశ్ రంజన్, రజనీశ్ కర్నాటక్, నిధు సక్సేనా పాల్గొన్నారు. చదవండి: TCS Work From Home Ends: టీసీఎస్ భారీ షాక్.. ఉద్యోగులు రెడీగా ఉండండమ్మా! -
డిజిటల్‌గా కిసాన్ క్రెడిట్ కార్డుల జారీ
న్యూఢిల్లీ: రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డుల (కేసీసీ) జారీని సులభతరం చేసే ప్రక్రియకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఫెడరల్ బ్యాంక్ శ్రీకారం చుట్టాయి. దీనికి సంబంధించి పైలట్ ప్రాజెక్టులను ప్రారంభించాయి. కేసీసీ తీసుకునేందుకు పేపర్ రూపంలో స్థల రికార్డుల పత్రాలను దాఖలు చేయడం, భౌతికంగా బ్యాంకు శాఖను సందర్శించడం వంటి బాదరబందీ లేకుండా డిజిటల్‌గానే ప్రక్రియ పూర్తి చేయవచ్చని తెలిపాయి. ఇందుకోసం రెండు బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్ (ఆర్బీఐహెచ్)తో జట్టు కట్టాయి. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మధ్యప్రదేశ్‌లోని హర్దా జిల్లాలో, ఫెడరల్ బ్యాంక్.. చెన్నైలో ఈ ప్రాజెక్టులను ప్రారంభించాయి. బ్యాంకు శాఖను సందర్శించాల్సిన అవసరం లేకుండా మొబైల్ హ్యాండ్సెట్ ద్వారా కేసీసీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని, ఆన్లైన్లోనే పొలం వెరిఫికేషన్ కూడా జరుగుతుందని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎడీ ఎ మణిమేఖలై తెలిపారు. -
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులకు భారీ షాక్!
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులకు భారీ షాక్ తగిలింది. ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్(ఎంసీఎల్ఆర్)లను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఖాతాదారులకు అందించే వివిధ రుణాలపై వడ్డీ రేట్లను నిర్ణయించడంలో కీలకమైన మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్లను పెంచినట్లు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన నోటిఫికేషన్లో తెలిపింది. దీంతో పెరిగిన ఎంసీఎల్ఆర్ రేట్లు పలు రకాల లోన్లపై ప్రభావం పడనుంది. ►సెప్టెంబర్ 11 నుండి పెరిగిన కొత్త యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంసీఎల్ఆర్ రేట్లు అమల్లోకి వస్తాయని ఆ సంస్థ విడుదల చేసిన నోటిఫికేషన్లో పేర్కొంది. ►ఇక ఈ ఎంసీఎల్ఆర్ రేట్లు ఓవర్ నైట్ టెన్ష్యూర్కు 7.00 శాతం, ఒక నెల టెన్ష్యూర్ కాలానికి 7.15 శాతానికి పెంచారు. తద్వారా అన్ని టెన్ష్యూర్ కాలానికి 5 బేసిస్ పాయింట్లు పెరిగింది. మూడు నెలల కాలానికి ఎంసీఎల్ఆర్ రేట్లను 7.25 శాతంగా యథాతథంగా ఉంచారు. ఆరు నెలలు, ఏడాది కాలపరిమితిలో యూబీఐ బ్యాంక్ రేట్లు వరుసగా 7.55 శాతం, 7.75 శాతం చొప్పున 5 బేసిస్ పాయింట్లు పెరిగాయి. ►రెండేళ్లు, మూడేళ్ల కాలపరిమితిలో యూబీఐ ఎంసీఎల్ఆర్ రేట్లు 7.95 శాతం, 8.10 శాతం చొప్పున 20 బేసిస్ పాయింట్లు, 35 బేసిస్ పాయింట్లు పెరిగాయి. ►కొత్త యూనియన్ బ్యాంక్ ఎంసిఎల్ఆర్ రేట్లు సెప్టెంబర్ 11 నుండి అమల్లోకి రాగా..ఈ రేట్ల పెంపు కొత్తగా రుణాలు తీసుకునే ఖాతాదారులకు లేదంటే, ఇప్పటికే రుణాలు తీసుకున్న రుణ గ్రహితలపై ప్రభావం పడునుంది. బ్యాంక్ నుండి తీసుకున్న రుణాలపై వడ్డీరేట్లు పెరగనున్నాయి. సెప్టెంబర్ 11, 2022 నుండి అమల్లోకి వచ్చిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంసీఎల్ఆర్ రేట్లు ఇలా ఉన్నాయి. ఓవర్ నైట్: ఎంసీఎల్ఆర్ పాత రేట్లు - 6.95 శాతం ఉండగా కొత్త ఎంసీఎల్ఆర్ రేట్లు - 7.00 శాతానికి పెరిగాయి ఒక నెల: ఎంసీఎల్ఆర్ పాత రేట్లు - 7.10 శాతం ఉండగా కొత్త ఎంసీఎల్ఆర్ రేట్లు - 7.15 శాతానికి పెరిగాయి మూడు నెలలు: ఎంసీఎల్ఆర్ పాత రేట్లు 7.35 శాతం ఉండగా కొత్త ఎంసీఎల్ఆర్ రేట్లు - 7.35 శాతంగా ఉంది ఆరు నెలలు: ఎంసీఎల్ఆర్ పాత రేట్లు 7.50 శాతం ఉండగా కొత్త ఎంసీఎల్ఆర్ రేట్లు - 7.55 శాతానికి పెరిగాయి ఒక సంవత్సరం: ఎంసీఎల్ఆర్ పాత రేట్లు 7.70 శాతం ఉండగా కొత్త ఎంసీఎల్ఆర్ రేట్లు - 7.75 శాతానికి పెరిగాయి రెండేళ్లు : ఎంసీఎల్ ఆర్ పాత రేట్లు 7.75 శాతం ఉండగా కొత్త ఎంసీఎల్ఆర్ రేట్లు 7.95 శాతానికి పెరిగాయి. మూడేళ్లు: ఎంసీఎల్ ఆర్ పాత రేట్లు 7.75 శాతం ఉండగా కొత్త ఎంసీఎల్ఆర్ రేట్లు 8.10 శాతానికి పెరిగాయి. చదవండి: పేదల నడ్డి విరుస్తున్న అడ్డగోలు వడ్డీ వసూళ్లు, ఆర్బీఐ కీలక నిర్ణయం! -
6,432 పీఓ పోస్ట్‌లకు నోటిఫికేషన్.. ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానం..
బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారా.. బ్యాంకు కొలువులో చేరాలనుకుంటున్నారా.. అయితే.. మీకు ఓ చక్కటి అవకాశం స్వాగతం పలుకుతోంది! ఏడు ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్(పీవో) హోదాలో.. అడుగుపెట్టే అవకాశం మీ ముంగిట నిలిచింది! అదే.. ఐబీపీఎస్.. కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ ప్రొబేషనరీ ఆఫీసర్/మేనేజ్మెంట్ ట్రైనీ నోటిఫికేషన్. సంక్షిప్తంగా ఐబీపీఎస్ సీఆర్పీ ఫర్ పీఓ/ఎంటీ!! మూడు దశల్లో ఉండే ఎంపిక ప్రక్రియలో విజయం సాధిస్తే.. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉజ్వల కెరీర్ సొంతం చేసుకోవచ్చు! 2023–24 సంవత్సరానికి ఐబీపీఎస్ సీఆర్పీ ఫర్ పీఓ/ఎంటీ నోటిఫికేషన్ వివరాలు, ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానం గురించి తెలుసుకుందాం.. దేశంలో ఎస్బీఐ మినహా మిగతా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కొలువుల భర్తీ కోసం ఏర్పాటైన సంస్థ.. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్). ప్రతి ఏటా క్రమం తప్పకుండా క్లర్క్, పీఓ, స్పెషలిస్ట్ ఆఫీసర్స్.. పోస్టుల భర్తీకి ఐబీపీఎస్ నోటిఫికేషన్లు విడుదల చేస్తోంది. తాజాగా 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఆయా బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్/మేనేజ్మెంట్ ట్రైనీ నియామక ప్రక్రియ ప్రారంభించింది. ఇందుకోసం సీఆర్పీ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ పీఓ / ఎంటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏడు బ్యాంకులు.. 6,432 పోస్ట్‌లు ►ఐబీపీఎస్ సీఆర్పీ ఫర్ పీఓ/ఎంటీ (12)–2023–24 ద్వారా మొత్తం ఏడు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 6,432 పోస్ట్‌లను భర్తీ చేయనున్నారు. బ్యాంక్ ఆఫ్ ఇండియా 535, కెనరా బ్యాంక్ 2500, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 500, పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్ 253, యూకో బ్యాంక్ 550, యూనియన్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా 2094. ►వీటితోపాటు.. ఎంపిక ప్రక్రియ పూర్తయ్యే నాటికి బ్యాంక్ ఆఫ్ బరోడా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్‌ల నుంచి కూడా ఇండెంట్ వచ్చే అవకాశముంది. ఈ నేపథ్యంలో పోస్ట్‌ల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉంది. అర్హతలు ►ఆగస్ట్ 22, 2022 నాటికి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. ►వయోపరిమితి: ఆగస్ట్ 1, 2022 నాటికి 20 నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ/ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు అయిదేళ్లు, ఓబీసీ (నాన్ క్రీమీ లేయర్) అభ్యర్థులకు మూడేళ్ల సడలింపు ఉంటుంది. మూడంచెల ఎంపిక ప్రక్రియ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పీఓ/ఎంటీ రిక్రూట్మెంట్ ప్రక్రియను ఐబీపీఎస్ మూడంచెల విధానంలో నిర్వహిస్తుంది. అవి.. ప్రిలిమినరీ; మెయిన్; పర్సనల్ ఇంటర్వ్యూ. ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షలు ఆన్లైన్ విధానంలో ఆబ్జెక్టివ్ టెస్ట్‌లు ఉంటాయి. ఈ ఆన్లైన్ పరీక్షల్లో నిర్దిష్ట కటాఫ్ మార్కులు సాధించిన వారికి పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. అందులోనూ విజయం సాధించి తుది జాబితాలో నిలిస్తే ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ అందజేస్తారు. ప్రిలిమినరీ రాత పరీక్ష.. ఇలా ►పీఓ/ఎంటీ ఎంపిక ప్రక్రియలో తొలి దశ ప్రిలిమినరీ రాత పరీక్షను మూడు విభాగాల్లో వంద మార్కులకు నిర్వహిస్తారు. అవి.. ఇంగ్లిష్ లాంగ్వేజ్ 30 ప్రశ్నలు–30 మార్కులు, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ 35 ప్రశ్నలు–35 మార్కులు, రీజనింగ్ ఎబిలిటీ 35 ప్రశ్నలు–35 మార్కులకు పరీక్ష ఉంటుంది. ప్రతి విభాగానికి పరీక్ష సమయం 20 నిమిషాలు. ►ప్రతి సెక్షన్‌లోనూ ఐబీపీఎస్ నిర్దిష్ట కటాఫ్ మార్కులను నిర్ణయిస్తుంది. ఆ కటాఫ్ మార్కుల జాబితాలో నిలిచిన వారికి మెయిన్ ఎగ్జామినేషన్‌కు అర్హత లభిస్తుంది. ►ప్రిలిమినరీలో నిర్దిష్ట కటాఫ్ మార్కుల ఆధారంగా.. ఒక్కో ΄ోస్ట్కు పది మంది చొప్పున (1:10 నిష్పత్తిలో)..మెయిన్‌కు ఎంపిక చేస్తారు. మెయిన్ 4 విభాగాలు.. 200 మార్కులు మెయిన్ ఎగ్జామినేషన్‌ను నాలుగు విభాగాల్లో 200 మార్కులకు నిర్వహిస్తారు. రీజనింగ్ అండ్ కంప్యూటర్ అప్టిట్యూడ్ 45 ప్రశ్నలు–60 మార్కులు, జనరల్/ఎకానమీ/బ్యాంకింగ్ అవేర్నెస్ 40 ప్రశ్నలు–40 మార్కులు, ఇంగ్లిష్ లాంగ్వేజ్ 35 ప్రశ్నలు–40 మార్కులు, డేటా అనాలసిస్ అండ్ ఇంటర్‌ప్రిటేషన్ 35 ప్రశ్నలు–60 మార్కులు.. ఇలా మొత్తం 155 ప్రశ్నలు–200 మార్కులకు పరీక్ష ఉంటుంది. పరీక్ష సమయం మూడు గంటలు. ఇంగ్లిష్ లాంగ్వేజ్.. డిస్క్రిప్టివ్ టెస్ట్ మెయిన్ ఎగ్జామ్‌లో పేర్కొన్న ఆబ్జెక్టివ్ విభాగాలతోపాటు అదనంగా..ఇంగ్లిష్ డిస్క్రిప్టివ్ టెస్ట్‌ను కూడా నిర్వహిస్తారు. ఈ విభాగంలో అభ్యర్థులు ఒక ఎస్సే, ఒక లెటర్ రైటింగ్ రాయాల్సి ఉంటుంది. దీనికి కేటాయించిన మార్కులు 25. సమయం 30 నిమిషాలు. దీని ద్వారా అభ్యర్థుల ఇంగ్లిష్ పరిజ్ఞానాన్ని పరీక్షిస్తారు. మెయిన్‌తో΄ాటే అదే రోజు ఈ డిస్క్రిప్టివ్ టెస్ట్‌ను కూడా నిర్వహిస్తారు. నెగెటివ్ నిబంధన ఆన్లైన్ విధానంలో..ఆబ్జెక్టివ్ టెస్ట్‌లుగా నిర్వహించే ప్రిలిమ్స్, మెయిన్స్ రెండు పరీక్షల్లోనూ నెగెటివ్ మార్కింగ్ నిబంధన అమలవుతోంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు. చివరగా.. ఇంటర్వ్యూ మెయిన్‌లో పొందిన మార్కుల ఆధారంగా.. సెక్షన్ వారీ కటాఫ్,ఓవరాల్ కటాఫ్‌లను నిర్దేశించి.. ఆ జాబితాలో నిలిచిన అభ్యర్థులకు చివరగా పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇంటర్వ్యూకు కేటాయించిన మార్కులు 100. అభ్యర్థులు తప్పనిసరిగా కనీస అర్హత మార్కులు సాధించాల్సి ఉంటుంది. జనరల్ కేటగిరీ అభ్యర్థులు కనీసం 40 శాతం మార్కులు పొందాలి. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులు కనీసం 35శాతం మార్కులు సాధించాలి. ఈ అర్హత మార్కులు ΄÷ందిన వారినే ఇంటర్వ్యూ మెరిట్ జాబితా రూపకల్పనలో పరిగణనలోకి తీసుకుంటారు. ఈ ఇంటర్వ్యూలను.. ΄ోస్ట్లు భర్తీ చేస్తున్న బ్యాంకులు లేదా ఏదైనా ఒక బ్యాంక్ నోడల్ బ్యాంక్‌గా వ్యవహరించి వాటి ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. 80:20 వెయిటేజీ విధానం అభ్యర్థుల తుది జాబితా రూపకల్పనలో వెయిటేజీ విధానాన్ని అమలు చేస్తున్నారు. మెయిన్ ఎగ్జామినేషన్, పర్సనల్ ఇంటర్వ్యూలకు నిర్దేశిత వెయిటేజీలు పేర్కొన్నారు. మెయిన్‌కు 80 శాతం వెయిటేజీ, పర్సనల్ ఇంటర్వ్యూకు 20 శాతం వెయిటేజీని నిర్దేశించారు. అంటే.. మొత్తం వంద మార్కులకు సాధించిన మార్కుల ఆధారంగా తుది జాబితాను సిద్ధం చేస్తారు. ఈ జాబితాలో నిలిచిన అభ్యర్థులను ఆయా బ్యాంకుల్లో 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఏర్పడే ఖాళీల్లో నియమిస్తారు. ముఖ్య సమాచారం ►దరఖాస్తు విధానం: అభ్యర్థులు ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాలి. ►ఆన్లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపు తేదీలు: ఆగస్ట్ 2 – ఆగస్ట్ 22,2022 ►ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ (ఆన్లైన్): అక్టోబర్‌లో ►మెయిన్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ : నవంబర్‌లో ►పర్సనల్ ఇంటర్వ్యూలు: 2023 జనవరి/ఫిబ్రవరి నెలల్లో ►ప్రొవిజినల్ అలాట్మెంట్: 2023 ఏప్రిల్ నెలలో ►పూర్తి వివరాలకు వెబ్సైట్: www.ibps.in -
యూనియన్ బ్యాంక్ ఆశలు.. రూ.15,000 కోట్లు!
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగంలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొండి బకాయిల (ఎన్పీఏలు) వసూలుపై బలమైన అంచనాలతో ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23)లో రూ.15,000 కోట్లు వసూలు అవుతాయని భావిస్తోంది. ఇందులో రూ.10,000 కోట్ల వరకు ఎన్సీఎల్టీ పరిధిలో దివాలా పరిష్కారం కోసం చూస్తున్న రుణ ఖాతాల నుంచి వస్తాయని అంచనా వేస్తున్నట్టు విశ్లేషకులతో నిర్వహించిన సమావేశంలో బ్యాంక్ ఎండీ, సీఈవో ఎ.మణిమేఖలై స్పష్టత ఇచ్చారు. కొత్తగా ఏర్పాటు చేసిన నేషనల్ అస్సెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ (ఎన్ఏఆర్సీఎల్)కి కొన్ని రుణ ఖాతాలను బదిలీ చేయనున్నట్టు చెప్పారు. రూ.4,842 కోట్ల విలువ చేసే రుణ పరిష్కార దరఖాస్తులను ఎన్సీఎల్టీ ఇప్పటికే ఆమోదించినట్టు.. మరో 55 ఖాతాలకు సంబంధించి రూ.5,168 కోట్ల ఎక్స్పోజర్కు ఆమోదం లభించాల్సి ఉన్నట్టు తెలిపారు. జూన్ త్రైమాసికంలో ఎన్సీఎల్టీ పరిష్కారాల రూపంలో యూనియన్ బ్యాంకుకు రూ.122 కోట్ల మొండి రుణాలు వసూలయ్యాయి. చదవండి: Sahara Group: సహారాలో భారీగా ఇరుక్కున్న ఇన్వెస్టర్లు.. మొత్తం లక్ష కోట్లు పైనే! -
రూ.34,615 కోట్ల బ్యాంక్ స్కాం,ఎవరీ సుధాకర్ శెట్టి!
న్యూఢిల్లీ: దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ (డీహెచ్ఎఫ్ఎల్) రూ.34,615 కోట్ల బడా బ్యాంకింగ్ మోసం కేసుపై జరుగుతున్న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) విచారణలో కీలక అంశాలు వెలుగుచూస్తున్నాయి. అత్యున్నత స్థాయి వర్గాల కథనం ప్రకారం, రూ. 14,683 కోట్ల డీహెచ్ఎఫ్ఎల్ నిధుల ’మళ్లింపు’లో తొమ్మిది రియల్టీ సంస్థల పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై కీలక విచారణ జరుగుతోంది. అప్పటి చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ కపిల్ వాధ్వాన్, డైరెక్టర్ ధీరజ్ వాధ్వాన్, వ్యాపారవేత్త సుధాకర్ శెట్టిల నియంత్రణలో ఉన్న ఈ తొమ్మిది రియల్ ఎస్టేట్ సంస్థలు తమ బాస్‌ల ఆర్థిక ప్రయోజనాల కోసం అక్రమ మార్గాలను అనుసరించాయని సీబీఐ పేర్కొంది. తొమ్మిదిలో ఐదు సుధాకర్ శెట్టివే... తొమ్మిది రియల్టీ సంస్థల్లో ఐదు వ్యాపారవేత్త సుధాకర్ శెట్టి నియంత్రణలోనివి కావడం గమనార్హం. కంపెనీలు తీసుకున్న రుణాలు కపిల్ వాధ్వాన్, ధీరజ్ వాధ్వాన్ల ఆదేశాల మేరకు దారిమళ్లినట్లు ఉన్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. 2010–2018 మధ్య కాలంలో రూ. 42,871 కోట్ల మేర రుణాలను మంజూరు చేసిన 17 బ్యాంకుల కన్సార్టియంకు నేతృత్వం వహిస్తున్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) నుండి వచ్చిన ఫిర్యాదుపై జూన్ 20వ తేదీన కేసు నమోదయ్యింది. కేసు నమోదయిన తర్వాత సీబీఐకి చెందిన దాదాపు 50 మందికిపైగా అధికారుల బృందం బుధవారం ముంబైలోని 12 ప్రాంగణాల్లో విస్తృత సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. డీహెచ్ఎఫ్ఎల్ మొత్తం కుంభకోణం రూ.34,615 కోట్లుగా సీబీఐ అధికారులు తెలిపారు. దీనిప్రకారం, ఇంత స్థాయిలో బ్యాంకింగ్ మోసం కేసుపై సీబీఐ విచారణ జరగడం ఇదే తొలిసారి. వాధ్వాన్ ద్వయం ఇతరులతో కలిసి నేరపూరిత కుట్రకు పాల్పడి, వాస్తవాలను తప్పుగా చూపించి దాచిపెట్టారని, నేరపూరిత విశ్వాస ఉల్లంఘనకు పాల్పడ్డారని బ్యాంక్ తన ఫిర్యాదులో పేర్కొంది. మే 2019 నుండి రుణం తిరిగి చెల్లించడంలో డిఫాల్ట్ కావడం ద్వారా కన్సార్టియంను రూ. 34,614 కోట్ల మేర మోసగించడానికి కుట్ర జరిగిందని వివరించింది. -
యూనియన్ బ్యాంక్ డిపాజిట్ రేట్లు పెంపు
ముంబై: ప్రభుత్వ రంగంలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) అన్ని కాలపరిమితులకు సంబంధించి డిపాజిట్లపై వడ్డీరేట్లను శుక్రవారం పెంచింది. దేశీయ టర్మ్ డిపాజిట్లు, నాన్–రెసిడెంట్ ఆర్డినరీ (ఎన్ఆర్ఓ), నాన్–రెసిడెంట్ ఎక్స్టర్నల్ (ఎన్ఆర్ఈ) టర్మ్ డిపాజిట్లకు పెంపు వర్తిస్తుందని ప్రకటనలో పేర్కొంది. ప్రకటన ప్రకారం దేశీయ, ఎన్ఆర్ఓ టర్మ్ డిపాజిట్ రేటు(రూ.2 కోట్లు లోపు)పై 46–90 రోజుల మధ్య 55 బేసిస్ పాయింట్లు పెరిగి (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) 3.50 శాతం నుంచి 4.05 శాతానికి చేరింది. ఆర్బీఐ బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు రెపోను మే, జూన్ నెలల్లో 90 బేసిస్ పాయింట్లు పెంచిన నేపథ్యంలో పలు బ్యాంకులు రుణ, డిపాజిట్ రేట్లను పెంచుతున్న సంగతి తెలిసిందే. -
హైదరాబాద్: జూబ్లీహిల్స్ యూనియన్ బ్యాంక్ సిబ్బంది నిర్లక్ష్యం
-
యూనియన్ బ్యాంక్ లాభం అప్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) మూడో త్రైమాసికంలో పీఎస్‌యూ దిగ్గజం యూనియన్ బ్యాంక్ ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 49 శాతం జంప్‌చేసి రూ. 1,085 కోట్లకు చేరింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 727 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 20,103 కోట్ల నుంచి రూ. 19,454 కోట్లకు క్షీణించింది. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 13.49 శాతం నుంచి 11.62 శాతానికి వెనకడుగు వేశాయి. అయితే నికర ఎన్పీఏలు 3.27 శాతం నుంచి 4.09 శాతానికి పెరిగాయి. ప్రొవిజన్లు, కంటింజెన్సీలు రూ. 5,210 కోట్ల నుంచి సగానికి తగ్గి రూ. 2,549 కోట్లకు పరిమితమయ్యాయి. ఫలితాల నేపథ్యంలో యూనియన్ బ్యాంక్ షేరు 1 శాతం నీరసించి రూ. 48 వద్ద ముగిసింది. -
హైదరాబాద్‌లో వీఏపీటీ ల్యాబ్‌ను ప్రారంభించిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
హైదరాబాద్: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈరోజు(జనవరి 5) సైబర్ సెక్యూరిటీ అవేర్నెస్ కిట్‌ను ప్రారంభించింది. హైదరాబాద్‌లోని తమ సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఆటోమేటెడ్ వీఏపీటీ(వల్నరబిలిటీ అసెస్మెంట్ & పెనెట్రేషన్ టెస్టింగ్) ల్యాబ్‌ను ప్రారంభించింది. సిబ్బంది, కస్టమర్లు మరియు ఇతర వాటాదారులలో సైబర్ సెక్యూరిటీ అవగాహన కల్పించడం లక్ష్యంతో దీనిని ప్రారంభించినట్లు బ్యాంక్ అధికారులు తెలిపారు. ఈ ప్రారంభ కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్, శ్రీ. కె.ఎం రెడ్డి, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా MD & CEO శ్రీ రాజ్‌కిరణ్ రాయ్ G, ముఖ్య అతిథిగా శ్రీ నరేంద్ర నాథ్ జి(జాతీయ భద్రతా మండలి సెక్రటేరియట్ జాయింట్ సెక్రటరీ), శ్రీమతి పీ ఆర్ లక్ష్మీ ఈశ్వరి, డైరెక్టర్-CDAC, హైదరాబాద్ & యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు శ్రీ. గోపాల్ సింగ్ గుసేన్, శ్రీ.నితేష్ రంజన్ & శ. రజనీష్ కర్నాటక్ పాల్గొన్నారు ఈ కిట్‌లో 2022కి ఇతర విషయాలతో పాటు బహుళ భాషా పాకెట్ పుస్తకం, సైబర్ సెక్యూరిటీ అవేర్నెస్ క్యాలెండర్ ఉన్నాయి. అంతేకాకుండా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, CDAC(సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్) సహకారంతో భారత ప్రభుత్వంలోని ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ వాటాదారులందరికీ సైబర్ సెక్యూరిటీ అవగాహనపై ఇ-బుక్-“యూనియన్ షీల్డ్”ను కూడా 6 భాషలలో ప్రారంభించింది. ఈ ఈవెంట్‌పై వ్యాఖ్యానిస్తూ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా MD & CEO శ్రీ రాజ్‌కిరణ్ రాయ్ జి మాట్లాడుతూ, “మేము మా సైబర్ భద్రతా ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్తున్నందున ఇది ఒక ముఖ్యమైన మైలురాయి. ఈ ప్రారంభంతో డిజిటల్ బ్యాంకింగ్ అనుభవాన్ని పొందేందుకు మేము మరో అడుగు వేశాము. అంతేకాకుండా వీఏపీటీ ల్యాబ్‌ను ఏర్పాటు చేయడంతో బ్యాంక్ ఏదైనా కొత్త ఉత్పత్తి భద్రతా పరీక్షను చాలా త్వరగా పూర్తి చేయగలదు, రోల్-అవుట్ చాలా వేగంగా సాధ్యమవుతుంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఉద్యోగులు, విక్రేతలు మరియు కస్టమర్లందరికీ సైబర్ సెక్యూరిటీ అవగాహన శిక్షణ, వర్క్‌షాప్‌లను అందించడంతో పాటు బ్యాంక్ సైబర్ సెక్యూరిటీ కార్యకలాపాలను బలోపేతం చేయడానికి హైదరాబాద్‌లో సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ని ఏర్పాటు చేసింది. వీఏపీటీ ల్యాబ్ CCOEలో ఒక భాగం. ఇటీవల, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(CCOE) మరియు CDAC-హైదరాబాద్, ఒక MOU ద్వారా, అన్ని కేడర్ల ఉద్యోగులు, విక్రేతలు మరియు కస్టమర్ల వంటి బ్యాంక్‌లోని వివిధ సమూహాలకు సైబర్ సెక్యూరిటీ అవగాహన కల్పించడానికి భాగస్వాములుగా మారాయి. CDAC ఈ ప్రయాణంలో బ్యాంక్ నాలెడ్జ్ పార్టనర్. వాటాదారులందరికీ ప్రయోజనం చేకూర్చేందుకు ఆరు భారతీయ భాషల్లో సైబర్ సెక్యూరిటీ అవగాహన (యూనియన్ షీల్డ్)పై ఇ-బుక్‌ను తీసుకురావడానికి CDAC దోహదపడింది. (చదవండి: చైనా మరో కీలక ప్రయోగం.. భూమి అంతం కానుందా?) -
ఫోర్ట్వంటీ.. నకిలీ ‘గ్యారంటీ’..
సాక్షి, హైదరాబాద్: తప్పుడు పత్రాలతో జాతీయ బ్యాంక్‌ను మోసం ఘటన చేసిన నగరంలో వెలుగుచూసింది. నకిలీ బ్యాంక్ గ్యారంటీలు సమర్పించి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ)కు రూ.53 కోట్లు టోకరా వేసిన ఇద్దరు ఘరానా నిందితులను సైబరాబాద్ ఎకనామిక్ ఆఫెన్స్ వింగ్ (ఈఓడబ్ల్యూ) పోలీసులు అరెస్ట్ చేశారు. సనత్‌నగర్‌కు చెందిన సివిల్ కాంట్రాక్టర్ కట్టమీది సంతోష్ రెడ్డి (36) కంపాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరిట 2010 ఏప్రిల్‌లో కంపెనీని ఏర్పాటు చేశాడు. ఇందులో కేపీహెచ్‌బీకి చెందిన నెక్కంటి శ్రీనివాస్ (51), మాదాపూర్ సాయినగర్‌కు చెందిన కొండకల్ గోపాల్ (42), నెల్లూరు జిల్లా వేదాయపాలెంకు చెందిన సోమవరపు సురేందర్ రెడ్డి (52) డైరెక్టర్లుగా చేరారు. వివిధ కంపెనీ సప్లయర్ల నుంచి మెటీరియల్ సేకరణ కోసం యూబీఐ నుంచి బ్యాంక్ గ్యారంటీ పొందాడు. దీని ఆధారంగా హెల్లా ఇన్ఫ్రా మార్కెట్ లిమిటెడ్, హెచ్‌పీసీఎల్, ఇన్ఫినిటీ ప్రాజెక్ట్స్, సృజన ఇండస్ట్రీస్, ఎన్ఎస్ఐసీ లిమిటెడ్, ఓఎఫ్‌బీ టెక్, పవర్2ఎస్ఎంఈ, జెట్వెర్క్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీలు సంతోష్ రెడ్డికి మెటీరియల్ సరఫరా చేశాయి. నకిలీ గ్యారంటీ సమర్పణ సాధారణంగా బ్యాంక్ గ్యారంటీ పొందాలంటే కంపెనీలోని ఒక డైరెక్టర్ ఆస్తులను సెక్యూరిటీగా సమర్పించాల్సి ఉంటుంది. ఒకవేళ పరిమితి దాటితే అప్పటికే ఉన్న గ్యారంటీని క్లోజ్ చేయాలి లేదా దాని స్థానంలో గ్యారంటీని పునరుద్ధరించాలి. అయితే ఈ కేసులో సంతోష్ రెడ్డి గరిష్ట గ్యారంటీ పరిమితి రూ.15 కోట్లు ఉండగా.. ఆ పరిమితిని మించి వివిధ కంపెనీల నుంచి మెటీరియల్ పొందేందుకు నకిలీ పత్రాలను సృష్టించాడు. వీటిని సంబంధిత కంపెనీలకు సమర్పించాడు. అలాగే కొత్త బ్యాంక్ గ్యారంటీని పొందేందుకు అప్పటికే గ్యారంటీ సమర్పించిన కంపెనీల లెటర్లను ఫోర్జరీ చేసి బ్యాంక్‌లకు సమర్పించాడు. ఇలా కంపాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ యూబీఐ కొండాపూర్ బ్రాంచ్‌లో 39 బ్యాంక్ గ్యారంటీలు సమర్పించి 53,18,50,093 రూపాయలు మోసం చేసింది. నకిలీని గుర్తించి.. నకిలీ గ్యారంటీ పత్రాలను గుర్తించిన యూబీఐ బ్యాంక్ ఏజీఎం సరిగాల ప్రకాశ్ బాబు గత జూలై 8న మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కంపాస్ ఇన్ఫ్రా, నలుగురు డైరెక్టర్లపై ఫిర్యాదు చేశారు. దీంతో ప్రధాన నిందితుడు సంతోష్ రెడ్డి విదేశాలకు పరారయ్యాడు. ఈఓడబ్ల్యూ బృందం నిందితుడి కదలికలపై నిఘా ఉంచింది. సాంకేతిక ఆధారాలను సేకరించి, విశ్వసనీయ సమాచారం మేరకు జూబ్లీహిల్స్‌లోని ఓ ప్రైవేట్ గెస్ట్ హౌస్‌లో సంతోష్ రెడ్డి, శ్రీనివాస్‌లను శుక్రవారం అదుపులోకి తీసుకుంది. మరో ఇద్దరు నిందితులు గోపాల్, సురేందర్ రెడ్డి పరారీలో ఉన్నారు. -
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు భారీ షాకిచ్చిన ఆర్బీఐ..!
RBI Imposes Penalty On Union Bank: ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) గట్టి షాకిచ్చింది.ఒత్తిడితో కూడిన ఆస్తుల విక్రయం, ఫ్రాడ్ కేసులను వర్గీకరించడంలో లోపాలతో పాటుగా మరికొన్ని నిబంధనలను పాటించనందుకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ సోమవారం(నవంబర్ 29)న కోటి రూపాయల జరిమానా విధించింది. రెగ్యులేటరీ సమ్మతిలో భాగంగా బ్యాంక్ తన కస్టమర్లతో కుదుర్చుకున్న ఏదైనా లావాదేవీ లేదా ఒప్పందాలను బహిర్గత పరచడానికి వీలు లేదు. ఈ విషయంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలను ఉల్లఘించినట్లు ఆర్బీఐ పేర్కొంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2019కు సంబంధించిన స్టాట్యూటరీ ఇన్స్పెక్షన్ ఫర్ సూపర్వైజరీ ఎవాల్యుయేషన్ను ఆర్బీఐ నిర్వహించింది. 2019 ఐఎస్ఈ సంబంధిత కరస్పాండెన్స్‌లు, ముందస్తు హెచ్చరిక సంకేతాలు ఉన్నప్పటికీ రెడ్ ఫ్లాగ్ ఖాతాలను వర్గీకరించడంలో, సెక్యూరిటీ రెసిపట్ల ప్రొవిజనింగ్‌ను బహిర్గతం చేయడంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వైఫల్యం చెందినట్లు ఆర్బీఐ పేర్కొంది. దీనికి అనుగుణంగా ఆర్బీఐ ఆదేశాలను పాటించనందుకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఫైన్‌ను విధించింది. అంతేకాకుండా బ్యాంకుకు ఎందుకు జరిమానా విధించకూడదో కారణం చూపాలని ఆర్బీఐ నోటీసు జారీ చేసింది. చదవండి: ఎస్బీఐకు ఆర్బీఐ భారీ పెనాల్టీ! ఎంత? ఎందుకంటే.. -
లేని ఆస్తులు చూపించి బ్యాంక్ లోన్ కొట్టేశారు
సాక్షి, హైదరాబాద్: వేస్ట్ పేపర్ రీ సైక్లింగ్ పేరుతో ఓ కంపెనీ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆంధ్రాబ్యాంక్)కు రూ.19.16 కోట్లు స్వాహా చేసింది. పేపర్ కట్టింగ్ యంత్రాలు, ఫ్యాక్టరీ గోడౌన్, స్టాక్, లే అవుట్ ప్లాట్లు.. ఇలాంటివి లేనివి ఉన్నట్లు డాక్యుమెంట్లలో చూపించి ఆంధ్రాబ్యాంక్ అమీర్‌పేట్ బ్రాంచ్‌కు ఈ మొత్తం ఎగనామం పెట్టింది. బ్యాంక్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ డి.అపర్ణారెడ్డి ఫిర్యాదు మేరకు అమెజాన్ ఎంటర్ప్రైజెస్ కంపెనీపై సీబీఐ గురువారం కేసు నమోదు చేసింది. ఆ వివరాల మేరకు.. అమీర్‌పేటకు చెందిన మన్నెపల్లి కమల్‌నాథ్ ఎండీగా, కొండపల్లి రాధాకృష్ణ డైరెక్టర్‌గా అమెజాన్ ఎంటర్ప్రైజెస్ పేరుతో కంపెనీ ఏర్పాటుచేశారు. వేస్ట్ పేపర్ రీ సైక్లింగ్ వ్యాపారానికి లోన్ కోసమంటూ అమీర్‌పేట్‌లోని అప్పటి ఆంధ్రాబ్యాంక్(ప్రస్తుతం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) చీఫ్ మేనేజర్ కట్రోత్ గోవింద్‌ను కలిశారు. తమకు పెద్ద పేపర్ కట్టింగ్ మిషన్, వేస్టేజ్ రీ సైక్లింగ్ ఉందని చెప్పి రుణం కోసం దరఖాస్తు చేశారు. అమెజాన్ ఎంటర్ప్రైజెస్ సంస్థ ప్రతినిధులు ఇచ్చిన యంత్రాల వివరాలు, గోడౌన్ వివరాలు, కొలట్రాల్ కింద ఇచ్చిన ఏడు ఖాళీ స్థలాల డాక్యుమెంట్లు చూసి రూ.19.16 కోట్ల రుణాన్ని గోవింద్ మంజూరుచేశారు. అయితే ఈ రుణ మంజూరులో సంస్థ చెప్పినట్లు యంత్రాలు, గోడౌన్, ఫ్లాట్లు, ఇతర ఆస్తులు గుర్తించి వాటిని లెక్కగట్టాల్సిన వ్యాలువర్ కటకం నర్సింహం, లీగల్ ఓపినియన్ ఇవ్వాల్సిన బ్యాంక్ అడ్వొకేట్ శ్రీనివాస్‌ప్రసాద్ తప్పుడు నివేదిక ఇచ్చారు. గోవింద్ చెప్పినట్లు నర్సింహం, శ్రీనివాసప్రసాద్ ఎలాంటి క్షేత్రస్థాయి పరీశీలన చేయకుండానే సంస్థకు అనుకూలంగా నివేదికలిచ్చారు. దీంతో అమీర్‌పేట్ బ్రాంచ్ నుంచి రూ.19.16 కోట్ల మేర అమెజాన్ ఎంటర్ ప్రైజెస్ సంస్థ రుణం పొందింది. రుణం పొంది ఏడాది గడిచినా చిల్లి గవ్వ కూడా తిరిగి కట్టకపోవడంతో విజిలెన్స్ విభాగం రంగంలోకి దిగింది. సంబంధిత కంపెనీ ప్రతినిధులతో మేనేజర్ కుమ్మక్కై బ్యాంకును మోసం చేశారన్న గుట్టురట్టయింది. దీనితో గోవింద్‌ను ఉద్యోగం నుంచి తొలగించారు. లేని ఆస్తులు ఉన్నట్లు చూపించి రుణం పొందినందుకు సంబంధిత సంస్థ, దాని ప్రతినిధులపై సీబీఐకి అపర్ణారెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో ప్రాథమిక విచారణ జరిపిన హైదరాబాద్ సీబీఐ అధికారులు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై పలు ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. -
యూనియన్ బ్యాంకు.. భేష్
ముంబై: ప్రభుత్వరంగంలోని యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా సెప్టెంబర్ క్వార్టర్‌కు ఆకర్షణీయమైన ఫలితాలను ప్రకటించింది. కన్సాలిడేటెడ్ లాభం 183 శాతం పెరిగి రూ.1,510 కోట్లుగా నమోదైంది. డీహెచ్ఎఫ్ఎల్ ఖాతాకు సంబంధించి గతంలో మాఫీ చేసిన రుణం రికవరీ కావడం మెరుగైన ఫలితాలకు దోహదపడింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.534 కోట్లుగానే ఉంది. నికర వడ్డీ ఆదాయం 9 శాతం పెరిగి రూ.6,829 కోట్లుగా ఉంది. నికర వడ్డీ మార్జిన్ 2.78 శాతం నుంచి 2.95 శాతానికి పుంజుకుంది. రుణాల్లో 3 శాతం వృద్ధిని సాధించింది. వడ్డీయేతర ఆదాయం 65 శాతం పెరిగి రూ.3,978 కోట్లుగా నమోదైంది. ఇందులో మాఫీ చేసిన రుణం తాలూ కు వసూలైన రూ.1,764 కోట్లు కూడా ఉంది. 8 శాతం రుణ వృద్ధి లక్ష్యం మొత్తం మీద సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.5,341 కోట్ల మేర రుణాల రికవరీని సాధించినట్టు యూనియన్ బ్యాంకు ఎండీ, సీఈవో రాజ్‌కిరణ్ రాయ్ ఫలితాల సందర్భంగా ప్రకటించారు. రిటైల్, వ్యవసాయ రుణాల్లో మంచి వృద్ధి కనిపిస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరికి రుణాల్లో 8 శాతం వృద్ధిని సాధించాలన్న లక్ష్యంతో ఉన్నట్టు తెలిపారు. స్థూల ఎన్పీఏలు (వసూలు కాని రుణాలు) ఏడాది క్రితం ఇదే కాలంలో ఉన్న 14.71 శాతం నుంచి 12.64 శాతానికి తగ్గాయి. సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.6,745 కోట్ల రుణాలు ఎన్పీఏలుగా మారాయి. ఇందులో రూ. 2,600 కోట్లు శ్రేయీ గ్రూపు కంపెనీలవే ఉన్నాయి. ఈ ఖాతాలకు ఇప్పటికే 65 శాతం కేటాయింపులు చేసినట్టు రాజ్‌కిరణ్ రాయ్ తెలిపారు. ఎన్పీఏలకు కేటాయింపులు రూ.3,273 కోట్లకు తగ్గాయి. -
తక్కువ వడ్డీ రేటుతో హోంలోను
న్యూఢిల్లీ: గృహ రుణ రేటును చరిత్రాత్మక కనిష్టం 6.4%కి తగ్గించినట్లు ప్రభుత్వ రంగ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) ఒక ప్రకటనలో తెలిపింది. అక్టోబర్ 27 నుంచి తగ్గించిన వడ్డీరేటు అమల్లోకి వస్తుంది. కొత్త రుణాల కోసం దరఖాస్తు చేసుకునే కస్టమర్లకు లేదా బ్యాలెన్స్ బదిలీలతో సహా ప్రస్తుత రుణాలను బదిలీ చేయాలనుకునే వారికి కొత్త రేట్లు వర్తిస్తాయని బ్యాంక్ పేర్కొంది. ‘పండుగ సీజన్లో గృహాలను కొనుగోలు చేయడానికి పెరుగుతున్న డిమాండ్‌ను మేము గమనిస్తున్నాం. ఈ నేపథ్యంలో కస్టమర్లు ఈ ఆఫర్ నుండి ప్రయోజనం పొందుతారు. ఈ తగ్గిన వడ్డీ రేటుతో యూబీఐ గృహ రుణ రేటు పరిశ్రమలో అత్యంత పోటీగా మారింది‘ అని బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. చదవండి: బ్యాంకుల్లో బంపర్ ఆఫర్లు, లోన్ల కోసం అప్లయ్ చేస్తున్నారా? -
డిజిటల్ రుణాల బాటలో బ్యాంకులు
ముంబై: డిజిటల్ రుణాల విధానం బ్యాంకింగ్ ముఖచిత్రాన్ని భారీ స్థాయిలో మార్చేస్తోందని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండీ రాజ్‌కిరణ్ రాయ్ జి తెలిపారు. వచ్చే రెండు, మూడు సంవత్సరాల్లో రిటైల్, చిన్న సంస్థల (ఎంఎస్ఎంఈ)కు బ్యాంకులు ఇచ్చే రుణాల్లో దాదాపు సగభాగం వాటా డిజిటల్ రుణాల ప్లాట్‌ఫామ్‌ల ద్వారానే ఉండగలవని ఆయన పేర్కొన్నారు. బ్యాంకింగ్, ఫైనాన్స్ సంస్థల వార్షిక సదస్సు సిబాస్ 2021లో పాల్గొన్న సందర్భంగా రాయ్ ఈ విషయాలు చెప్పారు. డిజిటల్ రుణాల విభాగం ప్రాచుర్యంలోకి వస్తున్న నేపథ్యంలో కస్టమర్లకు ఆన్లైన్లోనే సరీ్వసులు అందించగలిగేలా తగు సాధనాలను బ్యాంకులు రూపొందించుకోవాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. రాబోయే రోజుల్లో ఎంఎస్ఎంఈ రుణాల విషయంలో పెను మార్పులు చోటు చేసుకోగలవన్నారు. మరోవైపు ఫైనాన్షియల్ టెక్నాలజీ (ఫిన్‌టెక్) వచి్చన తొలినాళ్లలో అది బ్యాంకింగ్‌కు పోటీగా మారుతుందనే అభిప్రాయాలు ఉండేవని, ప్రస్తుతం రెండూ కలిసి సమన్వయంతో పనిచేస్తున్నాయని రాయ్ చెప్పారు. ‘ఫిన్‌టెక్‌లు ప్రస్తుతం బ్యాంకులకు సహాయపడుతున్నాయి. అవి మాకు పోటీ కాదు‘ అని ఆయన పేర్కొన్నారు. బ్యాంకులు నిరంతరం టెక్నాలజీలో ఇన్వెస్ట్ చేయాలని, ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ అవుతూ ఉండాలని రాయ్ సూచించారు. టెక్నాలజీలో నిపుణులు, కొత్త ఆవిష్కరణలు చేసే ప్రతిభావంతులను నియమించుకోవడం పై ప్రభుత్వ రంగ బ్యాంకులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. -
యూనియన్ బ్యాంకుకు రాజభాష కీర్తి పురస్కారం
న్యూఢిల్లీ: హిందీ భాషను విజయవంతంగా అమలు చేసినందుకు 2018–19, 2019–20, 2020–21 సంవత్సరాలకు గాను యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా ‘రాజభాష కీర్తి పురస్కార్’ను దక్కించుకుంది. బ్యాంకు ఎండీ, సీఈవో రాజ్‌కిరణ్ రాయ్ బుధవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకున్నారు. నేషనలైజ్డ్ బ్యాంకు విభాగంలో.. 2019–20లో మొదటి బహుమతిని, 2020–21 లో తృతీయ బహుమతిని అందుకుంది. హౌస్ మేగజైన్ విభాగంలో 2018–19లో.. సంస్థ అంతర్గత మేగజైన్ ‘యూనియన్ శ్రీజన్’కు రెండో బహుమతి లభించింది. ఇలా అధికారిక భాష అమలులో 5 అవార్డులను దక్కించుకున్నట్టు యూనియన్ బ్యాంకు ప్రకటించింది. -
సికింద్రాబాద్ పార్క్‌లైన్ వద్ద గల యూనియన్ బ్యాంక్‌లో అగ్ని ప్రమాదం
-
యూనియన్ బ్యాంకులో.. స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు
భారత ప్రభుత్వ రంగ బ్యాంక్.. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యూబీఐ).. వివిధ విభాగాల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. దీని ద్వారా సీనియర్ మేనేజర్, మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. సంబంధిత పోస్టులకు అవసరమైన విద్యార్హతలు, అనుభవం ఉంటే.. మూడంచెల్లో జరిగే ఎంపిక ప్రక్రియ ద్వారా ప్రభుత్వ రంగ బ్యాంకులో చక్కటి కెరీర్ సొంతం చేసుకోవచ్చు. అర్హతలు, ఆసక్తి ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 3వ తేదీలోగా ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యూబీఐ) ముంబై ప్రధాన కేంద్రంగా పనిచేస్తోంది. దేశంలోనే రెండో అతిపెద్ద బ్యాంక్‌గా యూబీఐకి పేరుంది. డిజిటలైజేషన్ ఊపందుకుంటున్న నేపథ్యంలో.. వినియోగదారులకు ఆన్లైన్ సేవలను మరింత వేగంగా అందించేందుకు బ్యాంకులు స్పెషలిస్ట్ ఆఫీసర్లను నియమిస్తుంటాయి. అందులో భాగంగా యూబీఐ.. 2021 సంవత్సరానికి సంబంధించి వివిధ విభాగాల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ► మొత్తం స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల సంఖ్య –347 ► పోస్టుల వివరాలు: సీనియర్ మేనేజర్లు–60, మేనేజర్లు–141, అసిస్టెంట్ మేనేజర్లు–146. ► విభాగాలు: రిస్క్, సివిల్ ఇంజనీర్, ఆర్కిటెక్ట్, ఎలక్ట్రికల్ ఇంజనీర్, ప్రింటింగ్ టెక్నాలజిస్ట్, ఫోరెక్స్, చార్టర్డ్ అకౌంటింగ్, టెక్నికల్ ఆఫీసర్. అర్హతలు ► పోస్టుల వారీగా విద్యార్హతలు వేర్వేరుగా ఉన్నాయి. ఆయా పోస్టులను అనుసరించి గ్రాడ్యుయేషన్,సంబంధిత సబ్జెక్టులో బీఈ/బీటెక్,ఎంబీఏ, సీఏ /సీఎంఏ(ఐసీడబ్ల్యూఏ)/సీఎస్ ఉత్తీర్ణతతో పాటు అనుభవం, సర్టిఫికేషన్లు కలిగి ఉండాలి. వయసు ► సీనియర్ మేనేజర్ స్థాయి పోస్టులకు 30–40 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. మిగతా పోస్టులకు 25 నుంచి 35ఏళ్ల మధ్య ఉండాలి. అసిస్టెంట్ మేనేజర్లకు 20–30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, ఎక్స్ సర్వీస్‌మెన్–ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది. ఎంపిక విధానం ► యూబీఐ స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు ఎంపిక ప్రక్రియ మూడంచెల్లో జరుగుతుంది. తొలుత ఆన్లైన్ విధానంలో(కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సీబీటీ)) నిర్వహిస్తారు. ఇందులో ఉత్తీర్ణులైన వారిని పర్సనల్ ఇంటర్వ్యూకు పిలుస్తారు. పర్సనల్ ఇంటర్వ్యూలోనూ అర్హత సాధించిన అభ్యర్థులకు గ్రూప్ డిస్కషన్ ఉంటుంది. ఇలా మూడు దశల్లో అభ్యర్థులు చూపిన ప్రతిభ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. 200 మార్కులకు రాత పరీక్ష ► రాత పరీక్ష మొత్తం 200 మార్కులకు ఉంటుంది. ఇందులో నాలుగు విభాగాల నుంచి ప్రశ్నలుంటాయి. పరీక్ష సమయం 120 నిమిషాలు. మల్టిపుల్ ఛాయిస్ విధానం(ఎంసీక్యూలు)లో ప్రశ్నలు అడుగుతారు. రీజనింగ్‌లో 50 ప్రశ్నలు–25 మార్కులు, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ 50 ప్రశ్నలు–50 మార్కులు, పోస్టుకు సంబంధించిన ప్రొఫెషనల్ నాలెడ్జ్ 50 ప్రశ్నలు–100 మార్కులు, ఇంగ్లిష్ లాంగ్వేజ్ 50 పశ్నలకు– 25 మార్కులకు పరీక్ష ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ యూబీఐ రాత పరీక్షలో నెగిటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 1/4వంతు మార్కు తగ్గిస్తారు. సమాధానాలు గుర్తించకుండా వదిలేసిన ప్రశ్నలకు ఎటువంటి నెగిటివ్ మార్కుల నిబంధన వర్తించదు. గ్రూప్ డిస్కషన్ గ్రూప్ డిస్కషన్ 50 మార్కులకు ఉంటుంది. ఇందులో జనరల్/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు కనీసం 25 మార్కులు, ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ అభ్యర్థులు కనీసం 22.5 మార్కులు సాధించాలి. కనీస అర్హత మార్కులు సాధించిన అభ్యర్థులను మాత్రమే పర్సనల్ ఇంటర్వ్యూకు పిలుస్తారు. పోస్టులను బట్టి 3:1 నిష్పత్తిలో అభ్యర్థులను ఇంటర్వ్యూకు ఆహ్వానిస్తారు. అంటే.. ఒక పోస్టుకు ముగ్గురు పోటీపడతారు. పర్సనల్ ఇంటర్వ్యూ పర్సనల్ ఇంటర్వ్యూ కూడా 50 మార్కులకు జరుగుతుంది. ఇందులో అభ్యర్థి అకడెమిక్ పరిజ్ఞానం, నాయకత్వ లక్షణాలు, కమ్యూనికేషన్ స్కిల్స్, ఆలోచనల్లో స్పష్టత, హాబీలు, ఎక్స్ట్రాకరిక్యులర్ యాక్టివిటీస్, వ్యక్తిత్వం, ఉద్యోగానికి తగిన లక్షణాలు ఉన్నాయా.. ఇలా వివిధ కోణాల్లో పరీక్షిస్తారు. పర్సనల్ ఇంటర్వ్యూలోనూ కనీస అర్హత మార్కులు 25. రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులు కనీసం 22.5 మార్కులు సాధించాలి. కనీస అర్హత మార్కులు పొందని అభ్యర్థులను అనర్హులుగా ప్రకటిస్తారు. వేతనాలు సీనియర్ మేనేజర్ పోస్టులకు రూ. 63,840–78,230, మేనేజర్ స్థాయి అధికారులకు రూ.48,170–69,810, అసిస్టెంట్ మేనేజర్లుకు రూ.36,000–63,840 వరకు వేతన శ్రేణి ఉంటుంది. ఇవే కాకుండా హెచ్ఆర్ఏ, డీఏ, సిటీ కంపన్సేటరీ అలవెన్స్, స్పెషల్ అలవెన్స్ వంటివి లభిస్తాయి. ప్రొబేషన్ స్పెషలిస్ట్ ఆఫీసర్(ఎస్ఓ) పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు దేశంలోని యూబీఐ బ్రాంచీలలో ఎక్కడైనా పనిచేయడానికి సిద్ధంగా ఉండాలి. అలాగే గతంలో యూబీఐ ఎస్ఓ నియామకాలను చూస్తే.. తొలుత రెండేళ్ల పాటు ప్రొబేషనరీగా పనిచేయాల్సి ఉండేది. ఇప్పుడు కూడా ఆదే నిబంధన అమలయ్యే అవకాశం ఉంది. కెరీర్ స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు యూబీఐలో ఉజ్వలమైన కెరీర్‌ను సొంతం చేసుకోవచ్చు. బ్యాంక్ పదోన్నతుల విధానానికి అనుగుణంగా అనుభవం, పనితీరుకు ఆధారంగా ఉన్నతస్థాయి హోదాలకు చేరుకునే అవకాశం ఉంది. ముఖ్యమైన సమాచారం ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 12.08.2021 ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 03.09.2021 ► పూర్తి వివరాలకు వెబ్సైట్ : www.unionbankofindia.co.in -
యూనియన్ బ్యాంకు లాభంలో మూడు రెట్ల వృద్ధి
న్యూఢిల్లీ: యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా (యూనియన్ బ్యాంకు) జూన్ త్రైమాసికానికి రూ.1,120 కోట్ల కన్సాలిడేటెడ్ లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.341 కోట్లతో పోలిస్తే మూడు రెట్లకు పైగా వృద్ధి నమోదైంది. ఈ ఏడాది మార్చితో ముగిసిన త్రైమాసికంలో లాభం రూ.1,269 కోట్లతో పోలిస్తే స్వల్పంగా తగ్గింది. మొత్తం ఆదాయం రూ.20,666 కోట్లుగా ఉంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఆదాయం రూ.20,487 కోట్లతో పోలిస్తే స్వల్పంగా పెరిగింది. వసూలు కాని నిరర్థక రుణాలు (ఎన్పీఏలు), కంటింజెన్సీలకు చేసిన కేటాయింపులు రూ.3,593 కోట్లుగా ఉన్నాయి. స్థూల ఎన్పీఏలు 14.95% (రూ.97,190 కోట్లు) నుంచి 13.60%కి (రూ.87,762 కోట్లు) మెరుగుపడగా.. నికర ఎన్పీఏలు 4.97 శాతం నుంచి 4.69%కి (రూ.27,437 కోట్లు) తగ్గాయి. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో యూనియన్ బ్యాంకు షేరు 7% లాభంతో రూ.37.95 వద్ద క్లోజయింది. -
విద్యార్థులకు గుడ్ న్యూస్.. తక్కువ వడ్డీకే రుణాలు!
విద్యార్థులకు గుడ్ న్యూస్. ఉన్నత చదువులు చదివేందుకు బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులు తక్కువ వడ్డీకే రుణాలు అందజేస్తున్నాయి. ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంక్ ఆఫ్ బరోడా ఎడ్యుకేషన్ లోన్స్‌పై 6.75 శాతం వడ్డీ రేటుతో రుణాలు అందిస్తోంది. బ్యాంక్‌బజార్ తెలిపిన సమాచారం ప్రకారం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 6.8 శాతం వడ్డీరేటు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 6.85 శాతంగా వడ్డీరేటు ఉంది. భారతదేశం, విదేశాలలో ఉన్నత చదువుల కోసం తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తున్నాయి. విద్యా రుణాలు తీసుకునే వారికి సెక్షన్ 80ఈ కింద పన్ను ప్రయోజనాలను అందిస్తాయి. మీరు మీ కోసం, మీ జీవిత భాగస్వామి లేదా పిల్లలకు విద్యా రుణం తీసుకున్నట్లయితే చెల్లించే వడ్డీ మొత్తంపై పన్ను మినహాయింపు లభిస్తుంది. అంటే ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటే రెండు బెనిఫిట్స్ లభిస్తున్నాయని చెప్పుకోవచ్చు. మీరు కూడా మీ పిల్లల్ని ఉన్నత చదువులు చదివించాలని భావిస్తే.. లేదంటే విదేశాల్లో చదివించాలని భావిస్తే.. ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవచ్చు. చదవండి: ఎస్బీఐ : జూలై 1 నుంచి కొత్త ఛార్జీలు -
బ్యాంకుల విలీనంతో ఖాతాదారుల పరిస్థితి అంతేనా..!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని బ్యాంకుల విలీన పరిణామాలతో కస్టమర్లు సమస్యలు ఎదుర్కొంటున్నారు. కొత్త మార్పుల కారణంగా గతంలో ఇచ్చిన పోస్ట్ డేటెడ్ చెక్కులు బౌన్సయితే చార్జీల భారం పడటం, డివిడెండ్ చెల్లింపులను సక్రమంగా అందకపోవడం వంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలపై ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు. పెద్ద బ్యాంకుల్లో విలీనమైన చిన్న బ్యాంకుల కస్టమర్లే ఎక్కువగా ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. పాత ఎంఐసీఆర్ చెక్కుల స్థానంలో కొత్త వాటిని జారీ చేసేందుకు, డివిడెండ్లు మొదలైనవి చెల్లించాల్సిన సంస్థలకు కొత్తగా మారిన ఐఎఫ్ఎస్సీ కోడ్ వివరాలను అందించేందుకు మరింత సమయం పట్టేయనున్నందున విలీన అమలు ప్రక్రియ డెడ్‌లైన్‌ను మరింతగా పొడిగించాలని కోరుతున్నారు. వాస్తవానికి ఇది మార్చి 31తో ముగిసింది. అకౌంట్ల అనుసంధానంలో సమస్యలు.. ఆరు ప్రభుత్వ రంగ బ్యాంకులను (పీఎస్బీ) నాలుగు పీఎస్బీల్లో విలీనం చేసిన ఉత్తర్వులు 2020 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చాయి. బ్యాంకుల సిస్టమ్స్ మొదలైన వాటి అనుసంధానం, కొత్త ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టం కోడ్ (ఐఎఫ్ఎస్సీ)ని అమల్లోకి తేవడం వంటి అంశాలకు మార్చి 31 డెడ్‌లైన్‌గా ప్రభుత్వం నిర్దేశించింది. అయితే, అకౌంట్ల అనుసంధానం మొదలుకుని ఇతరత్రా పలు సమస్యలు ఇంకా ఉంటున్నాయని కస్టమర్లు, పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి. సాధారణంగా పెద్ద బ్యాంకుల్లో విలీనమైన చిన్న బ్యాంకుల కస్టమర్లలో చాలా మందికి ఏవో కంపెనీల్లో షేర్లో లేదా బాండ్లలో పెట్టుబడులో ఉండే అవకాశముంది. వాటి మీద డివిడెండ్లు, ఇతరత్రా చెల్లింపులు మొదలుకుని ఐటీ రీఫండ్లు కూడా రావాల్సి ఉండొచ్చు. అయితే, ఐఎఫ్ఎస్సీ కోడ్ మారిపోవడం తదితర పరిణామాల వల్ల ఇలాంటివి పొందడం సమస్యగా మారే అవకాశం ఉంటోంది. పోనీ అలాగని కొత్త మార్పుల గురించి ఆయా సంస్థలకు తెలియజేయాలన్నా చాలా సమయం పట్టేయొచ్చు. ఈ నేపథ్యంలోనే డెడ్‌లైన్‌ను మూడు నెలల పాటు పొడిగించాలని కస్టమర్లు కోరుతున్నారు. ఇక కొత్త మార్పులకు అలవాటు పడేందుకు కూడా ఖాతాదారులకు ఇబ్బందిగా ఉంటోంది. ఉదాహరణకు పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ)లో విలీనమైన యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) ఓ కస్టమరు విషయం తీసుకుంటే.. దాదాపు అన్ని లావాదేవీలకు గతంలో ఈ–యూబీఐ యాప్ ఉపయోగించేవారు. కానీ విలీనం తర్వాత ప్రస్తుతం కొత్త యాప్‌ను వినియోగించడం చాలా మటుకు తగ్గించేశారు. యాప్ చాలా సంక్లిష్టంగానే కాకుండా నెమ్మదిగా లోడ్ అవుతుండటం కూడా ఇందుకు కారణమని వివరించారు. ఇక తండ్రి మరణానంతరం ఆయనకు చెందిన సీనియర్ సిటిజెన్స్ సేవింగ్స్ స్కీమ్ అకౌంటు నుంచి నగదు విత్‌డ్రా చేసుకోవడానికి సంబంధించిన ప్రక్రియ పూర్తి చేయడానికి దాదాపు నెల రోజులు పైగా పట్టేసిందని మరో యూబీఐ ఖాతాదారు వాపోయారు. ఇలాంటి సాంకేతిక సమస్యలతో విలీన బ్యాంకుల కస్టమర్లు సమస్యలు ఎదుర్కొంటున్నారని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. విలీనం ఇలా.. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్ విలీనమయ్యాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను విలీనం చేశారు. కెనరా బ్యాంకులో సిండికేట్ బ్యాంకు, ఇండియన్ బ్యాంకులో అలహాబాద్ బ్యాంకు విలీనమయ్యాయి. చదవండి: రిటైల్ రుణాలు.. రయ్రయ్! -
ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్!
ఆర్బీఐ ఆదేశాలకు అనుగుణంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్ శాఖలు విలీనం జరిగిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఇటీవల యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారికంగా ప్రకటించింది. ఇక నుంచి ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్ వినియోగదారులు కొత్త ఐఎఫ్ఎస్సీ కోడ్, ఎంఐసీఆర్ కోడ్ లు కలిగిన కొత్త చెక్ పుస్తకాలను పొందవలసి ఉంటుందని యుబిఐ ఒక ప్రకటనలో తెలిపింది. నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్(నెఫ్ట్) లావాదేవీల సమయంలో బ్యాంక్ శాఖను గుర్తించడానికి ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్(ఐఎఫ్ఎస్సీ) కోడ్ ఉపయోగిస్తారు. అలాగే, చెక్ ప్రాసెసింగ్ కోసం మాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రికగ్నిషన్(ఎంఐసీఆర్) కోడ్ ను ఉపయోగిస్తారు. పాత ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్ శాఖల ఐఎఫ్ఎస్సి, ఎంఐసీఆర్ కోడ్ లు గల చెక్ బుక్స్ 2021 మార్చి 31 వరకే పనిచేస్తాయి. పాత బ్యాంక్ వినియోగదారులు తమ బ్రాంచ్ నుంచి కొత్త చెక్ బుక్ పొందాలని లేదా మొబైల్ యాప్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా ఎటిఎం ద్వారా దరఖాస్తు చేసుకోవాలని యుబిఐ బ్యాంకు కోరింది. అయితే, ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్ యూజర్లు యూనియన్ బ్యాంకుకు మారినా పాత అకౌంట్ నెంబర్లు అలాగే ఉంటాయి. అకౌంట్ నెంబర్లో ఎలాంటి మార్పు ఉండదు. అంతేకాదు కస్టమర్ ఐడీ కూడా పాతదే ఉంటుంది. కోత్త ఐఎఫ్ఎస్సీ కోడ్ మీ బ్రాంచ్‌లో లేదా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో తెలుసుకోవాలి. కస్టమర్లకు ఏవైనా సందేహాలుంటే యూనియన్ బ్యాంక్ టోల్ ఫ్రీ నెంబర్లు 1800 208 2244, 1800 22 22 44 లేదా కస్టమర్ కేర్ నెంబర్ +91-80-61817110కు సంప్రదించవచ్చు. చదవండి: ఉచితంగా ఐపీఎల్ మ్యాచ్‌లు చూడండిలా! మొబైల్ ప్రియులకు గుడ్ న్యూస్ -
మూడింటి కలయికతో మున్ముందుకు
ఏప్రిల్ 1, 2020 నుంచి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సోదర బ్యాంకులైన ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంకులను కలుపుకొని భారతీయ బ్యాంకింగ్ రంగంలో ఒక నూతన చరి త్రకు శ్రీకారం చుట్టింది. దీంతో సుమారు 12 కోట్ల మంది ఖాతాదారులు, 9,500 శాఖలు, 75 వేలకు పైగా ఉద్యోగులతో భారతీయ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఐదవ స్థానంలో నిలిచింది.కొంతమంది నిరాశావాదులు ఈ కొత్త ఆవి ర్భావం విజయవంతం కాదని వాదించారు. కోవిడ్ కాలంలోనూ అబ్బురపరిచే విధంగా మొదటి త్రైమాసికంలోనే 333 కోట్ల రూపాయల లాభాన్ని యూనియన్ బ్యాంక్ ఆర్జించింది. వ్యాపారంలో 5 శాతం వృద్ధిని నమోదు చేసుకొని, తన వ్యాపార మొత్తాన్ని రూ.15,42,668 కోట్లకు పెంచుకొంది. మొండి బకాయిలను, నిరర్థక ఆస్తుల శాతాన్ని గణనీయంగా తగ్గించుకొంది. ఆంధ్రప్రదేశ్, తెలం గాణ, కర్ణాటక రాష్ట్రాలలో ఆంధ్రాబ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకులకు అత్యధిక శాఖలు ఉన్నాయి. ఈ మూడు బ్యాంకుల మేలుకలయికతో శాఖల సంఖ్యాపరంగా యూనియన్ బ్యాంక్ ఆంధ్ర రాష్ట్రంలో షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకుల్లో 17 శాతం దక్కించుకుంది, తెలంగాణ రాష్ట్రంలో 14 శాతం దక్కించుకుంది. డిపాజిట్ల పరంగా ఆంధ్ర రాష్ట్రంలో 19 శాతం, తెలంగాణలో 13 శాతం దక్కించుకుని అగ్రగామి బ్యాంకుల సరసన నిలిచింది.రైతులు, పారిశ్రామికవేత్తలు, మహిళలు, ఉద్యోగులు– ఇలా సమాజంలో అనేక వర్గాలను ఆకట్టుకునే విధంగా మా పథకాలు ఉన్నాయి. వృద్ధులకు ఆసరా చెల్లింపులు చేస్తున్నాం. అన్ని సేవలు డిజిటల్ మాధ్యమాల ద్వారా అందజేయడానికి కృషి చేస్తున్నాం. కోవిడ్ వల్ల దెబ్బతిన్న జీవన వ్యవస్థను దృష్టిలో ఉంచుకుని వారి చెల్లింపు వాయిదాలను, రేట్లను నిర్ధారించడం జరిగింది.ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంకులకు హైదరాబాద్, మంగళూరు నగరాలలో అద్భుతమైన నిర్మాణాలు ఉన్నాయి. గతంలో ఈ నగరాలు ఆంధ్ర, కార్పొరేషన్ బ్యాంకుల ప్రధాన కార్యాలయాలు కావడంచేత వీటికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం. అలాగే కొన్ని కీలకమైన కార్యాలయాలను ఇక్కడికి తరలించడం జరుగుతుంది. ఈ చర్య నైసర్గిక, మానవ వనరుల సద్వినియోగంలో ఒక సమతుల్యతను సాధిస్తుంది. మా ఉద్యోగులు ఈ విపత్తు సమయంలోనూ తమ విధులు నిర్వర్తించి స్ఫూర్తిదాయకంగా నిలి చారు. ఈ కాలంలోనే 125 స్థానిక ప్రధాన కార్యాలయాలు, 18 ఫీల్డ్ జనరల్ మేనేజర్ స్థాయి కార్యాలయాలు ప్రారంభించగలిగాం. ముంబైలో యూని యన్ బ్యాంకు ప్రధాన కార్యాలయాల ప్రారంభోత్సవానికి గాంధీజీ విచ్చేసి తమ ఆశీస్సులు అందజేశారు. అలాగే గాంధీజీ శిష్యులైన భోగరాజు పట్టాభి సీతారామయ్య ఆంధ్రాబ్యాంక్‌ను, హాజీ ఖాన్ బహదూర్ అబ్దుల్లా కార్పొరేషన్ బ్యాంకును స్థాపిం చారు. ఈ మహనీయుల వారసత్వాన్ని మేము కాపాడుతాం. ఆంధ్రాబ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్ ఖాతాదారులకు మా సేవల విషయంలో నమ్మకం కలిగించడం మా గురుతర బాధ్యత. ఈ మూడు బ్యాంకుల కలయిక గాంధీజీ సిద్ధాంతమైన వినియో గదారుడే దేవుడు అనేదానికి ప్రతిరూపంలా కొనసాగుతుంది. ముందు ముందు బ్యాంకింగ్ రంగంలో ఆశావహ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మధ్యతరహా, సూక్ష్మ తరహా పరిశ్రమలను ఆదుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఉన్న వారి రుణాలను తిరిగి బేరీజు వేసేం దుకు కూడా ఆర్బీఐ అంగీకరించింది. లాక్‌డౌన్‌తో నష్టాల్లో ఉన్న అనేక మందికి ఇది ఉపశమనం కలగజేస్తుంది. అలాగే భారత ప్రభుత్వం ప్రకటించిన ఆత్మ నిర్భరత ప్యాకేజీ ఆర్థిక రంగాన్ని బలోపేతం చేస్తుంది. దీనివల్ల కష్టకాలంలో స్తబ్దంగా ఉన్న పరిశ్రమలు, ఇతర వర్గాలు పుంజుకుంటాయి. ఇవి దేశ సౌభాగ్యానికి దోహదం చేయగలవు. మేము ఈ మూడు బ్యాంకుల శుభ కలయికతో బ్యాంకింగ్ రంగంలో సరైన ముందడుగు వేశాం. రాజ్ కిరణ్ రాయ్ వ్యాసకర్త ఎండీ, సీఈఓ, యూనియన్ బ్యాంక్ -
యూబీఐకి ‘ముసద్దీలాల్’ టోకరా!
సాక్షి, హైదరాబాద్: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యూబీఐ) నుంచి రుణం తీసుకుని మోసం చేసిన కేసులో హైదరాబాద్‌కు చెందిన ముసద్దీలాల్ జ్యువెలర్స్‌పై బెంగళూరు సీబీఐ అధికారులు నమోదు చేసిన కేసు ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు రంగంలోకి దిగారు. ఈ నేపథ్యంలోనే శుక్రవా రం రాత్రి బెంగళూరు నుంచి హైదరాబాద్‌కి చేరుకున్న ఈడీ ప్రత్యేక బృందం పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. బెంగళూరు సీబీఐ యూనిట్‌కు చెందిన బ్యాంక్ సెక్యూరిటీ అండ్ ఫ్రాడ్ సెల్ (బీఎస్‌ఎఫ్‌సీ) గతేడాది జూలై 20న ముసద్దీలాల్ జ్యువెలర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థపై కేసు నమోదు చేసింది. రుణాల రూపంలో పలు దఫాలుగా రూ.88 కోట్లు తీసుకుని మోసం చేసిన సంస్థ యజమానులు మోహన్‌లాల్ గుప్తా, ప్రశాంత్ గుప్తాలను కేసులో నిందితులుగా చేర్చారు. వీరు నకిలీ పత్రాలు సృష్టించి బ్యాంకు నుంచి రుణం తీసుకున్నట్లు సీబీఐ తెలిపింది. ఇదే విధంగా మరో బ్యాంక్ నుంచి కూడా రుణం తీసుకొని, ఆ తర్వాత యూబీఐతో ఆర్థిక లావాదేవీలు చేయడానికి ఆసక్తి చూపుతూ బ్యాంకుకు దరఖాస్తు చేసుకుంది. ఇలా లావాదేవీలు ప్రారంభించి సదురు సంస్థ తన క్రెడిట్ లిమిట్‌ను రూ.55 కోట్లకు పెంచుకుంది. ఓ దశలో వర్కింగ్ క్యాపిటల్ లోన్స్ (డబ్ల్యూసీఎల్), ఫండెడ్ ఇంట్రెస్ట్ టర్మ్ లోన్స్ (ఎఫ్‌ఐటీఎల్) కూడా తీసుకుంది. దీంతో యూబీఐ దగ్గర ముసద్దీలాల్ సంస్థ తీసుకున్న మొత్తం రుణం రూ.88 కోట్లకు చేరింది. ఈ మొత్తాన్ని దారి మళ్లించి వాటికి సంబంధించిన వాయిదాలను కూడా చెల్లించకపోవడంతో సదరు బ్యాంక్ ముసద్దీలాల్ సంస్థ ఖాతాలను ఎన్పీఏల జాబితాలో చేర్చింది. రూ.48 కోట్లు ఎగవేత.. వన్ టైమ్ సెటిల్మెంట్ (ఎటీఎస్) స్కీమ్‌లో భాగంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ముసద్దీలాల్ యజమానులు రూ.40 కోట్లు చెల్లించినా.. మరో రూ.48 కోట్లు ఉద్దేశపూర్వకంగా ఎగవేశారని బ్యాంకు అధికారులు తేల్చారు. దీంతో బెంగళూరు సీబీఐ యూనిట్లో ఫిర్యాదు చేశారు. ఓటీఎస్‌లో భాగంగా కొంత మొత్తం చెల్లించినా.. రుణం తీసుకునేప్పుడు తప్పుడు పత్రాలు సమర్పించడం నేరమేనని సీబీఐ పేర్కొంది. ఈ స్కామ్‌లో భారీ మనీలాండరింగ్ జరిగినట్లు అనుమానించిన సీబీఐ అధికారులు విష యాన్ని ఈడీ దృష్టికి తీసుకువెళ్లారు. ఇందులో భాగంగా శుక్రవారంరాత్రి హైదరాబాద్‌కి వచ్చిన ఈడీ అధికారులు ముసద్దీలాల్ సంస్థలు, వాటి యజమానుల ఇళ్లల్లో జరిపిన సోదాల్లో కొన్ని డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. 2017 డీమానిటైజేషన్ సమయంలో ముసద్దీలాల్ సంస్థ యజమానులు తమ వద్ద ఉన్న పాతనోట్లను మార్చడానికి వారి బంగారం వారే కొనుక్కుని రూ.100 కోట్ల స్కామ్‌కు పాల్పడినట్లు హైదరాబాద్ సీసీఎస్‌లో కేసు నమోదైంది. -
లాక్డౌన్లో బ్యాంకుల ఆఫర్లు
న్యూఢిల్లీ: కరోనా వైరస్ కట్టడికి సంబంధించిన లాక్డౌన్ అమలవుతున్న వేళ బ్యాంకులు వినూత్న ఆఫర్లతో తమ కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఔషధాలను తమ కార్డులతో కొనుగోలు చేస్తే 15 శాతం దాకా డిస్కౌంట్ ఇస్తామంటూ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) ఆఫర్ ఇచ్చింది. ‘ఈ కష్టకాలంలో ఫార్మసీ బిల్లుల భారం కాస్త తగ్గించుకునేందుకు సులభతరమైన మార్గం ఉంది. మీకు సమీపంలోని అపోలో ఫార్మసీ స్టోర్‌లో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్డులతో కొనుగోలు చేయడం ద్వారా 15 శాతం దాకా డిస్కౌంటు పొందండి‘ అని ట్వీట్ చేసింది. అటు ఎస్బీఐ కూడా ఇలాంటి ఆఫరే ఇచ్చింది. ‘అపోలో 24/7 నుంచి హెల్త్ చెకప్ చేయించుకోండి. యోనో ఎస్బీఐ యాప్ ద్వారా కొన్ని ల్యాబ్ టెస్టులపై ఆకర్షణీయ డిస్కౌంట్లు పొందండి‘ అని పేర్కొంది. అటు, అక్షయ తృతీయ రోజున తమ క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేసిన వారికి హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఆఫర్ ఇచ్చింది. రూ. 10,000 విలువ పైబడిన ప్రతీ కొనుగోలుపై 5 రెట్లు రివార్డ్ పాయింట్లు ఇస్తామని, పీఎం కేర్స్ ఫండ్‌కు రూ. 100 విరాళంగా ఇస్తామని తెలిపింది. ఇక బ్యాంకులు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మరింత మెరుగైన సేవలు అందించేందుకు నిబంధనలను కూడా సడలించాయి. ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి నగదు విత్‌డ్రా చేసుకున్నా జూన్ 30 దాకా ఎటువంటి చార్జీలు విధించబోమంటూ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్లకు ఆఫరిచ్చింది. -
ఐదో అతిపెద్ద బ్యాంక్ యూబీఐ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ)లో ఆంధ్రా, కార్పొరేషన్ బ్యాంక్‌ల విలీనం (అమాల్గమేషన్) తర్వాత దేశంలో ఐదో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్‌గా యూబీఐ అవతరించిందని ఎండీ అండ్ సీఈఓ రాజ్‌కిరణ్ రాయ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం యూబీఐకు దేశవ్యాప్తంగా 9,500 బ్రాంచీలు, 13,500 ఏటీఎంలు, 120 మిలియన్ల మంది కస్టమర్లున్నారని పేర్కొన్నారు. ఆంధ్రా, కార్పొరేషన్ బ్యాంక్‌ల వినియోగదారులు తమ డెబిట్ కార్డ్‌లను యూబీఐ ఏటీఎంలలో వినియోగించినా సరే ఎలాంటి అదనపు చార్జీలు ఉండవని చెప్పారు. కస్టమర్ల ఖాతా నంబరు, ఐఎఫ్ఎస్సీ కోడ్, డెబిట్, క్రెడిట్ కార్డ్‌లు, ఇంటర్నెట్, మొబైల్ బ్యాంకింగ్ పోర్టల్స్‌లో ఎలాం టి మార్పులు ఉండవని.. గతంలో మాదిరిగానే వినియోగించుకోవచ్చని ఆయన తెలిపారు. నగదు ఉపసంహరణ, నిల్వ, బ్యాలెన్స్ ఎంక్వైరీ వంటి బేసిక్ సర్వీస్‌లను మూడింట్లో ఏ బ్యాంక్‌లోనైనా వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు. -
బోర్డు మారింది.. ప్రస్థానం ముగిసింది
సాక్షి, మచిలీపట్నం: ఆంధ్రాబ్యాంక్ ప్రస్థానం ముగిసింది. యూనియన్ బ్యాంక్‌లో విలీనమైపోయింది. తొంబై ఏడేళ్ల చరిత్ర ఇక చరిత్రపుటల్లో కలిసిపోయింది. జిల్లా కేంద్రమైన బందరులో ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య 1923వ సంవత్సరం నవంబర్ 28న స్థాపించిన ఆంధ్రాబ్యాంకు 1980లో తీసుకొచ్చిన బ్యాంకుల జాతీయకరణతో ప్రభుత్వ రంగ బ్యాంకుగా మారింది. హైదరాబాద్ కేంద్రంగా దినదిన ప్రవర్థమానమై 2,885 శాఖలు, 3798 ఏటీఎంలు, 20,346 మంది సిబ్బందితో విస్తరించిన ఈ బ్యాంక్ రూ.3,98,511 కోట్ల వ్యాపారంతో రూ.1,80,258 కోట్ల రుణాలు, రూ.2,16,721 కోట్ల డిపాజిట్లతో దేశంలోనే అగ్రశ్రేణి బ్యాంకుల సరసన నిలిచింది. అంతటి చరిత్ర కలిగిన ఆంధ్రాబ్యాంకును యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా (యూబీఐ)లో విలీనం చేయాలని గత ఏడాది కేంద్రం తీసుకున్న నిర్ణయంపై నిరసనలు వెల్లువెత్తినా, రాష్ట్ర స్థాయిలో వివిధ రూపాల్లో ఉద్యమాలు సాగినా ఫలితం లేకుండాపోయింది. ప్రభుత్వ రంగంలోని పది బ్యాంకుల విలీనం బుధవారం నుంచి అమలులోకి వచ్చింది. దేశ వ్యాప్తంగా ఆరుబ్యాంకులు విలీనం కాగా, జాతీయ జెండా సృష్టికర్త పింగళి వెంకయ్య పుట్టిన బందరులో పురుడుపోసుకున్న ఆంధ్రాబ్యాంక్ కనుమరుగైంది. బందరులోని వ్యవస్థాపక బ్రాంచ్‌లో బుధవారం ఆంధ్రాబ్యాంక్ స్థానంలో యూనియన్ బ్యాంక్ పేరిట సైన్‌బోర్డు ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ లాక్డౌన్ కారణంగా తయారు చేసే పరిస్థితి లేకపోవడంతో ఆంధ్రాబ్యాంక్ నేమ్ బోర్డు వద్ద యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటూ బ్యానర్ ఏర్పాటు చేశారు. -
బ్యాంకింగ్ మోసాలు రూ. 1.17 లక్షల కోట్లు!
ఇండోర్: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌కు సంబంధించి 2019 ఏప్రిల్– డిసెంబర్ మధ్య జరిగిన మోసాల విలువ రూ.1.17 లక్షల కోట్లు. సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద వెల్లడైన అంశమిది. బ్యాంకుల వారీగా చూస్తే... ► 9 నెలల్లో 4,769 కేసుల వల్ల రూ.30,300 కోట్ల నష్టాలు ఎస్బీఐకి ఎదురయ్యాయి. ► పీఎన్బీ విషయంలో కేసుల సంఖ్య 294 అయితే, నష్టం విలువ రూ.14,929 కోట్లు. ► 250 కేసుల్లో రూ.11,166 కోట్ల మోసపూరిత నష్టాలను బ్యాంక్ ఆఫ్ బరోడా ఎదుర్కొంది. ► ఇక అలహాబాద్ బ్యాంక్ కేసుల సంఖ్య 860 అయితే, విలువ రూ.6,782 కోట్లు. ► బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.6,626 కోట్లకు సంబంధించి 161 కేసులను ఎదుర్కొంది. ► యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 292 కేసులను ఎదుర్కొంది. విలువ రూ.5,605 కోట్లు. ► ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 151 కేసులు (రూ.5,557 కోట్లు) ఎదుర్కొంటే, ఓబీసీ విషయంలో కేసుల సంఖ్య 282 అయితే, వీటి విలువ రూ.4,899 కోట్లు. -
వేలానికి ఎస్బీఐ, యూనియన్ బ్యాంకు ఎన్పీఏలు
ముంబై: ప్రభుత్వరంగ బ్యాంకులు ఎస్బీఐ, యూనియన్‌బ్యాంకులు రూ.2,836 కోట్ల వసూలు కాని మొండి రుణాలను (ఎన్పీఏ) వేలం వేయనున్నాయి. రూ.1,555 కోట్ల విలువైన ఎన్పీఏలను ఎస్బీఐ వేలానికి ఉంచింది. అలాగే, 11 ఎన్పీఏల ఖాతాలకు సంబంధించి రూ.1,281 కోట్ల రుణ ఆస్తుల వేలానికి బిడ్లను యూనియన్ బ్యాంకు ఆహ్వానించింది. ఈ నెల్లోనే ఈవేలం ద్వారా వీటిని అస్సెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీలకు విక్రయించనున్నాయి. ఎస్బీఐ వేలానికి ఉంచిన వాటిల్లో రోహిత్ ఫెర్రోటెక్ రూ.1,313.67 కోట్లు, ఇంపెక్స్ ఫెర్రోటెక్ రూ.200.67 కోట్లు, అవని ప్రాజెక్ట్స్ అండ్ ఇన్ఫ్రా రూ.40.53 కోట్ల రుణ బకాయిలు ఉన్నాయి. యూనియన్ బ్యాంకు వేలానికి ఉంచిన వాటిల్లో జీవీకే పవర్ గోయిండ్వాల్‌సాహెబ్ (రూ.444 కోట్లు), రాజమండ్రి గోదావరి బ్రిడ్జి (రూ.153 కోట్లు) తదితర ఖాతాలు ఉండడం గమనార్హం. -
యూనియన్ బ్యాంక్ నష్టం రూ.1,194 కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో భారీగా నష్టాలొచ్చాయి. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో రూ.139 కోట్ల నికర లాభం రాగా, ఈ క్యూ2లో రూ.1,194 కోట్ల నికర నష్టాలు వచ్చాయని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. అయితే మొత్తం ఆదాయం మాత్రం రూ.9,438 కోట్ల నుంచి రూ.10,557 కోట్లకు పెరిగిందని పేర్కొంది. తగ్గిన మొండి బకాయిలు...: బ్యాంక్ రుణ నాణ్యత అధ్వాన స్థితిలోనే కొనసాగుతోంది. మొండి బకాయిలు తగ్గినా, కేటాయింపులు మాత్రం పెరిగాయి. గత క్యూ2లో 15.74 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ2లో 15.24 శాతానికి తగ్గాయి. నికర మొండి బకాయిలు 8.42 శాతం నుంచి 6.98 శాతానికి చేరాయి. మొండి బకాయిలు తగ్గినా కేటాయింపులు మాత్రం దాదాపు రెట్టింపయ్యాయి. గత క్యూ2లో రూ.1,710 కోట్లుగా ఉన్న మొండి బకాయిలకు కేటాయింపులు ఈ క్యూ2లో రూ.3,328 కోట్లకు పెరిగాయి. మొండి బకాయిలు, ఇతరాలకు కలిపి మొత్తం మీద కేటాయింపులు రూ.1,716 కోట్ల నుంచి రూ.3,859 కోట్లకు పెరిగాయి. బీఎస్ఈలో షేర్ 0.7 శాతం లాభంతో రూ.52.30 వద్ద ముగిసింది. -
యూనియన్ బ్యాంక్ నష్టం రూ.1,194 కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో భారీగా నష్టాలొచ్చాయి. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో రూ.139 కోట్ల నికర లాభం రాగా, ఈ క్యూ2లో రూ.1,194 కోట్ల నికర నష్టాలు వచ్చాయని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. అయితే మొత్తం ఆదాయం మాత్రం రూ.9,438 కోట్ల నుంచి రూ.10,557 కోట్లకు పెరిగిందని పేర్కొంది. తగ్గిన మొండి బకాయిలు...: బ్యాంక్ రుణ నాణ్యత అధ్వాన స్థితిలోనే కొనసాగుతోంది. మొండి బకాయిలు తగ్గినా, కేటాయింపులు మాత్రం పెరిగాయి. గత క్యూ2లో 15.74 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ2లో 15.24 శాతానికి తగ్గాయి. నికర మొండి బకాయిలు 8.42 శాతం నుంచి 6.98 శాతానికి చేరాయి. మొండి బకాయిలు తగ్గినా కేటాయింపులు మాత్రం దాదాపు రెట్టింపయ్యాయి. గత క్యూ2లో రూ.1,710 కోట్లుగా ఉన్న మొండి బకాయిలకు కేటాయింపులు ఈ క్యూ2లో రూ.3,328 కోట్లకు పెరిగాయి. మొండి బకాయిలు, ఇతరాలకు కలిపి మొత్తం మీద కేటాయింపులు రూ.1,716 కోట్ల నుంచి రూ.3,859 కోట్లకు పెరిగాయి. బీఎస్ఈలో షేర్ 0.7 శాతం లాభంతో రూ.52.30 వద్ద ముగిసింది. -
ఆంధ్రాబ్యాంక్ ఇక కనపడదు
మచిలీపట్నం: తొంభై ఆరేళ్ల చరిత్ర కాలగర్భంలో కలసిపోతోంది. శత వసంతాల సంబరాలకు సిద్ధమవుతున్న ఆంధ్రాబ్యాంక్‌ను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ)లో విలీనం చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. బందరులో పురుడు పోసుకున్న తెలుగోళ్ల బ్యాంక్ కనుమరుగు కాబోతుందనే విషయాన్ని ఈ ప్రాంత వాసులు జీజీర్ణించుకోలేకపోతున్నారు. ఇది అనాలోచిత నిర్ణయమని బ్యాంక్ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేస్తుండగా.. కేంద్రం తీరుపై ప్రజాసంఘాలు విరుచుకుపడుతున్నాయి. ఇదీ ప్రస్థానం బందరులో ఇద్దరు అన్నదమ్ముల మధ్య వచ్చిన ఆర్థిక తగాదాను పరిష్కరించే క్రమంలో స్వాతంత్య్ర సమరయోథుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య ఆంధ్రాబ్యాంక్ స్థాపనకు పూనుకున్నారు. స్వాతంత్రోద్యమ కాలంలో ఆర్థిక పటిష్టత అవసరమని గుర్తించిన ఇంకొంతమంది పట్టాభికి వెన్నుదన్నుగా నిలిచారు. అలా 1923 నవంబర్ 20న రూ.లక్ష మూలనిధితో భోగరాజు ఇంట్లోనే ఆంధ్రాబ్యాంక్ కార్యకలాపాలు ప్రారంభయ్యాయి. పొదుపుతో మూలధనం పోగుచేయడం ద్వారా రైతుల ఆర్థిక అవసరాల్ని తీర్చటానికి భోగరాజు రచించిన ప్రణాళికలు ప్రభుత్వాలకు మార్గదర్శకంగా నిలిచాయి. 1980లో రెండో దఫాగా చేపట్టిన బ్యాంకుల జాతీయకరణతో ఆంధ్రాబ్యాంక్ ప్రభుత్వ రంగ బ్యాంక్‌గా అవతరించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు లీడ్ బ్యాంక్‌గా వ్యవహరిస్తూ వ్యవసాయ రంగానికి ఇతోధిక సేవలందిస్తూ వస్తోంది. 1981లో క్రెడిట్ కార్డులను మన దేశానికి పరిచయం చేసిన బ్యాంక్‌గా ఇది పేరొందింది. పెట్టుబడులను రాబట్టడంలో ఆసియాలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. పట్టాభి జ్ఞాపకాలు పదిలం బ్యాంక్ ఆర్థిక పటిష్టతకు పునాదులు వేసిన డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య జ్ఞాపకాలు మచిలీపట్నంలో నేటికీ పదిలంగానే ఉన్నాయి. బ్యాంక్‌లో డబ్బు దాచేందుకు ఉపయోగించిన ఇనుప బీరువా పట్టాభి రోడ్‌లోని వ్యవస్థాపక బ్యాంక్‌లో నేటికీ ఉంది. భోగరాజు నివసించిన ఇంట్లో గాంధీ కస్తూర్బా సేవా సమితి పేరుతో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ఆంధ్రాబ్యాంక్ ఆర్థిక సహకారంతో పట్టాభి సీతారామయ్య ట్రస్ట్ ద్వారా యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాల కల్పనలో శిక్షణ ఇస్తున్నారు. ఆంధ్రాబ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం కానుండటంతో పట్టాభి ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు, ఆంధ్రాబ్యాంక్ గ్రామీణాభివృద్ధి, ఉపాధి, ఉద్యోగ కల్పన శిక్షణా కార్యక్రమాలు కొనసాగుతాయా లేదా అనేది చర్చనీ యాంశమైంది. తెలుగోడి బ్యాంక్ లేకుండా చేస్తారా? తెలుగోడు స్థాపించిన బ్యాంక్‌ను లేకుండా చేయటం బాధాకరం. స్వాతంత్రోద్యమ కాలంలో ఆర్థిక భరోసా కలి్పంచేందుకు ఏర్పాటు చేసిన ఈ బ్యాంక్‌కు ఎంతో చరిత్ర ఉంది. – గుడివాడ వెంకట గున్నయ్యశెట్టి, వ్యవస్థాపక డైరెక్టర్ -
యూబీఐలో రూ.12 కోట్లు మాయం
కరీంనగర్‌క్రైం: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) నుంచి రూ.12 కోట్లు మాయమవడం కలకలం రేపింది. పారిశ్రామికవేత్తలమని పరిచయం చేసుకున్న ఇద్దరు వ్యక్తులను అప్పనంగా డబ్బులు ఇవ్వడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆడిటింగ్‌లో భాగంగా గురువారం తనిఖీలు నిర్వహించడంతో ఇది వెలుగుచూసింది. కరీంనగర్ యూబీఐ బ్రాంచ్ మేనేజర్‌గా సురేష్‌కుమార్ వ్యవహరిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. సురేష్‌కుమార్‌కు కామారెడ్డికి చెందిన రాజుతో పరిచయం ఉంది. అతని ద్వారా ముంబైకి చెందిన సౌమిత్ రంజన్ జైన్, మధ్యప్రదేశ్‌లోని జగదల్పూర్కు చెందిన మనోజ్‌కుమార్ శుక్లాలు వ్యాపారవేత్తలుగా మేనేజర్‌తో పరిచయం చేసుకున్నారు. కొన్నిరోజుల తర్వాత రంజన్‌జైన్ తనకు డబ్బులు అవసరం ఉందని, బ్యాంక్ నుంచి రూ.5 కోట్లు ఇస్తే.. అదనంగా కలిపి ఇస్తానని చెప్పాడు. దీంతో ఆశపడిన మేనేజర్.. 2018 అక్టోబర్‌లో మొదటి దఫా రూ.5 కోట్లు ఇచ్చాడు. ఫిబ్రవరిలో రెండో వ్యక్తి మనోజ్ శుక్లా కూడా తనకూ అవసరం ఉందని అడగడంతో అతనికి మరో రూ.7 కోట్లు తీసుకొని వెళ్లి అప్పగించారు. అనంతరం వారు పత్తా లేకుండా పోయారు. ఆడిటింగ్‌లో భాగంగా ఈ నెల 11న హైదరాబాద్ నుంచి వచ్చిన తనిఖీ బృందం పరిశీలించగా.. లెక్కల్లో తేడాలు రావడంతో అనుమానం వచ్చింది. దీంతో అన్ని రకాల రికార్డులు పరిశీలించగా.. రూ. 12 కోట్లకు సంబంధించిన సమాచారం లేదు. బ్యాంక్ మేనేజర్‌ను విచారించగా తాను ఇద్దరికి.. రూ.12 కోట్లు ఇచ్చినట్లు తెలిసింది. అన్నీ అనుమానాలే.. కరీంనగర్ యూనియన్ బ్యాంక్‌లో 28 బ్రాంచ్‌లకు చెందిన నగదు నిల్వలను పర్యవేక్షిస్తుంది. ఇక్కడ పనిచేస్తున్న సురేష్‌కుమార్ చాలా కాలంపాటు బ్యాంకింగ్ రంగంలో ఉన్నారు. అలాంటి వ్యక్తి కేవలం కొద్ది రోజుల క్రితం పరిచయమైన ఇద్దరికి తాను రూ.12 కోట్లు ఇచ్చానని చెప్పడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై సీబీఐ అధికారులు రంగంలోకి దిగారని తెలిసింది. ఈ విషయమై బ్యాంక్ అధికారుల పాత్ర ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
యూనియన్ బ్యాంకు లాభం రూ.153 కోట్లు
సాక్షి, ముంబై : ప్రభుత్వ రంగ సంస్థ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరాశాజనక ఫలితాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 3వ త్రైమాసికంలో విశ్లేషకుల అంచనాలను అందుకోలేకపోయింది. ఈ ఏడాది క్యూ3(అక్టోబర్-డిసెంబర్)లో యూనియన్ బ్యాంక్ రూ. 153 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది క్యూ3లో రూ.1250 కోట్ల నికర నష్టం నమోదైంది. అయితే రూ. 230-300 కోట్ల నికర లాభం ఆర్జించనుందని విశ్లేషకులు అంచనా వేశారు. అలాగే అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో రూ .9,133.58 కోట్లతో పోలిస్తే ఈ త్రైమాసికంలో మొత్తం ఆదాయం 9,572.58 కోట్లకు పెరిగింది. ఇందుకు ప్రధానంగా ప్రొవిజన్లు తగ్గడంతోపాటు, ఆస్తుల(రుణాల) నాణ్యత మెరుగుపడటం దోహదం చేసింది. ప్రొవిజన్లు, కంటెంజెన్సీలు సగానికి తగ్గి రూ. 1617 కోట్లకు చేరాయి. కాగా.. నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ) మాత్రం 2 శాతం క్షీణించి రూ. 2494 కోట్లకు పరిమితమైంది. క్వార్టర్ టూ క్వార్టర్ టూ గ్రాస్‌ఎన్‌పీఏ స్వల్పంగా (0.88),నికర ఎన్పీఏలు 2 శాతం తగ్గాయి. వార్షిక ప్రాతిపదికన 2017-18 నాటి మూడవ త్రైమాసికంలో 13.03 శాతం నుంచి మొత్తం నికర ఆదాయం (ఎన్పీఏ) 15.66 శాతం పెరిగింది. నికర ఎన్ఎపిఏలు కూడా గత సంవత్సరం నుంచి 6.96 శాతం నుంచి 8.27 శాతానికి పెరిగాయి. -
యూనియన్ బ్యాంకుకు రూ.74 కోట్ల టోకరా
సాక్షి, ముంబై: 2018 సంవత్సరం ప్రభుత్వ, ప్రయివేటు బ్యాంకుల్లో మూడు స్కాంలు, ఆరు మోసాలు అన్నట్టు గడిచింది. మరో రెండురోజుల్లో ఏడాది ముగియనుండగా తాజాగా ప్రభుత్వరంగ బ్యాంకు యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియాలో మరో మోసం వెలుగు చూసింది. ఈ కేసులో సీబీఐ నాలుగు వేర్వేరు కేసులను నమోదు చేసింది. యూనియన్ బ్యాంక్ ఫిర్యాదు మేరకు సీబీఐ ఈ కేసును నమోదు చేసింది. 74 కోట్ల రూపాయల మేర డిఫాల్టర్లు బ్యాంకును మోసగించారని తెలిపింది. కౌశాంబి, ఘజియాబాద్‌లోని కార్పొరేట్ బ్రాంచ్‌లలో ఈ మోసం చోటు చేసుకున్నట్టు సీబీఐ వెల్లడించింది. దీనికి సంబంధించి ఎస్ఎం ఎంటర్ప్రైజెస్, జీనియస్ ఇంపెక్స్, జెబిఆర్ ఇంపెక్స్, జె.ఆర్ ఫుడ్స్ కంపెనీలు డిఫాల్టర్లుగా తేలారని యూనియన్ బ్యాంక్ రిపోర్టు చేసింది. ఈ మొండి బకాయిలుపై విచారణ చేపట్టాలని సీబీఐని కోరింది. దీంతో ఈ కంపెనీల ప్రమోటర్లు, డైరెక్టర్లపై కూడా సీబీఐ కేసు నమోదు చేసింది. -
షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలి
శ్రీకాకుళం అర్బన్: ఆమదాలవలస నియోజకవర్గంలో మూసివేసిన చక్కెర ఫ్యాక్టరీని తెరిపించాలని పరివర్తన్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు చింతాడ రవికుమార్, ట్రస్ట్ సభ్యులు మంగళవారం ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని కోరారు. ప్రజాసంకల్ప పాదయాత్రలో భాగంగా ఆమదాలవలస బ్రిడ్జిరోడ్ వద్ద ఏర్పాటు చేసిన శిబిరంలో జగన్‌ను కలసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివిధ రాజకీయ కారణాల వల్ల 2004లో చక్కెర ఫ్యాక్టరీని మూసివేశారన్నారుల్లీ ప్రాంత రైతులంతా కోర్టును ఆశ్రయించడంతో 2016లో రైతులకు అనుకూలంగా తీర్పు వచ్చిందన్నారు. అయినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఆమదాలవలస నియోజకవర్గంలోని 15 మండలాల పరిధిలో 15వేలమంది రైతులు ఉన్నారని, 9,347 మంది షేర్‌హోల్డర్స్, రైతులు ఉన్నారన్నారు. పరిశ్రమ మూతపడేనాటికి చక్కెర పరిశ్రమలో వెయ్యిమంది ఉద్యోగులు పనిచేసేవారని పేర్కొన్నారు. షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని 2014 సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు, కూన రవికుమార్‌లు నియోజకవర్గ ప్రజలకు హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చాక విస్మరించారని చెప్పారు. కాన్‌కాస్ట్ పరిశ్రమ, జొన్నవలస జూట్‌ఫ్యాక్టరీ కూడా మూతపడ్డాయని పేర్కొన్నారు. అందరికీ న్యాయం జరిగేలా పరిశ్రమలను తెరిపించాలని విన్నవించారు. జగన్‌ను కలిసిన వారిలో ట్రస్ట్ సభ్యులు సనపల అన్నాజీరావు, కిల్లి లక్ష్మణరావు, నూక శ్రీరామ్మూర్తి, గురుగుబెల్లి మధుసూదనరావు, చాపర రమేష్, సాధు చిరంజీవిరావు, చింతాడ రాజశేఖర్, బొడ్డేపల్లి మోహనరావు తదితరులు ఉన్నారు. -
వడ్డీరేట్లు పెంచిన యూనియన్ బ్యాంకు
సాక్షి, ముంబై: యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా తన ఖాతాదారులకు చేదువార్త అందించింది. ఎంసీఎల్ఆర్ రేటు 0.5శాతం పెంచుతూ శనివారం ప్రకటించింది. ఈ పెంచిన వడ్డీరేట్లు ఈరోజు(డిసెంబరు 1) నుంచేఅమల్లోకి వస్తాయని వెల్లడించింది. -
మళ్లీ లాభాల్లోకి యూనియన్ బ్యాంక్
ముంబై: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ఆర్థిక సంవత్సరం జూలై– సెప్టెంబర్ క్వార్టర్లో లాభాల బాట పట్టింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో ఈ బ్యాంక్‌కు రూ.1,531 కోట్ల నికర నష్టాలు రాగా, ఈ క్యూ2లో రూ.139 కోట్ల నికర లాభం వచ్చింది. అయితే సీక్వెన్షియల్‌గా చూస్తే (ఈ క్యూ1లో నికర లాభం రూ.130 కోట్లు) స్వల్ప వృద్ధి మాత్రమే నమోదైంది. మొండి బకాయిలు మళ్లీ పెరిగినా, రుణాల రికవరీ అంచనాలను మించడం, వడ్డీ ఆదాయం అధికంగా ఉండడం వల్ల ఈ క్యూ2లో రూ.139 కోట్ల నికర లాభం వచ్చిందని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. అధిక వడ్డీ ఆదాయం వల్లే మళ్లీ లాభాల బాట పట్టామని బ్యాంక్ ఎమ్డీ, సీఈఓ రాజ్‌కిరణ్ రాయ్ చెప్పారు. పెరిగిన మొండి బకాయిలు... గత క్యూ2లో 12.35 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ2లో 15.74 శాతానికి పెరిగాయని రాజ్ కిరణ్ తెలిపారు. అలాగే నికర మొండి బకాయిలు 6,70 శాతం నుంచి 8.42 శాతానికి చేరాయి. ఇక నికర వడ్డీ ఆదాయం 8 శాతం ఎగసి రూ.2,494 కోట్లకు పెరిగింది. ఫలితంగా నికర వడ్డీ మార్జిన్ (ఎన్ఐఎమ్) 2.08 శాతం నుంచి 2.18 శాతానికి (అంతర్జాతీయ కార్యకలాపాలను కూడా కలుపుకుంటే) పెరిగింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 2.25 శాతం నికర వడ్డీ మార్జిన్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని రాజ్‌కిరణ్ తెలియజేశారు. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూప్‌కు రూ.1,100 కోట్ల రుణాలు రూ.1,868 కోట్ల రుణాలను రద్దు చేశామని, వీటికి ఇప్పటికే వంద శాతం కేటాయింపులు జరిపామని రాజ్ కిరణ్ వెల్లడించారు. రూ.300 కోట్ల మొండి బకాయిలను అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీలకు విక్రయించామన్నారు. ఈ క్యూ2లో డిపాజిట్లు 3 శాతం వృద్ధితో రూ.3,99,092 కోట్లకు పెరగ్గా, రుణాలు 9 శాతం వృద్ధితో రూ.3,02,007 కోట్లకు ఎగిశాయి. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూప్‌నకు రూ.1,100 కోట్ల మేర రుణాలిచ్చామని, వీటిల్లో 80 శాతం థర్మల్ ప్లాంట్‌కు సంబంధించినవని పేర్కొన్నారు. ఆర్థిక ఫలితాలు సానుకూలంగా ఉండటంతో బీఎస్ఈలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్ 12 శాతం లాభంతో రూ.69.75 వద్ద ముగిసింది. -
యూబీఐ హ్యాకింగ్‌పై సీబీఐ విచారణ
న్యూఢిల్లీ: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) హ్యాకింగ్ కేసు విచారణ సీబీఐ వద్దకు చేరింది. ఇప్పటిదాకా ఈ కేసును ముంబై పోలీసులు దర్యాప్తు చేయగా.. తాజాగా దీన్ని సీబీఐ టేకోవర్ చేసింది. 2016 జులై 20న జరిగిన ఈ సైబర్ దాడిలో హ్యాకర్లు 171 మిలియన్ డాలర్ల (సుమారు రూ.1,200 కోట్లు) నిధులను బ్యాంకు నోస్ట్రో అకౌంటు నుంచి వివిధ దేశాల్లోని ఖాతాల్లోకి మళ్లించారు. యూబీఐ నోస్ట్రో అకౌంట్లను నిర్వహించే రెండు అమెరికన్ బ్యాంకుల ద్వారా కాంబోడియా, థాయ్‌ల్యాండ్, తైవాన్, ఆస్ట్రేలియా దేశాల్లోని ఖాతాలకు నిధుల మళ్లింపు జరిగింది. -
తిరుమలలో శ్రియ
-
ఎనిమిది బ్యాంకులకు హైదరాబాద్ కంపెనీ టోకరా
సాక్షి, హైదరాబాద్ : వందల కోట్ల అప్పులు తీసుకుని బ్యాంకులకు పంగనామం పెడుతున్న కంపెనీల్లోకి తాజాగా హైదరాబాద్‌కు చెందిన కంపెనీ వచ్చి చేరింది. హైదరాబాద్‌కు చెందిన టొటెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అనే కంపెనీ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యూబీఐ)కు రూ. 313 కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టింది. ఈ మేరకు యూబీఐ ఫైనాన్స్ విభాగం ఫిర్యాదుతో కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) టొటెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్‌పై కేసు నమోదు చేసింది. టొటెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ప్రమోటర్ తొట్టెంపూడి సలాలిత్, డైరెక్టర్ తొట్టెంపూడి కవితలపై యూబీఐ ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. రోడ్ల నిర్మాణం, వాటర్ వర్క్స్, బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ లాంటి పలు ప్రాజెక్టులను టొటెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ చేపట్టేది. కంపెనీ అవసరాల నిమిత్తం ఎనిమిది బ్యాంకుల కన్సోర్టియం నుంచి టొటెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ భారీ మొత్తంలో రుణం తీసుకుంది. యూబీఐ ఫిర్యాదులో పేర్కొన దాని ప్రకారం బ్యాంకుల కన్సోర్టియంకు టొటెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఇంకా రూ. 1,394.43 కోట్లు చెల్లించాల్సివుంది. 2012లోనే టొటెం కంపెనీకి ఇచ్చిన రుణాన్ని యూబీఐ ఎన్పీఏగా చేర్చింది. తాజా రిపోర్టుల ప్రకారం సీబీఐ అజ్ఞాతంలో ఉన్న టొటెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ యజమానులను పట్టుకున్నట్లు సమాచారం. -
రూ.25లక్షలకు టోకరా వేసిన ఉద్యోగులు
సాక్షి, విజయవాడ : సిటీలో ఘరానామోసం వెలుగు చూసింది. ఇద్దరు ఉద్యోగులు తాము పనిచేసే బ్యాంకుకే టోకరా పెట్టారు. రూ.25లక్షలు స్వాహా చేశారు. వివరాల్లోకి వెళ్తే.. విజయవాడ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగులు విద్యాధరరావు, నాగేశ్వర రావు ఘరానా మోసానికి పాల్పడ్డారు. అశోక్ చక్రవర్తి పేరు మీద నకిలీ పత్రాలు సృష్టించి రూ. 25లక్షలకు శఠగోపం పెట్టారు. అయితే కొంత కాలానికి తీసుకున్న రుణం కట్టాలంటూ అసలు వ్యక్తికి నోటీసులు వెళ్లాయి. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అయితే తాను ఎప్పుడు లోన్ తీసుకోలేదంటూ అశోక్ చక్రవర్తి వాపోయారు. -
జనవరి 31లోగా చెల్లించాలి
సాక్షి హైదరాబాద్: హజ్ యాత్ర–2018కు ఎంపికైన వారు ప్రయాణానికయ్యే ఖర్చులో తొలి వాయిదా రూ. 81 వేలను ఈ నెలాఖరులోగా చెల్లించాలని హజ్ కమిటీ ప్రత్యేక అధికారి ఎస్.ఎ.షుకూర్ శుక్రవారం తెలిపారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోని ఏశాఖ నుంచి అయినా కేంద్ర హజ్ కమిటీ పేరుతో చలానా తీయవచ్చన్నారు. రుసుమును ఆన్లైన్లో కూడా చెల్లించవచ్చన్నారు. హజ్ కమిటీ కేటాయించిన నంబర్, బ్యాంక్ నిర్థారణ, పాన్‌కార్డు నంబర్లను చలానా తీసేటప్పుడు పేర్కొనాలని చెప్పారు. నగదు రసీదుతో పాటు డ్రా ద్వారా ఎంపికైన వారు తమ ఒరిజినల్ పాస్‌పోర్టు, ఫొటోలు, మెడికల్ సర్టిఫికెట్‌ను రాష్ట్ర హజ్ కార్యాలయంలో ఇవ్వాలన్నారు. -
12 పీఎస్‌యూ బ్యాంకులకు నిధుల సమీకరణ అనుమతి
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల మూలధనాన్ని పటిష్టపర్చేదిశగా ప్రిఫరెన్షియల్ కేటాయింపుల ద్వారా నిధుల సమీకరణకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. 12 పీఎస్‌యూ బ్యాంకులు రూ. 3000 కోట్ల సమీకరణకు ఈ అనుమతి లభించింది. ప్రిఫరెన్షియల్ కేటాయింపుల ద్వారా రూ. 2,912 కోట్ల సమీకరణకు 12 ప్రభుత్వ బ్యాంకులు చేసిన ప్రతిపాదనకు ఆర్థిక శాఖ ఓకే చెప్పగా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్విప్ విధానంలో రూ. 200 కోట్ల సేకరణకు కూడా అనుమతినిచ్చింది. 2016–17 ఆర్థిక సంవత్సరానికి 19 పీఎస్‌యూ బ్యాంకులకు బడ్జెట్లో ప్రతిపాదించిన రూ. 25,000 కోట్ల మూలధనంలో ఇప్పటికి 22,915 కోట్లను కేంద్ర ప్రభుత్వం అందచేసింది. మిగిలిన మొత్తాన్ని ఆయా బ్యాంకుల పనితీరు ఆధారంగా విడుదల చేయనున్నట్లు ఆర్థిక శాఖ ఆదివారం విడుదల చేసిన సంవత్సరాంతపు సమీక్షలో పేర్కొంది. -
రుణాలు ఎగ్గొట్టేవారు మార్గదర్శకులా?
– మౌనంగా ఉంటే అన్ని బ్యాంకులను ప్రైవేట్ పరం చేయడం ఖాయం – చేతనైతే ఆర్ఆర్బీలు అన్నింటినీ విలీనం చేయాలి – యూనియన్ బ్యాంక్ ఎంప్లాయీస్ రాష్ట్ర అధ్యక్షుడు శోభన్‌బాబు ఒంగోలు : బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టే ప్రజాప్రతినిధులు, బడా వ్యాపారవేత్తలు బ్యాంకు ఉద్యోగులకు మార్గదర్శకులా..? అని యూనియన్ బ్యాంక్ ఎంప్లాయీస్ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ శోభన్‌బాబు ప్రశ్నించారు. ఆదివారం స్థానిక యూనియన్ బ్యాంకు ఆవరణలో బ్యాంకు ఉద్యోగులతో నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇప్పటికే ఎస్బీఐ, అనుబంధ బ్యాంకుల విలీనం వేగవంతమైందని, ఈ విషయంలో మిగిలిన బ్యాంకు ఉద్యోగులు మౌనంగా ఉంటే ఆ పరిస్థితి ఇతర బ్యాంకులకు కూడా చుట్టుకుంటుందని శోభన్‌బాబు హెచ్చరించారు. ప్రభుత్వరంగ బ్యాంకులైనందునే డ్వాక్రా రుణాలు, రుణమాఫీ పథకాలను విజయవంతం చేశామని, దేశవ్యాప్తంగా 3 నెలల్లో రూ.22 కోట్ల జీరో బ్యాలెన్స్ జన్‌ధన్ బ్యాంకు ఖాతాలు లె రవగలిగామని చెప్పారు. ప్రైవేటు బ్యాంకుల్లో పొదుపు ఖాతా ప్రారంభించాలంటే కనీసంగా రూ.10 వేలు నిల్వ ఉండాలంటున్నారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రజలను బ్యాంకులకు దగ్గర చేస్తున్నాయా.. దూరం చేస్తున్నాయా.. అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించాలన్నారు. చేతనైతే గ్రామీణ బ్యాంకులన్నింటినీ విలీనం చేసి అతి పెద్ద బ్యాంకుగా చేయాలని, అందుకు సంపూర్ణ సహకారం అందించేందుకు బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సిద్ధంగా ఉందన్నారు. వాణిజ్య బ్యాంకుల్లో సంస్కరణల పేరుతో విలీన ప్రతిపాదనను విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 29వ తేదీన దేశవ్యాప్త బ్యాంకింగ్ సమ్మెకు బెఫీ(బ్యాంకు ఎంప్లాÄæూస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) పిలుపునిచ్చిందన్నారు. బెఫీ నాయకుడు, ఏపీజీబీ ప్రకాశం రీజియన్ కోశాధికారి నాగరాజు మాట్లాడుతూ ఈ నెల 17 నుంచి శీతాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అవుతున్న దృష్ట్యా గ్రామీణ బ్యాంకుల ఉద్యోగులు ఎదుర్కొంటన్న సమస్యలపై ఈ నెల 27,28 తేదీల్లో సమ్మెకు పిలుపు ఇచ్చినట్లు చెప్పారు. వాణిజ్య బ్యాంకులు చేపడుతున్న సమ్మెకు మద్దతుగా ఈ నెల 29న గ్రామీణ బ్యాంకుల ఉద్యోగులు భాగస్వాములవుతున్నట్లు ప్రకటించారు. సమావేశంలో బెఫీ నాయకులు సురేంద్రకుమార్, సుధాకర్, టీఎల్ ప్రసాద్, సీఐటీయూ నగర అధ్యక్షుడు దామా శ్రీనివాసులు మాట్లాడారు. -
23 శాతం తగ్గిన యూనియన్ బ్యాంక్ లాభం
న్యూఢిల్లీ: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నికర లాభం గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో 23 శాతం తగ్గింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం(2014-15) క్యూ4లో రూ.1,761 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.1,357 కోట్లకు తగ్గిందని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. మొత్తం ఆదాయం రూ.36,121 కోట్ల నుంచి రూ.36,250 కోట్లకు స్వల్పంగా పెరిగిందని వివరించింది. స్థూల మొండి బకాయిలు 4.96 శాతం (రూ.13,031 కోట్లు)నుంచి 8.70 శాతానికి(రూ.24,171 కోట్లు) పెరిగాయని, అలాగే నికర మొండి బకాయిలు 2.71 శాతం (రూ.6,919 కోట్ల)నుంచి 5.25 శాతానికి(రూ.14,026 కోట్ల)కు ఎగిశాయని తెలిపింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బ్యాంక్ షేర్ బీఎస్ఈలో 1.2 శాతం లాభపడి రూ.111 వద్ద ముగిసింది. -
యూబీఐకి రూ.2 కోట్ల మేర టోకరా
ఇద్దరు మేనేజర్లు సహా నలుగురి అరెస్టు మంచిర్యాల టౌన్(ఆదిలాబాద్) : ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను మోసగించి దాదాపు రూ.2 కోట్లు రుణం పొందిన కేసులో ఇద్దరు బ్యాంకు మేనేజర్లు సహా నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఏఎస్పీ విజయ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాలకు చెందిన సోమాల ఫణికుమార్, జన్నారానికి చెందిన మహ్మద్ యూసుఫ్, ఎస్డీ రహీముల్లా కలిసి 2013లో జన్నారంలో తొమ్మిదిన్నర గుంటల స్థలం కొనుగోలు చేశారు. ఇందులో షాపింగ్ కాంప్లెక్స్ కట్టాలని నిర్ణయించి.. మంచిర్యాల యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ మేనేజర్‌గా అప్పుడు పనిచేసిన రాజేశ్ డాయిఫోడ్ను సంప్రదించారు. కాంప్లెక్స్ కట్టకుండానే, కట్టినట్లుగా దానిని మార్టిగేజ్ చేసేలా మేనేజర్‌తో మాట్లాడుకున్నారు. వచ్చిన డబ్బు తలా కొంత తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు బ్యాంక్ మేనేజర్ రాజేశ్ రూ.1.20 కోట్లు రుణం అందజేశారు. కొద్ది రోజుల తర్వాత జరిపిన ఆడిటింగ్‌లో ఈ బండారం బయటపడింది. దీంతో అప్పటి మేనేజర్ రాజేశ్ ఈ సమస్యను లక్సెట్టిపేట ఎస్బీఐలో మేనేజర్‌గా పనిచేస్తున్న ఒబెరాయ్ ఝాన్సీలక్ష్మీభాయ్కు వివరించారు. ఇద్దరూ స్నేహితులు కావడంతో ఆమెతో కలిసి ఎస్బీఐకి లోను కోసం దరఖాస్తు చేసుకుని 23 మంది పేరిట యూనియన్ బ్యాంకులో దొంగ ఖాతాలను సృష్టించారు. ఇందుకు అన్ని రకాల ధ్రువీకరణ పత్రాలు ఎస్బీఐ నుంచి ఝాన్సీ అందించి సహకరించింది. 23 నకిలీ ఖాతాల్లో జన్నారం, దండేపల్లి, లక్సెట్టిపేటలో ఉండే వివిధ శాఖల ప్రభుత్వ ఉద్యోగులే ఎక్కువగా ఉన్నారు. వారి పేర రూ. 1,78,81,000 రుణం రూపంలో పొందారు. ఇందులో నుంచి గతంలో వీరు పొందిన రూ.1.20 కోట్లు బ్యాంకుకు చెల్లించారు. మిగతా రూ.58.81 లక్షలను సొంతానికి వాడుకున్నారు. కొద్ది రోజులకు యూనియన్ బ్యాంకుకు మేనేజర్‌గా వచ్చిన వరదరాజన్ 23 మంది ఖాతాదారులు రుణాలు చెల్లించకపోవడంపై ఆరా తీశారు. బ్యాంకును మోసం చేసినట్లుగా గుర్తించి 2015 మార్చి 27న కేసు పెట్టారు. చెన్నూరు ఎస్సై సతీశ్‌కుమార్ పూర్తి విచారణ జరిపి నిందితులు సోమాల ఫణికుమార్, మహ్మద్ యూసుఫ్లతోపాటు ఘట్కేసర్ డిప్యూటీ బ్రాంచ్ హెడ్‌గా పనిచేస్తున్న రాజేశ్ డాయిఫోడ్, చిత్తూరు జిల్లా చంద్రగిరి బ్రాంచ్‌లో బ్యాంక్ మేనేజర్‌గా పనిచేస్తున్న ఝాన్సీలక్ష్మీబాయిని అరెస్టు చేశారు. వీరందరిపైనా చీటింగ్ కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. -
రైతుల పేరుతో రూ. 20 లక్షలు స్వాహా
నెల్లూరు: నెల్లూరు జిల్లా కొండాపూర్ మండలం రాయపేటలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‌లోని ఉద్యోగి చేతి వాటం ప్రదర్శించాడు. రైతుల పేరుతో రూ. 20 లక్షలు స్వాహా చేశారు. ఆ విషయాన్ని అధికారులు చాలా ఆలస్యంగా గుర్తించారు. దాంతో బ్యాంకు అధికారులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో మంగళవారం విచారణ చేపట్టారు. అందులోభాగంగా బ్యాంకు ఉద్యోగిని ఉన్నతాధికారులు ప్రశ్నిస్తున్నారు. -
విదేశీ విస్తరణపై యూనియన్ బ్యాంక్ దృష్టి
ఈ ఏడాది సిడ్నీలో శాఖ ప్రారంభం బీజింగ్, షాంఘైలలో కొత్త శాఖల ఏర్పాటుకు చర్చలు కార్పొరేట్ రుణాల్లో కనిపించని వృద్ధి 2015-16లో 10 శాతం రుణ వృద్ధి అంచనా బ్యాంక్ ఈడీ కె. సుబ్రమణ్యం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వరంగ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విదేశీ విస్తరణపై ప్రధానంగా దృష్టిసారిస్తోంది. ఈ మధ్యనే బ్రిటన్‌లో అనుబంధ బ్యాంకును ప్రారంభించిన బ్యాంక్ తాజాగా ఆస్ట్రేలియాలోకి అడుగిడనుంది. ఈ ఏడాదిలోగా సిడ్నీలో కొత్త శాఖను ఏర్పాటు చేయనున్నామని, దీనికి సంబంధించి అక్కడి ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నట్లు యూనియన్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ కె.సుబ్రమణ్యం తెలిపారు. దీంతో పాటు షాంఘై, బీజింగ్‌లో కూడా శాఖలు ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు ఆయన తెలిపారు. అంతకుముందు భారీ పరిశ్రమల అవసరాల కోసం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఇండస్ట్రియల్ ఫైనాన్స్ శాఖను సుబ్రమణ్యం శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వచ్చే ఏడాదిలోగా సిడ్నీ శాఖ ఏర్పాటకు సంబంధించిన అన్ని అనుమతులు లభిస్తాయన్న ధీమాను వ్యక్తం చేశారు. ప్రస్తుతం యూనియన్ బ్యాంక్‌కు హాంకాంగ్, దుబాయ్, బెల్జియంల్లో శాఖలు ఉండగా, యూకేలో సబ్సిడరీ ఉంది. మొత్తం ఆదాయంలో సుమారు 5 శాతం విదేశాల నుంచి వస్తుండగా, దీన్ని 2019 నాటికి 10 శాతానికి తీసుకెళ్ళాలని లక్ష్యంగా పెట్టుకుంది. వడ్డీ లాభదాయకతపై ఒత్తిడి ఉంది.. నికర వడ్డీ లాభదాయకత(నిమ్)పై ఒత్తిడి ఉన్నప్పటికీ మెరుగుపర్చుకోగలమన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. ప్రస్తుతం 2.6 శాతంగా ఉన్న నిమ్ 2015-16 నాటికి 2.9 శాతానికి చేరుతుందన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. వడ్డీ లాభదాయకతను పెంచుకోవడానికి కాసా అకౌంట్లపై దృష్టిపెడుతున్నామని, ప్రస్తుతం డిపాజిట్లలో 28 శాతంగా ఉన్న కాసా వాటాను వచ్చే రెండేళ్ళలో 31 శాతానికి చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. వాస్తవంగా ఇప్పటికీ కార్పొరేట్ రుణాల్లో వాస్తవ వృద్ధి కనిపించడం లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా సుబ్రమణ్యం తెలిపారు. ప్రస్తుత ఏడాది యూనియన్ బ్యాంక్ రుణాల్లో 9 శాతం వృద్ధి ఉందని, ఇది వచ్చే ఏడాది 10 శాతంగా ఉండొచ్చని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. మంచి మార్కెట్ కోసం ఎదురు చూపులు వ్యాపార విస్తరణ కోసం క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ ప్లేస్‌మెంట్స్ (క్యూఐపీ) ద్వారా నిధులు సేకరించడానికి అన్ని అనుమతులు ఉన్నప్పటికీ, మంచి మార్కెట్ పరిస్థితులు కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. తక్షణం అదనపు నిధుల అవసరం లేదని వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలోగా రూ. 1,386 కోట్ల నిధులను క్విప్ రూపంలో సేకరించనున్నట్లు తెలిపారు. ఇది కాకుండా రూ. 4,000 కోట్ల టైర్-1 క్యాపిటల్ నిధులను సేకరించే అవకాశం ఉందన్నారు. బ్యాంకు శాఖల విస్తరణపై ఎక్కువగా దృష్టిసారించడం లేదని, ఏర్పాటు చేసిన ఏడాదిలోగా లాభనష్టరహిత స్థాయి సాధించగల సామర్థ్యం ఉన్న చోట్ల మాత్రమే ఏర్పాటు చేస్తున్నట్లు మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. వచ్చే ఏడాది కొత్తగా 200 శాఖలను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నామన్నారు.ప్రస్తుతం యూనియన్ బ్యాంక్‌కు దేశవ్యాప్తంగా 4,000 శాఖలున్నాయి. ఈ ఏడాది కొత్తగా 1,200 మంది ఉద్యోగులను తీసుకునే అవకాశం ఉందన్నారు. -
నేటి బడ్జెట్‌పై ఆశలెన్నో
సాక్షి, ముంబై: ఎన్నికలకు ముందు నరేంద్ర మోడీ ‘అచ్చే దిన్ ఆయేంగే’ (మంచి రోజులు వస్తాయి) అనే నినాదంతో చేసిన ప్రచారం మంచి ఫలితాలను ఇచ్చింది. ఎన్నోకల సమయంలో ముంబై అభివృద్ధికి మోడీ ఇచ్చిన హామీలు తప్పకుండా నెరవేర్చాలని ముంబైకర్లు కోరుతున్నారు. నిత్యావసర సరుకులు, కూరగాయల ధరలు, రైలు చార్జీలు, ఇంధన ధరలు పెరగడంతో సామాన్యులు బేజారవుతున్నాడు. మంగళవారం ప్రవేశపెట్టనున్న రైల్వే బడ్జెట్లో ముంబైకి ఎంతమేర ప్రాధాన్యం ఇస్తారనేదానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ముంబైలో ప్రతీరోజు 75 లక్షల మంది ప్రయాణికులు లోకల్ రైళ్లలో రాకపోకలు సాగిస్తుంటారు. కేంద్ర ప్రభుత్వానికి అందే ఆర్థిక వనరుల్లో లోకల్ రైళ్ల వాటా అత్యధికంగా ఉంటుంది. ఏటా ప్రవేశపెట్టే రైల్వే బడ్జెట్లో ముంబైకర్లకు మొండిచేయి ఎదురవుతుందన్న అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. గతంలో ప్రకటించిన అనేక రైల్వే ప్రాజెక్టులు పెండింగులో ఉన్నాయి. తీవ్రజాప్యం వల్ల వీటి వ్యయాలు తడిసి మోపెడవుతున్నాయి. నిధులు లేక కొన్ని ప్రాజెక్టులు అర్థంతరంగా నిలిచిపోయాయి. కనీసం ఈ బడ్జెట్లోనైనా నిధులు మంజూరైతే అవి పూర్తవుతాయని నగరవాసులు భావిస్తున్నారు. ముంబై అర్బన్ ట్రాన్స్‌పోర్టు ప్రాజెక్టు (ఎంయూటీపీ) ద్వారా మూడు ప్రాజెక్టులు పూర్తిచేయాలని రైల్వే బోర్డు సంకల్పించింది. అందులో మొదటి ప్రాజెక్టు కోసం రూ.3,125 కోట్లు మంజూరు చేశారు. ప్రాజెక్టు పనులు జాప్యం కావడంతో అంచనా వ్యయం రూ.వెయ్యి కోట్లు పెరిగింది. ఇందులో తొమ్మిది బొగీలున్న లోకల్ రైళ్లను 12, 15 బోగీలుగా మార్చే ప్రాజెక్టు కూడా ఉంది. రెండో ప్రాజెక్టుకు రూ.5,300 కోట్లు మంజూరు చేశారు. అనేక కారణాలవల్ల ఇవన్నీ పెండింగులోనే ఉన్నాయి. దీంతో ప్రాజెకుల్ట వ్యయం రూ.7,013 కోట్లకు చేరుకున్నా పనులు పూర్తికాలే దు. మూడో ప్రాజెక్టు కోసం రూ.10 వేల కోట్లు మంజూరు చేస్తామని గత బడ్జెట్లో ప్రకటించినా, ఇప్పటికీ అవి విడుదల కాలేదు. దీంతో ఠాణే-సీఎస్టీ స్టేషన్ల మధ్య ఐదు, ఆరో రైల్వే లేన్ల పనులు పెండింగులోనే ఉన్నాయి. ఈ పనులు సమయానికి పూర్తయినట్లతే లోకల్ రైలు సేవలను మరింత మెరుగుపరిచేందుకు వీలు పడేది. ముంబై రైల్వే స్టేషన్లలో మరుగుదొడ్లు నిర్మించడం, ప్రయాణికులకు మరింత భద్రత కల్పించడం, రైల్వే ప్రమాదాల నివారణ, ప్లాట్‌ఫారాల ఎత్తు పెంచడం, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు లేదా సబ్వే నిర్మాణం వంటి దీర్ఘకాల డిమాండ్లపై మోడీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని ముంబైకర్లు కోరుకుంటున్నారు.