ముంబై: యూనియన్ మ్యూచువల్ ఫండ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తన నిర్వహణ ఆస్తులను (ఏయూఎం) 50 శాతం మేర పెంచుకోనున్నట్టు ప్రకటించింది. 2023 మార్చి నాటికి ఈ సంస్థ ఏయూఎం రూ.9,853 కోట్లుగా ఉంటే, 2024 మార్చి నాటికి రూ.15,000 కోట్లకు తీసుకెళ్లాలనే లక్ష్యాన్ని పెట్టుకుంది. ఎప్పుడో 2012లోనే ఈ సంస్థ మ్యూచువల్ ఫండ్స్ సేవలు ప్రారంభించినప్పటికీ ఇంతకాలం ఆస్తుల్లో వృద్ధి చెప్పుకోతగినంత లేదు. ప్రభుత్వరంగ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన యూనియన్ మ్యూచువల్ ఫండ్‌లో, 39.64 శాతం వాటాను జపాన్‌కు చెందిన దైచీలైఫ్ 2018లో కొనుగోలు చేయడం గమనార్హం.
ఈ సంస్థ ఏయూఎంలో టాప్–30 పట్టణాల వాటా 68 శాతంగా ఉంటే, బీ30 (బియాండ్ 30) పట్టణాల నుంచి 32 శాతం ఆస్తులను కలిగి ఉంది. ‘‘మార్చి చివరికి ఉన్న ఏయూఎం రూ.9,853 కోట్లు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికం చివరికి రూ.10,700 కోట్లకు చేరుకుంది. వచ్చే మార్చి నాటికి ఇది రూ.15,000 కోట్లకు చేరుతుందని భావిస్తున్నాం. పెద్ద థీమ్యాటిక్ ఫండ్‌ను వచ్చే నెలలో ప్రారంభించనున్నాం. దీని ద్వారా రూ.500 కోట్లు సమీకరించగలమని అంచనా వేస్తున్నాం. మార్కెట్‌పైనే ఇది ఆధారపడి ఉంటుంది’’అని యూనియన్ మ్యూచువల్ ఫండ్ సీఈవో జి.ప్రదీప్‌కుమార్ తెలిపారు.
కొత్త భాగస్వామి మద్దతుతో
ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్నప్పటికీ ఏయూఎంలో వృద్ధి పెద్దగా లేకపోవడానికి బెల్జియంకు చెందిన కేబీసీ తొలుత భాగస్వామిగా ఉండడమేనని ప్రదీప్‌కుమార్ వెల్లడించారు. థర్డ్ పార్టీ విక్రయాలకు ఆ సంస్థ సమ్మతించకపోవడంతో, కేవలం యూనియన్ బ్యాంక్ శాఖల ద్వారానే విక్రయాలు చేయాల్సి వచి్చందన్నారు. 2018లో దైచీ రాకతో అప్పటికీ కేవలం రూ.4,500 కోట్లుగానే ఉన్న ఏయూఎం, ఐదేళ్లలో రెట్టింపైనట్టు చెప్పారు. ఇక ముందూ ఇదే విధంగా వృద్ధిని సాధిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment