న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల మూలధనాన్ని పటిష్టపర్చేదిశగా ప్రిఫరెన్షియల్ కేటాయింపుల ద్వారా నిధుల సమీకరణకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. 12 పీఎస్‌యూ బ్యాంకులు రూ. 3000 కోట్ల సమీకరణకు ఈ అనుమతి లభించింది. ప్రిఫరెన్షియల్ కేటాయింపుల ద్వారా రూ. 2,912 కోట్ల సమీకరణకు 12 ప్రభుత్వ బ్యాంకులు చేసిన ప్రతిపాదనకు ఆర్థిక శాఖ ఓకే చెప్పగా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్విప్ విధానంలో రూ. 200 కోట్ల సేకరణకు కూడా అనుమతినిచ్చింది. 2016–17 ఆర్థిక సంవత్సరానికి 19 పీఎస్‌యూ బ్యాంకులకు బడ్జెట్లో ప్రతిపాదించిన రూ. 25,000 కోట్ల మూలధనంలో ఇప్పటికి 22,915 కోట్లను కేంద్ర ప్రభుత్వం అందచేసింది. మిగిలిన మొత్తాన్ని ఆయా బ్యాంకుల పనితీరు ఆధారంగా విడుదల చేయనున్నట్లు ఆర్థిక శాఖ ఆదివారం విడుదల చేసిన సంవత్సరాంతపు సమీక్షలో పేర్కొంది.