
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో భారీగా నష్టాలొచ్చాయి. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో రూ.139 కోట్ల నికర లాభం రాగా, ఈ క్యూ2లో రూ.1,194 కోట్ల నికర నష్టాలు వచ్చాయని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. అయితే మొత్తం ఆదాయం మాత్రం రూ.9,438 కోట్ల నుంచి రూ.10,557 కోట్లకు పెరిగిందని పేర్కొంది.
తగ్గిన మొండి బకాయిలు...: బ్యాంక్ రుణ నాణ్యత అధ్వాన స్థితిలోనే కొనసాగుతోంది.
మొండి బకాయిలు తగ్గినా, కేటాయింపులు మాత్రం పెరిగాయి. గత క్యూ2లో 15.74 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ2లో 15.24 శాతానికి తగ్గాయి. నికర మొండి బకాయిలు 8.42 శాతం నుంచి 6.98 శాతానికి చేరాయి. మొండి బకాయిలు తగ్గినా కేటాయింపులు మాత్రం దాదాపు రెట్టింపయ్యాయి. గత క్యూ2లో రూ.1,710 కోట్లుగా ఉన్న మొండి బకాయిలకు కేటాయింపులు ఈ క్యూ2లో రూ.3,328 కోట్లకు పెరిగాయి. మొండి బకాయిలు, ఇతరాలకు కలిపి మొత్తం మీద కేటాయింపులు రూ.1,716 కోట్ల నుంచి రూ.3,859 కోట్లకు పెరిగాయి.
బీఎస్‌ఈలో షేర్ 0.7 శాతం లాభంతో రూ.52.30 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment