
ముంబై: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ఆర్థిక సంవత్సరం జూలై– సెప్టెంబర్ క్వార్టర్లో లాభాల బాట పట్టింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో ఈ బ్యాంక్‌కు రూ.1,531 కోట్ల నికర నష్టాలు రాగా, ఈ క్యూ2లో రూ.139 కోట్ల నికర లాభం వచ్చింది.
అయితే సీక్వెన్షియల్‌గా చూస్తే (ఈ క్యూ1లో నికర లాభం రూ.130 కోట్లు) స్వల్ప వృద్ధి మాత్రమే నమోదైంది. మొండి బకాయిలు మళ్లీ పెరిగినా, రుణాల రికవరీ అంచనాలను మించడం, వడ్డీ ఆదాయం అధికంగా ఉండడం వల్ల ఈ క్యూ2లో రూ.139 కోట్ల నికర లాభం వచ్చిందని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. అధిక వడ్డీ ఆదాయం వల్లే మళ్లీ లాభాల బాట పట్టామని బ్యాంక్ ఎమ్‌డీ, సీఈఓ రాజ్‌కిరణ్ రాయ్ చెప్పారు.
పెరిగిన మొండి బకాయిలు...
గత క్యూ2లో 12.35 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ2లో 15.74 శాతానికి పెరిగాయని రాజ్ కిరణ్ తెలిపారు. అలాగే నికర మొండి బకాయిలు 6,70 శాతం నుంచి 8.42 శాతానికి చేరాయి. ఇక నికర వడ్డీ ఆదాయం 8 శాతం ఎగసి రూ.2,494 కోట్లకు పెరిగింది. ఫలితంగా నికర వడ్డీ మార్జిన్ (ఎన్‌ఐఎమ్) 2.08 శాతం నుంచి 2.18 శాతానికి (అంతర్జాతీయ కార్యకలాపాలను కూడా కలుపుకుంటే) పెరిగింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 2.25 శాతం నికర వడ్డీ మార్జిన్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని రాజ్‌కిరణ్ తెలియజేశారు.
ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూప్‌కు రూ.1,100 కోట్ల రుణాలు
రూ.1,868 కోట్ల రుణాలను రద్దు చేశామని, వీటికి ఇప్పటికే వంద శాతం కేటాయింపులు జరిపామని రాజ్ కిరణ్ వెల్లడించారు. రూ.300 కోట్ల మొండి బకాయిలను అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీలకు విక్రయించామన్నారు. ఈ క్యూ2లో డిపాజిట్లు 3 శాతం వృద్ధితో రూ.3,99,092 కోట్లకు పెరగ్గా, రుణాలు 9 శాతం వృద్ధితో రూ.3,02,007 కోట్లకు ఎగిశాయి.
ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూప్‌నకు రూ.1,100 కోట్ల మేర రుణాలిచ్చామని, వీటిల్లో 80 శాతం థర్మల్ ప్లాంట్‌కు సంబంధించినవని పేర్కొన్నారు. ఆర్థిక ఫలితాలు సానుకూలంగా ఉండటంతో బీఎస్‌ఈలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్ 12 శాతం లాభంతో రూ.69.75 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment