సాక్షి, హైదరాబాద్: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యూబీఐ) నుంచి రుణం తీసుకుని మోసం చేసిన కేసులో హైదరాబాద్‌కు చెందిన ముసద్దీలాల్ జ్యువెలర్స్‌పై బెంగళూరు సీబీఐ అధికారులు నమోదు చేసిన కేసు ఆధారంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు రంగంలోకి దిగారు. ఈ నేపథ్యంలోనే శుక్రవా రం రాత్రి బెంగళూరు నుంచి హైదరాబాద్‌కి చేరుకున్న ఈడీ ప్రత్యేక బృందం పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. బెంగళూరు సీబీఐ యూనిట్‌కు చెందిన బ్యాంక్ సెక్యూరిటీ అండ్ ఫ్రాడ్ సెల్ (బీఎస్‌ఎఫ్‌సీ) గతేడాది జూలై 20న ముసద్దీలాల్ జ్యువెలర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థపై కేసు నమోదు చేసింది. రుణాల రూపంలో పలు దఫాలుగా రూ.88 కోట్లు తీసుకుని మోసం చేసిన సంస్థ యజమానులు మోహన్‌లాల్ గుప్తా, ప్రశాంత్ గుప్తాలను కేసులో నిందితులుగా చేర్చారు.
వీరు నకిలీ పత్రాలు సృష్టించి బ్యాంకు నుంచి రుణం తీసుకున్నట్లు సీబీఐ తెలిపింది. ఇదే విధంగా మరో బ్యాంక్ నుంచి కూడా రుణం తీసుకొని, ఆ తర్వాత యూబీఐతో ఆర్థిక లావాదేవీలు చేయడానికి ఆసక్తి చూపుతూ బ్యాంకుకు దరఖాస్తు చేసుకుంది. ఇలా లావాదేవీలు ప్రారంభించి సదురు సంస్థ తన క్రెడిట్ లిమిట్‌ను రూ.55 కోట్లకు పెంచుకుంది. ఓ దశలో వర్కింగ్ క్యాపిటల్ లోన్స్ (డబ్ల్యూసీఎల్), ఫండెడ్ ఇంట్రెస్ట్ టర్మ్ లోన్స్ (ఎఫ్‌ఐటీఎల్) కూడా తీసుకుంది. దీంతో యూబీఐ దగ్గర ముసద్దీలాల్ సంస్థ తీసుకున్న మొత్తం రుణం రూ.88 కోట్లకు చేరింది. ఈ మొత్తాన్ని దారి మళ్లించి వాటికి సంబంధించిన వాయిదాలను కూడా చెల్లించకపోవడంతో సదరు బ్యాంక్ ముసద్దీలాల్ సంస్థ ఖాతాలను ఎన్‌పీఏల జాబితాలో చేర్చింది.
రూ.48 కోట్లు ఎగవేత..
వన్ టైమ్ సెటిల్‌మెంట్ (ఎటీఎస్) స్కీమ్‌లో భాగంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ముసద్దీలాల్ యజమానులు రూ.40 కోట్లు చెల్లించినా.. మరో రూ.48 కోట్లు ఉద్దేశపూర్వకంగా ఎగవేశారని బ్యాంకు అధికారులు తేల్చారు. దీంతో బెంగళూరు సీబీఐ యూనిట్‌లో ఫిర్యాదు చేశారు. ఓటీఎస్‌లో భాగంగా కొంత మొత్తం చెల్లించినా.. రుణం తీసుకునేప్పుడు తప్పుడు పత్రాలు సమర్పించడం నేరమేనని సీబీఐ పేర్కొంది. ఈ స్కామ్‌లో భారీ మనీలాండరింగ్ జరిగినట్లు అనుమానించిన సీబీఐ అధికారులు విష యాన్ని ఈడీ దృష్టికి తీసుకువెళ్లారు. ఇందులో భాగంగా శుక్రవారంరాత్రి హైదరాబాద్‌కి వచ్చిన ఈడీ అధికారులు ముసద్దీలాల్ సంస్థలు, వాటి యజమానుల ఇళ్లల్లో జరిపిన సోదాల్లో కొన్ని డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. 2017 డీమానిటైజేషన్ సమయంలో ముసద్దీలాల్ సంస్థ యజమానులు తమ వద్ద ఉన్న పాతనోట్లను మార్చడానికి వారి బంగారం వారే కొనుక్కుని రూ.100 కోట్ల స్కామ్‌కు పాల్పడినట్లు హైదరాబాద్ సీసీఎస్‌లో కేసు నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment