CBI Focused Irregularities Grain Purchases-Delivery Custom Milled Rice - Sakshi
Sakshi News home page

Custom Milling Rice: సీఎంఆర్‌పై సీబీ'ఐ'

Published Sat, Jan 14 2023 2:12 AM | Last Updated on Sat, Jan 14 2023 8:50 AM

CBI Focused Irregularities Grain Purchases-Delivery Custom Milled Rice - Sakshi

సాక్షి, హైదరాబాద్‌/న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు, కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ (సీఎంఆర్‌) అప్పగింతల్లో జరిగిన అక్రమాలపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) దృష్టి పెట్టింది. భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) అధికారుల సహకారంతో చాలా రాష్ట్రాల్లో రైస్‌ మిల్లర్లు, వ్యాపారులు, రాష్ట్ర అధికారులు కలిసి వ్యవస్థీకృత సిండికేట్‌ నడుపుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో సీబీఐ విచారణ చేపట్టి తనిఖీలు నిర్వహిస్తోంది. ధాన్యం కొనుగోళ్లలో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడటం, నాసిరకం బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగించడం, నాణ్యత ప్రమాణాలకు తిలోదకాలిచ్చి బియ్యం సరఫరా చేస్తున్నారనే ఆరోపణలపై ఇప్పటికే ఢిల్లీ, హరియాణా, పంజాబ్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో దాడులు నిర్వహించింది.

74 మందిపై కేసులు నమోదు చేసి అరెస్ట్‌ చేసింది. ఇదే క్రమంలో త్వరలోనే తెలంగాణలోనూ ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు, సీఎంఆర్‌ అప్పగింతల్లో అవకతవకలపై దర్యాప్తుకు సీబీఐ రంగంలోకి దిగనున్నట్లు కేంద్రప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది. రాష్ట్రంలోని అధికార బీఆర్‌ఎస్‌ నేతల అండతో మిల్లర్లు సీఎంఆర్‌ కేటాయింపుల విషయంలో అవకతవకలకు పాల్పడుతున్నట్లుగా ఢిల్లీకి ఉప్పందినట్లు తెలిసింది. మిల్లర్లకు పౌరసరఫరాల శాఖ అధికారుల సంపూర్ణ సహకారం కూడా ఉందని భావిస్తున్న సీబీఐ ఆ దిశగా దర్యాప్తుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. 

4 రాష్ట్రాల్లోని 50 ప్రాంతాల్లో తనిఖీలు..
విశ్వసనీయ సమాచారం మేరకు.. ధాన్యం ఉత్పత్తి అధికంగా ఉండే పంజాబ్, హరియాణా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో ధాన్యం కొనుగోళ్లలో భారీగా అక్రమాలు జరిగినట్లు సీబీఐ గుర్తించింది. దీనితో పాటు సకాలంలో కేంద్రానికి ఇవ్వాల్సిన సీఎంఆర్‌ ఇవ్వకుండా మిల్లర్లు ప్రైవేటుకు అమ్ముకోవడం, దీనికి  కొందరు ఎఫ్‌సీఐ అధికారులతో పాటు ఆయా రాష్ట్రాల ఆహార, పౌరసరఫరాల శాఖల అధికారులు సహకరిస్తుండటాన్ని కూడా గుర్తించింది.

సెంట్రల్‌ పూల్‌కు ఇచ్చే బియ్యంలో నాణ్యత లోపిస్తున్నా, ఎఫ్‌సీఐ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంతో వినియోగదారులకు నాణ్యత లేని బియ్యం సరఫరా అవుతున్నట్లు నిర్ధారించింది. ఈ నేపథ్యంలోనే మూడ్రోజుల కిందట ఢిల్లీ, పంజాబ్, హరియాణా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లోని 50 ప్రాంతాల్లో సీబీఐ ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. ఎఫ్‌సీఐ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ రాజీవ్‌కుమార్‌ మిశ్రా సహా 74 మందిని అరెస్ట్‌ చేసింది. ఇందులో 37 మంది ఎఫ్‌సీఐ అధికారులు కాగా మిగతావారిలో మిల్లర్లు, దళారులు, గోదాముల నిర్వాహకులు ఉన్నారు.  

ఉత్పత్తి సామర్థ్యానికి మించి కొనుగోళ్లు
మిశ్రా ఎఫ్‌సీఐ ప్రధాన కార్యాలయంలో పనిచేసిన సమయంలోనే తెలంగాణ, పంజాబ్, హరియాణా రాష్ట్రాల్లో ఉత్పత్తి సామరŠాధ్యనికి మించి ధాన్యం కొనుగోళ్లు జరిగాయనే ఆరోపణలు వచ్చాయి. మిశ్రా చాలా రాష్ట్రాల మిల్లర్లతో కుమ్మక్కై, కేంద్రానికి ఇవ్వాల్సిన సీఎంఆర్‌ కోటా గడువు పెంపునకు ఆదేశాలు ఇచ్చారని, ఈ క్రమంలో కోట్ల రూపాయలు చేతులు మారాయనే ఆరోపణలు రాగా విచారణ జరుగుతోంది.

తెలంగాణకు సంబంధించి ఎఫ్‌సీఐలో గతంలో పనిచేసిన ఓ అధికారి హయాంలో కూడా సీఎంఆర్‌ కోటా సేకరణ విషయంలో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. అలాగే గత సంవత్సరం వానాకాలం, యాసంగి సీజన్ల సీఎంఆర్‌ గడువు దాటినా ఎఫ్‌సీఐకి అందకపోవడం, లెక్కల్లో తేడాలుండటం వంటి అంశాలు సీబీఐ దృష్టిలో ఉన్నట్లు చెబుతున్నారు. 

సీఎంఆర్‌ అప్పగింతలో అవకతవకలు
రాష్ట్రంలో వానాకాలం, యాసంగి సీజన్లలో రైతులు పండించిన పంటను మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఆ ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలిస్తుంటుంది. సుమారు 3 వేల మిల్లుల ద్వారా ధాన్యాన్ని మిల్లింగ్‌ చేసి, కేంద్ర ప్రభుత్వం సెంట్రల్‌పూల్‌ కింద ఇచ్చిన టార్గెట్‌కు అనుగుణంగా సీఎంఆర్‌ను ఎఫ్‌సీఐ గోడౌన్లకు పంపిస్తుంటుంది. అయితే మిల్లర్లు వ్యాపారమే లక్ష్యంగా రాజకీయ అండదండలతో అవకతవకలకు పాల్పడుతున్నారు. వచ్చిన ధాన్యాన్ని ఆరునెలల్లోగా మిల్లింగ్‌ చేసి ఎఫ్‌సీఐకి అప్పగించాల్సిన మిల్లర్లు ఆ తర్వాత రెండు, మూడు సీజన్లు గడిచినా అప్పగించడం లేదు. మిల్లుల్లోని నాణ్యమైన సర్కారు ధాన్యాన్ని మిల్లింగ్‌ చేసి, ప్రైవేటు వ్యాపారులకు విక్రయించుకుంటున్నారని, ప్రజా పంపిణీ బియం కొని, రీసైక్లింగ్‌ చేసి లోటును భర్తీ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. 

ఆధారాలు సేకరించిన దర్యాప్తు సంస్థ!
రాష్ట్రంలో ఉన్న సుమారు 3 వేల రైస్‌ మిల్లులకు గత మూడేళ్లుగా ప్రతి సీజన్‌లో సుమారు రూ.15 వేల కోట్ల విలువైన ధాన్యాన్ని ప్రభుత్వం అప్పగించి, సీఎంఆర్‌ తీసుకుంటోంది. ధాన్యాన్ని మిల్లింగ్‌ చేసినందుకు లేబర్‌ ఖర్చుతో సహా ప్రతి పైసా మిల్లర్లకు చెల్లిస్తోంది. అయినా.. 33 జిల్లాల్లోని పలువురు పౌరసరఫరాల శాఖ అధికారుల అండతో మిల్లర్లు సర్కారు ధాన్యాన్ని సొంత వ్యాపారానికి వినియోగించుకుంటున్నట్టుగాసీబీఐ ఆధారాలు సేకరించినట్లు సమాచారం.

2019–20లో 118 మంది మిల్లర్లు రూ.230 కోట్ల విలువైన 1,00,427 మెట్రిక్‌ టన్నుల బియ్యం ఎఫ్‌సీఐకి బకాయి పడగా, వారిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పైగా సదరు మిల్లులకు మరోసారి సీఎంఆర్‌ గడువు పెంచడం అనుమానాలకు తావిచ్చింది. 2020–21లో కూడా వందల సంఖ్యలో మిల్లర్లు బకాయిలు పడగా వారిని డిఫాల్టర్లుగా ప్రకటించి, 2021–22 సీజన్లలో ధాన్యం కేటాయింపును నిలిపివేశారు. అయితే ఆ తర్వాత రాజకీయ జోక్యంతో సదరు మిల్లులకు కూడా యధాతథంగా ధాన్యం సరఫరా అయింది. గత మూడేళ్లుగా రాష్ట్రంలో ధాన్యం దిగుబడి గణనీయంగా పెరగ్గా.. పౌరసరఫరాల శాఖ అధికారుల అండతో సాగుతున్న అడ్డగోలు వ్యవహారాలన్నింటిపై సీబీఐ ప్రాథమికంగా సమాచారం సేకరించినట్లు తెలిసింది. 

ఇప్పటికీ పెండింగ్‌లో 2021–22 వానాకాలం బియ్యం
రాష్ట్రంలో ప్రస్తుతం 2022–23 వానకాలం సీజన్‌కు సంబంధించిన ధాన్యం కొనుగోళ్లు సాగుతుండగా, మరో నెలలో కస్టమ్‌ మిల్లింగ్‌ ప్రారంభం కావలసి ఉంది. కానీ ఇప్పటికీ 2021–22 వానాకాలం సీజన్‌కు సంబంధించిన బియ్యం 8.65 లక్షల మెట్రిక్‌ టన్నులు (ఎల్‌ఎంటీ) ఎఫ్‌సీఐకి రావలసి ఉండటం గమనార్హం. ఆ సీజన్‌లో 70.21 ఎల్‌ఎంటీల ధాన్యాన్ని మిల్లర్లకు అప్పగించగా, 47.04 ఎల్‌ఎంటీల బియ్యాన్ని సీఎంఆర్‌ కింద ఇవ్వాల్సి ఉంది. అయితే ఇప్పటికి పలుమార్లు గడువు పెంచినా ఎఫ్‌సీఐకి ఇచ్చిన బియ్యం 38.39 ఎల్‌ఎంటీలే.

ఇక గత యాసంగి సీజన్‌కి సంబంధించి 50.39 ఎల్‌ఎంటీ ధాన్యం మిల్లులకు పంపించి, 34.07 ఎల్‌ఎంటీ సీఎంఆర్‌ తీసుకోవలసి ఉండగా, ఇప్పటివరకు కేవలం 16 ఎల్‌ఎంటీల బియ్యం మాత్రమే ఎఫ్‌సీఐకి అందింది. 2020–21 యాసంగి సీజన్‌కు సంబంధించి మిర్యాలగూడలోని వజ్ర పారాబాయిల్డ్‌ రైస్‌మిల్లు రూ.5.90 కోట్ల విలువైన బియ్యాన్ని ఎగవేయడంతో ఈ నెల 9న ఆ రైస్‌మిల్లు యజమానులు ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇలాంటి కేసులు ప్రతి జిల్లాలో ఉన్నప్పటికీ అధికారుల అండతో అక్రమాలు యధేచ్చగా కొనసాగుతూనే ఉన్నాయనే ఆరోపణలు విన్పిస్తున్నాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement