
విదేశీ విస్తరణపై యూనియన్ బ్యాంక్ దృష్టి
ఈ ఏడాది సిడ్నీలో శాఖ ప్రారంభం
బీజింగ్, షాంఘైలలో కొత్త శాఖల ఏర్పాటుకు చర్చలు
కార్పొరేట్ రుణాల్లో కనిపించని వృద్ధి
2015-16లో 10 శాతం రుణ వృద్ధి అంచనా
బ్యాంక్ ఈడీ కె. సుబ్రమణ్యం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వరంగ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విదేశీ విస్తరణపై ప్రధానంగా దృష్టిసారిస్తోంది. ఈ మధ్యనే బ్రిటన్‌లో అనుబంధ బ్యాంకును ప్రారంభించిన బ్యాంక్ తాజాగా ఆస్ట్రేలియాలోకి అడుగిడనుంది. ఈ ఏడాదిలోగా సిడ్నీలో కొత్త శాఖను ఏర్పాటు చేయనున్నామని, దీనికి సంబంధించి అక్కడి ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నట్లు యూనియన్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ కె.సుబ్రమణ్యం తెలిపారు. దీంతో పాటు షాంఘై, బీజింగ్‌లో కూడా శాఖలు ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు ఆయన తెలిపారు. అంతకుముందు భారీ పరిశ్రమల అవసరాల కోసం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఇండస్ట్రియల్ ఫైనాన్స్ శాఖను సుబ్రమణ్యం శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వచ్చే ఏడాదిలోగా సిడ్నీ శాఖ ఏర్పాటకు సంబంధించిన అన్ని అనుమతులు లభిస్తాయన్న ధీమాను వ్యక్తం చేశారు. ప్రస్తుతం యూనియన్ బ్యాంక్‌కు హాంకాంగ్, దుబాయ్, బెల్జియంల్లో శాఖలు ఉండగా, యూకేలో సబ్సిడరీ ఉంది. మొత్తం ఆదాయంలో సుమారు 5 శాతం విదేశాల నుంచి వస్తుండగా, దీన్ని 2019 నాటికి 10 శాతానికి తీసుకెళ్ళాలని లక్ష్యంగా పెట్టుకుంది.
వడ్డీ లాభదాయకతపై ఒత్తిడి ఉంది..
నికర వడ్డీ లాభదాయకత(నిమ్)పై ఒత్తిడి ఉన్నప్పటికీ మెరుగుపర్చుకోగలమన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. ప్రస్తుతం 2.6 శాతంగా ఉన్న నిమ్ 2015-16 నాటికి 2.9 శాతానికి చేరుతుందన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. వడ్డీ లాభదాయకతను పెంచుకోవడానికి కాసా అకౌంట్లపై దృష్టిపెడుతున్నామని, ప్రస్తుతం డిపాజిట్లలో 28 శాతంగా ఉన్న కాసా వాటాను వచ్చే రెండేళ్ళలో 31 శాతానికి చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. వాస్తవంగా ఇప్పటికీ కార్పొరేట్ రుణాల్లో వాస్తవ వృద్ధి కనిపించడం లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా సుబ్రమణ్యం తెలిపారు. ప్రస్తుత ఏడాది యూనియన్ బ్యాంక్ రుణాల్లో 9 శాతం వృద్ధి ఉందని, ఇది వచ్చే ఏడాది 10 శాతంగా ఉండొచ్చని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.
మంచి మార్కెట్ కోసం ఎదురు చూపులు
వ్యాపార విస్తరణ కోసం క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ ప్లేస్‌మెంట్స్ (క్యూఐపీ) ద్వారా నిధులు సేకరించడానికి అన్ని అనుమతులు ఉన్నప్పటికీ, మంచి మార్కెట్ పరిస్థితులు కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. తక్షణం అదనపు నిధుల అవసరం లేదని వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలోగా రూ. 1,386 కోట్ల నిధులను క్విప్ రూపంలో సేకరించనున్నట్లు తెలిపారు. ఇది కాకుండా రూ. 4,000 కోట్ల టైర్-1 క్యాపిటల్ నిధులను సేకరించే అవకాశం ఉందన్నారు. బ్యాంకు శాఖల విస్తరణపై ఎక్కువగా దృష్టిసారించడం లేదని, ఏర్పాటు చేసిన ఏడాదిలోగా లాభనష్టరహిత స్థాయి సాధించగల సామర్థ్యం ఉన్న చోట్ల మాత్రమే ఏర్పాటు చేస్తున్నట్లు మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. వచ్చే ఏడాది కొత్తగా 200 శాఖలను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నామన్నారు.ప్రస్తుతం యూనియన్ బ్యాంక్‌కు దేశవ్యాప్తంగా 4,000 శాఖలున్నాయి. ఈ ఏడాది కొత్తగా 1,200 మంది ఉద్యోగులను తీసుకునే అవకాశం ఉందన్నారు.