
సాక్షి, హైదరాబాద్ : వందల కోట్ల అప్పులు తీసుకుని బ్యాంకులకు పంగనామం పెడుతున్న కంపెనీల్లోకి తాజాగా హైదరాబాద్‌కు చెందిన కంపెనీ వచ్చి చేరింది. హైదరాబాద్‌కు చెందిన టొటెం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అనే కంపెనీ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యూబీఐ)కు రూ. 313 కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టింది.
ఈ మేరకు యూబీఐ ఫైనాన్స్ విభాగం ఫిర్యాదుతో కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) టొటెం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్‌పై కేసు నమోదు చేసింది. టొటెం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ప్రమోటర్ తొట్టెంపూడి సలాలిత్, డైరెక్టర్ తొట్టెంపూడి కవితలపై యూబీఐ ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. రోడ్ల నిర్మాణం, వాటర్ వర్క్స్, బిల్డింగ్స్ కన్‌స్ట్రక్షన్ లాంటి పలు ప్రాజెక్టులను టొటెం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ చేపట్టేది.
కంపెనీ అవసరాల నిమిత్తం ఎనిమిది బ్యాంకుల కన్సోర్టియం నుంచి టొటెం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ భారీ మొత్తంలో రుణం తీసుకుంది. యూబీఐ ఫిర్యాదులో పేర్కొన దాని ప్రకారం బ్యాంకుల కన్సోర్టియంకు టొటెం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఇంకా రూ. 1,394.43 కోట్లు చెల్లించాల్సివుంది. 2012లోనే టొటెం కంపెనీకి ఇచ్చిన రుణాన్ని యూబీఐ ఎన్‌పీఏగా చేర్చింది. తాజా రిపోర్టుల ప్రకారం సీబీఐ అజ్ఞాతంలో ఉన్న టొటెం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ యజమానులను పట్టుకున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment