యూనియన్‌ బ్యాంకులో.. స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు | Union Bank Specialist Officer Recruitment 2021: Vacancies, Eligibility, Salary | Sakshi
Sakshi News home page

యూనియన్‌ బ్యాంకులో.. స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌

Published Mon, Aug 23 2021 3:30 PM | Last Updated on Mon, Aug 23 2021 4:10 PM

Union Bank Specialist Officer Recruitment 2021: Vacancies, Eligibility, Salary - Sakshi

భారత ప్రభుత్వ రంగ బ్యాంక్‌.. యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(యూబీఐ).. వివిధ విభాగాల్లో స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. దీని ద్వారా సీనియర్‌ మేనేజర్, మేనేజర్, అసిస్టెంట్‌ మేనేజర్‌ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. సంబంధిత పోస్టులకు అవసరమైన విద్యార్హతలు, అనుభవం ఉంటే.. మూడంచెల్లో జరిగే ఎంపిక ప్రక్రియ ద్వారా ప్రభుత్వ రంగ బ్యాంకులో చక్కటి కెరీర్‌ సొంతం చేసుకోవచ్చు. అర్హతలు, ఆసక్తి ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్‌ 3వ తేదీలోగా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు..

యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(యూబీఐ) ముంబై ప్రధాన కేంద్రంగా పనిచేస్తోంది. దేశంలోనే రెండో అతిపెద్ద బ్యాంక్‌గా యూబీఐకి పేరుంది. డిజిటలైజేషన్‌ ఊపందుకుంటున్న నేపథ్యంలో.. వినియోగదారులకు ఆన్‌లైన్‌ సేవలను మరింత వేగంగా అందించేందుకు బ్యాంకులు స్పెషలిస్ట్‌ ఆఫీసర్లను నియమిస్తుంటాయి. అందులో భాగంగా యూబీఐ.. 2021 సంవత్సరానికి సంబంధించి వివిధ విభాగాల్లో స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.

► మొత్తం స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టుల సంఖ్య –347 
► పోస్టుల వివరాలు: సీనియర్‌ మేనేజర్లు–60, మేనేజర్లు–141, అసిస్టెంట్‌ మేనేజర్లు–146.
► విభాగాలు: రిస్క్, సివిల్‌ ఇంజనీర్, ఆర్కిటెక్ట్, ఎలక్ట్రికల్‌ ఇంజనీర్, ప్రింటింగ్‌ టెక్నాలజిస్ట్, ఫోరెక్స్, చార్టర్డ్‌ అకౌంటింగ్, టెక్నికల్‌ ఆఫీసర్‌.


అర్హతలు

► పోస్టుల వారీగా విద్యార్హతలు వేర్వేరుగా ఉన్నాయి. ఆయా పోస్టులను అనుసరించి గ్రాడ్యుయేషన్,సంబంధిత సబ్జెక్టులో బీఈ/బీటెక్,ఎంబీఏ, సీఏ /సీఎంఏ(ఐసీడబ్ల్యూఏ)/సీఎస్‌ ఉత్తీర్ణతతో పాటు అనుభవం, సర్టిఫికేషన్లు కలిగి ఉండాలి. 

వయసు
►  సీనియర్‌ మేనేజర్‌ స్థాయి పోస్టులకు 30–40 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. మిగతా పోస్టులకు 25 నుంచి 35ఏళ్ల మధ్య ఉండాలి. అసిస్టెంట్‌ మేనేజర్లకు 20–30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌–ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది. 

ఎంపిక విధానం
► యూబీఐ స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టులకు ఎంపిక ప్రక్రియ మూడంచెల్లో జరుగుతుంది. తొలుత ఆన్‌లైన్‌ విధానంలో(కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌(సీబీటీ)) నిర్వహిస్తారు. ఇందులో ఉత్తీర్ణులైన వారిని పర్సనల్‌ ఇంటర్వ్యూకు పిలుస్తారు. పర్సనల్‌ ఇంటర్వ్యూలోనూ అర్హత సాధించిన అభ్యర్థులకు గ్రూప్‌ డిస్కషన్‌ ఉంటుంది. ఇలా మూడు దశల్లో అభ్యర్థులు చూపిన ప్రతిభ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. 


200 మార్కులకు రాత పరీక్ష

► రాత పరీక్ష మొత్తం 200 మార్కులకు ఉంటుంది. ఇందులో నాలుగు విభాగాల నుంచి ప్రశ్నలుంటాయి. పరీక్ష సమయం 120 నిమిషాలు. మల్టిపుల్‌ ఛాయిస్‌ విధానం(ఎంసీక్యూలు)లో ప్రశ్నలు అడుగుతారు. రీజనింగ్‌లో 50 ప్రశ్నలు–25 మార్కులు, క్వాంటిటేటివ్‌ అప్టిట్యూడ్‌ 50 ప్రశ్నలు–50 మార్కులు, పోస్టుకు సంబంధించిన ప్రొఫెషనల్‌ నాలెడ్జ్‌ 50 ప్రశ్నలు–100 మార్కులు, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ 50 పశ్నలకు– 25 మార్కులకు పరీక్ష ఉంటుంది.

నెగిటివ్‌ మార్కింగ్‌
యూబీఐ రాత పరీక్షలో నెగిటివ్‌ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 1/4వంతు మార్కు తగ్గిస్తారు. సమాధానాలు గుర్తించకుండా వదిలేసిన ప్రశ్నలకు ఎటువంటి నెగిటివ్‌ మార్కుల నిబంధన వర్తించదు.


గ్రూప్‌ డిస్కషన్‌

గ్రూప్‌ డిస్కషన్‌ 50 మార్కులకు ఉంటుంది. ఇందులో జనరల్‌/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు కనీసం 25 మార్కులు, ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ అభ్యర్థులు కనీసం 22.5 మార్కులు సాధించాలి. కనీస అర్హత మార్కులు సాధించిన అభ్యర్థులను మాత్రమే పర్సనల్‌ ఇంటర్వ్యూకు పిలుస్తారు. పోస్టులను బట్టి 3:1 నిష్పత్తిలో అభ్యర్థులను ఇంటర్వ్యూకు ఆహ్వానిస్తారు. అంటే.. ఒక పోస్టుకు ముగ్గురు పోటీపడతారు. 


పర్సనల్‌ ఇంటర్వ్యూ

పర్సనల్‌ ఇంటర్వ్యూ కూడా 50 మార్కులకు జరుగుతుంది. ఇందులో అభ్యర్థి అకడెమిక్‌ పరిజ్ఞానం, నాయకత్వ లక్షణాలు, కమ్యూనికేషన్‌ స్కిల్స్, ఆలోచనల్లో స్పష్టత, హాబీలు, ఎక్స్‌ట్రాకరిక్యులర్‌ యాక్టివిటీస్, వ్యక్తిత్వం, ఉద్యోగానికి తగిన లక్షణాలు ఉన్నాయా.. ఇలా వివిధ కోణాల్లో పరీక్షిస్తారు. పర్సనల్‌ ఇంటర్వ్యూలోనూ కనీస అర్హత మార్కులు 25. రిజర్వేషన్‌ వర్గాల అభ్యర్థులు కనీసం 22.5 మార్కులు సాధించాలి. కనీస అర్హత మార్కులు పొందని అభ్యర్థులను అనర్హులుగా ప్రకటిస్తారు. 

వేతనాలు
సీనియర్‌ మేనేజర్‌ పోస్టులకు రూ. 63,840–78,230, మేనేజర్‌ స్థాయి అధికారులకు రూ.48,170–69,810, అసిస్టెంట్‌ మేనేజర్లుకు రూ.36,000–63,840 వరకు వేతన శ్రేణి ఉంటుంది. ఇవే కాకుండా హెచ్‌ఆర్‌ఏ, డీఏ, సిటీ కంపన్‌సేటరీ అలవెన్స్, స్పెషల్‌ అలవెన్స్‌ వంటివి లభిస్తాయి.


ప్రొబేషన్‌

స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌(ఎస్‌ఓ) పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు దేశంలోని యూబీఐ బ్రాంచీలలో ఎక్కడైనా పనిచేయడానికి సిద్ధంగా ఉండాలి. అలాగే గతంలో యూబీఐ ఎస్‌ఓ నియామకాలను చూస్తే.. తొలుత రెండేళ్ల పాటు ప్రొబేషనరీగా పనిచేయాల్సి ఉండేది. ఇప్పుడు కూడా ఆదే నిబంధన అమలయ్యే అవకాశం ఉంది. 

కెరీర్‌
స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు యూబీఐలో ఉజ్వలమైన కెరీర్‌ను సొంతం చేసుకోవచ్చు. బ్యాంక్‌ పదోన్నతుల విధానానికి అనుగుణంగా అనుభవం, పనితీరుకు ఆధారంగా ఉన్నతస్థాయి హోదాలకు చేరుకునే అవకాశం ఉంది. 

ముఖ్యమైన సమాచారం
► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
► ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 12.08.2021
► ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 03.09.2021
► పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌ : www.unionbankofindia.co.in 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement