రేపటి నుంచే గురుకుల పరీక్షలు | Gurukula exams are scheduled from August 1 to 23 | Sakshi
Sakshi News home page

రేపటి నుంచే గురుకుల పరీక్షలు

Published Mon, Jul 31 2023 1:55 AM | Last Updated on Mon, Jul 31 2023 8:19 PM

Gurukula exams are scheduled from August 1 to 23 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గురుకులాల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించిన అర్హత పరీక్షలకు సర్వం సిద్ధమైంది. తెలంగాణ గురుకుల విద్యాసంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ) ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆగస్టు ఒకటో తేదీ నుంచి 23వ తేదీ వరకు వరుసగా ఈ పరీక్షలు జరుగుతాయి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం చొప్పున రోజుకు మూడు సెషన్లలో నిర్వహిస్తారు. తొలిసారిగా ఆన్‌లైన్‌లో నిర్వహించే ఈ పరీక్షలకు 6.55లక్షల మంది హాజరుకానున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 17 జిల్లాల్లో 104 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.  

ఆఫ్‌లైన్‌లో నిర్వహించాలని అనుకున్నా... 
వాస్తవానికి ఈ పరీక్షలన్నీ ఓఎంఆర్‌ ఆధారితంగా ఆఫ్‌లైన్‌ పద్ధతిలో నిర్వహించాలని బోర్డు మొదట్లో నిర్ణయించింది. టీఎస్‌పీఎస్సీ పరీక్ష పత్రాల లీకేజీ వ్యవహారం, తదనంతర పరిస్థితుల నేపథ్యంలో ఆన్‌లైన్‌ పరీక్షలకే మొగ్గు చూపింది. లక్షల్లో అభ్యర్థులు ఉండడంతో ఆన్‌లైన్‌ పరీక్షల నిర్వహణ కత్తిమీద సామే అయినా,  వ్యూహాత్మక ప్రణాళికతో వేగంగా పరీక్షల నిర్వహణ షెడ్యూల్‌ ఖరారు చేసినట్టు అధికారులు చెబుతున్నారు.  

సెంటర్ల మార్పు అసాధ్యం  
హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకున్న తర్వాత అభ్యర్థుల్లో కొందరు పరీక్ష కేంద్రాల చిరునామా చూసి గురుకుల బోర్డుకు ఫిర్యాదు చేస్తున్నారు. సుదూర కేంద్రాల్లో పరీక్ష కేంద్రాలు ఖరారు చేయడం, ఒక్కో పరీక్షను ఒక్కోచోట రాయాల్సి రావడం సరికాదంటూ అధికారులు, హెల్ప్‌లైన్‌ కేంద్రాలకు ఫోన్లు, ఈ–మెయిల్‌ ద్వారా వినతులు సమరి్పస్తున్నారు. అయితే పరీక్ష కేంద్రాల మార్పు అసాధ్యమని గురుకుల బోర్డు స్పష్టం చేసింది. అభ్యర్థులు ఇచ్చిన ఆప్షన్లకు అనుగుణంగానే సెంటర్లు ఖరారు చేశామని, పరీక్ష కేంద్రాల లభ్యతకు అనుగుణంగా ఎంపిక చేయడంతో కొందరికి మొదటి ఆప్షన్‌లో ఉన్న కేంద్రం కేటాయించగా, మరికొందరికి ఎనిమిదవ ఆప్షన్‌లో కేంద్రం అలాట్‌ అయ్యిందని, ఇదంతా కంప్యూటర్‌ ఆధారితంగా జరిగినట్టు గురుకుల బోర్డు కన్వీనర్‌ మల్లయ్యబట్టు ‘సాక్షి’కి వివరించారు. 

ఆయా జిల్లాల్లో ఇలా

  • రాష్ట్రంలో అత్యధికంగా మేడ్చల్‌ జిల్లాలో 32 పరీక్ష కేంద్రాలున్నాయి. ఆ తర్వాత రంగారెడ్డి జిల్లాలో 16 కేంద్రాలు, కరీంనగర్‌ జిల్లాలో 10 కేంద్రాలో, హైదరాబాద్‌ జిల్లాలో 5 కేంద్రాలున్నాయి. 
  • ఆదిలాబాద్‌ జిల్లాలో కేవలం ఒకేఒక కేంద్రం ఉంది. ఆ పరీక్ష కేంద్రంలో ఒక సెషన్‌­లో కేవలం 90 మంది అభ్యర్థులు మా­త్రమే పరీక్ష రాసే అవకాశముంది. అయితే ఆ జిల్లా నుంచి దాదాపు 6వేల మంది ద­ర­ఖాస్తు చేసుకోగా, సగం మందికి వారు ఇ­చ్చి­న ఆప్షన్లకు అనుగుణంగా సమీపంలో ఉన్న జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు కేటాయించారు.
  • నిజామాబాద్‌ జిల్లాలో కేవలం రెండు పరీక్ష కేంద్రాలు మాత్రమే ఉన్నాయి. ఒక్కో పరీక్ష కేంద్రంలో ఒక సెషన్‌లో కేవలం 300 మంది చొప్పున 600 మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యే వీలు ఉంది. ఆ జిల్లా నుంచి దాదాపు 10వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. రెండు కేంద్రాల్లో సర్దుబాటు చేస్తూ మిగిలిన అభ్యర్థులకు వారు ఇచ్చిన ఆప్షన్లకు అనుగుణంగా సమీప జిల్లాల్లో సెంటర్లు కేటాయించారు. 
  • నల్లగొండ జిల్లాకు రెండు కేంద్రాలు, సూర్యాపేట జిల్లాలో 5 కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఈ రెండు జిల్లాల నుంచి దాదాపు 15వేల మంది దరఖాస్తు చేశారు. కంప్యూటర్ల లభ్యత ప్రకారం సెంటర్లు కేటాయిస్తూ,  మిగతా అభ్యర్థులకు ప్రాధాన్యత క్రమంలో కేటాయింపులు జరిపారు. 

ఆ మూడు రోజులు వేరే సెంటర్‌లో..
ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ఖమ్మంలోని ప్రియదర్శిని ఇంజనీరింగ్‌ కళాశాల నీట మునిగింది. అయితే ఈ కాలేజీని పరీక్ష కేంద్రంగా గుర్తించి ఏర్పాట్లు చేశారు. కానీ కాలేజీ మెజారిటీ ప్రాంతం నీట మునగడంతో వచ్చే 1, 3, 4వ తేదీల్లో ఈ కేంద్రంలో పరీక్షలు రాయాల్సిన అభ్యర్థులకు నిర్దేశించిన తేదీల్లో ప్రత్యామ్నాయంగా సమీపంలోని ఇతర కేంద్రాల్లో సర్దుబాటు చేశారు. ఈమేరకు అభ్యర్థులకు కొత్తగా హాల్‌టికెట్లు జారీ చేశారు. వాటిని గురుకుల బోర్డు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్టు అధికారులు వెల్లడించారు. 5వ తేదీ నుంచి ఆ కేంద్రంలో మిగతా పరీక్షలు యథావిధిగా జరుగుతాయంటున్నారు.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement