జిల్లాల్లో జాబ్స్
4,077 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా
► జిల్లాల ఆవిర్భావానికి ముందే కేబినెట్ ఆమోదం
► నేడో రేపో ఉత్తర్వులు జారీ చేయనున్న ఆర్థిక శాఖ
► రెవెన్యూ, పోలీసు విభాగాల్లో అత్యధిక పోస్టులు
► కొత్త జిల్లాలతో పలు శాఖల్లో ఉద్యోగుల కొరత
► దానిని అధిగమించడంపై సర్కారు దృష్టి
► త్వరలోనే మరిన్ని ఉద్యోగాల భర్తీకి చర్యలు
సాక్షి, హైదరాబాద్
కొత్త జిల్లాలతో పెరిగిన అవసరాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీపై దృష్టి సారించింది. అన్ని విభాగాల్లో కలిపి దాదాపు 4,077 పోస్టుల భర్తీకి సిద్ధమైంది. అవసరమైనన్ని కొత్త పోస్టులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు జిల్లాల ప్రారంభోత్సవానికి ముందే అధికారులను ఆదేశించడంతో... ప్రస్తుతమున్న పోస్టులు, ఉన్న ఉద్యోగులు, ఖాళీల వివరాలను ఆర్థిక శాఖ క్రోడీకరించింది. ఈ మేరకు కొత్తగా 4,077 పోస్టుల మంజూరుకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఆ ఫైలు ఆర్థిక శాఖ తుది పరిశీలనలో ఉంది. దీనికి సంబంధించి ఒకటి రెండు రోజుల్లోనే ఉత్తర్వులు వెలువడనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
వారం కిందటే..
కొత్త జిల్లాల ఆవిర్భావానికి ముందు ఈ నెల 7వ తేదీన జరిగిన మంత్రివర్గ సమావేశంలోనే కొత్త పోస్టుల మంజూరు ప్రతిపాదనలను పరిశీలించారు. అందులో అత్యవసరంగా భావించిన రెవెన్యూ, పాఠశాల విద్య, రహదారులు భవనాల శాఖ, హోం శాఖల ప్రతిపాదనలకు వెంటనే పచ్చజెండా ఊపారు. ఈ మేరకు ఆ పోస్టుల భర్తీకి చర్యలు ప్రారంభించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు కూడా. ఇక పంచాయతీరాజ్‌తో పాటు మరికొన్ని విభాగాల ప్రతిపాదనలను తాత్కాలికంగా పెండింగ్‌లో పెట్టాలని... క్షేత్రస్థాయిలో అవసరానికి అనుగుణంగా కొత్త పోస్టుల ప్రతిపాదనలను సిద్ధం చేయాలని సీఎం సూచించినట్లు సమాచారం. ఈ మేరకు తొలుత ఆమోదం పొందిన పోస్టుల మంజూ రుకు ఆర్థిక శాఖ ఫైలును సిద్ధం చేసింది.
ఏ విభాగాల్లో ఏయే పోస్టులు..
కొత్తగా మంజూరు చేయనున్న 4,077 పోస్టుల్లో అత్యధికంగా 2,109 పోస్టులు రెవెన్యూ విభాగానికి చెందినవే ఉన్నాయి. ఇందులో 104 తహసీల్దార్, మరో 104 డిప్యూటీ తహసీల్దార్ పోస్టులున్నాయి. అయితే కొత్త మండలాల సంఖ్య 125కు పెరిగిన నేపథ్యంలో ఇందుకు అనుగుణంగా తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్ పోస్టుల సంఖ్య పెరిగే అవకాశముంది. ఇక పాఠశాల విద్యా శాఖ పరిధిలో 85 మండల విద్యాధికారి (ఎంఈవో) పోస్టులకు, ఆర్‌అండ్‌బీలో నాలుగు ఈఈ పోస్టులు, 4 సూపరింటెండెంట్, 4 జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పోస్టులన్నీ టీఎస్‌పీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారు. ఇక రాష్ట్రంలో కొత్తగా సిద్దిపేట, కరీంనగర్, రామగుండం, నిజామాబాద్, ఖమ్మం పోలీస్ కమిషనరేట్‌లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కొత్త పోలీస్ స్టేషన్లూ ఏర్పాటు చేసింది. దీంతో పెరిగిన అవసరాలకు అనుగుణంగా హోం శాఖ ప్రతిపాదించిన 1,800 పోస్టులకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు.
మూడింతలకు చేరిన కొరత
కొత్త జిల్లాల ఏర్పాటుతో రాష్ట్రంలో అధికారుల, ఉద్యోగుల కొరత మూడింతలు పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని జిల్లాల పరిధిలో మొత్తం 53,319 పోస్టులు ఉండగా.. 40,775 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. మిగతా 12,544 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలను అనూహ్యంగా 31కి పెంచింది. ప్రస్తుతానికి అన్ని విభాగాలు ఉన్న ఉద్యోగులనే కొత్త జిల్లాలకు తాత్కాలికంగా సర్దుబాటు చేశాయి. అంటే అవసరంతో పోలిస్తే ప్రతి మూడు పోస్టుల్లో.. రెండు పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. ఈ సందర్భంగా చేపట్టిన శాఖల పునరేకీకరణ, పునర్వ్యవస్థీకరణతో కొన్ని పోస్టుల సంఖ్య తగ్గే అవకాశముంది. కానీ ఇప్పటికే ఉన్న ఖాళీలతో పాటు ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల అమలు దృష్ట్యా అన్ని జిల్లాల్లోనూ ఇంచుమించుగా ఉద్యోగుల అవసరం ఒకే స్థాయిలో ఉంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగుల కొరత ప్రభుత్వానికి సమస్యగా మారనుంది.
శాఖల వారీగా భర్తీ చేసే పోస్టులు
రెవెన్యూ 2,109
పోలీస్ 1,800
పాఠశాల విద్య 85
అగ్నిమాపక విభాగం 54
వ్యవసాయ శాఖ 25
ఆర్ అండ్ బీ 4
మొత్తం 4,077