సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగ నియామకాల ప్రక్రియ వడివడిగా సాగుతోంది. తొలిసారిగా ఆన్‌లైన్ పద్ధతిలో అర్హత పరీక్షలను కేవలం మూడు వారాల వ్యవధిలో నిర్వహించి రికార్డు సృష్టించిన తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ).. చివరి పరీక్ష రోజునే ప్రాథమిక కీలను విడుదల చేసింది. తాజాగా ‘ఫైనల్ కీ’(తుది జవాబు పత్రం) తయారీలో గురుకుల బోర్డు నిమగ్నమైంది.
దాదాపు 56 కేటగిరీలకు సంబంధించి 19 రోజుల పాటు రోజుకు మూడు సెషన్లలో పరీక్షలు నిర్వహించిన టీఆర్‌ఈఐఆర్‌బీ.. ప్రాథమిక కీలను విడుదల చేసి అభ్యంతరాలను కూడా ఆన్‌లైన్ పద్ధతిలో స్వీకరించింది. శనివారంతో అభ్యంతరాల స్వీకరణ గడువు ముగిసింది. ఆన్‌లైన్‌లో వచ్చిన అభ్యంతరాలను పరిశీలించేందుకు బోర్డు ప్రత్యేకంగా నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది.
ఈ కమిటీ అభ్యర్థుల అభ్యంతరాలను తగిన ఆధారాలతో పరిశీలించి నిర్ణయం తీసుకుంటుంది. రెండ్రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు భావిస్తున్నారు. నిపుణుల కమిటీ సూచనలకు అనుగుణంగా ఫైనల్ కీలను తయారుచేసి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచేందుకు టీఆర్‌ఈఐఆర్‌బీ కసరత్తు వేగవంతం చేసింది. ఈనెలాఖరులోగా ఈ ప్రక్రియను పూర్తి చేసేలా గురుకుల బోర్డు కసరత్తు చేస్తోంది.
అవరోహణ క్రమంలో నియామకాలు
గురుకుల విద్యా సంస్థల్లో వివిధ కేటగిరీల్లో 9,231 ఉద్యోగాలకు వెబ్‌నోట్ జారీ చేసిన టీఆర్‌ఈఐఆర్‌బీ.. ఆ తర్వాత జారీ చేసిన పూర్తిస్థాయి నోటిఫికేషన్ల ప్రకారం 9,210 పోస్టులకు మాత్రమే ప్రకటనలను పరిమితం చేసింది. ఇందులో భాగంగా ఈనెల 1వ తేదీ నుంచి 23వ తేదీ వరకు అర్హత పరీక్షలు జరిగాయి. సగటున 75 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు.
ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్ కేటగిరీలు మినహా మిగతా అన్ని కేటగిరీల్లోని అర్హత పరీక్షల ప్రాథమిక కీలను వెబ్‌సైట్‌లో అందుబాటులో పెట్టారు. కోర్టు కేసుల నేపథ్యంలో ఈ మూడు కేటగిరీల కీలను విడుదల చేయలేదు. ఈ నెలాఖరులో తుది కీలను ఖరారు చేసి, అదేరోజున అభ్యర్థులు సాధించిన మార్కులను కూడా వెబ్‌సైట్‌లో పెడతారు. గురుకుల సొసైటీల్లో ఉద్యోగాల భర్తీకి బోర్డు అవరోహణ విధానాన్ని ఎంచుకుంది.
ముందుగా పైస్థాయి పోస్టులను భర్తీ చేస్తూ క్రమంగా కింది స్థాయిలో పోస్టుల నియామకాలను ముగిస్తుంది. ఈ క్రమంలో తొలుత డిగ్రీ లెక్చరర్, జూనియర్ లెక్చరర్, పీజీటీ, టీజీటీ పోస్టులను భర్తీ చేస్తారు. ప్రస్తుతం తుది కీలను విడుదల చేసి మార్కులు ప్రకటించిన తర్వాత అర్హతల ఆధారంగా డీఎల్, జేఎల్ పోస్టులకు డెమో పరీక్షలు సైతం నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి అతి త్వరలో తేదీలను ఖరారు చేసే దిశగా గురుకుల బోర్డు చర్యలు వేగవంతం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment