9 వేల ఉద్యోగాలు!  | Recruitment Board of Telangana Gurukula Educational Institutions filled 9000 posts in 9 months | Sakshi
Sakshi News home page

9 వేల ఉద్యోగాలు! 

Published Mon, Mar 4 2024 2:33 AM | Last Updated on Mon, Mar 4 2024 3:24 PM

Recruitment Board of Telangana Gurukula Educational Institutions filled 9000 posts in 9 months - Sakshi

9 నెలల్లో గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు రికార్డు 

న్యాయ వివాదాలకు తావులేకుండా విజయవంతంగా ఉద్యోగాల భర్తీ 

ఇప్పటికే 2 వేల మందికి పైగా అభ్యర్థులకు నియామక పత్రాలు 

మరో 6,500 మందికి నేడు సీఎం చేతుల మీదుగా పంపిణీకి ఏర్పాట్లు 

సాక్షి, హైదరాబాద్‌:  రాష్ట్రంలోని సంక్షేమ గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగాల భర్తీ రికార్డు స్థాయి వేగంతో జరిగింది. కేవలం తొమ్మిది నెలల వ్యవధిలోనే దాదాపు తొమ్మిది వేల ఉద్యోగాలను తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ) భర్తీ చేసింది. న్యాయ వివాదాలకు తావు లేకుండా ప్రశాంతంగా నిర్వహించిన రికార్డును సైతం సొంతం చేసుకుంది. గురుకుల విద్యా సంస్థల్లో కొలువుల భర్తీ ప్రక్రియ మొదట్లో తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్విస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) నిర్వహించింది.

కానీ భర్తీ ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతోందని భావించిన ప్రభుత్వం గురుకుల నియామకాల కోసం ప్రత్యేకంగా బోర్డును ఏర్పాటు చేసింది. గురుకుల విద్యా సంస్థల సొసైటీ కార్యదర్శుల సమన్వయంతో ఏర్పాటు చేసిన ఈ బోర్డు దూకుడుగా భర్తీ ప్రక్రియ చేపట్టింది. గతంలో దాదా­పు 4 వేల ఉద్యోగ నియామకాలను ఏడాది కాలంలో పూర్తి చేయగా.. ఇప్పుడు ఏకంగా 9వేల ఉద్యోగాల భర్తీని కేవలం 9 నెలల్లోనే పూర్తి చేసింది. గత నెలలో 2 వేలకు పైగా ఫిజికల్‌ డైరెక్టర్‌ (పీడీ), లైబ్రేరియన్, పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్‌ (పీజీటీ) ఉద్యోగాలకు అర్హత సాధించిన వారికి నియామక పత్రాలు అందజేయగా.. ఇప్పుడు మరో 6,500 మందికి అందించనుంది. 

గత ఏప్రిల్‌లో ప్రకటనలు జారీ చేసి.. 
గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగ ఖాళీల భర్తీకి టీ­ఆర్‌­ఈఐఆర్‌బీ గతేడాది ఏప్రిల్‌ 5వ తేదీన నో­టి­ఫికేషన్‌ జారీ చేసింది. 9 వేల ఉద్యోగాలకు ఏక కా­లంలో 9 నోటిఫికేషన్లు విడుదల చేసి రికార్డు సృష్టించింది. అదే నెల 17వ తేదీ నుంచి దాదాపు నెల రో­జుల పాటు దరఖాస్తుల స్వీకరించి గతేడాది ఆగస్టు­లో పరీక్షలను నిర్వహించింది. అవకతవకలకు ఆ­స్కా­రం లేకుండా కంప్యూటర్‌ బేస్డ్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌ (సీబీఆర్‌టీ) విధానం అవలంభించింది. 

సెప్టెంబర్‌ నెలలో అర్హత పరీక్షలకు సంబంధించి ప్రాథమిక కీలను విడుదల చేసింది. దీనితో పాటు క్షేత్రస్థాయి నుంచి అభ్యంతరాలు స్వీకరించడం, తిరిగి తుది కీలను ఖరారు చేయడం దాదాపు నెలరోజుల వ్యవధిలో పూర్తి చేసింది. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ కావడం, మహిళలకు హారిజాంటల్‌ రిజర్వేషన్ల అంశం కోర్టు పరిధిలో ఉండడంతో కొంత జాప్యం జరిగింది. తాజాగా రాష్ట్రంలో ఏర్పాటైన ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ల అమలుకు సంబంధించి జీవోలు విడుదల చేయడంతో నియామకాల ప్రక్రియకు మార్గం సుగమమైంది. అర్హత పరీక్షల్లో అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా వివిధ కేటగిరీల్లో 1:2 నిష్పత్తిలో అభ్యర్థుల జాబితాలు ప్రకటించడం, అనంతరం డెమో పరీక్షలు, ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాలను వెబ్‌సైట్‌లో ప్రచురించడం లాంటివన్నీ కేవలం నెల రోజుల్లోనే పూర్తి చేసింది. ఫిబ్రవరి నెలాఖరు నాటికి ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తి చేసింది. 

నేటి మధ్యాహ్నం నియామక పత్రాలు 
ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌ (టీజీటీ), జూనియర్‌ లెక్చరర్‌ (జేఎల్‌), డిగ్రీ లెక్చరర్‌ (డీఎల్‌) ఉద్యోగాలకు సంబంధించి దాదాపు 6,500 మంది ఎంపికయ్యారు. వీరికి సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు నగరంలోని లాల్‌ బహద్దూర్‌ స్టేడియంలో నియామక పత్రాలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డితో పాటు ఇతర మంత్రులు, గురుకుల సొసైటీ కార్యదర్శులు, సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాలకు సంబంధించి ఎన్నికల కోడ్‌ అమలులో ఉండడంతో ఆయా జిల్లాలకు చెందిన అభ్యర్థులకు సోమవారం నియామకపత్రాలు ఇస్తారా? లేదా? అనే విషయమై స్పష్టత లేకుండా పోయింది. అయితే ఆయా జిల్లాల అభ్యర్థులు సైతం ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement