సాక్షి, అమరావతి: రాష్ట్ర లీడ్ బ్యాంక్‌గా రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నితేష్ రంజన్ చెప్పారు. రిటైల్ రుణాల మంజూరులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కీలకపాత్ర పోషిస్తోందని తెలిపారు. వడ్డీరేట్లు గరిష్ట స్థాయిలో ఉన్నా రిటైల్ రుణాలకు డిమాండ్ బాగుందని చెప్పారు. విజయవాడలో జరుగుతున్న రెండు రోజుల మెగా రిటైల్ ఎక్స్‌పోను ఆయన శుక్రవారం ప్రారంభించి పలువురికి రుణం మంజూరు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా నితేష్ రంజన్ ‘సాక్షి’ ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఇంటర్వ్యూలో ముఖ్యాంశాలు..
ప్రశ్న: స్టేట్ లెవెల్ బ్యాంకింగ్ కమిటీలో లీడ్ బ్యాంకర్‌గా ఉన్న యూనియన్ బ్యాంక్ ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధిలో ఏ విధంగా భాగస్వామ్యం అవుతోంది?
జవాబు: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్త వ్యాపార విస్తరణలో ఆంధ్రప్రదేశ్ కీలకపాత్ర పోషిస్తోంది. లీడ్ బ్యాంకర్‌గా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి పథకాలను నిర్దేశించిన వారికి సక్రమంగా అందించడానికి ప్రాధాన్యత ఇస్తున్నాము. రాష్ట్రంలో రిటైల్ బ్యాంకింగ్ కార్యకలాపాలు వేగంగా విస్తరిస్తున్నాయి. ఈ పండుగల సీజన్ కోసం సత్వరం రుణాలను మంజూరు చేసేలా విజయవాడలో మెగా రిటైల్ లోన్ ఎక్స్‌పో నిర్వహిస్తున్నాం. 25 మంది బిల్డర్లు, 12 మంది వాహన డీలర్లు, 7 ఎడ్యుకేషన్‌కన్సల్టెన్సీలను ఒకే వేదిక మీదకు తీసుకొచ్చాం. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా టైలర్ మేడ్ రుణ పథకాలను ఆఫర్ చేసి, అక్కడిక్కడే తక్షణం రుణాలు మంజూరు చేసేలా వ్యవస్థను ఏర్పాటు చేశాం.
ప్రశ్న: ప్రస్తుతం వడ్డీ రేట్లు గరిష్ట స్థాయిలో ఉన్నాయి. రుణ మార్కెట్‌పై వడ్డీ రేట్ల పెరుగుదల ప్రతికూల ప్రభావం చూపుతుందా?
జవాబు: వడ్డీ రేట్లు గరిష్ట స్థాయిలో ఉన్న మాట వాస్తవమే. కానీ దీనికి భిన్నంగా దేశవ్యాప్తంగా రిటైల్ రుణాలకు భారీగా డిమాండ్ ఏర్పడుతోంది. ఆటో, ఎడ్యుకేషన్, హోమ్ లోన్స్ వంటి రుణాలకు డిమాండ్ బాగుంది. గతేడాది యూనియన్ బ్యాంక్ రిటైల్ రుణాలు 17.19 శాతం పెరిగి రూ.1,60,595 కోట్లకు చేరాయి. ఈ ఏడాది కూడా రిటైల్ రుణాల్లో 10 నుంచి 12 శాతం వృద్ధిని అంచనా వేస్తున్నాం.
ప్రశ్న: వడ్డీ రేట్లు ఎప్పటి నుంచి తగ్గుతాయి?
జవాబు: ప్రస్తుతం ద్రవ్యోల్బణం అధిక స్థాయిలో ఉండటంతో వడ్డీ రేట్లు గరిష్టస్థాయిలో ఉన్నాయి. మరో రెండు మూడు త్రైమాసికాల వరకు వడ్డీ రేట్లు గరిష్టస్థాయిలో కొనసాగుతాయని అంచనా వేస్తున్నాం. ఆ తర్వాత నుంచి క్రమేపీ తగ్గే అవకాశం ఉంది.
ప్రశ్న: ఇతర బ్యాంకుల పోటీని తట్టుకోవడానికి యూనియన్ బ్యాంక్ ఏమైనా ప్రత్యేక ఆఫర్లను ప్రకటించిందా?
జవాబు: ప్రస్తుతం అన్ని బ్యాంకులకంటే తక్కువ రేటుకే రుణాలు అందిస్తున్నాం. అంతేకాకుండా పండుగుల సీజన్ దృష్టిలో పెట్టుకొనిఅన్ని రిటైల్ రుణాలపై ప్రాసెసింగ్ ఫీజును రద్దు చేశాం. విదేశాల్లో విద్య కోసం రుణాలు తీసుకునే వారికి రూ.40 లక్షల వరకు ఎటువంటి తనఖా అవసరం లేకుండా రుణాలిస్తున్నాం. ఆన్‌లైన్, యాప్‌ల ద్వారా క్షణాల్లో రుణాలు మంజూరు చేస్తున్నాం.
ప్రశ్న: దేశవ్యాప్తంగా నెలకొన్న వర్షాభావ పరిస్థితులు రుణాల మార్కెట్‌పై ఎటువంటి ప్రభావం చూపుతాయి?
జవాబు: ప్రస్తుతానికి దేశవ్యాప్తంగా అటువంటి వాతావరణం కనిపించడం లేదు. రుణాల మార్కెట్‌పై ఎటువంటి ప్రభావం లేదు. ఇప్పటికే పండుగుల సీజన్ మొదలైంది. ఇది నాలుగో త్రైమాసికం వరకు కొనసాగుతుంది. అప్పటివరకు ఇదే విధమైన డిమాండ్ కొనసాగుతుందని అంచనా వేస్తున్నాం.
రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు ప్రాధాన్యత
Published Sat, Sep 9 2023 5:17 AM | Last Updated on Sat, Sep 9 2023 5:17 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment