సాక్షి, అమరావతి: విద్యారుణం కోసం దరఖాస్తు చేసే సమయంలో ఓ విద్యార్థి సమర్పించిన ఆస్తి ఒరిజినల్ డాక్యుమెంట్లను అతడికి తిరిగి ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేసిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపై హైకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. ఇది ఆ విద్యార్థిని వేధించడమేనన్న హైకోర్టు.. ఇందుకు బ్యాంకు మూల్యం చెల్లించుకోవాల్సిందేనని స్పష్టం చేసింది.
ఆ విద్యార్థికి ఖర్చుల కింద రూ.25 వేలు చెల్లించాలని బ్యాంకును ఆదేశించింది. ఆ మొత్తాన్ని డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో 15 రోజుల్లో హైకోర్టు రిజిస్ట్రార్ (జ్యుడిషియల్) వద్ద డిపాజిట్ చేయాలని ఆదేశించింది. లేనిపక్షంలో తమ ఆదేశాల అమలుకు చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రార్‌కు స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రవినాథ్ తిల్హరీ ఇటీవల తీర్పు చెప్పారు.
ఇదీ పిటిషన్..
మచిలీపట్నానికి చెందిన విద్యార్థి నిశ్చల్.. విద్యారుణం కోసం ఆంధ్రాబ్యాంకుకు (తరువాత ఇది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనమైంది) దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తుతో అవసరమైన డాక్యుమెంట్లను, అతడి తల్లి ఇచ్చిన ఆస్తి ఒరిజినల్ గిఫ్ట్ డీడ్‌ను బ్యాంకు అధికారులకు సమర్పించారు.
అయితే కొల్లేటరల్ సెక్యూరిటీకి సంబంధించిన ఒరిజినల్ డీడ్‌ను సమర్పించలేదంటూ నిశ్చల్‌కు రుణం మంజూరు చేసేందుకు బ్యాంకు అధికారులు నిరాకరించారు. దీంతో నిశ్చల్ తాను సమర్పించిన ఒరిజినల్ గిఫ్ట్ డీడ్‌ను తిరిగి ఇచ్చేయాలని బ్యాంకు అధికారులను కోరారు. దీనికి బ్యాంకు అధికారులు సానుకూలంగా స్పందించలేదు. తమకు ఒరిజినల్ డాక్యుమెంట్ ఇవ్వలేదని చెప్పారు. దీంతో నిశ్చల్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ తిల్హరీ విచారించారు.
ఒరిజినల్ డీడ్‌ను ఇచ్చేస్తాం..
నిశ్చల్ న్యాయవాది శిఖరం కృష్ణమోహన్ వాదనలు వినిపిస్తూ.. దరఖాస్తుతో పాటు ఒరిజినల్ గిఫ్ట్ డీడ్‌ను సమర్పించినప్పటికీ బ్యాంకు అధికారులు ఇవ్వలేదంటూ చెప్పడం దారుణమన్నారు. దరఖాస్తుతో పాటు ఒరిజినల్ డీడ్‌ను సమర్పించామంటూ అందుకు సంబంధించిన ఆధారాలను ఆయన కోర్టు ముందుంచారు. ఈ సమయంలో బ్యాంకు న్యాయవాది వి.ద్యుమని పూర్తివివరాలను తెలుసుకుని కోర్టు ముందుంచేందుకు గడువు కోరారు.
ఇందుకు అంగీకరించిన న్యాయమూర్తి విచారణను వాయిదా వేశారు. తిరిగి ఇటీవల ఈ వ్యాజ్యం విచారణకు రాగా.. ద్యుమని స్పందిస్తూ దరఖాస్తుతో పాటు పిటిషనర్ ఒరిజినల్ డీడ్‌ను సమర్పించారని తెలిపారు. వాటిని తిరిగి ఇచ్చేందుకు బ్యాంకు సిద్ధంగా ఉందన్నారు. ఆ డీడ్ ద్వారా తనఖాపెట్టిన ఆస్తిని 15 రోజుల్లో విడిపిస్తామని చెప్పారు.
ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి బ్యాంకు తీరును తప్పుపట్టారు. ఇది పిటిషనర్‌ను వేధించడమేనన్నారు. అందుకే పిటిషనర్ మరో గత్యంతరం లేక న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వచ్చిందని తెలిపారు. ఇందుకుగానూ రూ.25 వేలను ఖర్చుల కింద పిటిషనర్‌కు చెల్లించాలని బ్యాంకును ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment