Education Loan
-
చదువుల 'రుణ' రంగం!
సాక్షి, అమరావతి: దేశంలో ఉన్నత చదువుల కోసం విద్యా రుణాలు పెరుగుతున్నట్లు రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) నివేదిక వెల్లడించింది. 2023 నాటికి విద్యా రుణాలు రూ.90 వేల కోట్లకు చేరుకున్నాయి. 2023–24లో దేశీయ బ్యాంకులు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు రూ.36,448 కోట్ల మేర విద్యా రుణాలను పంపిణీ చేశాయి. 5,50,993 మంది విద్యార్థులు విద్యా రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. » గత దశాబ్ద కాలంగా విదేశీ విద్య కోసం రుణాలపై ఆధారపడుతున్న విద్యార్థుల సంఖ్య స్థిరంగా పెరుగుతోంది. 2012–13లో వీరి సంఖ్య 22,200 కాగా 2020లో ఏకంగా 69,898కి చేరుకుంది. అయితే కేంద్ర విద్యాశాఖ 2022 నివేదిక ప్రకారం ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థుల్లో నాలుగు శాతం మాత్రమే రుణాల ప్రయోజనం పొందుతున్నారు. తెలంగాణ, కర్నాటక, పంజాబ్, మహారాష్ట్రలో విద్యా రుణాలకు అధిక డిమాండ్ నెలకొంది. »రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షల లోపు రుణాలకు ఎక్కువ దరఖాస్తులు వస్తున్నాయి. 2022లో దాదాపు 7.70 లక్షల మంది భారతీయ విద్యార్థులు అంతర్జాతీయ విద్యను ఎంచుకున్నారు. వరంలా ‘పీఎం విద్యాలక్ష్మీ’నాణ్యమైన ఉన్నత విద్యా సంస్థలో ప్రవేశం పొందిన విద్యార్థులకు ప్రధానమంత్రి విద్యాలక్ష్మీ పథకం ద్వారా పూర్తి స్థాయిలో ట్యూషన్ ఫీజులు, ఇతర ఖర్చులను చెల్లించేందుకు కేంద్ర ప్రభుత్వం బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి పూచీకత్తు రహిత, హామీ రహిత రుణాన్ని అందిస్తోంది. నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్) ర్యాంకింగ్ ప్రకారం 860 విద్యా సంస్థల్లోని సుమారు 22 లక్షల మంది విద్యార్థులకు దీని ద్వారా ప్రయోజనం చేకూరనుంది. » పీఎం విద్యాలక్ష్మీ పథకం కింద ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ కలిగిన ఉన్నత విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులు రూ.7.5 లక్షల వరకు రుణం పొందవచ్చు. రూ.8 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్న కుటుంబాలు ఇప్పటి వరకు ప్రభుత్వ స్కాలర్‌షిలు, వడ్డీ రాయితీలు పొందకపోతే వారికి రూ.10 లక్షల వరకు రుణం అందుతుంది. మారటోరియం కాలంలో 3 శాతం వడ్డీ రాయితీ లభిస్తుంది. ప్రభుత్వ విద్యా సంస్థల్లో సాంకేతిక, వృత్తిపరమైన కోర్సులను అభ్యసించే విద్యార్థులకు ప్రాధాన్యత ఇస్తారు. పీఎం విద్యాలక్ష్మీ కోసం ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లో విద్యా రుణం మంజూరవుతుంది. -
విదేశీ విద్యా రుణాలు.. కీలకమైన 7 అంశాలు..
ఇటీవలి కాలంలో విదేశీ విద్యను కోరుకునే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దీంతో విద్యా రుణాలకు కూడా డిమాండ్ నెలకొంది. వ్యక్తిగత అవసరాలకు అనుగుణమైన విద్యా రుణాలను అందించే నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు ఈ ప్రక్రియలో కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో విద్యా రుణాల కోసం దరఖాస్తు చేసుకోవడానికి ముందు పరిగణనలోకి తీసుకోవాల్సిన 7 కీలకాంశాలపై అవగాహన కల్పించేందుకే ఈ కథనం. ⇒ మొత్తం ఖర్చులపై అవగాహన ఉండాలి: విద్యార్థులు విదేశీ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకున్నప్పుడు ట్యూషన్‌తో పాటు వసతి, జీవన వ్యయాలు, ప్రయాణ ఖర్చులు, బీమా, ఇతరత్రా అనుకోకుండా తలెత్తే ఖర్చులన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాలి. తద్వారా ఎంత రుణం కోసం దరఖాస్తు చేసుకోవాలనేది తెలుస్తుంది. అవసరానికి మించి తీసుకోవడం శ్రేయస్కరం కాదు. ఈ లెక్కలు వేసుకోవడానికి ఎడ్యుకేషన్ లోన్ ఈఎంఐ కాల్క్యులేటర్, కాలేజ్ కోర్స్ ఎక్స్పెన్సెస్ కాల్క్యులేటర్ వంటి టూల్స్ ఉపయోగపడతాయి. ⇒ సమగ్ర పరిశోధన అవసరం: ఈ దశ పూర్తయ్యాక, అందుబాటులో ఉన్న వివిధ రుణాల ఆప్షన్లు, అర్హతలు, వడ్డీ రేట్లు, మంజూరు విధానాలు, తిరిగి చెల్లింపులకు సంబంధించిన నిబంధనలు, సహ–రుణగ్రహీత అవసరాలు, హామీలు, ప్రాసెసింగ్ ఫీజులపై పరిశోధన⇒ ఖర్చులన్నింటికీ సరిపోయేలా ఉండాలి: కొత్త తరం ఎన్బీఎఫ్సీలు సమగ్ర విద్యా రుణాలను అందిస్తున్నాయి. అంటే ట్యూషన్ ఫీజులు, ప్రయాణ ఖర్చులు, వసతి ఖర్చులు, లెరి్నంగ్ డివైజెస్ కొనుగోలు, జీవన వ్యయాలు మొదలైన అన్నింటికీ ఉపయోగపడే విధంగా లోన్స్ ఇస్తున్నాయి. దీనివల్ల ఆర్థిక విషయాల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేకుండా చదువు, కెరియర్‌పై దృష్టి పెట్టేందుకు వీలవుతుంది. ⇒ డాక్యుమెంటేషన్ ప్రధానం: విద్యార్థులు అవసరమైన అన్ని డాక్యుమెంట్ల చెక్‌లిస్ట్ తయారు చేసుకోవాలి. వాటన్నింటినీ సరిగ్గా సమరి్పస్తే సకాలంలో రుణాన్ని మంజూరు చేసే అవకాశాలు మెరుగుపడతాయి. ⇒ వేల్యుయేషన్‌పై అవగాహన ఉండాలి: రుణ ప్రొఫైల్స్‌ను మదింపు చేసేందుకు విద్యారి్థ–కేంద్రీకృత విధానాన్ని కొత్త తరం ఎన్బీఎఫ్సీలు అమలు చేస్తున్నాయి. సహ–రుణగ్రహీత ఆర్థిక నేపథ్యంపైనే ఆధారపడకుండా విద్యార్థి అకడమిక్ పనితీరు, ప్రవేశ పరీక్ష స్కోర్లు, ఎంచుకున్న కోర్సు .. యూనివర్సిటీ, భవిష్యత్తు ఉపాధి అవకాశాలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటాయి. ⇒ వీలైనంత ముందుగా దరఖాస్తు చేసుకోవాలి: ముందస్తు అప్రూవల్ ప్రక్రియను పూర్తి చేయడానికి, పత్రాలు తనిఖీ చేయడానికి, రుణాన్ని ఖరారు చేయడానికి ఆర్థిక సంస్థకు కొంత సమయం అవసరవుతుంది. సంస్థను బట్టి అప్రూవల్ ప్రక్రియ వివిధ రకాలుగా ఉంటుంది కాబట్టి వీలైనంత ముందుగా దరఖాస్తు చేసుకుంటే నిరీ్ణత సమయానికి రుణం మంజూరయ్యేలా చూసుకోవడానికి వీలవుతుంది. ⇒ స్మార్ట్ రీపేమెంట్ వ్యూహం ప్లాన్ చేసుకోవాలి: లోన్ తీసుకున్న తర్వాత నుంచి వడ్డీని కొంత కొంతగా కట్టుకుంటూ వెళ్లడం మంచిది. ఎందుకంటే గ్రేస్ పీరియడ్ ఉన్నప్పటికీ ఆ వ్యవధిలో వడ్డీ పడకుండా ఉండదు. ముందు నుంచి చెల్లించడం ప్రారంభిస్తే విద్యార్థులు ఆర్థికంగా మెరుగైన అలవాట్లను పెంపొందించుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుంది. -
భారమవుతున్న విద్యారుణాలు!
బ్యాంకులు అందిస్తున్న విద్యారుణాలు భారమవుతున్న తరుణంలో బడ్జెట్ 2024-25 ప్రసంగంలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ అనుకూల నిర్ణయాలు తీసుకుంటుందని చాలామంది భావించారు. కానీ ప్రస్తుతం ఉన్న రూ.4 లక్షల ఉన్నత విద్యారుణాన్ని రూ.10 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. గుడ్డి కంటే మెల్ల మేలు అన్నట్లు వడ్డీలపై నిర్ణయాన్ని వెల్లడించకుండా రుణ పరిమాణాన్ని పెంచడం ఒకింత మేలు చేసే అంశమే అయినా, భవిష్యత్తులో క్రీయాశీలకంగా మరిన్ని నిర్ణయాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.2047లోపు ‘వికసిత భారత్’ లక్ష్యంగా విత్త మంత్రి నిర్మలా సీతారామన్ మానవ వనరుల అభివృద్ధి, ఉద్యోగకల్పన, రెసెర్చ్ అండ్ డెవలప్మెంట్ బలోపేతం వంటి అంశాలపై దృష్టి సారించారు. ఉన్నత విద్యను అభ్యసించడానికి వీలుగా ప్రస్తుతం ఉన్న రుణ సదుపాయాన్ని రూ.4 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచారు. అయితే బ్యాంకులు ఎలాంటి పూచీకత్తు లేకుండా ఈ రుణాలను మంజూరు చేయడం లేదు. రుణాల జారీ అంశాన్ని అకడమిక్ మార్కులకు లింక్ పెడుతున్నారు. దాంతో రుణ గ్రహీతలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. గతంలో బ్యాంకులు విద్యా రుణాలను దాదాపు 4 శాతం వడ్డీకే అందించేవి. ప్రస్తుతం అది సుమారు 12.5 శాతానికి చేరింది.ఇదీ చదవండి: 379 అక్రమ రుణ వెబ్సైట్లు, 91 ఫిషింగ్ సైట్ల తొలగింపుప్రభుత్వం స్పందించి 2047 కల్లా ‘వికసిత భారత్’ లక్ష్యాన్ని చేరుకునేలా విద్యా రుణాలను మరింత సులభతరం చేసి, తక్కువ వడ్డీలకే వాటిని అందిచేలా చర్యలు తీసుకోవాలని నిపుణులు కోరుతున్నారు. దాంతోపాటు ఉన్నత విద్య చదువుతున్న సమయంలోనే కళాశాలలు, కంపెనీలు పరస్పరం ఒప్పందం కుదుర్చుకునేలా మరిన్ని ఏర్పాట్లు చేయాలని చెబుతున్నారు. దానివల్ల విద్యార్థి దశలోనే రియల్‌టైమ్ అనుభవం రావడంతో చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగంలో స్థిరపడే అవకాశం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. -
చదువులు ‘ఉన్నతం’
న్యూఢిల్లీ: దేశీయ విద్యాసంస్థల్లో ఉన్నత చదువులు అభ్యసించే విద్యార్థులకు రూ.10 లక్షల వరకు విద్యా రుణాలు అందించనున్నట్లు బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. విద్యా రుణాలకు సంబంధించి ఏటా లక్ష మంది విద్యార్థులకు రుణాలపై మూడు శాతం సబ్సిడీతో ఈ–వోచర్లు నేరుగా అందించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.విద్యార్థులు, విద్యారంగానికి ఇది మేలు చేస్తుందని విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ పేర్కొన్నారు. యువత ఆకాంక్షలను నెరవేర్చడం, నాణ్యమైన విద్య, మెరుగైన నైపుణ్యాలు అందుబాటులోకి రావడంతోపాటు వచ్చే ఐదేళ్లలో 4.1 కోట్ల ఉద్యోగాలను కొత్తగా సృష్టించవచ్చన్నారు.మేనేజ్మెంట్ విద్య బోధించే ప్రతిష్టాత్మక బిజినెస్ స్కూళ్లు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)లకు వరుసగా రెండో ఏడాదీ కేంద్రం కేటాయింపులు కుదించింది. గత ఆర్థిక ఏడాది సవరించిన అంచనాలతో పోలిస్తే పాఠశాల విద్యకు కేటాయింపులు రూ.535 కోట్లకుపైగా పెంచగా ఉన్నత విద్య గ్రాంట్‌ను రూ.9,600 కోట్లకుపైగా కుదించింది. మొత్తమ్మీద విద్యారంగానికి కేటాయింపులు రూ.9,000 కోట్లకుపైగా తగ్గాయి. విద్యాశాఖకు 2024–25 బడ్జెట్లో రూ.1.25 లక్షల కోట్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఆవిష్కరణలు, సృజనాత్మకతకు ప్రోత్సాహం విద్యాసంస్థలలో ఆవిష్కరణలు, సృజనాత్మకతను ప్రోత్సహించేందుకు బడ్జెట్లో మరో రూ.161 కోట్లు అదనంగా కేటాయించారు. ప్రపంచ స్థాయి విద్యాసంస్థలకు కేటాయింపులు రూ.1,300 కోట్ల (సవరించిన అంచనాలు) నుంచి రూ.1,800 కోట్లకు పెరిగాయి.యూజీసీకి నిధుల కేటాయింపులు గతేడాది సవరించిన అంచనాలు రూ.6,409 కోట్లతో పోలిస్తే ఈసారి 60.99 శాతం తగ్గించి రూ.2,500 కోట్లకు కుదించారు. ఐఐఎంలకు బడ్జెట్లో కోతలు తప్పలేదు. గతేడాది బడ్జెట్లో ఐఐఎంలకు కేటాయింపులు సవరించిన అంచనాలు రూ.608.23 కోట్లతో పోలిస్తే రూ.300 కోట్లకు కుదించగా ఈసారి మరింత కోత పడింది. ఈ ఏడాది సవరించిన అంచనాలు రూ.331 కోట్లతో పోలిస్తే కేటాయింపులు రూ.212 కోట్లకు కుదించారు. సెంట్రల్ వర్సిటీలకు మరికొంత.. దేశంలో అత్యున్నత సాంకేతిక విద్యకు నిలయాలైన ఐఐటీలకు కూడా బడ్జెట్ కేటాయింపులు గతేడాది సవరించిన అంచనాలతో పోలిస్తే స్వల్పంగా తగ్గాయి. సవరించిన అంచనాలు రూ.10,384.21 కోట్లతో పోలిస్తే కేటాయింపులు రూ.10,324.50 కోట్లకు తగ్గాయి. కేంద్రీయ విశ్వవిద్యాలయాల (సెంట్రల్ వర్సీటీలు) కేటాయింపులు మాత్రం 28 శాతం పెరిగాయి.సెంట్రల్ వర్సిటీలకు సవరించిన అంచనాలు రూ.12,000.08 కోట్లతో పోలిస్తే కేటాయింపులు రూ.15,472 కోట్లకు పెరిగాయి. పాఠశాల విద్యకు సంబంధించి కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ, ఎన్సీఈఆరీ్ట, పీఎంశ్రీ స్కూళ్లు, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో నిర్వహించే గ్రాంట్ ఇన్ ఎయిడ్ స్కూళ్లకు బడ్జెట్లో కేటాయింపులు పెరిగాయి. -
లోన్ పట్టు..టూర్‌కు జైకొట్టు
సాక్షి, హైదరాబాద్: గతంలో మెడికల్ ఎమర్జెన్సీ, పిల్లల ఉన్నత విద్య వంటి వాటికి పర్సనల్ లోన్లు తీసుకునేందుకు ఎక్కువ మంది మొగ్గు చూపేవారు. అందుకు భిన్నంగా ఇప్పుడు తమ ఇళ్లను ఆధునీకరించుకోవడం, ఇతర రెనోవేషన్ పనుల కోసమే కాకుండా హాలిడే టూర్‌కు వెళ్లేందుకు సైతం ఈ రుణాలు తీసుకుంటున్నట్టు వెల్లడైంది. మెట్రో నగరాలు, ప్రధాన పట్టణాలకు మించి నాన్ మెట్రో నగరాల నుంచి ఇలాంటి డిమాండ్ పెరుగుతోంది. వ్యక్తిగత రుణాలు పొందే ప్రతీ ఐదుగురిలో ఒకరు హాలిడే టూర్ కోసమే తీసుకుంటున్నట్టు ఆన్లైన్ప్లాట్ఫామ్ ‘పైసా బజార్’ తాజా సర్వేలో వెల్లడైంది. 2023 జనవరి–జూన్ మధ్య పైసాబజార్ నుంచి హాలిడే లోన్స్ తీసుకున్న వారిలో.. దేశంలోని 97 నాన్ మెట్రో నగరాలకు చెందిన వారు 68 శాతం మంది ఉండటం విశేషం. జోథ్‌పూర్, పట్నా, కాన్పూర్, ఆగ్రా, సూరత్, పాటియాలా తదితర మెట్రోయేతర నగరాల వారే ఈ రుణాలపై ఆసక్తి చూపుతున్నారు. ఇదే మెట్రో నగరాల విషయానికొస్తే... ముంబైలో 25 శాతం, బెంగళూరులో 22 శాతం, ఢిల్లీలో 20 శాతం మంది జాలీ ట్రిప్పుల కోసం రుణాలు తీసుకుంటున్నారు. అభిరుచులు మారుతున్నాయి. సెలవులను ఎంజాయ్ చేసేందుకో లేదా కొత్త కొత్త ప్రాంతాలను చూసేందుకో వెళ్లాలనుకునే వారు పెరుగుతున్నారు. దేశంలోగానీ లేదా విదేశాలకు గానీ వెకేషన్లకు వెళ్లే వారి సంఖ్య పెరుగుతోంది. గతంలో వీటి కోసం చాలామంది డబ్బు పొదుపు చేసుకుని దాంతో టూర్లకు వెళ్లేవారు. ఇప్పుడు పర్సనల్ లోన్ తీసుకుంటుండటం ట్రెండ్‌గా మారింది. నివేదికలోని ముఖ్యాంశాలివీ.. గత ఆరు నెలల్లో హాలిడే టూర్ కోసం పర్సనల్ లోన్లు తీసుకున్న వారిలో 73 శాతం దేశంలోని పర్యాటక ప్రదేశాలకు, 27 శాతం విదేశాల్లోని పర్యాటక ప్రాంతాలకు వెళ్లారు. విదేశాల్లో హాలిడే టూర్‌కు వెళ్లాలనుకుంటే ఎక్కువగా దుబాయ్ (28 శాతం)ని ఎంచుకోగా ఆ తర్వాత థాయ్‌లాండ్ (15 శాతం),యూరప్ (10 శాతం)ను ఎంచుకుంటున్నారు. దేశంలో అయితే గోవా (23 శాతం), హిమాచల్ ప్రదేశ్ 10శాతం), ఉత్తరాఖండ్ (9 శాతం), జమ్మూకశ్మీర్ (9 శాతం)లో హాలిడే ట్రిప్‌లకు మొగ్గుచూపుతున్నారు. 2023 జనవరి–జూన్ మధ్య కనీసం 21 శాతం మంది పర్యటనల నిమిత్తం పర్సనల్ లోన్లు తీసుకున్నారు. ఇది జనవరి–మార్చి మధ్య 16 శాతం ఉండగా, ఏప్రిల్–జూన్ కాలంలో 27 శాతంగా ఉంది. హాలిడే టూర్ లోన్లు తీసుకున్న వారిలో ఉద్యోగులు 74 శాతం ఉండగా, వివిధ రంగాల నిపుణులు, స్వయం ఉపాధి పొందుతున్న వారు (డాక్టర్లు, లాయర్లు, సీఏలు, వ్యాపారులు) 26 శాతం. ఖర్చు ఎక్కువైనా వెనుకాడట్లేదు.. హాలిడే టూర్లకు వెళ్లే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గతంలో పోల్చితే హాలిడేపై వెళ్లేటప్పుడు రవాణా, వసతి, ఆహారం, ఇతర సౌకర్యాల్లో మరింత నాణ్యతను కోరుకుంటున్నారు. అందుకోసం ఖర్చు ఎక్కువైనా భరించేందుకు సిద్ధమవుతున్నారు. దీనికోసం పర్సనల్ లోన్లు వంటి వాటిని ఎంచుకుంటున్నారు. –అజయ్ రామిడి, ఎండీ, లార్వెన్ టూర్స్, ట్రావెల్స్ -
ఎడ్యుకేషన్ లోన్ విభాగం హెచ్డీఎఫ్సీ క్రెడిలా విక్రయం
న్యూఢిల్లీ: విద్యా రుణాల విభాగం హెచ్డీఎఫ్సీ క్రెడిలాను క్రిస్‌క్యాపిటల్ తదితర పీఈ దిగ్గజాల కన్సార్షియంకు విక్రయించినట్లు మార్టిగేజ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ తాజాగా పేర్కొంది. కంపెనీలో 90 శాతం వాటాను రూ. 9,060 కోట్లకు విక్రయించినట్లు వెల్లడించింది. ప్రయివేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంకుతో విలీనం నేపథ్యంలో విద్యా రుణాల సంస్థను హెచ్డీఎఫ్సీ విక్రయించింది. బీపీఈఏ ఈక్యూటీ, క్రిస్‌క్యాపిటల్ ఇన్వెస్టర్ల కన్సార్షియంకు హెచ్డీఎఫ్సీ క్రెడిలా ఫైనాన్షియల్ సర్వీసెస్‌ను విక్రయించేందుకు తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు హెచ్డీఎఫ్సీ ద్వయం తాజాగా తెలియజేశాయి. దేశ, విదేశాలలో ఉన్నత విద్యనభ్యసించేందుకు విద్యార్ధులకు రుణాలందించే హెచ్డీఎఫ్సీ క్రెడిలాలో 9.99% వాటాను కొనసాగించనున్నట్లు హెచ్డీఎఫ్సీ వెల్లడించింది. -
విద్యార్థిని వేధించిన బ్యాంకుపై హైకోర్టు ఆగ్రహం
సాక్షి, అమరావతి: విద్యారుణం కోసం దరఖాస్తు చేసే సమయంలో ఓ విద్యార్థి సమర్పించిన ఆస్తి ఒరిజినల్ డాక్యుమెంట్లను అతడికి తిరిగి ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేసిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపై హైకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. ఇది ఆ విద్యార్థిని వేధించడమేనన్న హైకోర్టు.. ఇందుకు బ్యాంకు మూల్యం చెల్లించుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. ఆ విద్యార్థికి ఖర్చుల కింద రూ.25 వేలు చెల్లించాలని బ్యాంకును ఆదేశించింది. ఆ మొత్తాన్ని డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో 15 రోజుల్లో హైకోర్టు రిజిస్ట్రార్ (జ్యుడిషియల్) వద్ద డిపాజిట్ చేయాలని ఆదేశించింది. లేనిపక్షంలో తమ ఆదేశాల అమలుకు చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రార్‌కు స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రవినాథ్ తిల్హరీ ఇటీవల తీర్పు చెప్పారు. ఇదీ పిటిషన్.. మచిలీపట్నానికి చెందిన విద్యార్థి నిశ్చల్.. విద్యారుణం కోసం ఆంధ్రాబ్యాంకుకు (తరువాత ఇది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనమైంది) దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తుతో అవసరమైన డాక్యుమెంట్లను, అతడి తల్లి ఇచ్చిన ఆస్తి ఒరిజినల్ గిఫ్ట్ డీడ్‌ను బ్యాంకు అధికారులకు సమర్పించారు. అయితే కొల్లేటరల్ సెక్యూరిటీకి సంబంధించిన ఒరిజినల్ డీడ్‌ను సమర్పించలేదంటూ నిశ్చల్‌కు రుణం మంజూరు చేసేందుకు బ్యాంకు అధికారులు నిరాకరించారు. దీంతో నిశ్చల్ తాను సమర్పించిన ఒరిజినల్ గిఫ్ట్ డీడ్‌ను తిరిగి ఇచ్చేయాలని బ్యాంకు అధికారులను కోరారు. దీనికి బ్యాంకు అధికారులు సానుకూలంగా స్పందించలేదు. తమకు ఒరిజినల్ డాక్యుమెంట్ ఇవ్వలేదని చెప్పారు. దీంతో నిశ్చల్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ తిల్హరీ విచారించారు. ఒరిజినల్ డీడ్‌ను ఇచ్చేస్తాం.. నిశ్చల్ న్యాయవాది శిఖరం కృష్ణమోహన్ వాదనలు వినిపిస్తూ.. దరఖాస్తుతో పాటు ఒరిజినల్ గిఫ్ట్ డీడ్‌ను సమర్పించినప్పటికీ బ్యాంకు అధికారులు ఇవ్వలేదంటూ చెప్పడం దారుణమన్నారు. దరఖాస్తుతో పాటు ఒరిజినల్ డీడ్‌ను సమర్పించామంటూ అందుకు సంబంధించిన ఆధారాలను ఆయన కోర్టు ముందుంచారు. ఈ సమయంలో బ్యాంకు న్యాయవాది వి.ద్యుమని పూర్తివివరాలను తెలుసుకుని కోర్టు ముందుంచేందుకు గడువు కోరారు. ఇందుకు అంగీకరించిన న్యాయమూర్తి విచారణను వాయిదా వేశారు. తిరిగి ఇటీవల ఈ వ్యాజ్యం విచారణకు రాగా.. ద్యుమని స్పందిస్తూ దరఖాస్తుతో పాటు పిటిషనర్ ఒరిజినల్ డీడ్‌ను సమర్పించారని తెలిపారు. వాటిని తిరిగి ఇచ్చేందుకు బ్యాంకు సిద్ధంగా ఉందన్నారు. ఆ డీడ్ ద్వారా తనఖాపెట్టిన ఆస్తిని 15 రోజుల్లో విడిపిస్తామని చెప్పారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి బ్యాంకు తీరును తప్పుపట్టారు. ఇది పిటిషనర్‌ను వేధించడమేనన్నారు. అందుకే పిటిషనర్ మరో గత్యంతరం లేక న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వచ్చిందని తెలిపారు. ఇందుకుగానూ రూ.25 వేలను ఖర్చుల కింద పిటిషనర్‌కు చెల్లించాలని బ్యాంకును ఆదేశించారు. -
హయ్యర్ స్టడీస్ లోన్‌పై బ్యాంకు విధించే చార్జెస్, ఇవే!
ఉన్నత చదువు కోసం ఎక్కువ ఖర్చవుతుందనే విషయం అందరికీ తెలుసు, కావున కొన్ని సందర్భాల్లో దీనికోసం కొంతమంది బ్యాంక్ నుంచి లోన్ తీసుకుంటారు. మీరు తీసుకునే లోన్.. ఎంచుకున్న కోర్సుని బట్టి ఉండవచ్చు. అయితే బ్యాంకులు కొన్ని సందర్భాల్లో లోన్ చార్జీలను వెల్లడించదు. అలంటి సందర్భాల్లో వినియోగదారుడు లోన్ తిరిగి చెల్లించాల్సి వచ్చినప్పుడు కొంత ఇబ్బందికి లోనవుతాడు. నిజానికి నర్సింగ్ ప్రారంభం నుంచి ఉన్నత డిగ్రీ పొందే వరకు వివిధ సందర్భాల్లో విద్యార్థి లోన్స్ తీసుకోవచ్చు, ఇది చాలామందికి తెలియకపోవచ్చు. ఒక స్టూడెంట్ లోన్ తీసుకునేటప్పుడు దాని కోసం అదనపు ఖర్చులను భరించాల్సి వస్తుంది, అలాంటి వాటిని గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు ఇక్కడ చూడవచ్చు. ప్రాసెసింగ్ ఫీజు: మీరు లోన్ తీసుకోవాలనుకున్నప్పుడు బ్యాంకు లోన్ ప్రాసెస్ చేయడానికి కొంత ప్రాసెసింగ్ ఫీజుని వసూలు చేస్తుంది. ఇది మీరు తీసుకునే లోన్ అమౌంట్ మొత్తంలో 1 నుంచి 2 శాతం వరకు ఉంటుంది. ప్రీ పేమెంట్ ఫీజు: మీరు లోన్ తీసుకున్నప్పుడు అనుకున్న సమయానికంటే ముందుగా లోన్ తిరిగి చెల్లించాల్సి వస్తే దాని కోసం బ్యాంకులు ప్రీ పేమెంట్ ఫీజుని వసూలు చేసేవి, కానీ ఇప్పుడు ఆర్బిఐ నోటిఫికేషన్ కారణంగా ఏ బ్యాంకులు ఇటువంటి ఫీజులను తీసుకోవడం లేదు. లేట్ పేమెంట్: మీరు ఏదైనా కారణం వల్ల గానీ, ఇతర సమస్య వల్ల గానీ చెల్లించాల్సిన గడువు తర్వాత లోన్ తిరిగి చెల్లించినప్పుడు లేట్ పేమెంట్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అంతే కాకుండా మీరు ఆలస్యం చేయడం వల్ల సిబిల్ స్కోర్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఇది భవిస్యత్తులో కొన్ని అవసరాల్లో ఉపయోగపడకపోవచ్చు. కాబట్టి లేట్ చేయకుండా నిర్దిష్ట సమయంలో లోన్ చెల్లించాల్సి ఉంటుంది. వడ్డీ రకంలో మార్పు: మీరు లోన్ తీసుకునే సమయంలో మీ వడ్డీ రేటు నిర్ణయించబడుతుంది. అయితే స్థిరమైన వడ్డీ రేటు నుంచి ప్లోటింగ్ వడ్డీ రేటుకు మారాలనుకున్నప్పుడు కూడా కొంత డబ్బు చెల్లించాల్సి వస్తుంది. లోన్ రద్దు చేసుకోవడం: మీరు లోన్ కావాలని అప్లై చేసుకుని తరువాత ఏదైనా కారణం వల్ల లోన్ వద్దనుకుంటే అప్పుడు బ్యాంకు మైనర్ క్యాన్సిలేషన్ కింద కొంత మొత్తం వసూలు చేస్తుంది. ఇది మీరు మంజూరైన లోన్ మొత్తంలో 1 శాతం వరకు ఉండవచ్చు. -
విద్యా రుణాల్లోనూ ఎన్పీఏల వాత
న్యూఢిల్లీ: ఉన్నత విద్య కల సాకారానికి సాయపడే విద్యా రుణాలకు సంబంధించి బ్యాంకుల్లో అప్రమత్త ధోరణి పెరుగుతోంది. ఎందుకంటే విద్యా రుణాల్లో ఎగవేతలు 8 శాతానికి చేరాయి. దీంతో తాజా విద్యా రుణాల మంజూరులో ఆచితూచి అడుగులు వేసేలా బ్యాంకుల ధోరణిలో మార్పు కనిపిస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు ఇచ్చిన మొత్తం విద్యా రుణాల్లో ఎగవేతలు (మొండి బకాయిలు/ ఎన్పీఏలు) ఈ ఏడాది జూన్ చివరికి 7.82 శాతానికి పెరిగిపోయాయి. వసూలు కావాల్సిన విద్యా రుణాల మొత్తం రూ.80వేల కోట్లుగా ఉంది. ఎన్పీఏలు పెరిగిపోయినందున బ్యాంకు శాఖల వారీగా అప్రమత్త విధానాన్ని అనుసరిస్తున్నట్టు ఓ ప్రభుత్వరంగ బ్యాంకు సీనియర్ అధికారి వెల్లడించారు. దీనివల్ల నిజాయితీ రుణ కేసుల్లోనూ మరింత పరిశీలన అవసరపడుతుందని, ఇది జాప్యానికి దారితీయవచ్చన్నారు. విద్యా రుణాల్లో జాప్యాన్ని నివారించడానికి, విద్యా రుణాల పోర్ట్‌ఫోలియో సమీక్షపై ఇటీవలే ప్రభుత్వరంగ బ్యాంకులతో కేంద్ర ఆర్థిక శాఖ సమావేశాన్ని నిర్వహించడం గమనార్హం. విద్యా రుణాల్లో ఇటీవలి కాలంలో ఎన్పీఏలు గణనీయంగా పెరిగిపోవడం అన్నది ఆందోళనకర అంశమని, దేశంలో ఉన్నత విద్యకు మద్దతుగా బ్యాంకుల రుణ వితరణకు ఇది విఘాతమని ఆర్బీఐ ఇటీవలి బులెటిన్ సైతం పేర్కొంది. ఉపాధి అవకాశాల్లేమి వల్లే.. మన దేశంలో 90 శాతం మేర విద్యా రుణాలను ప్రభుత్వరంగ బ్యాంకులే అందిస్తున్నాయి. ప్రైవేటు రంగ బ్యాంకులు కేవలం ఏడు శాతం, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు 3 శాతం చొప్పున వాటాను 2020 మార్చి నాటికి కలిగి ఉన్నాయి. ఉద్యోగ మార్కెట్లోకి వస్తున్న పట్టభద్రుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధి అవకాశాల కల్పన లేదని రీసర్జంట్ ఇండియా ఎండీ జ్యోతి ప్రకాష్ పేర్కొన్నారు. ఇది విద్యా రుణ ఎగవేతలు పెరిగేందుకు కారణంగా అభిప్రాయపడ్డారు. దీంతో బ్యాంకులు విద్యా రుణాల విషయంలో అప్రమ్తతంగా వ్యవహరిస్తున్నట్టు చెప్పారు. ముఖ్యంగా రూ.7.5 లక్షల వరకు రుణాలను (హామీ/తాకట్టు ఉన్నవి, లేనివి) ఇవ్వడానికి వెనుకాడున్నట్టు పేర్కొన్నారు. నూతన విద్యా పాలసీని సమర్థంగా అమలు చేయడం, కనీస నైపుణ్యాలు, ఉపాధి కల్పన చర్యలు భాగస్వాములు అందరికీ మేలు చేస్తాయన్నారు. విద్యా రుణాలకు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ రూపొందించిన నమూనాను బ్యాంకులు అనుసరిస్తున్నాయి. దీని కింద రూ.4 లక్షల వరకు విద్యా రుణాలకు ఎటువంటి తాకట్టు అవసరం లేదు. రూ.7.5 లక్షల వరకు రుణాలకు మూడో పార్టీ నుంచి గ్యారంటీ ఇవ్వాల్సి ఉంటుంది. -
ఉన్నత చదువులకు చేయూత అందించండి
సాక్షి, హైదరాబాద్: నగరంలోని బోరబండలో నివాసం ఉండే నిరుపేద కుటుంబానికి చెందిన చదువుల తల్లి విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించేందుకు ఆర్థిక కష్టాలు పడుతోంది. కుటుంబ ఆర్థిక స్థితికి మించి కోర్సు ఫీజు ఉండటంతో దాతల సాయం కోసం ఎదురుచూస్తోంది. ప్రైవేటు ఉద్యోగి కురవ పులికొండ రంగస్వామికి ముగ్గురు ఆడపిల్లలు. పెద్ద కుమార్తె వైష్ణవి చిన్నప్పటి నుంచి చదువుల్లో రాణిస్తుండటంతో ఆర్థిక ఇబ్బందులున్నా బీటెక్ వరకు చదివించాడు. లండన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ హెర్ట్పోర్డ్షైర్లో ఎంఎస్(ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ విత్ రోబోటిక్) కోర్సుపై ఆసక్తితో దరఖాస్తు చేసుకోగా అనుమతి లభించింది. అప్పు చేసి ముందస్తుగా సీటు కోసం రూ.5 లక్షలు చెల్లించారు. కోర్సు మొత్తం ఫీజు రూ.16.50 లక్షలు కాగా, అడ్మిషన్ తీసుకున్న ఎనిమిది నెలల్లో పూర్తి ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. విద్యా లక్ష్మి పథకం కింద బ్యాంక్‌లో రుణం కోసం ప్రయత్నించగా రూ.7 లక్షల వరకు మంజూరు చేసేందుకు హామీ ఇచ్చారు. ఒక వేళ బ్యాంక్ రుణం మంజూరు చేసినా ఫీజు కోసం రూ.4.50 లక్షలు, కోర్సు పూర్తయ్యే వరకు మరో రూ.12 లక్షల వరకు ఖర్చు అవుతోంది. మొత్తం రూ.16.50 లక్షలు అవసరం. ఆర్థిక స్థోమత లేకపోవడంతో ఉన్నత చదువుల కోసం మనస్సున్న దాతలు ఆదుకోవాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. అకౌంట్ నంబర్ 0649118000761, కెనరా బ్యాంక్, వెంగళ్రావునగర్ బ్రాంచ్, ఐఎఫ్ఎస్సీ నంబర్ సీఎన్ఆర్బీ.0006108, హైదరాబాద్. ఫోన్: 97051 44495 గూగుల్ పే, ఫోన్ పే చేసి ఆర్థిక సాయం అందించవచ్చు. -
విద్యార్థులకు గుడ్ న్యూస్.. తక్కువ వడ్డీకే రుణాలు!
విద్యార్థులకు గుడ్ న్యూస్. ఉన్నత చదువులు చదివేందుకు బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులు తక్కువ వడ్డీకే రుణాలు అందజేస్తున్నాయి. ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంక్ ఆఫ్ బరోడా ఎడ్యుకేషన్ లోన్స్‌పై 6.75 శాతం వడ్డీ రేటుతో రుణాలు అందిస్తోంది. బ్యాంక్‌బజార్ తెలిపిన సమాచారం ప్రకారం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 6.8 శాతం వడ్డీరేటు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 6.85 శాతంగా వడ్డీరేటు ఉంది. భారతదేశం, విదేశాలలో ఉన్నత చదువుల కోసం తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తున్నాయి. విద్యా రుణాలు తీసుకునే వారికి సెక్షన్ 80ఈ కింద పన్ను ప్రయోజనాలను అందిస్తాయి. మీరు మీ కోసం, మీ జీవిత భాగస్వామి లేదా పిల్లలకు విద్యా రుణం తీసుకున్నట్లయితే చెల్లించే వడ్డీ మొత్తంపై పన్ను మినహాయింపు లభిస్తుంది. అంటే ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటే రెండు బెనిఫిట్స్ లభిస్తున్నాయని చెప్పుకోవచ్చు. మీరు కూడా మీ పిల్లల్ని ఉన్నత చదువులు చదివించాలని భావిస్తే.. లేదంటే విదేశాల్లో చదివించాలని భావిస్తే.. ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవచ్చు. చదవండి: ఎస్బీఐ : జూలై 1 నుంచి కొత్త ఛార్జీలు -
ఎడ్యుకేషన్ లోన్స్.. తీసుకోండి ఇలా!
కళ్ల ముందు కలల కోర్సులు ఎన్నెన్నో! ఆ కోర్సుల్లో చేరితే భవిష్యత్తు బంగారమవుతుందనే భావన! కెరీర్లో వెనుదిరిగి చూసుకోనక్కర్లేదనే ఆలోచన! కానీ.. చాలామందికి ఆర్థిక పరిస్థితులు వెనక్కులాగుతుంటాయి! రూ.లక్షల్లో ఫీజులు చూసి.. అర్హతలు, అవకాశం ఉన్నా.. నిరాశతో వెనుకంజ వేస్తున్న వైనం! ఇలాంటి ప్రతిభావంతులైన విద్యార్థులకు చక్కటి మార్గం.. ఎడ్యుకేషన్ లోన్స్!! ప్రస్తుతం పలు బ్యాంకులు.. విద్యారుణాలు అందిస్తూ.. విద్యార్థుల కెరీర్ ఉన్నతికి దోహదపడుతు న్నాయి. ఈ నేపథ్యంలో.. విద్యా రుణాలు, అర్హతలు, విధి విధానాలపై విశ్లేషణ.. బీటెక్, ఎంబీఏ వంటి ప్రొఫెషనల్ కోర్సులు పూర్తి చేయాలంటే.. కనిష్టంగా రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు; గరిష్టంగా రూ.15 లక్షల వరకు వెచ్చించాల్సి వస్తోంది. అదే విదేశీ విద్యకు వెళ్లాలంటే.. సగటున రూ.50 లక్షల వరకు వ్యయం అవుతోంది. ఫీజుల భారం కారణంగా ఎందరో ప్రతిభావంతులైన విద్యార్థులు.. ఉన్నత విద్యకు, విదేశీ విద్యకు దూరమవుతున్నారు. ఈ పరిస్థితిని పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్.. విద్యార్థులకు విద్యా రుణాలు అందించే ఏర్పాట్లుచేశాయి. విద్యా రుణాలు దేశంలోని గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూ ట్లలో,కోర్సుల్లో ప్రవేశం పొందిన వారికే కాకుండా.. విదేశీ విద్యకు వెళ్లే ప్రతిభావంతులు కూడా అందుకునే అవకాశం ఉంది. ఇన్స్టిట్యూట్కు, కోర్సుకు గుర్తింపు విద్యా రుణాలను అందిస్తున్న బ్యాంకులు.. కొన్ని నిర్దిష్ట నిబంధనలను అనుసరిస్తున్నాయి. బ్యాంకుల విధి విధానాల ప్రకారం–ఏఐసీటీఈ, యూజీసీ, కేంద్ర విద్యాశాఖ, ఆల్ ఇండియా అసోసియేషన్ ఆఫ్ యూనివర్సిటీస్ గుర్తింపు ఉన్న కళాశాలలు, కోర్సులనే విద్యా రుణ మంజూరులో పరిగణనలోకి తీసుకుంటాయి. అంటే.. సదరు ఇన్స్టిట్యూట్లలో ప్రవేశం పొందిన విద్యార్థులకే విద్యారుణం కోసం దరఖాస్తు చేసుకోవడానికి అనుమతి లభిస్తుంది. ఎంట్రన్స్‌లో అర్హత సాధిస్తేనే విద్యా రుణానికి దరఖాస్తు చేసుకునే విద్యార్థులు.. కోర్సులో ప్రవేశానికి నిర్వహించిన ఎంట్రన్స్‌లో అర్హత సాధించాల్సి ఉంటుంది. అంటే.. ఏదైనా ఎంట్రన్స్‌లో ర్యాంకు సాధించి.. కన్వీనర్ కోటాలో సీటు పొందిన వారికే విద్యా రుణ దరఖాస్తుకు అర్హత లభిస్తుంది. ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు.. ఎంట్రన్స్‌లో మెరిట్ పొందిన వారికే విద్యారుణ మంజూరులో ప్రాధాన్యం ఇస్తున్నాయి. కొన్ని ప్రైవేట్ బ్యాంకులు మాత్రం మేనేజ్మెంట్ కోటా ద్వారా ప్రవేశం పొందిన విద్యార్థులకు కూడా రుణ దరఖాస్తుకు అవకాశం కల్పిస్తున్నాయి. గరిష్టంగా రూ.10లక్షలు, రూ.20లక్షలు ► విద్యా రుణాల మంజూరు, గరిష్ట రుణ మొత్తం విషయంలో ప్రస్తుతం బ్యాంకులు రెండు రకాల విధానాలు అమలు చేస్తున్నాయి. ► దేశంలోని ఇన్స్టిట్యూట్లలో ప్రవేశం పొందిన విద్యార్థులకు గరిష్టంగా రూ.పది లక్షలు మంజూరు చేస్తున్నాయి. ► విదేశీ ఇన్స్టిట్యూట్లలో ప్రవేశం పొందిన వారికి గరిష్టంగా రూ.20 లక్షలు రుణం లభిస్తోంది. అవసరమైతే హామీలు ► విద్యా రుణాలను బ్యాంకులు మూడు శ్లాబ్‌ల విధానంలో మంజూరు చేస్తున్నాయి. ► అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న శ్లాబ్(రుణ మొత్తం) ఆధారంగా.. భవిష్యత్తులో రీపేమెంట్ పరంగా ముందుగానే కొన్ని హామీ పత్రాలు ఇచ్చే విధంగా నిబంధనలు అమలు చేస్తున్నాయి. ► శ్లాబ్–1 ప్రకారం– రూ.4 లక్షలు రుణ మొత్తంగా నిర్ణయించారు. ఈ శ్లాబ్‌లో విద్యార్థులు ఎలాంటి హామీ ఇవ్వక్కర్లేదు. ► శ్లాబ్–2 ప్రకారం– రూ.4లక్షల నుంచి రూ.7.5లక్షల వరకు రుణ మొత్తాన్ని కేటాయిస్తున్నారు. ఇందుకోసం తల్లిదండ్రుల హామీ, థర్డ్ పార్టీ గ్యారెంటీ పత్రం ఇవ్వాల్సి ఉంటుంది. ► శ్లాబ్–3 విధానం ప్రకారం– రూ.7.5 లక్షలకు పైగా రుణ మొత్తం లభిస్తోంది. దీనికి దరఖాస్తు చేయాలనుకుంటే.. ఈ మొత్తానికి సరిపడే కొల్లేటరల్ సెక్యూరిటీ(స్థిరాస్థి పత్రాలను) ఇవ్వాల్సి ఉంటుంది. మార్జిన్ మనీ చెల్లింపు ఎడ్యుకేషన్ లోన్ కోరుకునే విద్యార్థులు తాము దరఖాస్తు చేసుకున్న రుణ మొత్తంలో కొంత మొత్తాన్ని మార్జిన్ మనీగా సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు రూ.4 లక్షల వరకు ఎలాంటి మార్జిన్ మనీ అవసరం లేదు. కాని రూ.4 లక్షలు దాటిన రుణ దరఖాస్తులకు స్వదేశంలో విద్యకు అయిదు శాతం, విదేశీ విద్యకు 15 శాతం మార్జిన్ మనీని సమకూర్చుకోవాల్సి ఉంటుంది. రుణం లభించే వ్యయాలు ► ట్యూషన్ ఫీజు, హాస్టల్ ఫీజు, ఎగ్జామినేషన్/ లైబ్రరీ/లేబొరేటరీ ఫీజు, విదేశీ విద్య విద్యార్థులకు ప్రయాణ ఖర్చులు, పుస్తకాలు, యూనిఫామ్, ఇతర అకడమిక్ సంబంధిత పరికరాల కొనుగోలుకు అయ్యే వ్యయం, కంప్యూటర్ కొనుగోలు వ్యయం; కోర్సు పరంగా అవసరమైన స్టడీ టూర్స్, ప్రాజెక్ట్ వర్క్స్ తదితరాలకు అయ్యే ఖర్చు రుణంగా లభిస్తుంది. ► ఇన్స్టిట్యూట్లు వసూలు చేసే కాషన్ డిపాజిట్, బిల్డింగ్ ఫండ్, రిఫండబుల్ డిపాజిట్లకు కూడా రుణం మంజూరు చేస్తారు. ఇవి నిర్దేశిత ట్యూషన్ ఫీజు మొత్తంలో 10 శాతానికి మించకుండా ఉండాలి. ► కంప్యూటర్ కొనుగోలు వ్యయం, స్టడీ టూర్స్, ప్రాజెక్ట్ వర్క్స్ కోసం ఇచ్చే మొత్తం ట్యూషన్ ఫీజులో 20 శాతానికి మించకుండా ఉంటుంది. తిరిగి చెల్లింపు ఇలా ► విద్యా రుణం తిరిగి చెల్లించే విషయంలో బ్యాంకులు ఇటీవల కొంత సరళీకృత విధానాలు అనుసరిస్తున్నాయి. రీపేమంట్ హాలిడే పేరుతో కోర్సు పూర్తయిన తర్వాత సంవత్సరం నుంచి లేదా కోర్సు పూర్తయి ఉద్యోగం లభించినప్పటి నుంచి వాయిదాల పద్ధతిలో తిరిగి చెల్లించే వెసులుబాటు కల్పిస్తున్నాయి. ఇలా గరిష్టంగా 15 సంవత్సరాల వ్యవధిలో ఈఎంఐ విధానంలో రుణం మొత్తం చెల్లించొచ్చు. ► రుణ తిరిగి చెల్లింపు పరంగా స్టార్టప్ ఔత్సాహిక విద్యార్థులకు ప్రత్యేక వెసులుబాటు లభిస్తోంది. దీని ప్రకారం–స్టార్టప్ ఏర్పాటు చేసిన విద్యార్థులు.. కోర్సు పూర్తయ్యాక రెండేళ్ల తర్వాత నుంచి రుణం తిరిగి చెల్లించొచ్చు. ► ఉన్నత విద్యనభ్యసించే మహిళా విద్యార్థులను ప్రోత్సహించే దిశగా బ్యాంకులు విద్యారుణాల వడ్డీ రేట్లలో 0.5 శాతం నుంచి ఒక శాతం వరకు రాయితీ ఇస్తున్నాయి. టాప్ ఇన్స్టిట్యూట్లో చేరితే ప్రస్తుతం ఐబీఏ మార్గనిర్దేశకాల ప్రకారం–విద్యా ర్థులు ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్లలో ప్రవేశం పొందితే.. గరిష్ట రుణ మొత్తాన్ని పెంచే విచక్షణాధికా రాన్ని బ్యాంకులకు కల్పించింది. ఉదాహరణకు ఐఐ ఎంలు, ఐఐటీల వంటి ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్ లలో రూ.పది లక్షల కంటే ఎక్కువ ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. ఇలాంటి ఇన్స్టిట్యూట్లలో ప్రవేశం పొందిన వారికి గరిష్ట రుణ పరిమితి విషయంలో సడలింపు ఇచ్చే అవకాశం ఉంది. నిరంతర సమీక్ష విద్యా రుణం మంజూరు అయిన విద్యార్థికి సంబం«ధించిన ఫీజులను బ్యాంకులు నేరుగా సంబంధిత ఇన్స్టిట్యూట్కే పంపుతాయి. ఒకవేళ తొలి దశలో విద్యార్థులు సొంతంగా ఫీజు చెల్లించి ఉంటే.. సంబంధిత రశీదుల ఆధారంగా తొలి దశ ఫీజును విద్యార్థికి ఇస్తాయి. ఆ తర్వాత దశ నుంచి ఇన్స్టిట్యూట్కు పంపుతాయి. ప్రతి ఏటా విద్యా సంవత్సరం ప్రారంభ సమయంలో నిర్దేశిత గడవు తేదీలోగా ఇన్స్టిట్యూట్కు చెల్లిస్తాయి. అంతేకాకుండా అంతకుముందు సంవత్సరంలో చదువులో సదరు విద్యార్థి ప్రతిభను సమీక్షిస్తున్నాయి. దరఖాస్తుకు అవసరమైన పత్రాలు ► ప్రవేశ ధ్రువీకరణ పత్రం ► అకడమిక్ అర్హతల సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలు ► తల్లిదండ్రుల ఆదాయ ధ్రువీకరణ ► తల్లిదండ్రుల ఆదాయ స్థితిగతుల వివరాలు, బ్యాంకు అకౌంట్ స్టేట్మెంట్స్ ► నివాస ధ్రువీకరణ ► థర్డ్‌పార్టీ ఆదాయ ధ్రువీకరణ ► కోర్సు వ్యయానికి సంబంధించి ఇన్స్టిట్యూట్ల నుంచి అధీకృత లెటర్స్. ► పూర్తి వివరాలకు వెబ్సైట్: https://www.iba.org.in/ ఎడ్యుకేషన్ లోన్స్.. ముఖ్యాంశాలు ► స్వదేశీ, విదేశీ విద్యకు బ్యాంకుల రుణాలు. ► నియంత్రణ సంస్థలు, ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థల్లో ప్రవేశిస్తేనే రుణ దరఖాస్తుకు అర్హత. ► కనిష్టంగా రూ.4 లక్షలు గరిష్టంగా రూ.15 లక్షల వరకు రుణ మొత్తం. ► విదేశీ విద్య, ఐఐఎంలు, ఐఐటీలు వంటి ఇన్స్టిట్యూట్లలో ప్రవేశం పొందితే రుణ మొత్తాన్ని పెంచే అవకాశం. ► మహిళా విద్యార్థులను ప్రోత్సహించేలా ఇంట్రస్ట్ సబ్సిడీ స్కీమ్. ► విద్యాలక్ష్మి పోర్టల్ పేరిట ఆన్లైన్లో ఒకేసారి మూడు బ్యాంకులకు రుణ దరఖాస్తు చేసుకునే సదుపాయం. విద్యా లక్ష్మి పోర్టల్.. ఆన్లైన్ ద్వారా విద్యారుణం కోసం కేంద్ర ప్రభుత్వం విద్యా లక్ష్మి పేరుతో ప్రత్యేక పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ పోర్టల్.. విద్యా రుణాల విషయంలో విద్యార్థులకు, బ్యాంకులకు మధ్య అనుసంధానకర్తగా పనిచేస్తుంది. విద్యార్థులు విద్యాలక్ష్మి పోర్టల్‌లో లాగిన్ అయి.. కామన్ ఎడ్యుకేషనల్ లోన్ అప్లికేషన్ ఫామ్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. గరిష్టంగా మూడు బ్యాంకులకే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇలా ఆన్లైన్లో వచ్చిన దరఖాస్తులను.. అభ్యర్థులు ప్రాథమ్యంగా పేర్కొన్న బ్యాంకులకు పంపిస్తారు. తర్వాత దశలో సదరు బ్యాంకులు దరఖాస్తును పరిశీలించి సంతృప్తి చెందితే.. ఏ బ్రాంచ్‌లో సంప్రదించాలి, ఏ ఏ పత్రాలు తీసుకెళ్లాలి అనే వివరాలను విద్యార్థులకు తెలియజేస్తాయి. వెబ్సైట్: www.vidyalakshmi.co.in