సాక్షి, హైదరాబాద్: గతంలో మెడికల్ ఎమర్జెన్సీ, పిల్లల ఉన్నత విద్య వంటి వాటికి పర్సనల్ లోన్లు తీసుకునేందుకు ఎక్కువ మంది మొగ్గు చూపేవారు. అందుకు భిన్నంగా ఇప్పుడు తమ ఇళ్లను ఆధునీకరించుకోవడం, ఇతర రెనోవేషన్ పనుల కోసమే కాకుండా హాలిడే టూర్‌కు వెళ్లేందుకు సైతం ఈ రుణాలు తీసుకుంటున్నట్టు వెల్లడైంది. మెట్రో నగరాలు, ప్రధాన పట్టణాలకు మించి నాన్ మెట్రో నగరాల నుంచి ఇలాంటి డిమాండ్ పెరుగుతోంది.
వ్యక్తిగత రుణాలు పొందే ప్రతీ ఐదుగురిలో ఒకరు హాలిడే టూర్ కోసమే తీసుకుంటున్నట్టు ఆన్లైన్ప్లాట్ఫామ్ ‘పైసా బజార్’ తాజా సర్వేలో వెల్లడైంది. 2023 జనవరి–జూన్ మధ్య పైసాబజార్ నుంచి హాలిడే లోన్స్ తీసుకున్న వారిలో.. దేశంలోని 97 నాన్ మెట్రో నగరాలకు చెందిన వారు 68 శాతం మంది ఉండటం విశేషం. జోథ్‌పూర్, పట్నా, కాన్పూర్, ఆగ్రా, సూరత్, పాటియాలా తదితర మెట్రోయేతర నగరాల వారే ఈ రుణాలపై ఆసక్తి చూపుతున్నారు. ఇదే మెట్రో నగరాల విషయానికొస్తే... ముంబైలో 25 శాతం, బెంగళూరులో 22 శాతం, ఢిల్లీలో 20 శాతం మంది జాలీ ట్రిప్పుల కోసం రుణాలు తీసుకుంటున్నారు.
అభిరుచులు మారుతున్నాయి. సెలవులను ఎంజాయ్ చేసేందుకో లేదా కొత్త కొత్త ప్రాంతాలను చూసేందుకో వెళ్లాలనుకునే వారు పెరుగుతున్నారు. దేశంలోగానీ లేదా విదేశాలకు గానీ వెకేషన్లకు వెళ్లే వారి సంఖ్య పెరుగుతోంది. గతంలో వీటి కోసం చాలామంది డబ్బు పొదుపు చేసుకుని దాంతో టూర్లకు వెళ్లేవారు. ఇప్పుడు పర్సనల్ లోన్ తీసుకుంటుండటం ట్రెండ్‌గా మారింది.
నివేదికలోని ముఖ్యాంశాలివీ..
- గత ఆరు నెలల్లో హాలిడే టూర్ కోసం పర్సనల్ లోన్లు తీసుకున్న వారిలో 73 శాతం దేశంలోని పర్యాటక ప్రదేశాలకు, 27 శాతం విదేశాల్లోని పర్యాటక ప్రాంతాలకు వెళ్లారు.
- విదేశాల్లో హాలిడే టూర్‌కు వెళ్లాలనుకుంటే ఎక్కువగా దుబాయ్ (28 శాతం)ని ఎంచుకోగా ఆ తర్వాత థాయ్‌లాండ్ (15 శాతం),యూరప్ (10 శాతం)ను ఎంచుకుంటున్నారు.
- దేశంలో అయితే గోవా (23 శాతం), హిమాచల్ ప్రదేశ్ 10శాతం), ఉత్తరాఖండ్ (9 శాతం), జమ్మూకశ్మీర్ (9 శాతం)లో హాలిడే ట్రిప్‌లకు మొగ్గుచూపుతున్నారు.
- 2023 జనవరి–జూన్ మధ్య కనీసం 21 శాతం మంది పర్యటనల నిమిత్తం పర్సనల్ లోన్లు తీసుకున్నారు. ఇది జనవరి–మార్చి మధ్య 16 శాతం ఉండగా, ఏప్రిల్–జూన్ కాలంలో 27 శాతంగా ఉంది.
- హాలిడే టూర్ లోన్లు తీసుకున్న వారిలో ఉద్యోగులు 74 శాతం ఉండగా, వివిధ రంగాల నిపుణులు, స్వయం ఉపాధి పొందుతున్న వారు (డాక్టర్లు, లాయర్లు, సీఏలు, వ్యాపారులు) 26 శాతం.
ఖర్చు ఎక్కువైనా వెనుకాడట్లేదు..
హాలిడే టూర్లకు వెళ్లే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గతంలో పోల్చితే హాలిడేపై వెళ్లేటప్పుడు రవాణా, వసతి, ఆహారం, ఇతర సౌకర్యాల్లో మరింత నాణ్యతను కోరుకుంటున్నారు. అందుకోసం ఖర్చు ఎక్కువైనా భరించేందుకు సిద్ధమవుతున్నారు. దీనికోసం పర్సనల్ లోన్లు వంటి వాటిని ఎంచుకుంటున్నారు.
–అజయ్ రామిడి,
ఎండీ, లార్వెన్ టూర్స్, ట్రావెల్స్
Comments
Please login to add a commentAdd a comment