బ్యాంకులు అందిస్తున్న విద్యారుణాలు భారమవుతున్న తరుణంలో బడ్జెట్ 2024-25 ప్రసంగంలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ అనుకూల నిర్ణయాలు తీసుకుంటుందని చాలామంది భావించారు. కానీ ప్రస్తుతం ఉన్న రూ.4 లక్షల ఉన్నత విద్యారుణాన్ని రూ.10 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. గుడ్డి కంటే మెల్ల మేలు అన్నట్లు వడ్డీలపై నిర్ణయాన్ని వెల్లడించకుండా రుణ పరిమాణాన్ని పెంచడం ఒకింత మేలు చేసే అంశమే అయినా, భవిష్యత్తులో క్రీయాశీలకంగా మరిన్ని నిర్ణయాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
2047లోపు ‘వికసిత భారత్’ లక్ష్యంగా విత్త మంత్రి నిర్మలా సీతారామన్ మానవ వనరుల అభివృద్ధి, ఉద్యోగకల్పన, రెసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ బలోపేతం వంటి అంశాలపై దృష్టి సారించారు. ఉన్నత విద్యను అభ్యసించడానికి వీలుగా ప్రస్తుతం ఉన్న రుణ సదుపాయాన్ని రూ.4 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచారు. అయితే బ్యాంకులు ఎలాంటి పూచీకత్తు లేకుండా ఈ రుణాలను మంజూరు చేయడం లేదు. రుణాల జారీ అంశాన్ని అకడమిక్ మార్కులకు లింక్ పెడుతున్నారు. దాంతో రుణ గ్రహీతలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. గతంలో బ్యాంకులు విద్యా రుణాలను దాదాపు 4 శాతం వడ్డీకే అందించేవి. ప్రస్తుతం అది సుమారు 12.5 శాతానికి చేరింది.
ఇదీ చదవండి: 379 అక్రమ రుణ వెబ్‌సైట్లు, 91 ఫిషింగ్ సైట్‌ల తొలగింపు
ప్రభుత్వం స్పందించి 2047 కల్లా ‘వికసిత భారత్’ లక్ష్యాన్ని చేరుకునేలా విద్యా రుణాలను మరింత సులభతరం చేసి, తక్కువ వడ్డీలకే వాటిని అందిచేలా చర్యలు తీసుకోవాలని నిపుణులు కోరుతున్నారు. దాంతోపాటు ఉన్నత విద్య చదువుతున్న సమయంలోనే కళాశాలలు, కంపెనీలు పరస్పరం ఒప్పందం కుదుర్చుకునేలా మరిన్ని ఏర్పాట్లు చేయాలని చెబుతున్నారు. దానివల్ల విద్యార్థి దశలోనే రియల్‌టైమ్ అనుభవం రావడంతో చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగంలో స్థిరపడే అవకాశం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment