ఎడ్యుకేషన్‌ లోన్స్‌.. తీసుకోండి ఇలా! | Education Loan in India: How to Get Student Loan, Full Details in Telugu | Sakshi
Sakshi News home page

విద్యారుణం అందుకునే మార్గం!

Published Wed, Mar 17 2021 4:29 PM | Last Updated on Wed, Mar 17 2021 5:41 PM

Education Loan in India: How to Get Student Loan, Full Details in Telugu - Sakshi

కళ్ల ముందు కలల కోర్సులు ఎన్నెన్నో! ఆ కోర్సుల్లో చేరితే భవిష్యత్తు బంగారమవుతుందనే భావన! కెరీర్‌లో వెనుదిరిగి చూసుకోనక్కర్లేదనే ఆలోచన! కానీ.. చాలామందికి ఆర్థిక పరిస్థితులు వెనక్కులాగుతుంటాయి! రూ.లక్షల్లో ఫీజులు చూసి.. అర్హతలు, అవకాశం ఉన్నా.. నిరాశతో వెనుకంజ వేస్తున్న వైనం! ఇలాంటి ప్రతిభావంతులైన విద్యార్థులకు చక్కటి మార్గం.. ఎడ్యుకేషన్‌ లోన్స్‌!! ప్రస్తుతం పలు బ్యాంకులు.. విద్యారుణాలు అందిస్తూ.. విద్యార్థుల కెరీర్‌ ఉన్నతికి దోహదపడుతు న్నాయి. ఈ నేపథ్యంలో.. విద్యా రుణాలు, అర్హతలు, విధి విధానాలపై విశ్లేషణ..

బీటెక్, ఎంబీఏ వంటి ప్రొఫెషనల్‌ కోర్సులు పూర్తి చేయాలంటే.. కనిష్టంగా రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు; గరిష్టంగా రూ.15 లక్షల వరకు వెచ్చించాల్సి వస్తోంది. అదే విదేశీ విద్యకు వెళ్లాలంటే.. సగటున రూ.50 లక్షల వరకు వ్యయం అవుతోంది. ఫీజుల భారం కారణంగా ఎందరో ప్రతిభావంతులైన విద్యార్థులు.. ఉన్నత విద్యకు, విదేశీ విద్యకు దూరమవుతున్నారు. ఈ పరిస్థితిని పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం, ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌.. విద్యార్థులకు విద్యా రుణాలు అందించే ఏర్పాట్లుచేశాయి. విద్యా రుణాలు దేశంలోని గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూ ట్‌లలో,కోర్సుల్లో ప్రవేశం పొందిన వారికే కాకుండా.. విదేశీ విద్యకు వెళ్లే ప్రతిభావంతులు కూడా అందుకునే అవకాశం ఉంది. 

ఇన్‌స్టిట్యూట్‌కు, కోర్సుకు గుర్తింపు
విద్యా రుణాలను అందిస్తున్న బ్యాంకులు.. కొన్ని నిర్దిష్ట నిబంధనలను అనుసరిస్తున్నాయి. బ్యాంకుల విధి విధానాల ప్రకారం–ఏఐసీటీఈ, యూజీసీ, కేంద్ర విద్యాశాఖ, ఆల్‌ ఇండియా అసోసియేషన్‌ ఆఫ్‌ యూనివర్సిటీస్‌ గుర్తింపు ఉన్న కళాశాలలు, కోర్సులనే విద్యా రుణ మంజూరులో పరిగణనలోకి తీసుకుంటాయి. అంటే.. సదరు ఇన్‌స్టిట్యూట్‌లలో ప్రవేశం పొందిన విద్యార్థులకే విద్యారుణం కోసం దరఖాస్తు చేసుకోవడానికి అనుమతి లభిస్తుంది. 

ఎంట్రన్స్‌లో అర్హత సాధిస్తేనే
విద్యా రుణానికి దరఖాస్తు చేసుకునే విద్యార్థులు.. కోర్సులో ప్రవేశానికి నిర్వహించిన ఎంట్రన్స్‌లో అర్హత సాధించాల్సి ఉంటుంది. అంటే.. ఏదైనా ఎంట్రన్స్‌లో ర్యాంకు సాధించి.. కన్వీనర్‌ కోటాలో సీటు పొందిన వారికే విద్యా రుణ దరఖాస్తుకు అర్హత లభిస్తుంది. ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు.. ఎంట్రన్స్‌లో మెరిట్‌ పొందిన వారికే విద్యారుణ మంజూరులో ప్రాధాన్యం ఇస్తున్నాయి. కొన్ని ప్రైవేట్‌ బ్యాంకులు మాత్రం మేనేజ్‌మెంట్‌ కోటా ద్వారా ప్రవేశం పొందిన విద్యార్థులకు కూడా రుణ దరఖాస్తుకు అవకాశం కల్పిస్తున్నాయి. 

గరిష్టంగా రూ.10లక్షలు, రూ.20లక్షలు
 విద్యా రుణాల మంజూరు, గరిష్ట రుణ మొత్తం విషయంలో ప్రస్తుతం బ్యాంకులు రెండు రకాల విధానాలు అమలు చేస్తున్నాయి. 
 దేశంలోని ఇన్‌స్టిట్యూట్‌లలో ప్రవేశం పొందిన విద్యార్థులకు గరిష్టంగా రూ.పది లక్షలు మంజూరు చేస్తున్నాయి.
► విదేశీ ఇన్‌స్టిట్యూట్‌లలో ప్రవేశం పొందిన వారికి గరిష్టంగా రూ.20 లక్షలు రుణం లభిస్తోంది. 

అవసరమైతే హామీలు
► విద్యా రుణాలను బ్యాంకులు మూడు శ్లాబ్‌ల విధానంలో మంజూరు చేస్తున్నాయి. 
► అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న శ్లాబ్‌(రుణ మొత్తం) ఆధారంగా.. భవిష్యత్తులో రీపేమెంట్‌ పరంగా ముందుగానే కొన్ని హామీ పత్రాలు ఇచ్చే విధంగా నిబంధనలు అమలు చేస్తున్నాయి. 
► శ్లాబ్‌–1 ప్రకారం– రూ.4 లక్షలు రుణ మొత్తంగా నిర్ణయించారు. ఈ శ్లాబ్‌లో విద్యార్థులు ఎలాంటి హామీ ఇవ్వక్కర్లేదు.
► శ్లాబ్‌–2 ప్రకారం– రూ.4లక్షల నుంచి రూ.7.5లక్షల వరకు రుణ మొత్తాన్ని కేటాయిస్తున్నారు. ఇందుకోసం తల్లిదండ్రుల హామీ, థర్డ్‌ పార్టీ గ్యారెంటీ పత్రం ఇవ్వాల్సి ఉంటుంది.
► శ్లాబ్‌–3 విధానం ప్రకారం– రూ.7.5 లక్షలకు పైగా రుణ మొత్తం లభిస్తోంది. దీనికి దరఖాస్తు చేయాలనుకుంటే.. ఈ మొత్తానికి సరిపడే కొల్లేటరల్‌ సెక్యూరిటీ(స్థిరాస్థి పత్రాలను) ఇవ్వాల్సి ఉంటుంది.



మార్జిన్‌ మనీ చెల్లింపు
ఎడ్యుకేషన్‌ లోన్‌ కోరుకునే విద్యార్థులు తాము దరఖాస్తు చేసుకున్న రుణ మొత్తంలో కొంత మొత్తాన్ని మార్జిన్‌ మనీగా సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు రూ.4 లక్షల వరకు ఎలాంటి మార్జిన్‌ మనీ అవసరం లేదు. కాని రూ.4 లక్షలు దాటిన రుణ దరఖాస్తులకు స్వదేశంలో విద్యకు అయిదు శాతం, విదేశీ విద్యకు 15 శాతం మార్జిన్‌ మనీని సమకూర్చుకోవాల్సి ఉంటుంది.

రుణం లభించే వ్యయాలు
 ట్యూషన్‌ ఫీజు, హాస్టల్‌ ఫీజు, ఎగ్జామినేషన్‌/ లైబ్రరీ/లేబొరేటరీ ఫీజు, విదేశీ విద్య విద్యార్థులకు ప్రయాణ ఖర్చులు, పుస్తకాలు, యూనిఫామ్, ఇతర అకడమిక్‌ సంబంధిత పరికరాల కొనుగోలుకు అయ్యే వ్యయం, కంప్యూటర్‌ కొనుగోలు వ్యయం; కోర్సు పరంగా అవసరమైన స్టడీ టూర్స్, ప్రాజెక్ట్‌ వర్క్స్‌ తదితరాలకు అయ్యే ఖర్చు రుణంగా లభిస్తుంది. 



► ఇన్‌స్టిట్యూట్‌లు వసూలు చేసే కాషన్‌ డిపాజిట్, బిల్డింగ్‌ ఫండ్, రిఫండబుల్‌ డిపాజిట్‌లకు కూడా రుణం మంజూరు చేస్తారు. ఇవి నిర్దేశిత ట్యూషన్‌ ఫీజు మొత్తంలో 10 శాతానికి మించకుండా ఉండాలి.

  కంప్యూటర్‌ కొనుగోలు వ్యయం, స్టడీ టూర్స్, ప్రాజెక్ట్‌ వర్క్స్‌ కోసం ఇచ్చే మొత్తం ట్యూషన్‌ ఫీజులో 20 శాతానికి మించకుండా ఉంటుంది.

తిరిగి చెల్లింపు ఇలా
► విద్యా రుణం తిరిగి చెల్లించే విషయంలో బ్యాంకులు ఇటీవల కొంత సరళీకృత విధానాలు అనుసరిస్తున్నాయి. రీపేమంట్‌ హాలిడే పేరుతో కోర్సు పూర్తయిన తర్వాత సంవత్సరం నుంచి లేదా కోర్సు పూర్తయి ఉద్యోగం లభించినప్పటి నుంచి వాయిదాల పద్ధతిలో తిరిగి చెల్లించే వెసులుబాటు కల్పిస్తున్నాయి. ఇలా గరిష్టంగా 15 సంవత్సరాల వ్యవధిలో ఈఎంఐ విధానంలో రుణం మొత్తం చెల్లించొచ్చు.



► రుణ తిరిగి చెల్లింపు పరంగా స్టార్టప్‌ ఔత్సాహిక విద్యార్థులకు ప్రత్యేక వెసులుబాటు లభిస్తోంది. దీని ప్రకారం–స్టార్టప్‌ ఏర్పాటు చేసిన విద్యార్థులు.. కోర్సు పూర్తయ్యాక రెండేళ్ల తర్వాత నుంచి రుణం తిరిగి చెల్లించొచ్చు. 

► ఉన్నత విద్యనభ్యసించే మహిళా విద్యార్థులను ప్రోత్సహించే దిశగా బ్యాంకులు విద్యారుణాల వడ్డీ రేట్లలో 0.5 శాతం నుంచి ఒక శాతం వరకు రాయితీ ఇస్తున్నాయి.

టాప్‌ ఇన్‌స్టిట్యూట్‌లో చేరితే
ప్రస్తుతం ఐబీఏ మార్గనిర్దేశకాల ప్రకారం–విద్యా ర్థులు ప్రతిష్టాత్మక ఇన్‌స్టిట్యూట్‌లలో ప్రవేశం పొందితే.. గరిష్ట రుణ మొత్తాన్ని పెంచే విచక్షణాధికా రాన్ని బ్యాంకులకు కల్పించింది. ఉదాహరణకు ఐఐ ఎంలు, ఐఐటీల వంటి ప్రతిష్టాత్మక ఇన్‌స్టిట్యూట్‌ లలో రూ.పది లక్షల కంటే ఎక్కువ ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. ఇలాంటి ఇన్‌స్టిట్యూట్‌లలో ప్రవేశం పొందిన వారికి గరిష్ట రుణ పరిమితి విషయంలో సడలింపు ఇచ్చే అవకాశం ఉంది. 

నిరంతర సమీక్ష
విద్యా రుణం మంజూరు అయిన విద్యార్థికి సంబం«ధించిన ఫీజులను బ్యాంకులు నేరుగా సంబంధిత ఇన్‌స్టిట్యూట్‌కే పంపుతాయి. ఒకవేళ తొలి దశలో విద్యార్థులు సొంతంగా ఫీజు చెల్లించి ఉంటే.. సంబంధిత రశీదుల ఆధారంగా తొలి దశ ఫీజును విద్యార్థికి ఇస్తాయి. ఆ తర్వాత దశ నుంచి ఇన్‌స్టిట్యూట్‌కు పంపుతాయి. ప్రతి ఏటా విద్యా సంవత్సరం ప్రారంభ సమయంలో నిర్దేశిత గడవు తేదీలోగా ఇన్‌స్టిట్యూట్‌కు చెల్లిస్తాయి. అంతేకాకుండా అంతకుముందు సంవత్సరంలో చదువులో సదరు విద్యార్థి ప్రతిభను సమీక్షిస్తున్నాయి.
 
దరఖాస్తుకు అవసరమైన పత్రాలు
ప్రవేశ ధ్రువీకరణ పత్రం
► అకడమిక్‌ అర్హతల సర్టిఫికెట్ల జిరాక్స్‌ కాపీలు
► తల్లిదండ్రుల ఆదాయ ధ్రువీకరణ
► తల్లిదండ్రుల ఆదాయ స్థితిగతుల వివరాలు, బ్యాంకు అకౌంట్‌ స్టేట్‌మెంట్స్‌
► నివాస ధ్రువీకరణ
► థర్డ్‌పార్టీ ఆదాయ ధ్రువీకరణ
► కోర్సు వ్యయానికి సంబంధించి ఇన్‌స్టిట్యూట్‌ల నుంచి అధీకృత లెటర్స్‌.
► పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://www.iba.org.in/

ఎడ్యుకేషన్‌ లోన్స్‌.. ముఖ్యాంశాలు
 స్వదేశీ, విదేశీ విద్యకు బ్యాంకుల రుణాలు.
► నియంత్రణ సంస్థలు, ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థల్లో ప్రవేశిస్తేనే రుణ దరఖాస్తుకు అర్హత.
► కనిష్టంగా రూ.4 లక్షలు గరిష్టంగా రూ.15 లక్షల వరకు రుణ మొత్తం.
► విదేశీ విద్య, ఐఐఎంలు, ఐఐటీలు వంటి ఇన్‌స్టిట్యూట్‌లలో ప్రవేశం పొందితే రుణ మొత్తాన్ని పెంచే అవకాశం.
► మహిళా విద్యార్థులను ప్రోత్సహించేలా ఇంట్రస్ట్‌ సబ్సిడీ స్కీమ్‌.
► విద్యాలక్ష్మి పోర్టల్‌ పేరిట ఆన్‌లైన్‌లో ఒకేసారి మూడు బ్యాంకులకు రుణ దరఖాస్తు చేసుకునే సదుపాయం. 

విద్యా లక్ష్మి పోర్టల్‌.. ఆన్‌లైన్‌ ద్వారా
విద్యారుణం కోసం కేంద్ర ప్రభుత్వం విద్యా లక్ష్మి పేరుతో ప్రత్యేక పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ పోర్టల్‌.. విద్యా రుణాల విషయంలో విద్యార్థులకు, బ్యాంకులకు మధ్య అనుసంధానకర్తగా పనిచేస్తుంది. విద్యార్థులు విద్యాలక్ష్మి పోర్టల్‌లో లాగిన్‌ అయి..  కామన్‌ ఎడ్యుకేషనల్‌ లోన్‌ అప్లికేషన్‌ ఫామ్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.  గరిష్టంగా మూడు బ్యాంకులకే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇలా ఆన్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తులను.. అభ్యర్థులు ప్రాథమ్యంగా పేర్కొన్న బ్యాంకులకు పంపిస్తారు. తర్వాత దశలో సదరు బ్యాంకులు దరఖాస్తును పరిశీలించి సంతృప్తి చెందితే.. ఏ బ్రాంచ్‌లో సంప్రదించాలి, ఏ ఏ పత్రాలు తీసుకెళ్లాలి అనే వివరాలను విద్యార్థులకు తెలియజేస్తాయి. 
వెబ్‌సైట్‌: www.vidyalakshmi.co.in  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement