Educational loan
-
పాఠం కోసం ఫారిన్ వెళదాం చలోచలో!
ఇంగ్లాండ్‌లో అడుగు పెడుతూనే ‘ఎలాగో జ్ఞాపకం పెట్టుకొని కుడికాలే పెట్టాను. నిజానికి అదృష్టం బాగుంటే ఏ కాలు పెట్టినా ఇబ్బంది లేదు. బాగుండకపోతే ఏ కాలు పెట్టినా ఒక్కటే’ అనుకుంటాడు పార్వతీశం. బారిష్టరు చదువు కోసం ఉన్న పల్లెటూరు నుంచి ఇంగ్లాండ్‌కు వెళ్లిన పార్వతీశం తెలియని భాష, మనుషులు, సంస్కృతుల వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతూ మనల్ని తెగ నవ్విస్తాడు. కాలం మారినంత మాత్రాన, చదువు కోసం వెళ్లినవారికి దేశం కాని దేశంలో సమస్యలు ఉండవని కాదు. అవి వేరే రకంగా ఉండవచ్చు. అవి ఏ రకంగా ఉన్నా సరే... యూత్ వాటిని లైట్‌గా తీసుకుంటుంది. విదేశీ యూనివర్శిటీలలో చదువుపై బోలెడు లవ్వు చూపుతోంది... విదేశీ చదువు అనేది ఒకప్పుడు సంపన్న వర్గాల వారికి మాత్రమే పరిమితమైన విషయం. అయితే ఇప్పుడు దృశ్యం మారింది. ఆర్థికస్థాయి, చిన్నా, పెద్దా పట్టణాలు అనే తేడా లేకుండా ఎంతోమంది విద్యార్థులు విదేశాలకు వెళుతున్నారు. ఎనభైలలో ఫారిన్ యూనివర్శిటీ అంటే ఎక్కుమందికి అమెరికాలోని యూనివర్శిటీలు మాత్రమే. ఇప్పుడు అమెరికా, ఆస్ట్రేలియా, కెనడాలతో పాటు రిమోట్ ఈస్ట్ యూరోపియన్ దేశాలపై కూడా యువత ఆసక్తి ప్రదర్శిస్తోంది. ‘ఎందుకు ఇలా?’ అనే ప్రశ్నకు రకరకాల సమాధానాలు వినిపిస్తాయి. అందులో ఒకటి... ‘పాఠ్యపుస్తకాలను, తరగతి గదినీ దాటి మన విద్యావ్యవస్థ బయటికి రాలేకపోతోంది. పాఠ్యాంశం యూత్‌కు దగ్గర కాలేపోతోంది’ దిల్లీకి చెందిన పద్దెనిమిది సంవత్సరాల శ్రేయకు ఎన్విరాన్మెంటల్ టెక్నాలజీ అంటే ఆసక్తి. ఆ ఆసక్తి ఆమెను అమెరికాలోని ‘జార్జియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’ వరకు తీసుకువ్చంది. ‘ఈ యూనివర్శిటీ డిగ్రీ మాత్రమే ఇవ్వదు. ఎంతో అనుభవ జ్ఞానాన్ని ఇస్తుంది’ అంటుంది శ్రేయ. ఫ్లెక్సిబుల్ కరికులమ్ నుంచి ప్రపంచంలోనే అత్యున్నతమైన బోధన సిబ్బంది వరకు ఆ యూనివర్శిటీ గురించి చెప్పుకోదగిన అంశాలను ప్రస్తావిస్తుంది శ్రేయ. ‘విద్యార్థులు తమను తాము వ్యక్తీకరించుకునే అనుభవ జ్ఞానాన్ని విదేశీ విశ్వవిద్యాలయాలు ఇస్తాయి’ అంటున్నారు దిల్లీ యూనివర్శిటీ మాజీ వైస్–ఛాన్సలర్ దినేష్ సింగ్. అయితే ‘అత్యున్నత ప్రవణాలతో కూడిన చదువు’ మాత్రమే మన విద్యార్థులు దేశం దాటడానికి కారణం కావడం లేదు. ‘భిన్నమైన సాంస్కృతిక వాతావరణంలో గడపడం, ఇతర దేశాల విద్యార్థులతో కలిసి చదువుకొనే అవకాశం దానికదే ఒక ఎడ్యుకేషన్’ అనే అభిప్రాయం కూడా విదేశీ విశ్వవిద్యాలయాలపై ఆసక్తికి కారణం అవుతుంది. ‘విదేశీ యూనివర్శిటీలలో చదువుకోవడం అనేది మన విద్యావ్యవస్థను తక్కువ చేయడం కాదు. మన పరిధిని విస్తృతం చేసుకోవడం మాత్రమే’ అంటుంది పుణెకు చెందిన సుమన. దిల్లీకి చెందిన 19 సంవత్సరాల సైబా బజాజ్ కెనడాలోని ‘యూనివర్శిటీ ఆఫ్ మనిటోబ’లో కంప్యూటర్ సైన్స్ చదువుతోంది. ‘విదేశాలలో చదువు అనేది డిగ్రీలను మించినది. ఇది ఒక రకంగా సెల్ఫ్–జర్నీ’ అంటుంది సైబా. బెంగళరుకు చెందిన ప్రతిభా జైన్ గ్రాఫిక్ డిజైనింగ్ కోర్సు చేయడానికి యూకేకు వెళ్లాలనుకుంటోంది. ఈ మావ\త్రం దానికి అక్కడిదాకా వెళ్లాలా! అనిపిస్తుందిగానీ ప్రతిభ వెర్షన్ వేరు. ‘యూకేకు వెళ్లాలనుకోవడానికి కారణం... అక్కడి యూనివర్శిటీ ఫర్ ది క్రియేటివ్ ఆర్ట్స్‌కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో ప్రపంచంలో పెద్ద పేరు ఉండడం ఒక కారణం అయితే, సాంస్కృతిక వైవిధ్యం, గ్లోబల్ ఎక్స్పోజర్ అనేది రెండో కారణం. మూడోకారణం ఒకేరకమైన అభిరుచులు ఉన్న వారితో, సబ్జెక్ట్‌కు సంబంధించిన నిపుణులతో కలిసి నెట్‌వర్క్‌గా ఏర్పడే అవకాశం ఉండడం’ అంటుంది ప్రతిభ. జాబ్ మార్కెట్లో సులువుగా విజయం సాధిస్తారు అనే ధీమా వల్ల, మల్టీ కల్చరల్ యూనివర్శిటీలలో తమ పిల్లలను చదివించడానికి పేరెంట్స్ ఆసక్తి చూపుతున్నారు. పక్కా ఫైనాన్స్ ప్లానింగ్, ఎడ్యుకేషన్ లోన్ల వల్ల పిల్లలను విదేశీ యూనివర్శిటీలలో చదివించడం చాలామంది పేరెంట్స్‌కు పెద్ద సమస్య కావడం లేదు. తల్లిదండ్రుల ఆసక్తిని గమనించి నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ(ఎన్బీఎఫ్సీ)లు ఎడ్యుకేషన్ లోన్స్‌పై ప్రత్యేక దృష్టి పెడుతున్నాయి. మరోవైపు ‘అబ్రాడ్ ఎడ్యుకేషన్ లోన్స్’కు బెస్ట్ ఎన్బీఎఫ్సీలు ఏమిటి? అని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు పేరెంట్స్. టెస్ట్–ప్రిపేరేషన్, కంట్రీ, కోర్సు, యూనివర్శిటీ ఎంపిక, డాక్యుమెంటేషన్ ప్లానింగ్... మొదలైన వాటిలో స్టడీ అబ్రాడ్ కన్సల్టెన్సీలపై ఆధారపడుతోంది యూత్. జపాన్ అయినా ఓకే అబ్రాడ్ ఎడ్యుషన్ అనగానే అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ... మొదలైన దేశాలు గుర్తుకు వస్తాయి తప్ప జపాన్ గుర్తుకు రావడం జరగదు. అయితే గణాంకాల ప్రకారం జపాన్ యూనివర్శిటీలలో చదివే మన విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. కొన్ని సంవత్సరాల క్రితం జపాన్‌లోని 20 యూనివర్శిటీల ప్రతినిధులు దిల్లీ, పుణె, చెన్నైలలో హైస్కూల్, కాలేజీలలో నిర్వహింన ఎడ్యుకేషన్ ఫెయిర్‌కు మం స్పందన లభించింది. (చదవండి: ఇంట్లోనే బీర్ తయారీ..జస్ట్ క్షణాల్లో రెడీ చేసుకోవచ్చు ఎలాగంటే) -
విద్యార్థులకు లియో 1 క్రెడిట్ కార్డ్
హైదరాబాద్: ఎడ్యుఫిన్‌టెక్ సంస్థ లియో 1, క్యాంపస్‌లలో నగదుతో పని లేకుండా ఉండేందుకు కో బ్రాంబెడ్ క్రెడిట్ కార్డు ‘లియో1 కార్డ్’ను విడుదల చేయనుంది. ఇందుకు స్టూడెంట్ ట్రైబ్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఆర్థిక క్రమశిక్షణతో ఉండే విద్యార్థులకు దీన్ని ఆఫర్ చేయనున్నట్టు సంస్థ తెలిపింది. విద్యా సంస్థలను నగదు రహితంగా మార్చడమే తమ భాగస్వామ్యం లక్ష్యమని పేర్కొంది. -
విద్యా రుణాల్లోనూ ఎన్పీఏల వాత
న్యూఢిల్లీ: ఉన్నత విద్య కల సాకారానికి సాయపడే విద్యా రుణాలకు సంబంధించి బ్యాంకుల్లో అప్రమత్త ధోరణి పెరుగుతోంది. ఎందుకంటే విద్యా రుణాల్లో ఎగవేతలు 8 శాతానికి చేరాయి. దీంతో తాజా విద్యా రుణాల మంజూరులో ఆచితూచి అడుగులు వేసేలా బ్యాంకుల ధోరణిలో మార్పు కనిపిస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు ఇచ్చిన మొత్తం విద్యా రుణాల్లో ఎగవేతలు (మొండి బకాయిలు/ ఎన్పీఏలు) ఈ ఏడాది జూన్ చివరికి 7.82 శాతానికి పెరిగిపోయాయి. వసూలు కావాల్సిన విద్యా రుణాల మొత్తం రూ.80వేల కోట్లుగా ఉంది. ఎన్పీఏలు పెరిగిపోయినందున బ్యాంకు శాఖల వారీగా అప్రమత్త విధానాన్ని అనుసరిస్తున్నట్టు ఓ ప్రభుత్వరంగ బ్యాంకు సీనియర్ అధికారి వెల్లడించారు. దీనివల్ల నిజాయితీ రుణ కేసుల్లోనూ మరింత పరిశీలన అవసరపడుతుందని, ఇది జాప్యానికి దారితీయవచ్చన్నారు. విద్యా రుణాల్లో జాప్యాన్ని నివారించడానికి, విద్యా రుణాల పోర్ట్‌ఫోలియో సమీక్షపై ఇటీవలే ప్రభుత్వరంగ బ్యాంకులతో కేంద్ర ఆర్థిక శాఖ సమావేశాన్ని నిర్వహించడం గమనార్హం. విద్యా రుణాల్లో ఇటీవలి కాలంలో ఎన్పీఏలు గణనీయంగా పెరిగిపోవడం అన్నది ఆందోళనకర అంశమని, దేశంలో ఉన్నత విద్యకు మద్దతుగా బ్యాంకుల రుణ వితరణకు ఇది విఘాతమని ఆర్బీఐ ఇటీవలి బులెటిన్ సైతం పేర్కొంది. ఉపాధి అవకాశాల్లేమి వల్లే.. మన దేశంలో 90 శాతం మేర విద్యా రుణాలను ప్రభుత్వరంగ బ్యాంకులే అందిస్తున్నాయి. ప్రైవేటు రంగ బ్యాంకులు కేవలం ఏడు శాతం, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు 3 శాతం చొప్పున వాటాను 2020 మార్చి నాటికి కలిగి ఉన్నాయి. ఉద్యోగ మార్కెట్లోకి వస్తున్న పట్టభద్రుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధి అవకాశాల కల్పన లేదని రీసర్జంట్ ఇండియా ఎండీ జ్యోతి ప్రకాష్ పేర్కొన్నారు. ఇది విద్యా రుణ ఎగవేతలు పెరిగేందుకు కారణంగా అభిప్రాయపడ్డారు. దీంతో బ్యాంకులు విద్యా రుణాల విషయంలో అప్రమ్తతంగా వ్యవహరిస్తున్నట్టు చెప్పారు. ముఖ్యంగా రూ.7.5 లక్షల వరకు రుణాలను (హామీ/తాకట్టు ఉన్నవి, లేనివి) ఇవ్వడానికి వెనుకాడున్నట్టు పేర్కొన్నారు. నూతన విద్యా పాలసీని సమర్థంగా అమలు చేయడం, కనీస నైపుణ్యాలు, ఉపాధి కల్పన చర్యలు భాగస్వాములు అందరికీ మేలు చేస్తాయన్నారు. విద్యా రుణాలకు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ రూపొందించిన నమూనాను బ్యాంకులు అనుసరిస్తున్నాయి. దీని కింద రూ.4 లక్షల వరకు విద్యా రుణాలకు ఎటువంటి తాకట్టు అవసరం లేదు. రూ.7.5 లక్షల వరకు రుణాలకు మూడో పార్టీ నుంచి గ్యారంటీ ఇవ్వాల్సి ఉంటుంది. -
ఎడ్యుకేషన్‌లోన్ కావాలా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి..
విదేశాల్లో చదువుకుని, కెరీర్‌ను గ్రాండ్‌గా మొదలు పెట్టాలన్నది చైతన్య (24) డ్రీమ్. బీటెక్ చేసిన తర్వాత రెండేళ్లపాటు సాఫ్ట్వేర్ డెవలపర్‌గా పనిచేశాడు. ఫ్రాన్స్‌లోని మాంట్పెల్లియర్ బిజినెస్ స్కూల్లో ఎంఎస్సీ డిగ్రీ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్నాడు. డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ కోర్సుకు పాక్షికంగా స్కాలర్ షిప్ రావడంతో అతడు ఎంతో సంతోషించాడు. కానీ, అప్పుడే అసలు సవాలు ఎదురైంది. వచ్చిన స్కాలర్షిప్ కొద్ది మొత్తమే, మిగిలిన మొత్తాన్ని రుణం ద్వారా సమకూర్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది. విద్యా రుణం సులభంగా లభిస్తుందని అనుకోవచ్చు. కానీ, ఆచరణలో ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. నెల రోజుల పాటు ప్రశాంతత కోల్పోయి అతడు చేసిన ప్రయత్నం ఫలించింది. ప్రతిష్టాత్మక విద్యా సంస్థలో సీటు కావడంతో బ్యాంకు విద్యా రుణానికి ఓకే చెప్పింది. అందుకే, విద్యా రుణం పొందడం అనుకున్నంత సులభం కాదు. రుణం ఇచ్చే సంస్థ అన్ని విషయాలను స్పృశిస్తుంది. ఎలా వ్యవహరిస్తే సులభంగా రుణం లభిస్తుంది? ఈ విషయంలో ఉన్న సవాళ్లు, వాటిని అధిగమించడంపై అవగాహన కల్పించే కథనమే ఇది. ఏటా వేలాది మంది భారత విద్యార్థులు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళుతున్నారు. విదేశాంగ శాఖ వద్దనున్న తాజా సమాచారం మేరకు.. కరోనా తర్వాత కూడా విదేశాలకు వెళ్లే విద్యార్థుల సంఖ్యలో వృద్ధి కనిపిస్తోంది. 2021లో 11 లక్షల మంది భారత విద్యార్థులు విదేశీ చదువుల కోసం వెళ్లారు. 2024లో భారత్ నుంచి సుమారు 18 లక్షల మంది విదేశాల్లో ఉన్నత విద్యను ఎంపిక చేసుకోవచ్చని కన్సల్టెన్సీ సంస్థ రెడ్‌సీర్ అంచనా. వారు చేసే ఖర్చు వార్షికంగా 80 బిలియన్ డాలర్లు (రూ.6.16 లక్షల కోట్లు) ఉంటుందని ఈ సంస్థ పేర్కొంది. విద్యా రుణాన్ని నమ్ముకుని విదేశీ విద్యకు ప్లాన్ చేసుకునే వారు ముందుగానే ఇందుకు సంబంధించి వాస్తవ అంశాలను, పూర్తి సమాచారాన్ని తెలుసుకోవాలి. క్షేత్రస్థాయిలో ప్రత్యక్షంగా విచారించుకోవాలి. ‘‘ముఖ్యంగా బ్యాంకింగ్ రంగం విద్యా రుణాలను పరిమితంగానే మంజూరు చేస్తోంది. వచ్చిన ప్రతి దరఖాస్తుకు ఆమోదం చెప్పడం లేదు. గుర్తింపు పొందిన యూనివర్సిటీలు, విద్యా సంస్థల పూర్తి జాబితానే చాలా బ్యాంకుల వద్ద లేదంటే విద్యా రుణాల విషయంలో వాటికి ఎంత ఆసక్తి ఉందో అర్థం చేసుకోవచ్చు’’అని లాంచ్మైకెరీర్ అనే కెరీర్ కౌన్సెలింగ్ ప్లాట్‌ఫామ్ గ్లోబల్ లీడర్ సుష్మాశర్మ తెలిపారు. బ్యాంకును గుర్తించడం.. విద్యా సంస్థలు, దేశాలకు సంబంధించి పరిమితులు ఉన్నాయి. తమ ముందుకు వచ్చే ప్రతి విదేశీ విద్యా రుణ దరఖాస్తును బ్యాంకులు ఆమోదించవు. పైగా ఒక బ్యాంకుకు సంబంధించి కూడా అన్ని శాఖలు ఈ వ్యాపారం చూడడం లేదు. చైతన్య ముందుగా ఎన్బీఎఫ్సీ నుంచి రుణం తీసుకుందామని అనుకున్నాడు. సులభంగా, వేగంగా వస్తుందని అనుకుని కొన్ని ఎన్బీఎఫ్సీలను సంప్రదించాడు. కానీ, ఒక్కటంటే ఒక్కటీ చైతన్య సీటు సంపాదించిన యూనివర్సిటీ కోర్సులకు రుణాలను ఆఫర్ చేయడం లేదని తెలిసి ఆశ్చర్యపోయాడు. చివరికి ఎస్బీఐని సంప్రదించగా అతడి ప్రయత్నం ఫలించింది. అదీ మెయిన్ బ్రాంచ్‌కు వెళ్లాల్సి వచ్చింది. కావాల్సినంత రుణం.. విదేశీ విద్యా కోర్సు అంటే ఫీజులకే బోలెడు ఖర్చు అవుతుంది. ఇదే పెద్ద సవాలు. విదేశీ విద్యా సంస్థల్లో సీటు కోసం దరఖాస్తు చేసుకునే ముందే ట్యూషన్ పీజులతోపాటు అక్కడ నివసించేందుకు అయ్యే వ్యయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సుష్మాశర్మ సూచించారు. ఇక కావాల్సినంత రుణం లభించక, తాము సొం తంగా సమకూర్చుకోలేని సందర్భాల్లో విద్యార్థులు రాజీమార్గాలను అనుసరించడాన్ని గమనించొచ్చు. కావాల్సి నంత రుణం/నిధులు సమకూరని సందర్భంలో అవసరమైతే కోర్సును లేదంటే విద్యా సంస్థను మార్చే వారు కూడా ఉన్నట్టు ఫ్లై మాస్టర్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ ఎండీ రాజేష్ వర్మ తెలిపారు. ఉద్యోగ అవకాశాలు.. రుణం ఇచ్చే ముందు ఏ బ్యాంకు అయినా, మరో సంస్థ అయినా ఏం చూస్తుంది..? రుణం తీసుకున్న వ్యక్తికి తిరిగి చెల్లించే సామర్థ్యం ఉందా..? అనే కదా.. అలాగే, విద్యా రుణం విషయంలో బ్యాంకులు అభ్యర్థి చేస్తున్న కోర్సు, ఉద్యోగ మార్కెట్లో ఆ కోర్సుకు ఉన్న డిమాండ్‌ను పరిశీలిస్తాయి. ఇందులో భాగంగా విద్యార్థి చదవబోయే విద్యాసంస్థకు ఉన్న పేరు, గుర్తింపు, అందులో చదివిన వారికి ఉపాధి అవకాశాలు ఏ మేరకు ఉన్నాయి? ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుంటాయి. ‘‘విద్యార్థి కేంబ్రిడ్జ్ లేదా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ వంటి విద్యా సంస్థలకు వెళ్లొచ్చు. కానీ, ఈ తరహా ప్రతిష్టాత్మక, పేరొందిన ఇనిస్టిట్యూషన్స్‌కు నేరుగా దరఖాస్తు చేసుకోవడానికి బదులు విద్యార్థులు ఏజెన్సీలను ఆశ్రయిస్తుంటారు. దాంతో చివరికి పెద్దగా తెలియని యూనివర్సిటీలో అడ్మిషన్‌తో వారు సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. అటువంటప్పుడు విద్యా రుణం కష్టంగా మారుతుంది’’ అని విద్యా రుణాల మార్కెట్‌ప్లేస్ అయిన విమేక్స్కాలర్స్ సహ వ్యవస్థాపకుడు అర్జున్ ఆర్ కృష్ణ తెలిపారు. పేపర్ వర్క్ కావాల్సిన డాక్యుమెంట్లను సిద్ధం చేసుకోవడం ముఖ్యమైన కార్యక్రమం. డాక్యుమెంట్ ప్రక్రియ ఎంత క్లిష్టమో ఇప్పటికే రుణం తీసుకుని విదేశీ విద్యా కోర్సు చేస్తున్న వారిని అడిగితేనే తెలుస్తుంది. విభా షణ్ముఖ్ (33) యూఎస్‌లోని రైస్ యూనివర్సిటీలో పీహెచ్డీ చదువుతున్నారు. డాక్యుమెంటేషన్ ప్రక్రియ ఎంత క్లిష్టతరమో తన అనుభవాన్ని వెల్లడించారు. డల్లాస్‌లోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్‌లో ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదివేందుకు 2013లో ఆయన ఓ ప్రభుత్వ రంగ బ్యాం కులో రుణానికి దరఖాస్తు చేసుకున్నారు. ‘‘బ్యాంకు అడిగిన అన్ని పత్రాలను తీసుకెళ్లి ఇచ్చాను. అయినా కానీ, కోర్సుకు అయ్యే ఖర్చు, ఇతర వ్యయాలకు సంబంధించి యూనివర్సిటీ నుంచి ధ్రువీకరణ పత్రం కావాలని బ్యాంకు అడిగింది. కానీ యూనివర్సిటీల నుంచి ఈ తరహా పత్రాలు పొందడం అదిపెద్ద సవాలు’’అని షణ్ముఖ్ తెలిపారు. తాకట్టు.. దేశీ యూనివర్సిటీల్లో కోర్సుల కోసం రుణాలు తీసుకునేట్టు అయితే బ్యాంకులు తనఖా కోరవు. కానీ, విదేశీ వర్సిటీల్లో విద్య కోసం తీసుకునే రుణాలకు సంబంధించి తనఖా పెట్టాలని బ్యాంకులు అడుగుతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వరంగ బ్యాంకులు తనఖా కోరుతున్నాయి. తనఖా కింద స్తిరాస్థి, ప్రావిడెంట్ ఫండ్ లేదా సెక్యూరిటీ డిపాజిట్ ఇస్తే సరిపోతుంది. చాలా ఎన్బీఎఫ్సీలు, ప్రైవేటు బ్యాంకులు తనఖా అడగడం లేదు. మాస్టర్స్ కోర్సులకు తనఖా లేకుండానే ఇవి రుణాలు ఇస్తున్నాయి. వివరాలు సమగ్రంగా తెలుసుకుని ముందడుగు వేయాలి. అధిక వ్యయాలు ప్రభుత్వరంగ బ్యాంకుల్లో విద్యా రుణానికి డాక్యుమెంట్లు సమర్పణ, ఆమోదం ప్రక్రియ కొద్దిగా కష్టం అనిపిస్తుంది. అదే ఎన్బీఎఫ్సీలు, ప్రైవేటు బ్యాంకుల నుంచి విద్యా రుణం సులభంగానే లభిస్తుంది. కాకపోతే ప్రభుత్వరంగ బ్యాంకులతో పోలిస్తే వీటిల్లో వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ చార్జీలు ఎక్కువగా ఉంటుంటాయి. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో విద్యా రుణాలపై రేట్లు 6.9 శాతం నుంచి 12.5 శాతం మధ్య ఉన్నాయి. ప్రైవేటు బ్యాంకుల్లో 10.5 శాతం నుంచి 13 శాతం మధ్య ఉన్నాయి. ఎన్బీఎఫ్సీలు, ప్రైవేటు బ్యాంకులు (ఎక్కువ శాతం) ఇచ్చే విద్యా రుణాలకు మారటోరియం ఉండడం లేదు. దీంతో రుణం మంజూరు చేసిన మరుసటి నెల నుంచే చెల్లింపులు మొదలు పెట్టాల్సి ఉంటుంది. మారటోరియం అంటే.. కోర్సు కాల వ్యవధికి ముగిసిన తర్వాత ఆరు నెలల వరకు రుణానికి చెల్లింపులు చేయక్కర్లేదు. కోర్సు అనంతరం ఉద్యోగం పొందేందుకు వీలుగా ఆరు నెలల వ్యవధి ఉంటుంది. దీనివల్ల విద్యార్థి కుటుంబానికి ఎంతో ఉపశమనం ఉంటుంది. అందుకుని రుణానికి వెంటనే చెల్లింపులు చేయలేని వారు ప్రభుత్వరంగ బ్యాంకుల్లో మారటోరియంతో కూడిన విద్యా రుణానికే ప్రయత్నించాలి. రుణానికి ముందే ప్రణాళిక ఉండాలి.. సాధారణంగా విద్యార్థులు తమ బడ్జెట్ కోణం నుంచి విదేశాల్లో ప్రవేశాలకు ప్రయత్నిస్తుంటారు. అంటే తక్కువ వ్యయాలు అయ్యే ప్రాంతాలను ఎంపిక చేసుకుంటుంటారు. దీనివల్ల అంతగా ప్రాచుర్యం లేని దేశం లేదా విద్యా సంస్థలో చేరాల్సి వస్తుంది. అందుబాటు ధరలు ఏ దేశంలో ఉన్నాయో విచారించుకుని అక్కడ విద్యాసంస్థను ఎంపిక చేసుకుంటున్నారు. ‘‘ఉదాహరణకు ఒక విద్యార్థి రూ.20లక్షలు ఖర్చు చేయగలనని అనుకుంటే ఆమె లేదా అతడు జర్మనీలో ప్రవేశం కోసం ప్రయత్నిస్తున్నారు. అంతకంటే ఎక్కువ బడ్జెట్ పెట్టుకోగలిగితే యూఎస్ లేదా యూకేలో ప్రవేశం కోసం ప్రయత్నం చేస్తున్నారు. విద్యా రుణం పొందే విషయంలో పేరున్న యూనివర్సిటీయే కాకుండా, దేశానికీ ప్రాధాన్యం ఉంటుంది’’అని కృష్ణ వివరించారు. విద్యా సంస్థలు పేరున్నవి, ప్రతిష్టాత్మకమైనవి అయితే బ్యాంకులు తనఖా కోరడం లేదు. ప్రభుత్వరంగ బ్యాంకులు అయితే యూనివర్సిటీలు, కోర్సులతో జాబితాను నిర్వహిస్తున్నాయి. ఏఏ వర్సిటీలు, ఏ కోర్సులకు తక్కువ వడ్డీ రేటు రుణాలు, తక్కువ తనఖాతో మంజూరు చేయాలో ఈ జాబితానే వాటికి ప్రామాణికంగా ఉంటోంది. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలతోపాటు ప్రొడిగీ ఫైనాన్స్, ఎంపవర్ ఫైనాన్సింగ్ తదితర అంతర్జాతీయ సంస్థలు సైతం విద్యా రుణాలు ఇస్తున్నాయి. కొన్ని యూనివర్సిటీలు విదేశీ విద్యార్థులకు విద్యారుణాల పరంగా సాయాన్ని అందిస్తున్నాయి. ‘‘గ్రామీణ ప్రాంతాల్లో ఆస్తులు ఉన్నవారు, సరైన పత్రాలను అందించలేని వారికి విద్యా రుణం పరంగా ప్రైవేటు బ్యాంకులు సౌకర్యం’’అని కృష్ణ తెలిపారు. స్కాలర్షిప్ ‘‘విదేశీ విద్య కోసం వెళ్లే వారిలో కోర్సుకు అయ్యే వ్యయం మేర పూర్తి స్కాలర్షిప్ పొందే అవకాశం 2–3 శాతం మందికే ఉంటుంది. కానీ, పాక్షిక స్కాలర్షిప్ను అందించే విద్యా మండళ్లు, ఇనిస్టిట్యూషన్స్ కూడా ఉన్నాయి’’అని కృష్ణ తెలిపారు. దరఖాస్తు సమయంలోనే స్కాలర్షిప్ కోసం ప్రయత్నించాలని ఆయన సూచించారు. ఇందుకోసం ఎన్నో పథకాలు అవకాశాలున్నట్టు చెప్పారు. సున్నా వడ్డీ రుణాలు, విరాళాలు కూడా అందుబాటులో ఉన్నట్టు తెలిపారు. టాటా ఫౌండేషన్, అగాఖాన్ ఫౌండేషన్ తదితర సంస్థలు సాయం అందిస్తున్నాయి. స్కాలర్షిప్ పొందడంలో సాయపడే జ్ఞాన్‌ధన్, విమేక్ సొల్యూషన్స్ తదితర సంస్థలు కూడా ఉన్నాయి. క్రెడిట్ స్కోరు విద్యా రుణం విషయంలోనూ మంచి క్రెడిట్ స్కోరు సాయపడుతుంది. దరఖాస్తు ఆమోదానికే ఎక్కువ అవకాశం ఉంటుంది. కనుక పిల్లలను ఉన్నత విద్య కోసం విదేశాలకు పంపించాలనుకునే వారు మంచి క్రెడిట్ స్కోరు ఉండేలా చర్యలు తీసుకోవాలి. కాలేజీకి వచ్చిన పిల్లలు ‘బై నౌ పే లేటర్’ సదుపాయాలను విచ్చలవిడిగా ఉపయోగించుకుని చెల్లించకుండా వదిలేస్తున్నారు. ఈ తరహా చర్యలు రుణాలకు అడ్డంకిగా మారతాయి. విదేశ విద్య ప్రణాళిక ఉన్న వారు ఎట్టి పరిస్థితుల్లోనూ క్రెడిట్ హిస్టరీలో మచ్చ పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. తల్లిదండ్రులూ ఈ విషయంలో పిల్లల వ్యయాల పట్ల శ్రద్ధ చూపాలి. డాక్యుమెంట్లు విద్యా రుణానికి కేవైసీ డాక్యుమెంట్లు అన్నీ సిద్ధం చేసుకోవాలి. కేవైసీ అంటే గుర్తింపు, వయసు, చిరునామాను ధ్రువీకరించేవి. వీటితోపాటు గ్రాడ్యుయేషన్ మార్కుల మెమో షీటు, సెకండరీ స్కూల్, హైస్కూల్ ఇలా విద్యకు సంబంధించి అన్ని మెమో పత్రాలను దగ్గర ఉంచుకోవాలి. తల్లిదండ్రులు లేదంటే సంరక్షకుల ఆదాయ రుజువు సర్టిఫికెట్ అవసరం. తనఖా కోసం ఉంచతగిన ఇల్లు, పొలం, ప్లాట్, ఫిక్స్డ్ డిపాజిట్ లేదంటే పీపీఎఫ్ ఖాతా పాస్ బుక్, యూనివర్సిటీలో ప్రవేశాన్ని ధ్రువీకరిస్తూ మంజూరు చేసే లేఖ, కోర్సు ఫీజుల చెల్లింపుల షెడ్యూల్, స్కాలర్షిప్ లెటర్, రుణ గ్రహీత బ్యాంకు స్టేట్మెంట్ (చివరి ఆరు నెలలు), తల్లిదండ్రి లేదా సంరక్షకుడి బ్యాంకు ఖాతా స్టేట్మెంట్, ఆదాయపన్ను రిటర్నుల పత్రాలు, తల్లిదండ్రుల ఆదాయపన్ను రిటర్నుల పత్రాలు సిద్ధం చేసుకోవాలి. కొన్ని బ్యాంకులు రుణ దరఖాస్తుదారుడి వాటా కింద చెల్లించే మొత్తానికి మూలాన్ని అడుగుతాయి. అవి కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఉద్యోగ అవకాశాలు చూడాలి రుణం సాయంతో విదేశీ విద్య కోసం ప్రయత్నించే వారు చూడాల్సిన ముఖ్యమైన వాటిల్లో.. కోర్సు అనంతరం ఉపాధి అవకాశాలు ఒకటి. దీనివల్ల తీసుకునే రుణాన్ని తిరిగి తీర్చివేసే సామర్థ్యాలపై స్పష్టత తెచ్చుకోవచ్చు. విద్యా రుణాల్లో పెరుగుతున్న ఎగవేతలు ఈ విషయంలో ముందు జాగ్రత్త అవసరమని తెలియజేస్తన్నాయి. ప్రభుత్వరంగ బ్యాంకులు ఇచ్చిన విద్యా రుణాల్లో 9.55 శాతం నిరర్థక ఆస్తులుగా (ఎన్పీఏలు) 2020లో వర్గీకరించినట్టు 2021 పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం స్వయంగా తెలిపింది. కోర్సు అనంతరం అక్కడే కొంతకాలంపాటు ఉండి ఉపాధి అవకాశాన్ని సొంతం చేసుకోవాలన్నది నిపుణుల సూచన. ‘‘గతంలో అయితే కొన్ని దేశాలు కోర్సు అనంతరం కేవలం కొన్ని నెలల పాటే ఉపాధి అవకాశాల అన్వేషణకు వీలుగా ఉండనిచ్చేవి. కానీ, ఇప్పుడు బ్రిటన్ సహా చాలా దేశాలు గ్రాడ్యుయేట్ రూట్ ప్రోగ్రామ్‌లను ప్రవేశపెట్టాయి. వీటి కింద ఉన్నతవిద్య అనంతరం అక్కడే కొన్నేళ్లపాటు ఉండి ఉద్యోగం చేసుకోవచ్చు’’అని ఓ కన్సల్టెన్సీ అధినేత తెలిపారు. -
ఎడ్యుకేషన్ లోన్స్.. తీసుకోండి ఇలా!
కళ్ల ముందు కలల కోర్సులు ఎన్నెన్నో! ఆ కోర్సుల్లో చేరితే భవిష్యత్తు బంగారమవుతుందనే భావన! కెరీర్లో వెనుదిరిగి చూసుకోనక్కర్లేదనే ఆలోచన! కానీ.. చాలామందికి ఆర్థిక పరిస్థితులు వెనక్కులాగుతుంటాయి! రూ.లక్షల్లో ఫీజులు చూసి.. అర్హతలు, అవకాశం ఉన్నా.. నిరాశతో వెనుకంజ వేస్తున్న వైనం! ఇలాంటి ప్రతిభావంతులైన విద్యార్థులకు చక్కటి మార్గం.. ఎడ్యుకేషన్ లోన్స్!! ప్రస్తుతం పలు బ్యాంకులు.. విద్యారుణాలు అందిస్తూ.. విద్యార్థుల కెరీర్ ఉన్నతికి దోహదపడుతు న్నాయి. ఈ నేపథ్యంలో.. విద్యా రుణాలు, అర్హతలు, విధి విధానాలపై విశ్లేషణ.. బీటెక్, ఎంబీఏ వంటి ప్రొఫెషనల్ కోర్సులు పూర్తి చేయాలంటే.. కనిష్టంగా రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు; గరిష్టంగా రూ.15 లక్షల వరకు వెచ్చించాల్సి వస్తోంది. అదే విదేశీ విద్యకు వెళ్లాలంటే.. సగటున రూ.50 లక్షల వరకు వ్యయం అవుతోంది. ఫీజుల భారం కారణంగా ఎందరో ప్రతిభావంతులైన విద్యార్థులు.. ఉన్నత విద్యకు, విదేశీ విద్యకు దూరమవుతున్నారు. ఈ పరిస్థితిని పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్.. విద్యార్థులకు విద్యా రుణాలు అందించే ఏర్పాట్లుచేశాయి. విద్యా రుణాలు దేశంలోని గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూ ట్లలో,కోర్సుల్లో ప్రవేశం పొందిన వారికే కాకుండా.. విదేశీ విద్యకు వెళ్లే ప్రతిభావంతులు కూడా అందుకునే అవకాశం ఉంది. ఇన్స్టిట్యూట్కు, కోర్సుకు గుర్తింపు విద్యా రుణాలను అందిస్తున్న బ్యాంకులు.. కొన్ని నిర్దిష్ట నిబంధనలను అనుసరిస్తున్నాయి. బ్యాంకుల విధి విధానాల ప్రకారం–ఏఐసీటీఈ, యూజీసీ, కేంద్ర విద్యాశాఖ, ఆల్ ఇండియా అసోసియేషన్ ఆఫ్ యూనివర్సిటీస్ గుర్తింపు ఉన్న కళాశాలలు, కోర్సులనే విద్యా రుణ మంజూరులో పరిగణనలోకి తీసుకుంటాయి. అంటే.. సదరు ఇన్స్టిట్యూట్లలో ప్రవేశం పొందిన విద్యార్థులకే విద్యారుణం కోసం దరఖాస్తు చేసుకోవడానికి అనుమతి లభిస్తుంది. ఎంట్రన్స్‌లో అర్హత సాధిస్తేనే విద్యా రుణానికి దరఖాస్తు చేసుకునే విద్యార్థులు.. కోర్సులో ప్రవేశానికి నిర్వహించిన ఎంట్రన్స్‌లో అర్హత సాధించాల్సి ఉంటుంది. అంటే.. ఏదైనా ఎంట్రన్స్‌లో ర్యాంకు సాధించి.. కన్వీనర్ కోటాలో సీటు పొందిన వారికే విద్యా రుణ దరఖాస్తుకు అర్హత లభిస్తుంది. ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు.. ఎంట్రన్స్‌లో మెరిట్ పొందిన వారికే విద్యారుణ మంజూరులో ప్రాధాన్యం ఇస్తున్నాయి. కొన్ని ప్రైవేట్ బ్యాంకులు మాత్రం మేనేజ్మెంట్ కోటా ద్వారా ప్రవేశం పొందిన విద్యార్థులకు కూడా రుణ దరఖాస్తుకు అవకాశం కల్పిస్తున్నాయి. గరిష్టంగా రూ.10లక్షలు, రూ.20లక్షలు ► విద్యా రుణాల మంజూరు, గరిష్ట రుణ మొత్తం విషయంలో ప్రస్తుతం బ్యాంకులు రెండు రకాల విధానాలు అమలు చేస్తున్నాయి. ► దేశంలోని ఇన్స్టిట్యూట్లలో ప్రవేశం పొందిన విద్యార్థులకు గరిష్టంగా రూ.పది లక్షలు మంజూరు చేస్తున్నాయి. ► విదేశీ ఇన్స్టిట్యూట్లలో ప్రవేశం పొందిన వారికి గరిష్టంగా రూ.20 లక్షలు రుణం లభిస్తోంది. అవసరమైతే హామీలు ► విద్యా రుణాలను బ్యాంకులు మూడు శ్లాబ్‌ల విధానంలో మంజూరు చేస్తున్నాయి. ► అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న శ్లాబ్(రుణ మొత్తం) ఆధారంగా.. భవిష్యత్తులో రీపేమెంట్ పరంగా ముందుగానే కొన్ని హామీ పత్రాలు ఇచ్చే విధంగా నిబంధనలు అమలు చేస్తున్నాయి. ► శ్లాబ్–1 ప్రకారం– రూ.4 లక్షలు రుణ మొత్తంగా నిర్ణయించారు. ఈ శ్లాబ్‌లో విద్యార్థులు ఎలాంటి హామీ ఇవ్వక్కర్లేదు. ► శ్లాబ్–2 ప్రకారం– రూ.4లక్షల నుంచి రూ.7.5లక్షల వరకు రుణ మొత్తాన్ని కేటాయిస్తున్నారు. ఇందుకోసం తల్లిదండ్రుల హామీ, థర్డ్ పార్టీ గ్యారెంటీ పత్రం ఇవ్వాల్సి ఉంటుంది. ► శ్లాబ్–3 విధానం ప్రకారం– రూ.7.5 లక్షలకు పైగా రుణ మొత్తం లభిస్తోంది. దీనికి దరఖాస్తు చేయాలనుకుంటే.. ఈ మొత్తానికి సరిపడే కొల్లేటరల్ సెక్యూరిటీ(స్థిరాస్థి పత్రాలను) ఇవ్వాల్సి ఉంటుంది. మార్జిన్ మనీ చెల్లింపు ఎడ్యుకేషన్ లోన్ కోరుకునే విద్యార్థులు తాము దరఖాస్తు చేసుకున్న రుణ మొత్తంలో కొంత మొత్తాన్ని మార్జిన్ మనీగా సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు రూ.4 లక్షల వరకు ఎలాంటి మార్జిన్ మనీ అవసరం లేదు. కాని రూ.4 లక్షలు దాటిన రుణ దరఖాస్తులకు స్వదేశంలో విద్యకు అయిదు శాతం, విదేశీ విద్యకు 15 శాతం మార్జిన్ మనీని సమకూర్చుకోవాల్సి ఉంటుంది. రుణం లభించే వ్యయాలు ► ట్యూషన్ ఫీజు, హాస్టల్ ఫీజు, ఎగ్జామినేషన్/ లైబ్రరీ/లేబొరేటరీ ఫీజు, విదేశీ విద్య విద్యార్థులకు ప్రయాణ ఖర్చులు, పుస్తకాలు, యూనిఫామ్, ఇతర అకడమిక్ సంబంధిత పరికరాల కొనుగోలుకు అయ్యే వ్యయం, కంప్యూటర్ కొనుగోలు వ్యయం; కోర్సు పరంగా అవసరమైన స్టడీ టూర్స్, ప్రాజెక్ట్ వర్క్స్ తదితరాలకు అయ్యే ఖర్చు రుణంగా లభిస్తుంది. ► ఇన్స్టిట్యూట్లు వసూలు చేసే కాషన్ డిపాజిట్, బిల్డింగ్ ఫండ్, రిఫండబుల్ డిపాజిట్లకు కూడా రుణం మంజూరు చేస్తారు. ఇవి నిర్దేశిత ట్యూషన్ ఫీజు మొత్తంలో 10 శాతానికి మించకుండా ఉండాలి. ► కంప్యూటర్ కొనుగోలు వ్యయం, స్టడీ టూర్స్, ప్రాజెక్ట్ వర్క్స్ కోసం ఇచ్చే మొత్తం ట్యూషన్ ఫీజులో 20 శాతానికి మించకుండా ఉంటుంది. తిరిగి చెల్లింపు ఇలా ► విద్యా రుణం తిరిగి చెల్లించే విషయంలో బ్యాంకులు ఇటీవల కొంత సరళీకృత విధానాలు అనుసరిస్తున్నాయి. రీపేమంట్ హాలిడే పేరుతో కోర్సు పూర్తయిన తర్వాత సంవత్సరం నుంచి లేదా కోర్సు పూర్తయి ఉద్యోగం లభించినప్పటి నుంచి వాయిదాల పద్ధతిలో తిరిగి చెల్లించే వెసులుబాటు కల్పిస్తున్నాయి. ఇలా గరిష్టంగా 15 సంవత్సరాల వ్యవధిలో ఈఎంఐ విధానంలో రుణం మొత్తం చెల్లించొచ్చు. ► రుణ తిరిగి చెల్లింపు పరంగా స్టార్టప్ ఔత్సాహిక విద్యార్థులకు ప్రత్యేక వెసులుబాటు లభిస్తోంది. దీని ప్రకారం–స్టార్టప్ ఏర్పాటు చేసిన విద్యార్థులు.. కోర్సు పూర్తయ్యాక రెండేళ్ల తర్వాత నుంచి రుణం తిరిగి చెల్లించొచ్చు. ► ఉన్నత విద్యనభ్యసించే మహిళా విద్యార్థులను ప్రోత్సహించే దిశగా బ్యాంకులు విద్యారుణాల వడ్డీ రేట్లలో 0.5 శాతం నుంచి ఒక శాతం వరకు రాయితీ ఇస్తున్నాయి. టాప్ ఇన్స్టిట్యూట్లో చేరితే ప్రస్తుతం ఐబీఏ మార్గనిర్దేశకాల ప్రకారం–విద్యా ర్థులు ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్లలో ప్రవేశం పొందితే.. గరిష్ట రుణ మొత్తాన్ని పెంచే విచక్షణాధికా రాన్ని బ్యాంకులకు కల్పించింది. ఉదాహరణకు ఐఐ ఎంలు, ఐఐటీల వంటి ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్ లలో రూ.పది లక్షల కంటే ఎక్కువ ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. ఇలాంటి ఇన్స్టిట్యూట్లలో ప్రవేశం పొందిన వారికి గరిష్ట రుణ పరిమితి విషయంలో సడలింపు ఇచ్చే అవకాశం ఉంది. నిరంతర సమీక్ష విద్యా రుణం మంజూరు అయిన విద్యార్థికి సంబం«ధించిన ఫీజులను బ్యాంకులు నేరుగా సంబంధిత ఇన్స్టిట్యూట్కే పంపుతాయి. ఒకవేళ తొలి దశలో విద్యార్థులు సొంతంగా ఫీజు చెల్లించి ఉంటే.. సంబంధిత రశీదుల ఆధారంగా తొలి దశ ఫీజును విద్యార్థికి ఇస్తాయి. ఆ తర్వాత దశ నుంచి ఇన్స్టిట్యూట్కు పంపుతాయి. ప్రతి ఏటా విద్యా సంవత్సరం ప్రారంభ సమయంలో నిర్దేశిత గడవు తేదీలోగా ఇన్స్టిట్యూట్కు చెల్లిస్తాయి. అంతేకాకుండా అంతకుముందు సంవత్సరంలో చదువులో సదరు విద్యార్థి ప్రతిభను సమీక్షిస్తున్నాయి. దరఖాస్తుకు అవసరమైన పత్రాలు ► ప్రవేశ ధ్రువీకరణ పత్రం ► అకడమిక్ అర్హతల సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలు ► తల్లిదండ్రుల ఆదాయ ధ్రువీకరణ ► తల్లిదండ్రుల ఆదాయ స్థితిగతుల వివరాలు, బ్యాంకు అకౌంట్ స్టేట్మెంట్స్ ► నివాస ధ్రువీకరణ ► థర్డ్‌పార్టీ ఆదాయ ధ్రువీకరణ ► కోర్సు వ్యయానికి సంబంధించి ఇన్స్టిట్యూట్ల నుంచి అధీకృత లెటర్స్. ► పూర్తి వివరాలకు వెబ్సైట్: https://www.iba.org.in/ ఎడ్యుకేషన్ లోన్స్.. ముఖ్యాంశాలు ► స్వదేశీ, విదేశీ విద్యకు బ్యాంకుల రుణాలు. ► నియంత్రణ సంస్థలు, ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థల్లో ప్రవేశిస్తేనే రుణ దరఖాస్తుకు అర్హత. ► కనిష్టంగా రూ.4 లక్షలు గరిష్టంగా రూ.15 లక్షల వరకు రుణ మొత్తం. ► విదేశీ విద్య, ఐఐఎంలు, ఐఐటీలు వంటి ఇన్స్టిట్యూట్లలో ప్రవేశం పొందితే రుణ మొత్తాన్ని పెంచే అవకాశం. ► మహిళా విద్యార్థులను ప్రోత్సహించేలా ఇంట్రస్ట్ సబ్సిడీ స్కీమ్. ► విద్యాలక్ష్మి పోర్టల్ పేరిట ఆన్లైన్లో ఒకేసారి మూడు బ్యాంకులకు రుణ దరఖాస్తు చేసుకునే సదుపాయం. విద్యా లక్ష్మి పోర్టల్.. ఆన్లైన్ ద్వారా విద్యారుణం కోసం కేంద్ర ప్రభుత్వం విద్యా లక్ష్మి పేరుతో ప్రత్యేక పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ పోర్టల్.. విద్యా రుణాల విషయంలో విద్యార్థులకు, బ్యాంకులకు మధ్య అనుసంధానకర్తగా పనిచేస్తుంది. విద్యార్థులు విద్యాలక్ష్మి పోర్టల్‌లో లాగిన్ అయి.. కామన్ ఎడ్యుకేషనల్ లోన్ అప్లికేషన్ ఫామ్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. గరిష్టంగా మూడు బ్యాంకులకే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇలా ఆన్లైన్లో వచ్చిన దరఖాస్తులను.. అభ్యర్థులు ప్రాథమ్యంగా పేర్కొన్న బ్యాంకులకు పంపిస్తారు. తర్వాత దశలో సదరు బ్యాంకులు దరఖాస్తును పరిశీలించి సంతృప్తి చెందితే.. ఏ బ్రాంచ్‌లో సంప్రదించాలి, ఏ ఏ పత్రాలు తీసుకెళ్లాలి అనే వివరాలను విద్యార్థులకు తెలియజేస్తాయి. వెబ్సైట్: www.vidyalakshmi.co.in -
భారీగా తగ్గిన విద్యారుణాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యా రుణాలు తీసుకునే వారి సంఖ్య భారీగా తగ్గిపోయింది. 2018–19తో పోలిస్తే 2019–20లో విద్యారుణం తీసుకున్న వారి సంఖ్య 56 శాతం పడిపోయినట్లు రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ నివేదికలో పేర్కొంది. అమెరికా వీసాలపై ఆంక్షలతో... ♦2018–19లో 35,779 మంది రూ.796 కోట్లు విద్యా రుణం తీసుకోగా గడిచిన ఆర్థిక సంవత్సరంలో 15,611 మంది రూ.478 కోట్లు మాత్రమే రుణం తీసుకున్నారు. రెండేళ్ల క్రితం రాష్ట్రంలోవిద్యా రుణాలు తీసుకున్న వారి సంఖ్య 1,04,597 కాగా అది ఇప్పుడు 77,983కి పడిపోయింది. ♦ఆర్థిక వ్యవస్థ మందగమనం, అమెరికా వీసా నిబంధనలు కఠినతరం చేయడం విద్యారుణాలు తగ్గడానికి ప్రధానకారణంగా బ్యాంకర్లు పేర్కొంటున్నారు. మొండి బకాయిలు పెరగడం కూడా కారణంగా చెబుతున్నారు. (ఆ అధికారం కోర్టుకు లేదు) ♦ఇంజనీరింగ్ వంటి ఉన్నతవిద్యకు తీసుకునే రుణాలు కూడా భారీగా తగ్గిపోయాయి. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం తిరిగి అమల్లోకి రావడంతో విద్యారుణం తీసుకునే వారి సంఖ్య మరింత తగ్గిందని ఎస్బీఐ మేనేజర్ ఒకరు వ్యాఖ్యానించారు. ♦ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విద్యారుణాలు మరింత తగ్గుతాయని బ్యాంకింగ్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. కోవిడ్19తో ఈ ఏడాది విదేశీ విద్య రుణాలు దాదాపుగా ఉండకపోవచ్చని, స్థానిక కోర్సులప్రారంభంపై స్పష్టత లేకపోవడంతో విద్యా రుణాలకు ముందుకు రావడం లేదు. ♦గతేడాది ఈ సమయానికి రూ.కోటికిపైగా రుణాలు ఇచ్చామని, ఇప్పుడు అడిగే వారే కనిపించడం లేదని విజయవాడలోని ఒక రీజనల్ బ్యాంకు మేనేజర్ తెలిపారు. -
ఐసీఐసీఐలో కోటి వరకు విద్యారుణం
ముంబై: ఐసీఐసీఐ బ్యాంక్‌లో విద్యా రుణాలు(ఎడ్యుకేషన్ లోన్స్)ను వేగంగా అందించేందుకు చర్యలు చేపట్టింది. కేవలం నిమిషాల వ్యవధిలోనే వినియోగదారులకు రూ.10లక్షల నుంచి కోటి రూపాయలు అందించే ప్రణాళికను రూపకల్పన చేసింది. ‘ఇన్‌స్టా ఎడ్యుకేషన్ లోన్’ పేరిట నిబంధనలు, షరతులతో కొద్ది నిమిషాల్లోనే విద్యా రుణాలను అందించనుంది. పూర్తిగా డిజిటల్ పద్దతిలో విద్యా రుణాల ప్రక్రియను చేపట్టనుంది. దేశీయ, ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాలు, కళాశాలలో ప్రవేశం పొందిన విద్యార్థులకు బ్యాంక్ రుణాలను మంజూరు చేస్తుంది. అయితే వినియోగదారులు తమ స్థిర డిపాజిట్ల(ఫిక్సడ్ డిపాజిట్స్)లో 90శాతం బ్యాంక్ రుణాలు పొందవచ్చు అని ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది. వేగంగా మంజూరు చేసే రుణాల వల్ల విద్యార్థులు ఎంతో ప్రయోజనం పొందుతారని ఐసీఐసీఐ తెలిపింది. కాగా రుణాలు చెల్లించడానికి పది సంవత్సరాల కాలపరిమితిని బ్యాంక్ విధించింది. మరోవైపు ఆదాయపు పన్ను చట్టం, 1961 లోని సెక్షన్ 80 ఇ ప్రకారం.. 8 సంవత్సరాల వరకు బ్యాంక్‌లో విద్యా రుణాలకు ఆదాయపు పన్ను మినహాయింపు వర్తిస్తుంది. కాగా అంతర్జాతీయ సంస్థలలో ప్రవేశం పొందే విద్యార్థుల కోసం, బ్యాంక్ రుణాలు రూ. 10 లక్షల నుంచి రూ.కోటి వరకు, దేశీయ సంస్థలలో రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు పొందవచ్చు.కాగా విద్యారుణాలను అప్లై చేయాలంటే..మొదటగా వినియోగదారులు ఐసీఐసీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్‌లో లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత బ్యాంక్ సైట్లో రుణాలకు సంబంధించిన ఆఫర్‌ను అధ్యయనం చేయాలి. వినియోగదారులకు కావాల్సిన రుణం, చెల్లించే కాలపరిమితి, ప్రవేశం పొందిన విశ్వవిద్యాలయం పేరు తదితర వివరాలను అప్లికేషన్ ఫార్మ్‌లో నమోదు చేయాలి. తరువాత విద్యార్థి పేరు, పుట్టిన తేదీ, విద్యార్థితో సంబంధం వంటి వివరాలను నమోదు చేయాలి. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత బ్యాంక్‌కు సంబంధించిన నిబంధనలు, షరతులను అంగీకరిస్తే వన్ టైమ్ పాస్వర్డ్ (OTP) ద్వారా బ్యాంక్ దృవీకరించిన నెంబర్ వస్తుంది. ఆ తర్వాత ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాక, విద్యారుణాలు పొందిన మంజూరు లేఖను బ్యాంక్ వినియోగదారులకు అందిస్తుంది. (చదవండి: ‘బోగస్’తో బ్యాంక్‌కు టోకరా!) -
విద్యా రుణానికి మెరుగైన మార్గం
పేరున్న విద్యా సంస్థల్లో చదవడం ద్వారా తమ కెరీర్‌ను అద్భుతంగా తీర్చిదిద్దుకోవాలన్న ఆకాంక్ష ఎంతో మంది విద్యార్థుల్లో ఉంటుంది. కానీ, అందరికీ తగినంత ఆర్థిక స్థోమత ఉండకపోవచ్చు. పైగా విద్యా వ్యయాలు ఏటేటా భారీగానే పెరిగిపోతున్న పరిస్థితులను చూస్తూనే ఉన్నాం. విదేశాల్లో ఉన్నత విద్య చదవాలనే అభిలాష కూడా ఇటీవలి కాలంలో పెరిగిపోతోంది. అయితే, ఇందుకోసం అయ్యేంత ఖర్చు సొంతంగా భరించే సామర్థ్యం లేదని వెనుకంజ వేయాల్సిన అవసరం లేదు. బ్యాంకుల నుంచి రుణం తీసుకోవడం ఓ మంచి మార్గం. 2015లో సగటు విద్యా రుణం సైజు రూ.5.73 లక్షలుగా ఉంటే, 2018లో రూ.8.5 లక్షలకు పెరిగినట్టు ట్రాన్స్ యూనియన్ సిబిల్ డేటా తెలియజేస్తోంది. మూడేళ్లలోనే 45 శాతం పెరుగుదల కనిపిస్తోంది. కనుక భారీ వ్యయాల కోసం రుణాలను ఆశ్రయించాల్సిన పరిస్థితులు ఎదురుకావచ్చు. ఈ పరిస్థితుల్లో తమ పిల్లల ఉన్నత విద్య కోసం రుణాలు తీసుకునే వారు పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాల గురించి తెలియజేసే కథనమే ఇది. విద్యా రుణం తీసుకోవడానికి ముందు ప్రతీ ఒక్కరూ ఏ బ్యాంకులో తక్కువ వడ్డీ రేటు ఉంది, చెల్లింపుల సౌలభ్యాన్ని విచారించుకోవడం ఎంతైనా అవసరం. రుణాలపై వడ్డీ రేట్ల వివరాలను ఆయా బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల వెబ్సైట్ల సాయంతో తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ప్రధానమంత్రి విద్యాలక్ష్మి స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం విద్యా లక్ష్మి పోర్టల్ ద్వారా ఈ విషయంలో పూర్తి సహకారం కూడా అందిస్తోంది. విద్యా రుణం గురించి వివరాలు తెలుసుకోవడంతోపాటు దరఖాస్తు చేసుకోవడం, ఆ దరఖాస్తు తీరు తెన్నులను ట్రాక్ చేసుకునేందుకు ఈ పోర్టల్ సాయపడుతుంది. దీంతో ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో, చెల్లింపుల పరంగా సౌకర్యంగా ఉన్న బ్యాంకు నుంచి రుణానికి దరఖాస్తు చేసుకోవచ్చు. మార్జిన్ మనీ కోర్సు ఫీజుల అవసరాలకు అనుగుణంగా బ్యాంకులు నూరు శాతం వరకు రుణాన్ని సర్దుబాటు చేస్తాయి. అయితే, ఆర్బీఐ నిబంధనల ప్రకారం.. రూ.4 లక్షల వరకు రుణానికి మార్జిన్ మనీ (సొంతంగా సమకూర్చుకోవాల్సిన మొత్తం) అవసరం. దేశీయంగానే ఉన్నత విద్య చదవాలనుకుంటే అందుకు అయ్యే వ్యయంలో 5 శాతాన్ని మార్జిన్ మనీగా సమకూర్చుకోవాలి. అదే విదేశాల్లో విద్య కోసం రుణం తీసుకునేవారు 15% మార్జిన్ మనీ రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. విద్యా రుణం మొత్తం రూ.4లక్షల కు మించకపోతే బ్యాంకులు హామీ కోరవు. రూ.4లక్షల నుంచి రూ.7.5 లక్షల మధ్య ఉంటే హామీదారును అడుగుతాయి. రూ.7.5 లక్షలకు మించి రుణం తీసుకోదలిస్తే ఆస్తులను తనఖాగా ఉంచాలని కోరతాయి. రుణాల చెల్లింపుల్లో వైఫల్యం చోటు చేసుకుంటే వసూలు కోసం వీటిని కోరడం జరుగుతుంది. క్రెడిట్ స్కోర్ సాధారణంగా విద్యారుణం తీసుకునే వారికి తల్లిదండ్రులు లేదా సంరక్షకులు గ్యారంటార్‌గా ఉంటారు. విద్యార్థికి క్రెడిట్ స్కోరు ఉండదు కనుక కుటుంబ సభ్యుల్లో ఒకరు గ్యారంటార్‌గా ఉండాల్సి వస్తుంది. ఇటువంటి సందర్భాల్లో హామీదారుగా ఉండేందుకు ముందుకు వచ్చే వారికి క్రెడిట్ స్కోరు తగినంత ఉండేలా చూసుకోవాలి. అప్పుడే రుణ దరఖాస్తు తిరస్కరణకు గురికాకుండా చూసుకోవచ్చు. 750పైన క్రెడిట్ స్కోరు ఉంటే రుణం సులభంగా రావడంతోపాటు, వడ్డీ రేటు తక్కువకు తీసుకునే వెసులుబాటు ఉంటుంది. లేదంటే పిల్లల విద్యావకాశాలపై ప్రతికూలత ఏర్పడుతుంది. దరఖాస్తుదారు విద్యాలక్ష్మి పోర్టల్‌లో తప్పకుండా నమోదు చేసుకోవాలి. కామన్ ఎడ్యుకేషన్ లోన్ దరఖాస్తు ఫారాన్ని పూర్తి చేసి, అవసరమైన వివరాలన్నింటినీ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తును పూర్తి చేసిన అనంతరం దరఖాస్తుదారుడు విద్యా రుణం కోసం పోర్టల్‌లో సెర్చ్ చేసి, తన అవసరాలు, సౌలభ్యాలకు అనుకూలమైన దానిని ఎంపిక చేసుకోవచ్చు. ఇక్కడ పూర్తి చేసే దరఖాస్తు పత్రాన్ని అన్ని బ్యాంకులు పరిగణనలోకి తీసుకుంటాయి. అందుకే దీన్ని ఉమ్మడి దరఖాస్తు పత్రంగా పేర్కొన్నారు. సక్రమంగా చెల్లింపులు మొదటి నెల నుంచే తీసుకున్న రుణంపై వడ్డీ జమ అవడం మొదలవుతుంది. కాకపోతే రుణం తీసుకున్న తర్వాత ఈఎంఐల చెల్లింపులు మొదలు కావడానికి మధ్యలో గ్రేడ్ పీరియడ్ ఉంటుంది. విద్యార్థి కోర్స్ పూర్తి చేసుకున్న తర్వాత సాధారణంగా ఒక ఏడాది పాటు ఇది ఉంటుంది. అయితే, ఈ కాలంలో వడ్డీ భారం పెరిగిపోకుండా, వేగంగా రుణ చెల్లింపులు పూర్తయ్యేందుకు గాను తల్లిదండ్రులు ప్రతీ నెలా కొంత మేర చెల్లించడం మంచి ప్రణాళిక అవుతుంది. అదనపు ప్రయోజనాలు విద్యా రుణం తీసుకోవడం వల్ల పన్ను ఆదా వంటి ప్రయోజనాలు కూడా ఉన్నాయి. సెక్షన్ 80ఈ కింద విద్యా రుణంపై చెల్లించే వడ్డీకి పూర్తిగా పన్ను మినహాయింపు పొందొచ్చు. విద్యా రుణం తీసుకుని, సక్రమ చెల్లింపులు చేయడం వల్ల మంచి క్రెడిట్ స్కోరు కూడా నమోదవుతుంది. ఈ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పిల్లల విద్యా రుణానికి సంబంధించి ప్రణాళిక వేసుకోవాలి. -
అన్నీ 'చదివాకే' విద్యా రుణం
ఇప్పుడు విద్యా రుణం గతంతో పోలిస్తే చాలా తేలిగ్గా, చౌకగా పొందడం సాధ్యమే. ఎన్బీఎఫ్సీ సంస్థల రాకతో విద్యా రుణాల విషయంలో బ్యాంకులు, ఆర్థిక సంస్థల మధ్య పోటీ ఏర్పడింది. ఇందుకు కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహమూ ప్రధాన కారణమనే చెప్పాలి. అయితే, సులభంగా విద్యా రుణాలు పొందే పరిస్థితులున్నప్పటికీ, దరఖాస్తుదారులు మాత్రం ముందుగా అన్ని అంశాలూ విచారించుకున్నాకే రుణం తీసుకునే దిశగా అడుగులు వేయాలన్నది నిపుణుల సూచన. – సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం కోర్స్, సంస్థ కీలకం... పలు ప్రైవేటు విద్యా సంస్థల్లో బ్యాంకుల తరఫున విద్యా రుణాల మంజూరు కోసం డెస్క్‌లు ప్రారంభమవుతున్నాయి. అయితే, సులభంగా రుణం వస్తోంది కదా అని కోర్సునో, విద్యా సంస్థనో మార్చుకోవటం సరికాదన్నది నిపుణుల సూచన. విద్యా సంస్థ, కోర్సు కచ్చితంగా సరిపడేది అయి ఉండాలని, భవిష్యత్తులో ఏం చేయాలన్న అంశం ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని బ్యాంక్ బజార్ సీఈవో ఆదిల్ శెట్టి సూచించారు. కనుక ఏ కోర్స్ చేయాలన్నది నిర్ణయించుకున్నాకే రుణం ఎంత అవసరమన్నది తెలుసుకోవాలి. ట్యూషన్ ఫీజులకు తోడు హాస్టల్ చార్జీలు, మెస్ ఖర్చులు, ఆకస్మిక ఖర్చులు అన్నింటినీ అంచనా వేశాకే రుణం ఎంతన్నది స్పష్టం అవుతుంది. తల్లిదండ్రుల నుంచి వచ్చే మొత్తాన్ని ఈ వ్యయాల నుంచి మినహాయించాలి. మిగిలిన మేర విద్యా రుణానికి వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం ఒకటుంది. మీరు చదివిన చదువు.... ఆ తర్వాత విద్యా రుణాన్ని తిరిగి తీర్చివేసేందుకు అక్కరకు రావాలి. బ్యాంకులు కేవలం అభ్యర్థి విద్యా సంస్థ, కోర్సు ఆధారంగా తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని అంచనా వేస్తాయని, రుణం తీసుకునే వారు మాత్రం తమ కోర్సుకున్న ఉద్యోగావకాశాలు చూసి... తిరిగి చెల్లించగలమా, లేదా అనేది నిర్ణయించుకోవాలని క్రెడిట్ మంత్రి సీఈవో రంజిత్ పుంజా చెప్పారు. ఇందుకోసం ఇప్పటి వరకు ఆయా కోర్సులు పూర్తి చేసిన వారికున్న ప్లేస్మెంట్ అవకాశాలు, కంపెనీలు ఆఫర్ చేసిన వేతనం తాలూకు పూర్వ గణాంకాలు సాయపడతాయని తెలియజేశారు. గరిష్ట వేతన ఆఫర్ కాకుండా సగటు వేతన ఆఫర్‌ను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. అలాగే, కోర్సు అనంతరం పొందే వేతనం మొత్తంలో రుణం కోసం చేసే ఈఎంఐ చెల్లింపులు 30 శాతాన్ని మించకుండా చూసుకోవాలని కూడా పుంజా అభిప్రాయపడ్డారు. వడ్డీ రేట్లు ఎంత? ఇక విద్యా రుణం విషయంలో చూడాల్సిన మరో ముఖ్యమైన అంశం వడ్డీ రేటు. ఎన్ఎస్డీఎల్ నిర్వహించే ఠీఠీఠీ.ఠిజీఛీy్చ ్చజుటజిఝజీ.ఛిౌ.జీn అనే పోర్టల్ ఇందుకు సాయపడుతుంది. అన్ని బ్యాంకుల విద్యా రుణాల వడ్డీ రేట్ల వివరాలు ఇందులో లభిస్తాయి. ప్రతిష్టాత్మక విద్యా సంస్థలైన ఐఐఎం, ఐఐటీల్లో చదివే వారికి బ్యాంకులు తక్కువ వడ్డీ రేట్లకే రుణాలను ఆఫర్ చేస్తున్నాయి. కారణం వీటిల్లో చదివిన వారికి మెరుగైన వేతన ప్యాకేజీలతో ఆఫర్లు ఉండడమే. ఇండియన్ బ్యాంకు అయితే ఐఐటీ, ఐఐఎం, ఐఐఎస్సీల్లో చదివే వారికి విద్యా రుణాలను 9.95 శాతం వార్షిక వడ్డీ రేటుకే ఆఫర్ చేస్తోంది. అలాగే, ఎన్ఐటీలో చదివే విద్యార్థులకు 10.45 శాతం వడ్డీ రేటును చార్జ్ చేస్తుండగా, ఇతర సంస్థల్లో చదివే వారికి మాత్రం 11.75 శాతం రేటును అమలు చేస్తోంది. అలాగే, ప్రభుత్వ కోటా, మేనేజ్మెంట్ కోటాలో సీట్లను పొందే విద్యార్థుల విషయంలో బ్యాంకులు వేర్వేరు వడ్డీ రేట్లను అమలు చేస్తున్నాయి. పర్సనల్ లోన్స్ కంటే విద్యా రుణాలు చౌకే అయినా, గృహ రుణాలతో పోలిస్తే కాస్తంత ఖరీదైనవే. ఎందుకంటే గృహ రుణం సెక్యూర్డ్ లోన్ అవుతుంది. కానీ, విద్యా రుణం అన్సెక్యూర్డ్ లోన్. దీనిపై బ్యాంకులకు డిఫాల్ట్ రిస్క్ ఉంటుంది. ఇక, విద్యా రుణం మొత్తం భారీగా ఉంటే బ్యాంకులు హామీలను అడుగుతున్నాయి. దాదాపుగా ఎక్కువ కేసుల్లో ఇది గార్డియనే. సంరక్షకుల క్రెడిట్ హిస్టరీ లేదా అదనపు హామీలు ఇవ్వడం వల్ల విద్యా రుణాలపై వ్యయాలు తగ్గించుకోవచ్చు. చాలా బ్యాంకులు 10 ఏళ్ల కాలానికి విద్యా రుణాలను మంజూరు చేస్తున్నాయి. అయితే, రుణం రూ.7.5 లక్షలు ఆ పైన ఉంటే కాల వ్యవధిని మరో ఐదేళ్ల పాటు అంటే మొత్తం మీద 15 ఏళ్ల వరకు పొడిగించుకోవచ్చు. కాల వ్యవధి ఎక్కువ ఉంటే రుణ వాయిదా మొత్తం తగ్గుతుంది. మొత్తం మీద చెల్లించే వడ్డీ ఎక్కువగా ఉంటుంది. కాకపోతే దీర్ఘకాలం ఉంటే ఈఎంఐ వేతనంలో 30 శాతం మించకుండా చూసుకోవచ్చని పుంజా తెలిపారు. అయితే, దీర్ఘకాలానికి తీసుకున్నా, ఉద్యోగంలో చేరాక వెసులుబాటు చేసుకుని ముందస్తుగా రుణాన్ని తీర్చివేయడం ద్వారా వడ్డీ భారాన్ని తగ్గించుకోవచ్చు. విద్యా రుణంపై ఆదాయపన్ను ప్రయోజనం కూడా ఉంది. విద్యా రుణంపై చేసే వడ్డీ చెల్లింపుల మొత్తాన్ని సెక్షన్ 80ఈ కింద ఎనిమిదేళ్ల వరకు పన్ను మినహాయింపు పొందొచ్చు. మారటోరియం కూడా ఉంది... విద్యా రుణాల్లో మారటోరియం అనే ప్రత్యేకమైన సదుపాయం కూడా ఉంది. కోర్సు పూర్తయిన 12 నెలల వరకు లేదా ఉద్యోగంలో చేరిన ఆరు నెలల వరకు (ఈ రెండింటిలో ఏది ముందు అయితే అది) విద్యా రుణం చెల్లింపులు చేయాల్సిన అవసరం లేదు. అయితే, గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే ఈ మారటోరియం కాలంలో రుణంపై వడ్డీ పడుతూనే ఉంటుంది. అందుకని వడ్డీ భారంగా మారే వరకు వేచి ఉండకుండా కోర్సు పూర్తయిన వెంటనే రుణ ఈఎంఐ చెల్లింపులు మొదలు పెట్టడం మంచిదనేది ఆదిల్‌శెట్టి సూచన. ఇక మరో అంశం విద్యారుణం ఓ వ్యక్తి జీవితంలో తీసుకునే మొదటి రుణం అవుతుంది. కనుక సరైన చెల్లింపుల ద్వారా మంచి క్రెడిట్ స్కోరుకు బాటలు వేసుకోవడానికి ఇదో అవకాశం. -
విద్యా రుణం... తెలివుండాలి!
ఉన్నత చదువులు చదువుకోవటం అందరికీ ఇష్టమే. కాకపోతే కొందరికి ఆర్థికంగా ఎలాంటి దన్నూ ఉండదు కనక... ఉన్నత చదువులు కలగానే మిగిలిపోతుంటాయి. అలాంటి వారికి వెన్నుదన్నునిచ్చేవే విద్యా రుణాలు. కుటుంబీకులు కొంత కష్టపడి... చదువుకునే సంస్థ గనక సరైనదైతే ఈ రుణానికి ఎలాంటి అడ్డంకులూ ఉండవు. ఇప్పుడు చాలా మంది ఆధారపడుతున్నది కూడా వీటిపైనే!!. సరే! రుణం వస్తుంది. దాన్ని కాలేజీకి చెల్లించి చదువు కూడా పూర్తి చేస్తాం. ఆ తరవాత..? ఇపుడదే పెద్ద సమస్య. ఈ రుణాన్ని తీర్చాల్సిన బాధ్యత గుర్తొచ్చినప్పుడే కష్టమనిపిస్తుంది. ముఖ్యంగా పెద్ద మొత్తంలో రుణం తీసుకుంటే నెలవారీ చెల్లించాల్సిన వాయిదాలు (ఈఎంఐ) చాలా ఇబ్బందిగా మారతాయి. త్వరగా ఉద్యోగం దొరక్కపోవటమో... దొరికినా తక్కువ జీతంతో రావటమో జరిగితే... ఆ ప్రభావం తిరిగి చెల్లించే వాయిదాలపై పడుతుంది. దీనివల్ల క్రెడిట్ స్కోరు పడిపోవడమే కాకుండా, ఆ రుణం భారంగా మారుతుంది కూడా. విద్యా రుణమూ దీనికి మినహాయింపేమీ కాదు. అందుకే... విద్యా రుణం తీసుకోవాలనుకున్న వారు ఆ రుణం చేతికందాక ఏం చేయాలి? అవసరమైతే దాన్ని పునరుద్ధరించుకుని గరిష్ట ప్రయోజనాలు ఎలా పొందాలి? పన్ను ప్రయోజనాలేంటి? వంటి కీలక సమాచారం తెలుసుకోవాలి. ఆ వివరాలే ఈ ‘ప్రాఫిట్’ ప్రధాన కథనం... – సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం అవసరమైతే రీఫైనాన్స్ చేసుకోండి విద్యా రుణానికి దరఖాస్తు చేసుకున్నప్పుడు చాలా మంది అది చేతికొస్తే చాలనుకుంటారు. అందుకని వడ్డీ రేటు తగ్గించాలని డిమాండ్ చేయలేని పరిస్థితిలో ఉంటారు. బ్యాంకు పెట్టిన షరతులు, నియమ, నిబంధనలను ఆమోదిస్తున్నట్టు సంతకాలు కూడా చేసేస్తారు. రుణం తీసుకుని విద్య పూర్తయి ఉద్యోగంలో చేరాక మాత్రం... ఆ రుణానికి సంబంధించిన ఒప్పంద నిబంధనలు సౌకర్యంగా అనిపించకపోవచ్చు. మరి అప్పుడు ఏం చేయాలి? ‘‘నిజానికిలా అనిపించినపుడు సమీక్షించాలని బ్యాంకును నిరభ్యంతరంగా డిమాండ్ చేయొచ్చు. వినియోగదారుడు తీసుకున్న విద్యా రుణానికి అవసరమైతే మరో సంస్థ నుంచి సానుకూల షరతులపై రీఫైనాన్స్ చేసుకునే అవకాశం కూడా ఉంది’’ అని అవాన్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ సీఈవో అమిత్గండా చెప్పారు. రీఫైనాన్స్ అంటే మరో సంస్థ నుంచి రుణం తీసుకుని పాత రుణాన్ని తీర్చివేయటమన్న మాట. రుణం తీసుకుని విద్య పూర్తి చేసిన వారు, ఉద్యోగం దొరికి రుణాన్ని చెల్లించే మెరుగైన స్థితిలోకి వచ్చినపుడు వారికి నియమ, నిబంధనలు నచ్చలేదనుకోండి. అలాంటపుడు ఈ రీఫైనాన్స్తో పాతదానికి గుడ్‌బై చెప్పేయొచ్చు. కాకపోతే కొత్త సంస్థ నుంచి రుణం తీసుకుంటారు కనుక ప్రాసెసింగ్ ఫీజు కొంత చెల్లించాల్సి ఉంటుంది. కొత్తగా రుణాన్ని ఆఫర్ చేస్తున్న సంస్థ నిబంధనలు సౌకర్యంగా ఉంటే, తక్కువ వడ్డీ రేటుకు వస్తుంటే రీఫైనాన్స్ ఆప్షన్‌ను పరిశీలించొచ్చనేది అమిత్గండా సూచన. ఇదెలా పనిచేస్తుందంటే... ఉదాహరణకు రూ.20 లక్షల రుణాన్ని 12 శాతం వడ్డీ రేటుపై 9 ఏళ్లలో తీర్చేయాలి. ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు లేదనుకుంటే, రెండేళ్ల విద్యా సమయాన్ని మినహాయించి చూస్తే, మిగిలిన కాలానికి రూ.9.66 లక్షలను వడ్డీ రూపంలో చెల్లించాల్సి వస్తుంది. మంచి ఉద్యోగంలో చేరిన తర్వాత సహజంగానే తిరిగి రుణం పొందేందుకు అవకాశాలు మెరుగవుతాయి. అప్పుడు 10 శాతం వడ్డీపై రీఫైనాన్స్ సదుపాయం పొందినా గానీ, మిగిలి ఉన్న ఏడేళ్ల కాలంలో వడ్డీ తగ్గడం వల్ల రూ.1.77 లక్షలు ఆదా అవుతాయి. ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో సీటు సంపాదించి ఉంటే ఉద్యోగంలో చేరకముందే రుణ ఒప్పందాలను సమీక్షించాలని బ్యాంకులను డిమాండ్ చేయవచ్చు. ఎందుకంటే ప్రముఖ విద్యా సంస్థల్లో చదివిన వారికి మెరుగైన ఉద్యోగ అవకాశాలు కచ్చితంగా ఉంటాయి కనక బ్యాంకులూ వారి డిమాండ్లను సానుకూలంగా పరిశీలిస్తాయి. క్రెడిట్ స్కోరు పట్ల జాగ్రత్త చాలా మందికి విద్యా రుణమే వారి జీవితంలో తీసుకునే తొలి రుణమవుతుంది. కాబట్టి క్రమం తప్పకుండా రుణ వాయిదా చెల్లింపులు జరిగేలా చూసుకోవాలి. లేదంటే వారి క్రెడిట్ స్కోరు తగ్గిపోయి, భవిష్యత్తులో ఇతర రుణాల విషయంలో సమస్యలు ఎదురవుతాయి. వేళ ప్రకారం రుణ వాయిదాలు చెల్లిస్తే చాలు. ప్రత్యేకంగా ఏ చర్యలూ అవసరం లేదు. క్రెడిట్ బ్యూరోల నుంచి క్రెడిట్ రిపోర్ట్‌ను తెప్పించుకుని పరిశీలించే అవకాశం కూడా ఉంది. కోర్సు పూర్తికాకుంటే..? ఉద్యోగం రాకపోతే...? ఒకవేళ రుణం తీసుకుని చేరిన కోర్సును విద్యార్థి పూర్తి చేయలేకపోతే ఎంటి పరిస్థితి? అన్న సందేహం తలెత్తవచ్చు. విద్యారుణ పథకం–2015 కింద ఇటువంటి సందర్భాల్లో విద్యార్థులు తమ కోర్స్ పూర్తి చేసేందుకు వీలుగా బ్యాంకులు కాల వ్యవధిని పొడిగిస్తాయి. వడ్డీయే కాదు, అసలు చెల్లింపులకు కూడా ఈ మేరకు కాలవ్యవధి పొడిగించినట్టుగానే భావించాలి. ఒకవేళ కోర్సు పూర్తయి ఉద్యోగం రాకపోయినా లేదా విద్యార్హతలకు తగ్గ ఉద్యోగం రాకపోయినా కూడా బ్యాంకులు మూడు సార్ల వరకు (ప్రతీ సారీ ఆరు నెలల చొప్పున) చెల్లింపుల కాల వ్యవధిని పొడిగించేందుకు సమ్మతిస్తున్నాయి. దీనివల్ల చెల్లింపుల భారం తగ్గుతుంది కానీ, రుణంపై చెల్లించే వడ్డీ భారం పెరుగుతుంది. పన్ను లాభాలున్నాయి... ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 80ఈ కింద విద్యా రుణం తీసుకున్న వారు దానిపై చెల్లించే వడ్డీని ఆదాయం నుంచి మినహాయించుకుని చూపే వెసులుబాటు ఉంది. ఈ సెక్షన్ కింద క్లెయిమ్ చేసుకునేందుకు పరిమితి లేకపోవడం ఆకర్షణీయాంశం. అంటే వడ్డీ రూపంలో ఎంత చెల్లించినా గానీ ఆ మొత్తాన్ని ఆదాయం నుం చి మినహాయించి చూపించవచ్చు. ఎనిమిదేళ్లు, లేదా రుణ చెల్లింపుల కాలం ఈ రెండింటిలో ఏది తక్కువయితే అది అమల్లోకి తీసుకుంటారు. రుణంలో అసలుకు చేసే చెల్లింపులపై మాత్రం మినహాయింపు లేదు. ఈ చట్టం కింద పన్ను మినహాయంపులు అన్నవి వ్యక్తిగత ఉన్నత చదువులకు, జీవిత భాగస్వామి, పిల్లల విద్యలకు కూడా పొందొచ్చు. ఉదాహరణకు ఏడేళ్ల కాల వ్యవధి కలిగిన రూ.20 లక్షల విద్యా రుణంపై 11.5 శాతం వడ్డీ రేటు అనుకుంటే, మొదటి రెండేళ్లు చదివే సమయంలో చెల్లింపులపై మారటోరియం తీసేయగా, రుణాన్ని తీర్చేందుకు ఐదేళ్లు ఉంటుంది. దీంతో ఏటా వడ్డీ రూపంలో రూ.2.3 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. రుణం తీసుకున్న వ్యక్తి అధిక పన్ను శ్లాబ్ పరిధిలో ఉంటే పన్ను మినహాయింపుల రూపంలో రూ.71,760 ఆదా అవుతుంది. ఈ మినహాయింపు పొందేం దుకు వడ్డీ చెల్లింపుల సర్టిఫికెట్‌ను బ్యాంకు లేదా రుణమిచ్చిన సంస్థ నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. ఏ బ్యాంకులో రుణం తీసుకున్నా ఈ ప్రయోజనానికి అర్హులే. అయితే, ఎన్బీఎఫ్సీల్లో కొన్నింటికే ఈ సదుపాయం ఉంది. అందుకే ఎన్బీఎఫ్సీ నుంచి రుణం తీసుకునే ముందు ఈ అంశాన్ని ధ్రువీకరించుకోవాలి. రుణాన్ని ముందుగా తీర్చివేయదలిస్తే మాత్రం పన్ను ప్రయోజనాల కోణంలో ఓ సారి ఆలోచించడం మంచిది. ఎందుకంటే పన్ను చెల్లించేంత ఆదాయం ఉంటే రుణాన్ని ముందుగా తీర్చివేయడం కంటే కాల వ్యవధి వరకు కొనసాగించటం ద్వారా గణనీయమైన పన్ను ఆదా చేసుకోవచ్చు. -
సరస్వతికి లక్ష్మీ కటాక్షం
ఉమెన్ ఫైనాన్స్ / ఎడ్యుకేషనల్ లోన్ ఇప్పటికీ చాలావరకు చిన్న, మధ్య తరగతి కుటుంబాల వారు తమ పిల్లలకు ప్రాథమిక విద్యను అందజేయగలుగుతున్నా, పై చదువులకు మాత్రం పంపలేక ఆర్థికంగా అవస్థలు పడుతున్నారు. కొంతమంది తమ పిల్లల్లో ఎవరో ఒకరిని మాత్రమే ఉన్నత విద్యాభాస్యానికి పంపగలుగుతున్నారు. మరీ ముఖ్యంగా... ఆడపిల్ల, మగపిల్ల వాడు ఉంటే మగపిల్లవాడిని మాత్రమే పైచదువులకు పంపిస్తూ, ఆడపిల్లలకు పెళ్లి చేసేస్తున్నారు. దీని వల్ల మెరుగైన ప్రతిభ ఉన్న చాలామంది విద్యార్థులు మరుగున పడిపోతున్నారు. పిల్లల పైచదువుల కోసం అని బ్యాంకులు, ఇతర ఫైనాన్స్ సంస్థలు లోను తీసుకునే సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. కానీ చాలామందికి వీటి మీద అవగాహన లేక పోవడం వల్ల ఈ అవకాశాన్ని వినియోగించుకోలేకపోతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని విద్యార్థులు ఎవరైతే పైచదువులకు వెళ్లాలనుకుంటున్నారో వారు ఎడ్యుకేషన్ లోన్‌ను సులభంగా పొందడానికి భారత ప్రభుత్వం 2015 ఆగస్టు 15న విద్యాలక్ష్మి (www.vidyalakshmi.co.in) అనే పోర్టల్‌ను ప్రారంభించింది. ఆర్థిక వెసులుబాటు లేని కారణంగా ఏ విద్యార్థీ తన చదువును మధ్యలోనే ఆపేయకూడదు అనే ముఖ్యోద్దేశంతో ఈ పోర్టల్ ప్రారంభం అయింది. దీని ద్వారా సులభంగా విద్యా లోను పొందే అవకాశం ఉంది. ≈ పోర్టల్ ద్వారా ఏయే రకాల ఎడ్యుకేషనల్ లోను స్కీములను వివిధ బ్యాంకులు అందజేస్తున్నాయో ఆ సమాచారం పొందవచ్చు. ≈ అన్ని బ్యాంకులకు ఒకే తరహాలో అప్లికేషన్ ద్వారా లోన్‌కి దరఖాస్తు చేసుకునే సదుపాయం ఉంది. ≈ ఒకేసారి వివిధ బ్యాంకులకు లోన్ కోసం అప్లై చేయవచ్చు. ≈ బ్యాంకులు ఈ పోర్టల్ ద్వారా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి వాటి స్టేటస్‌ను పోర్టల్‌లో పొందుపరుస్తాయి. ≈ విద్యార్థులు లోనుకు సంబంధించి ఏమైనా సమాచారం తెలుసుకోవాలన్నా, లేదా కంప్లైంట్ ఇవ్వాలన్నా ఇ-మెయిల్ ద్వారా అలాంటి సదుపాయం ఉంటుంది. ≈ ఈ పోర్టల్ నుంచి నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్‌కి కూడా లింకేజ్ ఉంటుంది. దాని వల్ల విద్యార్థులు ప్రభుత్వం వారు అందజేసే వివిధ రకాల స్కాలర్‌షిప్పుల గురించి సమాచారం పొందవచ్చు. అప్లికేషన్ కూడా పెట్టుకోవచ్చు. ≈ ఈ విద్యాలక్ష్మి పోర్టల్ అనేది లోన్‌కి అప్లై చేసుకోడానికి ఒక సులభతరమైన మార్గం మాత్రమే. ఎవరు లోన్‌కి అర్హులు? లోను మొత్తం ఎంత? వడ్డీరేట్లు తదితరాలు బ్యాంకు వారి నిబంధలన మేరకు ఉంటాయి. ≈ సాధారణంగా బ్యాంకువారు 12 నుంచి 17 శాతం వరకు వడ్డీతో లోన్ సౌకర్యాన్ని కల్పిస్తారు. ≈ ఈ లోన్‌కి ప్రాసెసింగ్ ఫీజు, ప్రీ క్లోజర్ ఫీజు ఏమీ చార్జి చెయ్యరు. ≈ లోన్ మొత్తాన్ని విద్యకయ్యే ఖర్చు మొత్తానికి మాత్రమే ఇస్తారు. ≈ ఈ లోన్‌కి తప్పనిసరిగా గ్యారెంటీ ఇచ్చేవారు కావాలి. ఒకవేళ ఎక్కువ మొత్తమైతే కొల్లేటరల్ (ష్యూరిటీ) కూడా అవసరం అవుతుంది. ≈ ఈ లోన్‌కి కట్టే వడ్డీని ఇన్‌కంటాక్స్ చట్టం ప్రకారం సెక్షన్ 80 ఇ కింద తగ్గింపు పొందవచ్చు. (ఈ సెక్షన్ కింద తగ్గింపు పొందాలంటే లోన్ని తప్పనిసరిగా షెడ్యూల్ బ్యాంకు నుండి లేదా ఆమోదిత ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ నుండి మాత్రమే తీసుకోవాలి). ≈ ఆర్థిక ఇబ్బందులతో సతమతం అయ్యే విద్యార్థులు ఈ ఎడ్యుకేషనల్ లోన్ ద్వారా తమ విద్యకు తామే డబ్బును సమకూర్చుకుని, విద్య అనంతరం తామే తీర్చుకోవచ్చు. ఇదొక మంచి సదుపాయం. - రజని భీమవరపు ఫైనాన్షియల్ ప్లానర్, ‘జెన్ మనీ’ -
విద్యా రుణం తీర్చకపోయినా.. మైనస్ స్కోర్: సిబిల్
కొచ్చి : తీసుకున్న విద్యా రుణం తిరిగి తీర్చకపోయినా... అది సిబిల్ క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం చూపుతుందని క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (ఇండియా) లిమిటెడ్ (సిబిల్) సీనియర్ వైస్ ప్రెసిడెంట్-కన్జూమర్ సర్వీసెస్ అండ్ కమ్యూనికేషన్స్ హర్షాలా చందోర్కర్ స్పష్టం చేశారు. విద్యారుణం తీసుకున్న ఒక వ్యక్తి తన కోర్సును పూర్తిచేసిన నిర్దిష్ట సమయం తర్వాత రుణ బకాయి చెల్లించాల్సి ఉంటుంది. లేదా సంబంధిత వ్యక్తికి హామీ ఉన్న వ్యక్తి అయినా నెలవారీ చెల్లింపులు జరపాలి. పెరుగుతున్న విద్యా రుణ బకాయిలు... ఈ రుణాలకు సంబంధించి సిబిల్ స్కోర్ సమస్య ఉండదని కొందరు భావిస్తున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో చందోర్కర్ ఈ విషయం చెప్పారు. రుణ అప్లికేషన్ ప్రక్రియ పూర్తికి బ్యాంకులు సిబిల్ ట్రాన్స్ యూనియన్ స్కోర్‌ను ప్రమాణంగా తీసుకుంటాయి. విద్యా రుణానికి సంబంధించి ముఖ్యాంశాలు చూస్తే.. సిబిల్ డేటా ప్రకారం దేశంలో, విదేశాల్లో విద్యకు సంబంధించి మొత్తం రుణాల విలువ 2015 మార్చి 31 నాటికి రూ.63,800 కోట్ల మూడు, నాలుగు త్రైమాసికాల్లో విద్యా రుణాలకు అత్యధికంగా దరఖాస్తులు దాఖలవుతున్నాయి. 2014 నాల్గవ త్రైమాసికంలో 1,30,000 విద్యా రుణ దరఖాస్తులు దాఖలయ్యాయి. ప్రస్తుతం సగటు రుణం రూ.6 లక్షలకు చేరింది.మొత్తం మంజూరులో రూ.1 లక్ష లోపు రుణాలు 10 శాతంకన్నా తక్కువ ఉండగా... రూ.5 లక్షలు దాటిన రుణాల సంఖ్య 30 శాతంపైనే.