సరస్వతికి లక్ష్మీ కటాక్షం
ఉమెన్ ఫైనాన్స్ / ఎడ్యుకేషనల్ లోన్
ఇప్పటికీ చాలావరకు చిన్న, మధ్య తరగతి కుటుంబాల వారు తమ పిల్లలకు ప్రాథమిక విద్యను అందజేయగలుగుతున్నా, పై చదువులకు మాత్రం పంపలేక ఆర్థికంగా అవస్థలు పడుతున్నారు. కొంతమంది తమ పిల్లల్లో ఎవరో ఒకరిని మాత్రమే ఉన్నత విద్యాభాస్యానికి పంపగలుగుతున్నారు. మరీ ముఖ్యంగా... ఆడపిల్ల, మగపిల్ల వాడు ఉంటే మగపిల్లవాడిని మాత్రమే పైచదువులకు పంపిస్తూ, ఆడపిల్లలకు పెళ్లి చేసేస్తున్నారు. దీని వల్ల మెరుగైన ప్రతిభ ఉన్న చాలామంది విద్యార్థులు మరుగున పడిపోతున్నారు.
పిల్లల పైచదువుల కోసం అని బ్యాంకులు, ఇతర ఫైనాన్స్ సంస్థలు లోను తీసుకునే సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. కానీ చాలామందికి వీటి మీద అవగాహన లేక పోవడం వల్ల ఈ అవకాశాన్ని వినియోగించుకోలేకపోతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని విద్యార్థులు ఎవరైతే పైచదువులకు వెళ్లాలనుకుంటున్నారో వారు ఎడ్యుకేషన్ లోన్‌ను సులభంగా పొందడానికి భారత ప్రభుత్వం 2015 ఆగస్టు 15న విద్యాలక్ష్మి (www.vidyalakshmi.co.in) అనే పోర్టల్‌ను ప్రారంభించింది.
ఆర్థిక వెసులుబాటు లేని కారణంగా ఏ విద్యార్థీ తన చదువును మధ్యలోనే ఆపేయకూడదు అనే ముఖ్యోద్దేశంతో ఈ పోర్టల్ ప్రారంభం అయింది. దీని ద్వారా సులభంగా విద్యా లోను పొందే అవకాశం ఉంది.
≈ పోర్టల్ ద్వారా ఏయే రకాల ఎడ్యుకేషనల్ లోను స్కీములను వివిధ బ్యాంకులు అందజేస్తున్నాయో ఆ సమాచారం పొందవచ్చు.
≈ అన్ని బ్యాంకులకు ఒకే తరహాలో అప్లికేషన్ ద్వారా లోన్‌కి దరఖాస్తు చేసుకునే సదుపాయం ఉంది.
≈ ఒకేసారి వివిధ బ్యాంకులకు లోన్ కోసం అప్లై చేయవచ్చు.
≈ బ్యాంకులు ఈ పోర్టల్ ద్వారా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి వాటి స్టేటస్‌ను పోర్టల్‌లో పొందుపరుస్తాయి.
≈ విద్యార్థులు లోనుకు సంబంధించి ఏమైనా సమాచారం తెలుసుకోవాలన్నా, లేదా కంప్లైంట్ ఇవ్వాలన్నా ఇ-మెయిల్ ద్వారా అలాంటి సదుపాయం ఉంటుంది.
≈ ఈ పోర్టల్ నుంచి నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్‌కి కూడా లింకేజ్ ఉంటుంది. దాని వల్ల విద్యార్థులు ప్రభుత్వం వారు అందజేసే వివిధ రకాల స్కాలర్‌షిప్పుల గురించి సమాచారం పొందవచ్చు. అప్లికేషన్ కూడా పెట్టుకోవచ్చు.
≈ ఈ విద్యాలక్ష్మి పోర్టల్ అనేది లోన్‌కి అప్లై చేసుకోడానికి ఒక సులభతరమైన మార్గం మాత్రమే. ఎవరు లోన్‌కి అర్హులు? లోను మొత్తం ఎంత? వడ్డీరేట్లు తదితరాలు బ్యాంకు వారి నిబంధలన మేరకు ఉంటాయి.
≈ సాధారణంగా బ్యాంకువారు 12 నుంచి 17 శాతం వరకు వడ్డీతో లోన్ సౌకర్యాన్ని కల్పిస్తారు.
≈ ఈ లోన్‌కి ప్రాసెసింగ్ ఫీజు, ప్రీ క్లోజర్ ఫీజు ఏమీ చార్జి చెయ్యరు.
≈ లోన్ మొత్తాన్ని విద్యకయ్యే ఖర్చు మొత్తానికి మాత్రమే ఇస్తారు.
≈ ఈ లోన్‌కి తప్పనిసరిగా గ్యారెంటీ ఇచ్చేవారు కావాలి. ఒకవేళ ఎక్కువ మొత్తమైతే కొల్లేటరల్ (ష్యూరిటీ) కూడా అవసరం అవుతుంది.
≈ ఈ లోన్‌కి కట్టే వడ్డీని ఇన్‌కంటాక్స్ చట్టం ప్రకారం సెక్షన్ 80 ఇ కింద తగ్గింపు పొందవచ్చు. (ఈ సెక్షన్ కింద తగ్గింపు పొందాలంటే లోన్‌ని తప్పనిసరిగా షెడ్యూల్ బ్యాంకు నుండి లేదా ఆమోదిత ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్ నుండి మాత్రమే తీసుకోవాలి).
≈ ఆర్థిక ఇబ్బందులతో సతమతం అయ్యే విద్యార్థులు ఈ ఎడ్యుకేషనల్ లోన్ ద్వారా తమ విద్యకు తామే డబ్బును సమకూర్చుకుని, విద్య అనంతరం తామే తీర్చుకోవచ్చు. ఇదొక మంచి సదుపాయం.
- రజని భీమవరపు
ఫైనాన్షియల్ ప్లానర్, ‘జెన్ మనీ’