Women Finance
-
ఈక్విటీల్లో మహిళల భాగస్వామ్యం ఎలా ఉందంటే..
ఈక్విటీ మార్కెట్లో మహిళా పెట్టుబడిదారుల భాగస్వామ్యం పెరుగుతోంది. వారి సగటు పోర్ట్‌ఫోలియో పరిమాణం రూ.55,454గా ఉందని సర్వేలు చెబుతున్నాయి. ఇది ఈక్విటీ పెట్టుబడిదారుల జాతీయ సగటు కంటే ఎక్కువ. ఈక్విటీలో పెట్టుబడిపెట్టే మొత్తం మహిళల్లో మెజారిటీ (68%) రూ.1 లక్షలోపు పోర్ట్‌ఫోలియో కలిగి ఉన్నారని ఆన్లైన్ బ్రోకరేజ్ ప్లాట్‌ఫామ్ ఫైయర్స్ డేటా ద్వారా తెలిసింది.ఈ నివేదిక ప్రకారం 21% మహిళలు రూ.1 లక్ష-రూ.5 లక్షల వరకు పోర్ట్‌ఫోలియో కలిగి ఉన్నారు. 11% మంది రూ.5 లక్షలకు పైగా పెట్టుబడి పెట్టారు. మహారాష్ట్రలోని మొత్తం ఇన్వెస్టర్లలో దాదాపు మహిళలు సగం మంది ఉన్నారు. మొత్తం మహిళా పెట్టుబడిదారుల్లో 22.38% మంది మహారాష్ట్ర వారే. ఆంధ్రప్రదేశ్‌లో 10.68%, కర్ణాటక 7.65%, కేరళ 5.78% మంది మహిళలు ఈక్వీటీల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు.ఇదీ చదవండి: బ్యాంకుల్లో రుణవృద్ధి తగ్గుతుందన్న ప్రముఖ సంస్థమహిళా వ్యాపారులు ఉన్న మొదటి ఐదు నగరాల్లో ముంబై (4.16%), బెంగళూరు (4.19%), పుణె (3.93%), థానే (2.66%), హైదరాబాద్ (2.62%) ఉన్నాయి. 26-55 ఏళ్ల వయసు ఉన్న మహిళలు 58% మంది ఉన్నారు. ఫైయర్స్ ప్లాట్‌ఫారమ్‌లో మహిళా పెట్టుబడిదారులు నెలకు 5% స్థిరమైన వృద్ధితో పెరుగుతున్నారని డేటా ద్వారా తెలిసింది. -
95 శాతం మహిళలకు అవి తెలియదట!
భారత్‌లో మహిళలకు అప్పుపుట్టడం కష్టంగా మారిందని, అందుకు సంబంధించిన వివరాలు తెలియజేస్తూ తాజా నివేదిక విడుదలైంది. అప్పు కోసం చూస్తున్న మహిళల్లో దాదాపు 47 శాతం మందికి ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నట్లు యూకేకు చెందిన బిజినెస్ ఫైనాన్షియల్ ప్లాట్‌ఫామ్ టైడ్ బుధవారం విడుదల చేసిన నివేదికలో తెలిపింది.టైడ్ ఇండియా నివేదించిన తన మొదటి భారత్ ఉమెన్ యాస్పిరేషన్ ఇండెక్స్ (బీడబ్ల్యూఏఐ) కోసం టైర్-2 పట్టణాల నుంచి 18-55 ఏళ్ల వయసు ఉన్న 1,200 మందిపై సర్వే చేశారు. ఇందులో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ ఆర్థిక పథకాలు, తమ వ్యాపారానికి ప్రయోజనం చేకూర్చే కార్యక్రమాల గురించి వారికి తెలియదని 95 శాతం మంది మహిళలు చెప్పారు. అయితే 52 శాతం మంది మహిళా పారిశ్రామికవేత్తలకు ఆర్థిక రుణాలు అందుబాటులో ఉన్నాయని, ప్రతి ఇద్దరిలో ఒకరికి ఆర్థికపరమైన అవకాశం ఉందని నివేదిక వెల్లడించింది. కానీ 47 శాతం మందికి మాత్రం అప్పుపుట్టడం కష్టంగా మారుతుందని నివేదించింది.సర్వేలో భాగంగా 80 శాతం మంది మహిళలు డిజిటల్ అక్షరాస్యత అవసరమని గుర్తించారు. 51 శాతం మంది తమ వ్యాపారం కోసం డిజిటల్ సాధనాలను యాక్సెస్ చేయడంలో అడ్డంకులు ఎదుర్కొంటున్నారని నివేదిక ఎత్తి చూపింది. 31 శాతం మంది మహిళలకు అదే వ్యాపారంలో ఉన్న ఇతర మహిళలతో పోటీ ఏర్పడుతోందని తెలిసింది. ఇదీ చదవండి: ఎవరెస్ట్, ఎండీహెచ్ మసాలాపై నిషేధం.. స్పందించిన కంపెనీటైడ్, గ్లోబల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆలివర్ ప్రిల్ మాట్లాడుతూ..‘మహిళా వ్యాపారవేత్తలకు అప్పు పుట్టుకపోవడానికి ప్రధాన కారణం..వారు మహిళలు కావడమే. దాంతోపాటు వారు ఉంటున్న ప్రాంతం కూడా అవరోధంగా మారుతోంది. ముఖ్యంగా టైర్-2 పట్టణాలు, సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లోని మహిళా పారిశ్రామికవేత్తలకు ఆర్థిక పరమైన అవగాహన లేకపోవడం, సరైన మార్గదర్శకత్వం కరవవడంతో అప్పులు రావడం లేదు’ అన్నారు. -
మీ ఇంటికి దీపం మీరే!
ఉమెన్ ఫైనాన్స్ వందన సాధారణ గృహిణి. భర్త, ఇద్దరు ఆడపిల్లల ఇంటి వ్యవహారాలు చూసుకోవడంలోనే రాత్రీ పగలూ గడిపేస్తుండేది. ఆర్థిక వ్యవహారాలన్నీ సంపాదనపరుడైన భర్త రాజేశే చూసుకొనేవారు. ఇంటి బడ్జెట్ మాత్రం ఆమె చూసుకొంటూ వచ్చేది. జీతం నుంచి నెల నెలా భర్త ఇచ్చిన డబ్బులతోనే ఇంటి ఖర్చులు చూసేది. ఆ డబ్బుతోనే ఇల్లు గడిపి, అందులోనే కాస్తంత దాచి, పిల్లలు అడిగినవి ఏమైనా కొనిపెట్టేది. అయితే, కొన్నేళ్ళుగా పెరుగుతున్న ధరలు, వాటితో పెరుగుతున్న ఇంటి ఖర్చులు ఇబ్బందిపెడుతూ వచ్చాయి. పిల్లల చదువుల ఖర్చూ పెరిగింది. పొదుపు సూత్రం పాటించని వందన ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరి అయ్యింది. పురుగు మీద పుట్రలా కొద్ది నెలల క్రితం ఆమె భర్త రాజేశ్ దురదృష్టవశాత్తూ ఒక ప్రమాదంలో కన్నుమూశాడు. అప్పటి దాకా గృహ ఋణం వాయిదాలు కట్టడం దగ్గర నుంచి అన్నీ చూసుకున్న భర్త చనిపోవడంతో, ఆర్థిక వ్యవహారాలేవీ తెలియని వందన ఇబ్బందుల్లో పడింది. అప్పటి దాకా తన భర్త నడిపినవన్నీ తెలుసుకోవడానికి తంటాలు పడింది. వందన లానే చాలామంది భారతీయ గృహిణులు ఆర్థిక వ్యవహారాల పట్ల అవగాహన లేక ఇబ్బంది పడుతున్నారు. రోజు రోజుకూ పెరుగుతున్న ధరలు, మరోపక్క గ్యాస్ సిలిండర్ల దగ్గర నుంచి అన్నిటి మీదా తగ్గిపోతున్న సబ్సిడీల నేపథ్యంలో ఇంటి బడ్జెట్‌నూ, కుటుంబ భవిష్యత్తునూ ప్లాన్ చేసుకోవడం అంత ఈజీ కాదు. అయితే, కొద్దిపాటి అవగాహనతో ఆడవాళ్ళు చాలా అద్భుతంగా ఈ పని చేయగలరు. నిజం చెప్పాలంటే, మగవాళ్ళ కన్నా బ్రహ్మాండంగా చేయగలరు. దాని కోసం గృహిణులు పాటించాల్సిన కొన్ని టిప్స్ ఏమిటంటే... 1. ఆదాయం, ఖర్చు లెక్క చూసుకోండి! ఇంటికి సరుకులు, సామాన్లు కొనే విషయంలో బడ్జెట్ వేసుకోవడం గృహిణులకు అలవాటే. ఆ మంచి అలవాటును కేవలం నెల నెలా ఇల్లు నడపడానికే పరిమితం చేయకండి. కరెంట్ బిల్లు, ఫోన్ బిల్లు, ఇంటి అద్దె, క్రెడిట్ కార్డ్ బిల్లు, హౌసింగ్ లోన్ లాంటి వాటితో సహా మొత్తం ఇంటి బడ్జెట్‌కు ఎంత అవసరమో చూసుకోండి. వచ్చే ఆదాయం, పెట్టాల్సిన ఈ ఖర్చు - రెండూ లెక్కవేసుకోండి. దీనికి నిపుణుల అవసరమేమీ లేదు. కంప్యూటర్లో ఎక్సెల్ వర్క్‌షీట్‌లో టైప్ చేసుకోవచ్చు. లేదంటే సింపుల్‌గా ఒక డైరీ పెట్టుకొని, లెక్క రాసుకోవచ్చు. 2. ఎక్కడ అతిగా ఖర్చవుతోందో చూడండి! ఇంటికయ్యే ఖర్చు మొత్తం లెక్క చూసుకున్నాక, ఏయే విషయాల్లో ఎక్కువ ఖర్చవుతోందో అర్థమవుతుంది. వాటిని ఏ మేరకు తగ్గించుకోవచ్చో చూసుకోవాలి. ఉదాహరణకు, వారం వారం హోటల్‌కు వెళ్ళి భోజనం చేయడం, వారాంతంలో మాల్స్‌కు వెళ్ళి షాపింగ్ చేయడం, తరచూ సినిమాలకూ, షికార్లకూ వెళ్ళడం లాంటివి. వీటిని పూర్తిగా మానేయక్కర్లేదు కానీ, తగ్గించుకోవచ్చు. ఎక్కువగా వాడనట్లయితే, ఫోన్, ఇంటర్నెట్లకు తక్కువ ప్యాకేజ్ తీసుకోవచ్చు. అలాగే, పెద్ద పెద్ద మాల్స్‌కు వెళ్ళి ఎక్కువ ఖర్చు పెట్టి కొనే పని పెట్టుకోకుండా, దగ్గరలోనే ధర తగ్గించి సరుకులు అమ్మే పచారీ కొట్లు చూసుకోవడం బెటర్. 3. ముందు ఆదా! ఆ తరువాతే ఖర్చులు!! సాధారణంగా ఇంటిని నడిపే ఇల్లాళ్ళకు డబ్బులు ఆదా చేసే మంచి అలవాటు ఉంటుంది. మానుకోదగ్గ ఖర్చులేవో చూసుకొని, వాటిని మానుకొంటే ఆదా మరింత పెరుగుతుంది. అలాగే, బ్యాంక్‌లో సేవింగ్స్ ఖాతా తెరిచి, కాస్తంత అదనంగా డబ్బు ఉందనుకున్నప్పుడల్లా దానిలో డబ్బు డిపాజిట్ చేస్తూ ఉండాలి. అలా కొద్ది కొద్దిగా దాచుకుంటూ వచ్చిన సొమ్మే ఒకనాటికి పెద్ద మొత్తం అవుతుంది. ఇలా దాచుకోగా మిగిలిన మొత్తంతోనే ఖర్చులు పెట్టుకోవడం అలవాటు చేసుకోవాలి. 4. తెలివిగా మదుపు చేయాలి! డబ్బు దాచడం ఒక్కటే కాదు... ఆ డబ్బు భవిష్యత్తులో అవసరాలకు తగ్గట్లు పెరిగేలా చూసుకోవడం కూడా ముఖ్యం. డబ్బులు అటు బ్యాంకులోనో, ఇటు ఇంట్లోనో ఉత్తినే పడి మూలుగుతుండడం వల్ల ఉపయోగం లేదు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ధరలకు అది సరిపోదు. కాబట్టి, దాచుకొన్న డబ్బును తెలివిగా ఎలా మదుపు చేయాలన్నది చూసుకోవాలి. అందుకోసం అవసరమైతే నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోవాలి. కావాలంటే, డబ్బు మదుపు చేయడం గురించి జీవిత భాగస్వామి సలహాలు అడిగి తీసుకోవాలి. 5. అత్యవసర ఖర్చులకు ప్లానింగ్! గృహిణులు సాధారణంగా భర్త చేసే ప్లానింగ్ మీద ఆధారపడుతూ ఉంటారు. పూర్తిగా అలా ఆధారపడడం తప్పు. కొన్నిసార్లు అనుకోకుండా వైద్యం ఖర్చులో, మరొకటో రావచ్చు. అలాంటప్పుడు ఇబ్బంది పడకుండా ఉండేలా చూసుకోవాలి. భర్తతో కలసి మీరు కూడా ఆర్థిక ప్లానింగ్‌లో పాలు పంచుకోవాలి. ఆకస్మిక ప్రయాణాలకని, పిల్లల చదువులకని కొంత డబ్బును విడిగా పెట్టుకోవడం మంచిది. అలాగే, రిటైర్మెంట్ తరువాతి జీవితం గురించి కూడా ఆలోచించాలి. ఆ వయసులో డబ్బుకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. 6. అవగాహన పెంచుకోవాలి! ఇంట్లో ఉండే ఆడవాళ్ళకు డబ్బుల వ్యవహారాలు ఎందుకని కొందరు అనుకుంటూ ఉంటారు. అది చాలా తప్పు. అసలు ఆర్థిక వ్యవహారాల అవగాహన ఇంటిని నడిపే గృహిణులకే ఎక్కువగా ఉండాలి. స్త్రీలు కూడా దీని మీద ఎక్కువగా దృష్టి పెట్టాలి. డబ్బు ఆదా చేయడానికీ, దాన్ని మదుపు చేయడానికీ ఉన్న మార్గాలు తెలుసుకోవాలి. ముందుగా బ్యాంకులో ఉన్న ఆదా మార్గాలు తెలుసుకోవడం ద్వారా మొదలుపెట్టాలి. అయితే, బ్యాంకులో సేవింగ్ ఎకౌంట్‌తో ఆగిపోకుండా, మదుపు చేయడానికి ఉన్న ఇతర మార్గాలు తెలుసుకోవాలి. తరువాత ఆర్థిక నిపుణులతో విషయం చర్చించాలి. వీలుంటే, ఇంటర్నెట్లో సదరు మదుపు అవకాశాల గురించి అన్వేషించి, వివరాలు తెలుసుకోవాలి. కొన్ని టీవీ ఛానళ్ళు మహిళల పర్సనల్ ఫైనాన్స్పైన ప్రత్యేక కార్యక్రమాలు వేస్తుంటాయి. అవి చూడడం కూడా ఒక మంచి ఆలోచన. జీవితంలో ఎప్పుడైనా, ఏదైనా జరగవచ్చు కాబట్టి, అన్ని రకాల పరిస్థితులకూ సిద్ధంగా ఉండాలి. ఆర్థిక అంశాల పట్ల ఎంత అవగాహన పెంచుకొంటే, అంత మంచిది. - మహతి -
కొద్దికొద్దిగా... కొండంతగా..!
ఉమెన్ ఫైనాన్స్ / రికరింగ్ డిపాజిట్ పరుగెత్తి పాలు తాగటం కన్నా నెమ్మదిగా వెళ్లి నీళ్లు తాగటం మంచిది అనే నానుడి వినే ఉంటారు. చాలామంది తమ పిల్లలకు తమకు మంచి భవిష్యత్తును ఏర్పరచుకోవాలనే కోరికతో చాలా కష్టపడి సొమ్మును కూడబెడుతూ ఉంటారు. ఆ సొమ్మును సరైన ప్రణాళిక లేకుండా త్వరగా పెద్ద మొత్తం అవ్వాలనే ఆశతో ఎక్కువ రిస్క్ ఉన్నటువంటి మార్గాలలో పెట్టుబడి పెడుతూ ఉంటారు. ఇలాంటప్పుడు ఒక్కోసారి అనుకోని పరిస్థితుల కారణంగా మొదటకే మోసం జరగవచ్చు. అందుకే పెట్టుబడి పెట్టే మొత్తాన్ని ఒకే పొదుపు మార్గంలో కాకుండా కొన్నింటిని రిస్క్ తక్కువగా ఉండే వాటిలోను, మరికొంత మొత్తాన్ని కాస్త రిస్క్ భరించగలిగే సాధనంలో పెట్టుబడి పెడితే, అనుకున్న లక్ష్యాన్ని సులువుగా చేరుకుంటారు. రిస్క్ తక్కువగా ఉండి అతి తక్కువ మొత్తంతో మొదలు పెట్టుకొనే సాధనమే బ్యాంకువారు అందజేసే రికరింగ్ డిపాజిట్స్. ► ఈ రికరింగ్ డిపాజిట్‌ను నెలకు అతితక్కువ మొత్తమైన 100 రూ.తో మొదలుపెట్టవచ్చు. ► సాధారణంగా బ్యాంకులు 7 శాతం నుండి 8 శాతం వరకు వడ్డీని అందజేస్తున్నాయి. ► ఈ రికరింగ్ డిపాజిట్ కాల వ్యవధిని 6 నెలల నుండి 10 సంవత్సరాల వరకు ఎంచుకోవచ్చు. ► సీనియర్ సిటిజన్స్‌కి వడ్డీ రేటు 0.5 శాతం అదనంగా లభిస్తుంది. ► రికరింగ్ డిపాజిట్ మీద వచ్చే వడ్డీ గనుక రూ. 10,000లు దాటితే టీడీఎస్ కట్ అవుతుంది. ► ఈ రికరింగ్ డిపాజిట్ మీద లోన్ తీసుకునే సదుపాయం కూడా ఉంది. {పతి నెలా తప్పనిసరిగా రికరింగ్ డిపాజిట్ ఎంత మొత్తానికైతే తీసుకుంటారో అంత మొత్తాన్ని బ్యాంకులో జమ చేయాలి. లేకపోతే పెనాల్టీ పడుతుంది. ► రికరింగ్ డిపాజిట్లో ఉన్న మొత్తానికి ప్రతి మూడు నెలలకోసారి వడ్డీని లెక్కగడతారు. కొన్ని బ్యాంకులు ఇన్స్టాల్మెంట్ కట్టకపోయినా పెనాల్టీ వేయకుండా, సౌలభ్యం ఉన్నప్పుడు కట్టే విధంగా కూడా రికరింగ్ డిపాజిట్ సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. ► బ్యాంకులు ఖాతాదారుల సేవింగ్స్ ఖాతా నుండి ఆటోమేటిక్‌గా వారి రికరింగ్ ఖాతాకు ప్రతి నెల రికరింగ్ డిపాజిట్ మొత్తాన్ని బదిలీ చేసే సౌకర్యాన్ని కూడా అందజేస్తున్నాయి. ► ఇలా అతి తక్కువ రిస్క్ కలిగి ఉండి తమకు వచ్చే సంపాదనలో కొంత మొత్తాన్ని భవిష్యత్తు అవసరాలకు సమకూర్చుకోవడానికి ఈ రికరింగ్ డిపాజిట్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. -
సరస్వతికి లక్ష్మీ కటాక్షం
ఉమెన్ ఫైనాన్స్ / ఎడ్యుకేషనల్ లోన్ ఇప్పటికీ చాలావరకు చిన్న, మధ్య తరగతి కుటుంబాల వారు తమ పిల్లలకు ప్రాథమిక విద్యను అందజేయగలుగుతున్నా, పై చదువులకు మాత్రం పంపలేక ఆర్థికంగా అవస్థలు పడుతున్నారు. కొంతమంది తమ పిల్లల్లో ఎవరో ఒకరిని మాత్రమే ఉన్నత విద్యాభాస్యానికి పంపగలుగుతున్నారు. మరీ ముఖ్యంగా... ఆడపిల్ల, మగపిల్ల వాడు ఉంటే మగపిల్లవాడిని మాత్రమే పైచదువులకు పంపిస్తూ, ఆడపిల్లలకు పెళ్లి చేసేస్తున్నారు. దీని వల్ల మెరుగైన ప్రతిభ ఉన్న చాలామంది విద్యార్థులు మరుగున పడిపోతున్నారు. పిల్లల పైచదువుల కోసం అని బ్యాంకులు, ఇతర ఫైనాన్స్ సంస్థలు లోను తీసుకునే సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. కానీ చాలామందికి వీటి మీద అవగాహన లేక పోవడం వల్ల ఈ అవకాశాన్ని వినియోగించుకోలేకపోతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని విద్యార్థులు ఎవరైతే పైచదువులకు వెళ్లాలనుకుంటున్నారో వారు ఎడ్యుకేషన్ లోన్‌ను సులభంగా పొందడానికి భారత ప్రభుత్వం 2015 ఆగస్టు 15న విద్యాలక్ష్మి (www.vidyalakshmi.co.in) అనే పోర్టల్‌ను ప్రారంభించింది. ఆర్థిక వెసులుబాటు లేని కారణంగా ఏ విద్యార్థీ తన చదువును మధ్యలోనే ఆపేయకూడదు అనే ముఖ్యోద్దేశంతో ఈ పోర్టల్ ప్రారంభం అయింది. దీని ద్వారా సులభంగా విద్యా లోను పొందే అవకాశం ఉంది. ≈ పోర్టల్ ద్వారా ఏయే రకాల ఎడ్యుకేషనల్ లోను స్కీములను వివిధ బ్యాంకులు అందజేస్తున్నాయో ఆ సమాచారం పొందవచ్చు. ≈ అన్ని బ్యాంకులకు ఒకే తరహాలో అప్లికేషన్ ద్వారా లోన్‌కి దరఖాస్తు చేసుకునే సదుపాయం ఉంది. ≈ ఒకేసారి వివిధ బ్యాంకులకు లోన్ కోసం అప్లై చేయవచ్చు. ≈ బ్యాంకులు ఈ పోర్టల్ ద్వారా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి వాటి స్టేటస్‌ను పోర్టల్‌లో పొందుపరుస్తాయి. ≈ విద్యార్థులు లోనుకు సంబంధించి ఏమైనా సమాచారం తెలుసుకోవాలన్నా, లేదా కంప్లైంట్ ఇవ్వాలన్నా ఇ-మెయిల్ ద్వారా అలాంటి సదుపాయం ఉంటుంది. ≈ ఈ పోర్టల్ నుంచి నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్‌కి కూడా లింకేజ్ ఉంటుంది. దాని వల్ల విద్యార్థులు ప్రభుత్వం వారు అందజేసే వివిధ రకాల స్కాలర్‌షిప్పుల గురించి సమాచారం పొందవచ్చు. అప్లికేషన్ కూడా పెట్టుకోవచ్చు. ≈ ఈ విద్యాలక్ష్మి పోర్టల్ అనేది లోన్‌కి అప్లై చేసుకోడానికి ఒక సులభతరమైన మార్గం మాత్రమే. ఎవరు లోన్‌కి అర్హులు? లోను మొత్తం ఎంత? వడ్డీరేట్లు తదితరాలు బ్యాంకు వారి నిబంధలన మేరకు ఉంటాయి. ≈ సాధారణంగా బ్యాంకువారు 12 నుంచి 17 శాతం వరకు వడ్డీతో లోన్ సౌకర్యాన్ని కల్పిస్తారు. ≈ ఈ లోన్‌కి ప్రాసెసింగ్ ఫీజు, ప్రీ క్లోజర్ ఫీజు ఏమీ చార్జి చెయ్యరు. ≈ లోన్ మొత్తాన్ని విద్యకయ్యే ఖర్చు మొత్తానికి మాత్రమే ఇస్తారు. ≈ ఈ లోన్‌కి తప్పనిసరిగా గ్యారెంటీ ఇచ్చేవారు కావాలి. ఒకవేళ ఎక్కువ మొత్తమైతే కొల్లేటరల్ (ష్యూరిటీ) కూడా అవసరం అవుతుంది. ≈ ఈ లోన్‌కి కట్టే వడ్డీని ఇన్‌కంటాక్స్ చట్టం ప్రకారం సెక్షన్ 80 ఇ కింద తగ్గింపు పొందవచ్చు. (ఈ సెక్షన్ కింద తగ్గింపు పొందాలంటే లోన్ని తప్పనిసరిగా షెడ్యూల్ బ్యాంకు నుండి లేదా ఆమోదిత ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ నుండి మాత్రమే తీసుకోవాలి). ≈ ఆర్థిక ఇబ్బందులతో సతమతం అయ్యే విద్యార్థులు ఈ ఎడ్యుకేషనల్ లోన్ ద్వారా తమ విద్యకు తామే డబ్బును సమకూర్చుకుని, విద్య అనంతరం తామే తీర్చుకోవచ్చు. ఇదొక మంచి సదుపాయం. - రజని భీమవరపు ఫైనాన్షియల్ ప్లానర్, ‘జెన్ మనీ’ -
బీమా ఉంటే ధీమాగా ప్రయాణించొచ్చు!
ఉమెన్ ఫైనాన్స్ / వాహన బీమా పాలసీ ప్రస్తుత రోజుల్లో మహిళలు అన్ని రంగాల్లో దూసుకువెళ్తున్నారు. కొంతమంది ఉద్యోగాలు చేస్తుంటే, మరికొంతమంది స్వయం ఉపాధి మార్గాలలో పయనిస్తున్నారు. ఈ క్రమంలో తమ విధులను సమర్థవంతంగా నిర్వహించడానికి వాహనాలను కూడా విరివిగా వాడుతున్నారు. ఇంటిలో ఉండే హౌస్‌వైఫ్‌లు కూడా తమ పిల్లలను స్కూళ్లకు, ఇతర తరగతులకు పంపడానికి అలాగే తమ ఇంటి అవసరాలకు వాహనాలను ఉపయోగిస్తున్నారు. ఈ వాహనాలను నడిపేటప్పుడు రోడ్డు భద్రత, స్వీయభద్రతకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవడం ఎంత ముఖ్యమో ఇన్సూరెన్స్ తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. మోటార్ వెహికిల్స్ యాక్ట్ 1985 ప్రకారం ఏ వాహనానికైనా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తీసుకోవడం తప్పనిసరి. చాలామంది ఇన్సూరెన్స్ తీసుకోవడం తప్పనిసరి కనుక తీసుకుంటారు కానీ దాని గురించి ఏమీ తెలుసుకోరు. మరికొంతమంది ద్విచక్ర వాహనాలకు అసలు ఇన్సూరెన్స్ తీసుకోరు. ఈ ఇన్సూరెన్స్‌లో వేటివేటికి కవరేజి ఉంటుంది, ఎలా పనిచేస్తుందో చూద్దాం. సాధారణంగా రెండు రకాల పాలసీలు అందుబాటులో ఉన్నాయి. అవి 1. లయబిలిటీ పాలసీ, రెండు ప్యాకేజీ పాలసీ 1. లయబిలిటీ పాలసీ: ఇది మీరు వినియోగిస్తున్న వాహనం వల్ల వేరే వ్యక్తులకు గాని, వారి ఆస్తులకు గాని ఏమైనా నష్టం వాటిల్లితే ఈ పాలసీ ద్వారా వారికి నష్టపరిహారం అందుతుంది. ఈ పాలసీ మోటార్ వెహికిల్స్ యాక్ట్ ప్రకారం తప్పనిసరిగా తీసుకోవలసినది. 2. ప్యాకేజీ పాలసీ: ఈ పాలసీలో లయబిలిటీ రిస్క్తోబాటు ఇన్సూరెన్స్ తీసుకున్న వాహనానికి డ్యామేజీ జరిగినా వాహనం నడిపేవారికి పర్సనల్ యాక్సిడెంట్ జరిగినా కవరేజీ లభిస్తుంది. మోటార్ పాలసీలో ఇన్సూరెన్స్ మొత్తాన్ని ఐ.డి.వి (ఇన్సూరెన్స్ డిక్లేర్డ్ వ్యాల్యూ) నిర్ణయిస్తారు. ఈ ఐడీవీని వెహికిల్ తయారీదారు విక్రయించిన ధర, దాని మోడల్, తయారు చేసిన సంవత్సరం తదితరాల ఆధారంగా తరుగుదలను తీసివేసి లెక్కకడతారు. ఒకవేళ వెహికిల్ మోడల్ తయారీని నిలిపి వేస్తే, ఐడీవీ అనేది ఇన్సూరెన్స్ కంపెనీ, ఇన్సూరెన్స్ చేయించుకునేవారు వారి నియమ నిబంధనల ఆధారంగా నిర్ణయిస్తారు. ఈ ఇన్సూరెన్స్ అనేది ప్రతి సంవత్సరం రెన్యూ చేసుకోవలసి ఉంటుంది. కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు ద్విచక్ర వాహనాలకు ఒక సంవత్సరానికి మాత్రమే కాకుండా రెండు లేదా మూడు సంవత్సరాలకు ఒకేసారి ఇన్సూరెన్స్‌ని అందజేస్తున్నారు. వీటివల్ల ప్రతి సంవత్సరం గుర్తుంచుకుని రెన్యూ చేయవలసిన పని ఉండదు. అలాగే టారిఫ్ రేట్స్, టాక్స్ పెరిగినా వాటి భారం తగ్గుతుంది. మనిషి జీవితం ఎంతో విలువైనది. మీరు వినియోగించే వాహనం ద్వారా వేరేవారికి నష్టం వాటిల్లితే లేదా మరణం సంభవిస్తే ఆ కుటుంబానికి ఆ లోటును మీరు ఎప్పటికీ భర్తీ చేయలేరు. కాని కొంతలో కొంత వారికి జరిగిన ఆర్థిక నష్టాన్ని భర్తీ చేసే ఒక సదుపాయమే ఈ ఇన్సూరెన్స్. కనుక తప్పనిసరిగా ఇన్సూరెన్స్ తీసుకుని సేఫ్టీగా ప్రయాణిస్తూ మీ విధులను నిర్వహించండి. - రజని భీమవరపు ఫైనాన్షియల్ ప్లానర్, ‘జెన్ మనీ’ -
చిన్న దుకాణానికీ... బీమా భరోసా...
ఉమెన్ ఫైనాన్స్ / షాప్ కీపర్స్ పాలసీ భార్యాభర్తలు ఇద్దరూ సంపాదిస్తేనే గానీ కుటుంబ ఆర్థిక లక్ష్యాలను నేరవేర్చుకునే పరిస్థితులు ఇప్పుడు లేవు. ఇందుకు కొంతమంది ఉద్యోగాలు చేస్తుంటే, కొందరు స్వయం ఉపాధిని ఎంచుకుంటున్నారు. స్వయం ఉపాధి కింద చాలా వరకు మహిళలు సొంతంగా చిన్నచిన్న దుకాణాలను (ఉదా: కిరాణా, దుస్తులు, గాజులు తదితర విక్రయాలు) సమర్థంగా నిర్వహిస్తున్నారు. అయితే ఎంత సమర్థంగా నిర్వహించినా కొన్నిసార్లు అనుకోని పరిణామాలు సంభవించి నష్టాన్ని చవిచూడవలసి వస్తుంది. ఈ నష్టాన్ని కొంత మేర ‘షాప్ కీపర్స్ పాలసీ’ ద్వారా భర్తీ చేసుకోవచ్చు. ఈ పాలసీని ఎవరు తీసుకోవచ్చు? ఇది ఎలా ఉపయోగపడుతుంది? అనే విషయాలను చూద్దాం. వివిధ రకాల ఇన్సూరెన్స్ కంపెనీలు ఈ షాప్ కీపర్స్ పాలసీని కొన్ని చిన్న చిన్న వ్యత్యాసాలలో అందజేస్తున్నాయి. ప్యాకేజ్ పాలసీగా వివిధ రకాల రిస్క్‌లను కవర్ చేసే విధంగా దీనిని అందిస్తున్నారు. ఈ ప్యాకేజీ పాలసీలో తప్పనిసరిగా తీసుకోవలసిన వాటిని తీసుకుని, ఆప్షనల్‌గా ఉన్నటువంటి వాటిని తమ షాపునకు అనుగుణంగా ఎంచుకోవచ్చు. బిల్డింగ్, అందులోని వస్తువులకు అగ్ని ప్రమాదం జరిగితే వాటికి బీమా రక్షణ ఉంటుంది. పాలసీ తీసుకునేటప్పుడు బల్డింగ్ విలువను ప్రస్తుత మార్కెట్ విలువ, దాని తరుగుదల తదితరాల ఆధారంగా లెక్కగడతారు. దొంగతనం జరిగినప్పుడు అందులో ఏ వస్తువులకైతే బీమా రక్షణ తీసుకున్నామో అవి చోరీకి గురయితే ఆ మేరకు నష్ట పరిహారం అందుతుంది. అలాగే షాపులోని డబ్బుకు కూడా ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. పెడల్ సైకిల్, ప్లేట్ గ్లాస్, గ్లో సైన్కి డ్యామేజీ జరిగితే వాటిని కూడా ఈ పాలసీ కవర్ చేస్తుంది.షాపులో పని చేసేవారు మోసం చేయడం వల్ల నష్టపోతే ఆ నష్టానికి కూడా బీమా రక్షణ పొందవచ్చు. అలాగే షాపులో జరిగే పని వల్ల వేరే వ్యక్తులు గానీ లేదా వారి ఆస్తికి గానీ ఏదైనా నష్టం వాటిల్లితే ఆ నష్టానికి కూడా ఈ పాలసీ ద్వారా రక్షణ కల్పించుకోవచ్చు. ఏదైనా ప్రమాదం జరిగి, ఆ షాపును మళ్లీ యథాతథంగా ఏర్పాటు చేసుకోడానికి పట్టే వ్యవధిలో నష్టపోయే లాభానికి కూడా బీమా రక్షణ తీసుకోవచ్చు. ఈ షాప్ కీపర్ పాలసీని ప్యాకేజీ పాలసీగా అందజేస్తారని ముందే చెప్పుకున్నాం. కాబట్టి షాపు ఉండే ఏరియా, వస్తువులు, తదితరాలకు అనుగుణంగా ఏయే ఆప్షన్లు కావాలో ఎంచుకోవాలి. పాలసీ తీసుకునేటప్పుడు వాటి నిబంధనలు, షరతులు తప్పనిసరిగా చదవాలి. ఏయే రిస్క్‌లకు కవరేజీ లభ్యం కావడం లేదో కూడా చూసుకోవాలి. మన జీవితానికి ఎలాగైతే బీమా రక్షణ కల్పించుకుంటామో అదే విధంగా కుటుంబానికి ఆర్థిక చేయూతనిచ్చే దుకాణానికి కూడా బీమా రక్షణ ఏర్పరచుకుంటే.. అనుకోని సంఘటనలు జరిగి నష్టం వాటిల్లినప్పుడు చాలా వరకు బీమా సాదుపాయం ద్వారా ఆ నష్టాన్ని భర్తీ చేసుకోవచ్చు. రజని భీమవరపు ఫైనాన్షియల్ ప్లానర్, ‘జెన్ మనీ’ -
సొంతింటి స్వతంత్రం
ఉమెన్ ఫైనాన్స్ / రివర్స్ మార్ట్గేజ్ ప్రతి ఒక్కరూ తమ వృద్ధాప్యంలో ఏ చీకూ చింతా లేని ప్రశాంత జీవితం గడపాలని కోరుకుంటారు. మరి అలాంటి జీవితం అందరూ పొందగలుగుతున్నారా? దీనికి సమాధానం ‘లేదు’ అనే చెప్పాలి. ఎందుకంటే.. కొంతమందికి ఆర్థికపరమైన ఇబ్బందులు, మరికొందరికి ఆరోగ్య సమస్యలు. ఇంకొంత మందికి అన్ని వనరులూ, వసతులూ ఉన్నా కూడా తమ వారితో లేమనే బెంగ. అన్నిటికన్నా ముఖ్య సమస్య.. ఉన్న సమస్యను ఎలా పరిష్కరించుకోవాలా అనే టెన్షన్ పడుతూ సమస్యను మరింత జటిలం చేసుకోవడం. అనగనగా... ఓ చిన్న కథ ఒక ఊరిలో ఒక పెద్దావిడ ఉండేవారు. భర్త వైద్యం నిమిత్తం ఒక వ డ్డీ ప్యాపారి దగ్గర తన ఇంటిని తనఖా పెట్టి కొంత డబ్బును అప్పుగా తీసుకుంది. కాలక్రమంలో ఆమె భర్త మరణిస్తాడు. ఆమెకు పిల్లా జల్లా, ముందూ వెనుకా ఎవరూ లేరు. ఆమె, ఆమె భర్త కలిసి సంపాదించి నిర్మించుకున్న ఆ ఇల్లు తప్ప ఏమీ లేదు. ఆ ఇల్లు కూడా తనఖాలో ఉంది. ఆమెకు ఇంకా పని చేయగల శక్తి ఉంది. కానీ తనకు ఎవరూ లేరనీ, ఆ వడ్డీ వ్యాపారి వచ్చి అప్పు కట్టమని అడిగితే డబ్బు ఎక్కడి నుంచి తేవాలి అని, ఒకవేళ తీసుకురాకపోతే ఎక్కడ తన ఇంటిని వేలం వేస్తాడోనని భయం పట్టుకుంది. ఆ భయమే ఎక్కువై... పనిచేసే ఆవిడ కూడా మంచం పట్టింది. ఈ విషయం కాస్తా ఆ వడ్డీ వ్యాపారి చెవిన పడింది. ఆ వడ్డీ వ్యాపారి అత్యాశతో ఆమెకు ఎవరూ లేరు కనుక ఎలాగైనా ఆ ఇంటిని చేజిక్కించుకోవాలని అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా ఊరి పెద్దలతో పంచాయితీ పెట్టించాడు. ఆమె ఎటూ మంచాన పడింది కనుక, నెలకు కొంత మొత్తాన్ని ఆమె బతికి ఉన్నన్నాళ్లూ ఆమెకు ఇచ్చి, ఆమె మరణానంతరం ఇల్లు తన సొంత అయ్యేలా తీర్మానం చేయించుకున్నాడు. నెలా, రెండు నెలల్లో ఆ ఇల్లు తన సొంతం అవుతుందని చాలా సంతోషపడిపోయాడు. కానీ అలా జరగలేదు! ఏళ్లకు ఏళ్లు పెద్దావిడకు నెలనెలా డబ్బు ఇస్తూనే ఉన్నాడు. అలా ఎందుకు జరిగిందంటే... అతడు చేయించిన తీర్మానంతో ఆ పెద్దావిడ బెంగ తీరిపోయింది! తను పని చేసినా చేయకపోయినా కొంత మొత్తం క్రమం తప్పకుండా వడ్డీ వ్యాపారి నుంచి అందుతోంది. అంతే కాకుండా, తనకి ఓపిక ఉంటే పని చేస్తూ అదనపు ఆదాయం సమకూర్చుకోవచ్చు. అలాగే తన ఇంటి నుంచి కూడా తనను ఎవరూ వెళ్లగొట్టరు. ఈ నిశ్చింతతో ఆమె పుష్టిగా తింటూ, హాయిగా ఉండసాగింది. మనకూ ఉంది ఈ సదుపాయం! ప్రస్తుత పరిస్థితుల్లో మనక్కూడా ఈ పెద్దావిడకే ఉన్న సదుపాయం లాంటిది ఒకటి ఉంటే బాగుంటుంది కదా. ఉంటే కాదు, ఉంది! దాని పేరే ‘రివర్స్ మార్ట్గేజ్’. బ్యాంకులు సొంత ఇల్లు కలిగి ఉండి అందులో నివసిస్తూ 60 సం॥పైబడిన వారికి ఈ రివర్స్ మార్ట్గేజ్ లోన్‌ను అందిస్తున్నాయి. సింపుల్‌గా చెప్పాలంటే ఇది ఇంటి లోన్‌కు ఆపోజిట్‌గా ఉంటుంది! ఇంటి స్థితి, ప్రస్తుత మార్కెట్ విలువ, ప్రస్తుత డిమాండ్.. వీటిని బట్టి ఇంటి విలువను బ్యాంకు వారు లెక్క గడతారు. ఆ విలువను బట్టి ఎంతవరకు లోన్ ఇవ్వవచ్చో ఆ మొత్తాన్ని ఇ.ఎం.ఐ. (నెలసరి వాయిదా) రూపంలో అందజేస్తారు. ఈ ఇ.ఎం.ఐ. ని ఒక నిర్ణీత కాల పరిమితికి అందజేస్తారు. ఇ.ఎం.ఐ.ని నెలవారీగా కానీ, మూడు నెలలకొకసారి గానీ ఎంచుకునే వీలు ఉంటుంది. ఈ విధంగా తీసుకున్న లోన్‌ను వ్యక్తి మరణించినప్పుడు లేదా ఇంటిని అమ్ముకోదలచినప్పుడు చెల్లించవలసి ఉంటుంది. ఉదా: ఒక వ్యక్తి ఈ లోన్‌ను 10 సం. వరకు తీసుకున్నాడు అనుకుందాం. ఆ వ్యక్తి 10 సం.ల వరకు ఇ.ఎం.ఐ.ని పొందుతాడు. గడువు తీరిన తర్వాత ఎటువంటి ఇ.ఎం.ఐ. రాదు. ఆ తరువాత అతడు మరణించినప్పుడు ఆ వ్యక్తి వారసులు ఆ లోన్ చెల్లించి ఆ ఇంటిని తమ సొంతానికి వాడుకోవచ్చు. లేకపోతే బ్యాంకు వారు ఆ ఇంటిని అమ్మి లోన్‌కు జమ చేసుకుని మిగిలిన మొత్తాన్ని ఆ వ్యక్తి వారసులకు అందజేస్తారు. ఒకవేళ ఆ ఇల్లు అమ్మగా వచ్చిన డబ్బు లోన్‌కి సరిపోకపోతే బ్యాంకు వారు నష్టపోవలసి ఉంటుంది. అందుకే బ్యాంకు వారు లోన్ ఇచ్చేటప్పుడే ఇంటి విలువను లెక్కించే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. ఇద్దరూ కలిసి తీసుకోవచ్చు ఈ రుణాన్ని భార్యభర్తలు ఇద్దరూ కలిపి కూడా తీసుకోవచ్చు. ఇద్దరూ కలిసి తీసుకున్నప్పుడు ఇద్దరి మరణానంతరం మాత్రమే బ్యాంకు వారికి ఇంటిని అమ్మడానికి హక్కు ఉంటుంది. అయితే ఈ కింది సందర్భాలలో గడువు కన్నా ముందే బ్యాంకు వారు లోన్ అకౌంట్ క్లోజ్ చేస్తారు. లోన్ తీసుకున్నవారు ఒక ఏడాదిపాటు ఆ ఇంటిలో నివసించనట్లయితే ఇంటి పన్ను కట్టనట్లయితే లోన్ తీసుకున్న వ్యక్తి తను దివాళా తీశానని ప్రకటిస్తే ఆ ఇంటి హక్కులకు సంబంధించి ఏమైనా మార్పులు, చేర్పులు చేస్తే ప్రభుత్వం వారు వివిధ కారణాల వల్ల ఆ ఇంటిని స్వాధీన పరచుకున్నా, లేదా పడగొట్టినా. ఆర్థికంగా ఒకరి మీద ఆధారపడకుండా, తాము సంపాదించి కట్టుకున్న ఇంటిలో తమ తుది శ్వాస వరకు నివసించాలని కోరుకునే వారికి ఈ రివర్స్ మార్టిగేజ్ చాలా చక్కటి మార్గం. రజని భీమవరపు ఫైనాన్షియల్ ప్లానర్, ‘జెన్ మనీ’ -
ముందే కట్ అవదు కాబట్టి... వెనక్కు రాలేదన్న బాధ ఉండదు
ఉమెన్ ఫైనాన్స్ / ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్స్ కంపెనీలు ఏవైనా తమ అవసరాలకు తగిన పెట్టుబడులను సమకూర్చుకోడానికి పబ్లిక్ షేర్లను ఆఫర్ చేస్తుంటాయి. (ఉదా: కొత్త కంపెనీ పెట్టడానికి, ఉన్న కంపెనీ సామర్థ్యాన్ని పెంచడానికి, ఇతరత్రా అభివృద్ధి అవసరాల కోసం). అలా కంపెనీ ప్రకటించిన షేర్లను ‘ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్స్’ (ఐ.పి.ఓ.లు) విధానంలో కంపెనీ నుంచి నేరుగా పొందవచ్చు. ఈ ఐ.పి.ఓ.ల ద్వారా షేర్లకు దరఖాస్తు చేయదలచుకున్న వారు తప్పనిసరిగా ఎ.ఎస్.బి.ఎ. (అప్లికేషన్ సపోర్టెడ్ బై బ్లాక్డ్ అమౌంట్) పద్ధతిలో దరఖాస్తు చేసుకోవాలి. ఈ పద్ధతి వివరాలను చూద్దాం. సెబి (సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) 2016 జనవరి 1 నుంచి ఐ.పి.ఓ. షేర్లను ఎ.ఎస్.బి.ఎ. పద్ధతిలో దరఖాస్తు చేయడాన్ని తప్పనిసరి చేసింది. ఎ.ఎస్.బి.ఎ. పద్ధతిలో ఐ.పి.ఓ.లకు దరఖాస్తు చేసినప్పుడు ఖాతాదారుని బ్యాంకు అకౌంటు నుండి.. ఎన్ని షేర్లకైతే దరఖాస్తు చేశారో ఆ మొత్తం ఆ ఐ.పి.ఓ.కి బదలీ కాదు. ఆ మొత్తాన్ని బ్యాంకు ఖాతాలోనే ఉంచి బ్లాక్ చేయడం జరుగుతుంది. ఎప్పుైడె తే ఖాతాదారునికి అలాట్మెంట్ జరుగుతుందో ఆ అలాట్మెంట్ మొత్తం వరకు మాత్రమే బ్యాంకు అకౌంట్ నుండి బదలీ చేస్తారు. (బ్యాంకు ఖాతాలో సొమ్ము బ్లాక్ చేసి ఉన్నప్పటికీ). దరఖాస్తు చేసిన తేదీ నుండి షేర్ల అలాట్మెంట్ తేదీ వరకు ఖాతాదారునికి బ్యాంకు వారు వడ్డీని యథాతథంగా అందజేస్తారు. పాత పద్ధతిలో అయితే ఖాతాదారుడు వడ్డీని నష్టపోవలసి వచ్చేది. అలాగే దరఖాస్తు చేసినప్పటికీ అలాట్మెంట్ జరగకపోతే ఆ సొమ్ము మళ్లీ వెనక్కు వచ్చే సందర్భంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొనవలసి వచ్చేది. బ్యాంకులు ఏవైతే ఈ ఎ.ఎస్.బి.ఎ. సర్వీసును అందజేయడానికి అనుమతి పొంది ఉంటాయో వాటిని ఎస్.సి.ఎస్.బి.లు (సెల్ఫ్ సర్టిఫైడ్ సిండికేట్ బ్యాంకులు) అంటారు. ఈ ఎస్.సి.ఎస్.బి.లు ఏయే బ్రాంచీలలో ఎ.ఎస్.బి.ఎ. సర్వీసును అందజేస్తాయో ఆ బ్రాంచీలలో ఎస్.ఎస్.బి.ఎ. అప్లికేషన్‌ను దాఖలు చేయవచ్చు. ఖాతాదారులు ఏ ఎస్.సి.ఎస్.బి.లోనైతే తమ బ్యాంకు ఖాతాను కలిగి ఉన్నారో ఆ ఎస్.సి.ఎస్.బి. బ్రాంచిలలో మాత్రమే ఎ.ఎస్.బి.ఎ. అప్లికేషన్‌ను అందజేయాలి. వేరే బ్యాంకులలో అనుమతించరు. ఒక్కొక్క ఐ.పి.ఓ. కి 5 దరఖాస్తుల వరకు ఒక బ్యాంకు ఖాతా ద్వారా సమర్పించవచ్చు. దరఖాస్తు చేసిన తర్వాత బిడ్డింగ్ సమయంలోనే విత్‌డ్రా చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. విత్‌డ్రా చేసిన వెంటనే బ్యాంకు ఖాతాలో ఉన్న మొత్తం లోంచి అప్లై చేసిన మొత్తం మేరకు అన్‌బ్లాక్ అవుతుంది. అదే బిడ్డింగ్ చివరి రోజు ముగిసిన తర్వాత విత్‌డ్రా చేస్తే మాత్రం వెంటనే అన్‌బ్లాక్ అవదు. ఆ ఐ.పి.ఓ. తాలూకు రిజిస్ట్రార్ సూచనల మేరకు అలాట్మెంట్ అంతా ముగిసిన తర్వాత అన్ బ్లాక్ అవుతుంది. ఖాతాదారుని బ్యాంకుకు కోర్ బ్యాంకింగ్ సౌకర్యం ఉంటే కనుక ఖాతాదారు తన బ్యాంకు ఖాతా ఉన్న బ్రాంచిలోనే కాకుండా, ఆ బ్యాంకు వారు నిర్ణయించిన వేరే బ్రాంచీలలో కూడా ఎ.ఎస్.బి.ఎ. అప్లికేషన్ ఇవ్వొచ్చు. ఏ ఐ.పి.ఓ.కైనా ఖాతాదారులు ఎన్.ఎస్.ఇ., బి.ఎస్.ఇ., వెబ్సైట్ల నుండి ఎ.ఎస్.బి.ఎ. ఇ-ఫామ్‌ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఎస్.సి.ఎస్.బి. జాబితాని, వాటి బ్రాంచీల లిస్టుని ఎన్.ఎస్.ఇ., బి.ఎస్.ఇ., సెబీ సైట్ ల నుండి పొందవచ్చు. ఎ.ఎస్.బి.ఎ. అప్లికేషన్ నింపేటప్పుడు జాగ్రత్తగా అన్ని వివరాలను (పేరు, పాన్ నెంబరు, డీమ్యాట్ అకౌంట్ నెంబరు, బిడ్ రేట్, బిడ్ క్వాంటిటీ తదితర వివరాలు) పొందుపరచవలసి ఉంటుంది. వీటిల్లో ఏ మాత్రం తప్పు ఉన్నా దరఖాస్తు రిజెక్ట్ అవుతుంది. ఐ.పి.ఓ.కి దరఖాస్తు చేసేటప్పుడు ఆ కంపెనీ వివరాలను పరిశీలించి అలాగే, రేటింగ్ వివరాలను తెలుసుకొని అప్లై చెయ్యడం మంచిది. రజని భీమవరపు ఫైనాన్షియల్ ప్లానర్, ‘జెన్ మనీ’ -
బీమా పత్రాలకు భరోసా!
ఉమెన్ ఫైనాన్స్ / ఇ-ఇన్సూరెన్స్ ఖాతా డబ్బును ఎలక్ట్రానిక్ రూపంలో బ్యాంకులో ఎలా భద్రపరుస్తామో; షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లు, బాండ్స్ తదితర పెట్టుబడులను డీ-మ్యాట్ ఖాతాలో ఎలాగైతే ఎలక్ట్రానిక్, డిజిటల్ రూపేణా పొందుపరుస్తారో.. అదే విధంగా ఇన్సూరెన్స్ పాలసీలను ఎలక్ట్రానిక్ పద్దతిలో నమోదు చేయడానికి వీలుపడేలా ఏర్పాటైనదే ఇ-ఇన్సూరెన్స్ ఖాతా. దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అవి ఏమిటో, ఈ.. ఇ-ఇన్సూరెన్స్ ఖాతాను ఎలా తెరవాలో తెలుసుకుందాం. * సంస్థలు ఏవైతే కంపెనీస్ యాక్టు 1956 కింద రిజిస్టర్ అయి, ఐ.ఆర్.డి.ఎ. (ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ) వారి చేత ఇన్సూరెన్స్ పాలసీలను ఎలక్ట్రానిక్ పద్ధతిలో నిర్వహించడానికి అనుమతి పొందుతాయో వాటి ద్వారా ఇ-ఇన్సూరెన్స్ ఖాతాను ప్రారంభించవచ్చు. * ఇలాంటి సంస్థలను ఇన్సూరెన్స్ రెపాజిటరీ అంటారు. ఇవి ఏ విధమైనటువంటి పాలసీలనూ అమ్మడానికి వీలు లేదు. కేవలం పాలసీలను ఎలక్ట్రానిక్ రూపంలో పొందుపరచడానికి మాత్రమే ఇవి ఉద్దేశించినవి. * ఈ ఇన్సూరెన్స్ రెపాజిటరీలు కొంతమందిని తమ కంపెనీ ప్రతినిధులుగా నియమించుకుని తమ విధులను నిర్వర్తిస్తాయి. * ఇ-ఇన్సూరెన్స్ ఖాతా ఒక ఇన్సూరెన్స్ రెపాజిటరీ వద్ద మాత్రమే కలిగి ఉండాలి. ఒకటి కన్నా ఎక్కువ ఖాతాలను అనుమతించరు. * ఈ ఖాతాను ప్రారంభించడానికి గానీ, నిర్వహించడానికి గానీ ఖాతాదారులు ఎటువంటి చార్జీలు చెల్లించనవసరం లేదు. * ఈ ఖాతా అప్లికేషన్‌ను ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి గానీ, ఇన్సూరెన్స్ రెపాజిటరీ /ఇన్సూరెన్స్ రెపాజిటరీ అధికారిక ప్రతినిధి నుంచి గానీ పొందవచ్చు. అప్లికేషన్‌ను పొందుపరిచిన వారం లోగా ఖాతా ప్రారంభం అవుతుంది. * ఈ ఖాతాను ఏ పాలసీలు లేకపోయినా ప్రారంభించవచ్చు. భవిష్యత్తులో ఎప్పుడైతే పాలసీలు తీసుకుంటారో అప్పుడు ఆ పాలసీని ఎలక్ట్రానిక్ రూపంలో పొందవచ్చు. పాలసీలు ఉన్నట్లయితే వాటిని ఈ ఖాతాలో నమోదు చేయవచ్చు. * ఈ ఖాతాను ఒక ఇన్సూరెన్స్ రెపాజిటరీ నుండి మరొక ఇన్సూరెన్స్ రెపాజిటరీకి బదలీ చేసుకునే వెసులుబాటు ఉంది. * ఒకవేళ ఎలక్ట్రానిక్ రూపంలో ఉన్న పాలసీని పాలసీ బాండ్ రూపేణా పేపర్ రూపంలో తీసుకోవాలంటే మళ్లీ మార్చుకునే సౌకర్యం ఉంది. * ప్రతి ఇన్సూరెన్స్ రెపాజిటరీలో తప్పనిసరిగా ఖాతాదారుల ఫిర్యాదుల విభాగం ఉంటుంది. ఏమైనా సమస్యలు ఉంటే ఈ విభాగం ద్వారా పరిష్కారం పొందవచ్చు. ఇ-ఇన్సూరెన్స్ ఖాతా ఉపయోగాలు సురక్షితం : ఎలక్ట్రానిక్ రూపంలో ఉంటాయి కాబట్టి పాలసీ బాండ్ పోతుందనీ, డామేజీ జరుగుతుందనీ భయపడనవసరం లేదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు పాలసీని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సులభతరం: అడ్రస్, ఫోన్ నెంబరు తదితరాలు మార్చాలి అనుకున్నప్పుడు ప్రతి పాలసీకి మార్పులు చేయకుండా ఈ ఖాతాకు మాత్రమే చేస్తే సరిపోతుంది. * ఒకేచోట ఆన్లైన్లో పాలసీలు అన్నింటినీ సమీక్షించుకోవచ్చు. * పాలసీ బెనిఫిట్స్ అన్నీ ఎలక్ట్రానిక్ పద్ధతిలో బ్యాంకు ఖాతాకు బదలీ అవుతాయి కనుక త్వరగా చేతికి అందుతాయి. * ఈ ఖాతాకు ‘ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్’ను పెట్టుకునే సౌకర్యం ఉంది. ఈ ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్ ఖాతాదారుని మరణానంతరం లేదా ఖాతాదారుడు ఖాతాను నిర్వహించలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మాత్రమే ఖాతాను నిర్వహించడానికి అర్హుడు. అయితే ఆ రిప్రజెంటేటివ్‌కు పాలసీ బెనిఫిట్స్ పొందడానికి ఎటువంటి అధికారమూ ఉండదు. అవి నామినీకి మాత్రమే చెందుతాయి. నామినీ, ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్ కూడా ఒకే వ్యక్తి అయి ఉండవచ్చు. మనం ఎన్నో రకాలుగా మన కుటుంబ సభ్యుల భద్రత కోసం పెట్టుబడులు పెడుతుంటాం, ఇన్సూరెన్స్‌లు తీసుకుంటూ ఉంటాం. ఈ వివరాలన్నీ కుటుంబలోని వారికి తెలియకపోతే, అనుకోని సంఘటన జరిగినప్పుడు మనం కష్టపడి పొదుపు చేసినదంతా వృథాగా మరుగున పడిపోతుంది. కనుక పాలసీలకు ఇ-ఇన్సూరెన్స్ తీసుకుని, అన్నిటినీ ఒకేచోట భద్రపరిస్తే సులభంగా ఉంటుంది. - రజని భీమవరపు ఫైనాన్షియల్ ప్లానర్, ‘జెన్ మనీ’ -
చీకటి మలుపులో చేతికందే దీపం
ఉమెన్ ఫైనాన్స్ / ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన మన దేశంలో ప్రతి ఒక్కరికీ, మరీ ముఖ్యంగా తక్కువ ఆదాయం కలిగిన వారందరికీ ప్రమాదం కారణంగానే కాకుండా, మరే ఇతర కారణం చేతనైనా మరణం సంభవిస్తే వారి కుటుంబ సభ్యులకు కొంతమేర ఆర్థిక చేయూతను ఇవ్వాలనే సదుద్దేశంతో 2015-16 ఆర్థిక సంవత్సరంలో మన ప్రభుత్వం ‘ప్రధాన మంత్రి జీవన జ్యోతి బీమా యోజన’ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం వివరాలను చూద్దాం. ఈ పథకంలో నమోదైన ఖాతాదారులకు ఏ కారణం చేతనైనా మరణం సంభవిస్తే 2 లక్షల రూపాయలను వారి నామినీకి అందజేస్తారు. కనీసం 18 సం. మొదలుకొని, 50 సం. వయసు గల వారి వరకు ఈ పథకంలో చేరడానికి అర్హులు.ఏ బ్యాంకులైతే ఈ పథకాన్ని నిర్వహిస్తారో ఆ బ్యాంకులో.. సేవింగ్స్ ఖాతాను కలిగి ఉండాలి. 330 రూపాయలను ప్రతి సంవత్సరం ఈ పథకానికి ప్రీమియంగా చెల్లించాలి. ఈ పథకం జూన్ 1 మొదలుకొని మే 31 వరకు ఉంటుంది. మళ్లీ తర్వాత సంవత్సరానికి ఈ పథకాన్ని కొనసాగించాలంటే మే 31 లోపల ప్రీమియం చెల్లించవలసి ఉంటుంది. బ్యాంకులు ప్రీమియంను ఆటో-డెబిట్ పద్ధతిలో బ్యాంకు ఖాతాదారుల నుండి తీసుకుంటాయి. కనుక పథకంలో కొనసాగాలనుకునేవారు తమ ఖాతాలో ప్రీమియం సొమ్మును ఉంచవలసి ఉంటుంది. 55 సం. వయసు వరకు మాత్రమే పథకంలో కొనసాగే వెసులుబాటు ఉంటుంది. ఆ తర్వాత పథకాన్ని కొనసాగించినా సొమ్ము ఏమీ రాదు. ఈ పథకంలో చేరిన తర్వాత 55 సం.లకు ముందు ఏ కారణం చేతనైనా మరణం సంభవిస్తే వారి నామినీకి సొమ్ము అందజేస్తారు. బ్యాంకు ఖాతాను మూసి వేసినా, ప్రీమియం సొమ్ముకు సరిపడా మొత్తాన్ని ఖాతాలో ఉంచకపోయినా ఈ పథకం కొనసాగదు. ఒక బ్యాంకు ఖాతాకన్నా ఎక్కువ బ్యాంకు ఖాతాలలో ఈ పథకానికి ప్రీమియం చెల్లించిన ప్పటికీ ఒక ఖాతా ద్వారా మాత్రమే బీమా లభిస్తుంది. మిగతా ఖాతాల ద్వారా చెల్లించిన ప్రీమియంకు బీమా వర్తించదు.ఈ పథకం ప్రారంభించినప్పుడు కాకుండా తర్వాత చేరేవారు; పథకంలో చేరి, కొనసాగకుండా ఉండి, మళ్లీ జాయిన్ కాదలచుకున్నవారు ‘సెల్ఫ్ సర్టిఫికెట్ ఆఫ్ గుడ్ హెల్త్’ని అందజేయవలసి ఉంటుంది. ఈ పథకంలో చేరేవారికి ఆధార్‌ని ప్రధాన పత్రంగా పరిగణిస్తారు. ఖాతాదారులు ఆధార్‌ని తమ బ్యాంకు ఖాతాకు తప్పనిసరిగా అనుసంధానించాలి. ఇది చాలా తక్కువ ప్రీమియంతో అతి సులభంగా ప్రతి ఒక్కరూ తమ కుటుంబానికి తమ మరణానంతరం ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు వీలుకల్పించే ఒక మంచి పథకం. అయితే పథకంలో చేరడం ఎంత ముఖ్యమో, ఆ ఖాతాను కొనసాగించడమూ అంతే ముఖ్యం అని గ్రహించాలి. రజని భీమవరపు ఫైనాన్షియల్ ప్లానర్, ‘జెన్ మనీ’ -
అరవై దాటాక.. నడిపించే కాన్ఫిడెన్స్
ఉమెన్ ఫైనాన్స్ / అటల్ పెన్షన్ యోజన ప్రతి ఒక్కరూ వృద్ధాప్యంలో ఒక నిర్ణీత మొత్తాన్ని ప్రతి నెలా తప్పనిసరిగా పింఛను రూపేణా పొందాలనే ముఖ్య ఉద్దేశంతో ప్రభుత్వం ‘అటల్ పెన్షన్ యోజన’ పథకాన్ని 2015-2016 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించింది. అసలు ఏమిటీ పథకం. వివరాలు చూద్దాం.18 సంవత్సరాలు మొదలుకొని 40 సంవత్సరాల వరకు ఈ పథకంలో చేరవచ్చు. చేరిన దగ్గర్నుంచి 60 సం. వయసు వచ్చే వరకు చందా చెల్లించవలసి ఉంటుంది.ఈ పథకంలో వెయ్యి మొదలుకొని, ఐదు వేల రూపాయల వరకు (వెయ్యి, రెండు వేలు. మూడు వేలు... ఇలా) గ్యారెంటీ పెన్షన్ ఎంత కావాలో ఆ మొత్తాన్ని ఎంచుకోవచ్చు. చందా అనేది ఖాతాదారుడు ఈ పథకంలో చేరే నాటికి ఉన్న వయసు, ఎంచుకునే గ్యారెంటీ పెన్షన్ మీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు ఖాతాదారుని వయసు 18 సం. అయితే 1000 రూపాయల గ్యారెంటీ పెన్షన్‌కు ప్రతి నెలా 42 రూపాయలు చెల్లించాలి. అదే 5000 రూపాయల గ్యారెంటీ పెన్షన్ కావాలంటే ప్రతి నెలా 210 రూపాయలు చెల్లించాలి. ఒకవేళ ఖాతాదారుని వయసు 35 సం. అయితే వెయ్యి రూపాయల గ్యారెంటీ పెన్షన్‌కు ప్రతి నెలా 181 రూపాయలు, అదే ఐదు వేల రూపాయల గ్యారెంటీ పెన్షన్ అయితే ప్రతి నెలా 902 రూపాయలు చెల్లించాలి. చందాను నెలవారీ, 3 నెలలకు లేదా 6 నెలలకు ఒకసారి కట్టే సదుపాయం ఉంది. ఈ పథకం ద్వారా సేకరించిన మొత్తాన్ని ప్రభుత్వం వారు సూచించిన పెట్టుబడి సూత్రాలకు అనుగుణంగా పి.ఎఫ్.ఆర్. డి.ఎ. (పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ) చేత నియమితులైన పెన్షన్ ఫండ్ మేనేజర్లు నిర్వహిస్తారు.ఖాతాదారులకు పెట్టుబడి మార్గాలను లేదా పెన్షన్ ఫండ్ మేనేజర్లను ఎంచుకునే వెసులుబాటు లేదు. ఖాతాదారులు 60 సం. వయసు నిండిన తర్వాత నుంచి ఎంత గ్యారెంటీ పెన్షన్ ఎంచుకుంటారో అంత మొత్తాన్ని ప్రతి నెలా పొందవచ్చు. అంతే కాకుండా చందా మొత్తం మీద రాబడి ఎక్కువ ఉన్నట్లయితే ఎక్కువ పెన్షన్‌ని కూడా పొందవచ్చు. ఒక వేళ తక్కువ రాబడి ఉంటే కనుక గ్యారెంటీ పెన్షన్‌ను తగ్గించరు. ఆ మొత్తాన్ని కచ్చితంగా ఇస్తారు. 60 సం. నిండాక ఖాతాదారుడు మరణించినట్లయితే వారి భార్య /భర్త కు పెన్షన్ అంద జేస్తారు. ఒకవేళ ఇద్దరూ మరణించినట్లయితే ఖాతాదారునికి 60 ఏళ్లు వచ్చే వరకు జమ అయిన మూలనిధి మొత్తాన్ని నామినీకి అందజేస్తారు.60 సం. నిండకముందే ఖాతాదారుడు మరణించినట్లయితే వారి జీవిత భాగస్వామికి, ఖాతాదారునికి 60 ఏళ్లు వచ్చే వరకు చందా కట్టే వెసులుబాటు ఉంది. 60 సం. నిండాక గ్యారెంటీ పెన్షన్‌ను జీవిత భాగస్వామి మరణం వరకు పొందవచ్చు. ఒకవేళ జీవిత భాగస్వామికి ఖాతాను పొడిగించే ఉద్దేశం లేకపోతే అప్పటి వరకు జమ అయిన మూలధన మొత్తాన్ని జీవిత భాగస్వామికి లేదా నామినీకి అందజేస్తారు. ఈ పథకంలో ఖాతాదారుడు ఒకే ఒక ఖాతాని ప్రారంభించే అవకాశం ఉంటుంది. పెన్షన్ మొత్తాన్ని తగ్గించుకునే, పెంచుకునే సదుపాయం ఉంటుంది. రజని భీమవరపు ఫైనాన్షియల్ ప్లానర్, ‘జెన్ మనీ’ -
బంగారం కన్నా బాండ్లు బెటర్
ఉమెన్ ఫైనాన్స్ / గోల్డ్ బాండ్స్ బంగారం డిమాండును తగ్గించాలనే ముఖ్య ఉద్దేశంతో ప్రభుత్వం వారు గోల్డ్ బాండ్ స్కీమును ప్రారంభించారు. ఈ గోల్డ్ బాండ్స్‌ని ఆర్.బి.ఐ. (రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా) జారీ చేస్తుంది. వీటిని డీమ్యాట్ పద్ధతిలో, పేపర్ రూపేణ కూడా జారీ చేస్తారు. వీటిని నిర్ణీత బ్యాంకు శాఖలు, పోస్ట్ ఆఫీసు బ్రాంచీల ద్వారా నిర్వహిస్తారు. గోల్డ్ బాండ్లు కొనాలని ఆసక్తి ఉన్నవారు వాటిపై కనీస అవగాహన కలిగి ఉండాలి. * గోల్డ్ బాండ్లలో పెట్టుబడి పెట్టాలనుకునేవారు కనీసం 2 గ్రాములు మొదలుకొని 500 గ్రాముల వరకు ఒక ఆర్థిక సంవత్సరానికి కొనుకోలు చేయవచ్చు. * ఈ బాండ్లను జారీ చేసేటప్పుడు గ్రాము విలువ ఎంత? అప్లికేషన్ గడువు తేదీలు ఏమిటి? అన్నది ఆర్.బి.ఐ. నిర్ణయిస్తుంది. * కాల పరిమితి 8 సంవత్సరాలు. 8 సంవత్సరాల తర్వాత గ్రాము విలువ ఎంతైతే ఉంటుందో అంత మొత్తాన్ని ఖాతాదారునికి అందజేస్తారు. బాండ్లు కొన్న తర్వాత కూడా ఐదవ సంవత్సరం నుండీ డబ్బు అవసరం అయితే ఆ సమయానికి ఉన్న గ్రాము ధర ఆధారంగా సొమ్మును పొందవచ్చు. * పెట్టుబడిదారులకు 2.75 శాతం (సంవత్సరానికి) చొప్పున వడ్డీ అందజేస్తారు. ఈ వడ్డీని ఆరు నెలలకు ఒకసారి ఖాతాదారుని ఖాతాకు జమ చేస్తారు. * ఈ గోల్డ్ బాండ్స్ మీద వచ్చే కాపిటల్ గైన్కు పన్ను మినహాయింపు ఉంటుంది. * గోల్డ్ బాండ్ రేటును ఇండియా బులియన్ అండ్ జెవెల్స్ అసోసియేషన్ (ఐ.బి.జె.ఎ) వారు అంతకు క్రితం వారంలోని 999 ప్యూరిటీ బంగారం క్లోజింగ్ రేటు సింపుల్ యావరేజీ ఆధారంగా నిర్ణయించిన ధరను బట్టి నిర్ణయిస్తారు. * ఈ గోల్డ్ బాండ్స్ స్టాక్ ఎక్సేంజీలలో లిస్ట్ అయి, ట్రేడ్అవుతూ ఉంటాయి కనుక ఒకవేళ ఐదేళ్లకు ముందే సొమ్మును వెనక్కి తీసుకోవాలంటే వాటిని అమ్మవచ్చు. * ఈ గోల్డ్ బాండ్స్‌ను లోన్ తీసుకోవడానికి కోల్లేటరల్గా కూడా వాడుకోవచ్చు. పెట్టుబడి కోసమే బంగారం కొనేవారికి ఈ గోల్డ్ బాండ్స్ అనేవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. బంగారానికి బదులు ఈ గోల్డ్ బాండ్స్ కొనడం వల్ల ఎలాంటి దొంగల భయం, ప్యూరిటీ భయం ఉండదు. అంతేకాకుండా బంగారం బదులు బాండ్స్ కొనడం వల్ల బంగారం డిమాండు తగ్గి, తద్వారా బంగారం దిగుమతులు తగ్గుముఖం పడతాయి. ఈ విధంగా మన దేశ ఉన్నతికి కూడా సహాయపడగలుగుతారు. - రజని భీమవరపు ఫైనాన్షియల్ ప్లానర్, ‘జెన్ మనీ’ -
కౌంట్ వాళ్లది.. క్యాష్ మనది
ఉమెన్ ఫైనాన్స్ / పోర్ట్‌ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసు ఆర్థిక లక్ష్యాలను సాధించుకోవటానికి, ఉన్న సంపదను పెంపొందించుకోవడానికి వివిధ పెట్టుబడి మార్గాలైనటువంటి ఈక్విటీ, డెట్‌లలో పెట్టుబడి పెడుతూ ఉంటారు చాలామంది. కాని, వాటిమీద పూర్తి అవగాహన లేకపోతే తరచూ వాటిని చూసుకుంటూ, అవసరమైతే మార్పులు చేర్పులు చేసుకోవటానికి వీలు కుదరకపోవచ్చు. ఇలాంటి వారికోసమే పోర్ట్‌ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసు (పిఎంఎస్) ప్రారంభమయింది. ఈ సర్వీసు అందజేసే కంపెనీ సెబి (సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా)తో పోర్ట్‌ఫోలియో మేనేజర్‌గా రిజిస్టర్ చేసుకోవాలి. ఈ సర్వీసు పొందగోరే వ్యక్తులు ఎవరైనా సెబీతో రిజిష్టర్ అయిన పోర్ట్‌ఫోలియో మేనేజర్ వద్ద ఖాతాని ప్రారంభించవచ్చు. కనీస మొత్తం 25 లక్షలు మొదలుకుని ఎంత మొత్తానికైనా సర్వీసు పొందవచ్చు. ఈ సొమ్మును చెక్, ఆన్లైన్ ట్రాన్స్ఫర్ రూపేణా లేదా షేర్ల రూపేణా జమచేయవచ్చు. ఈ ఖాతాను రెండు రకాలుగా కలిగి ఉండవచ్చు.. 1. డిస్క్రెషనరీ పిఎంఎస్: ఈ పద్ధతిలో ఏయే పెట్టుబడి మార్గాలలో పెట్టుబడి పెట్టాలి అనేది ఫండ్ మేనేజర్ నిర్ణయిస్తారు. 2. నాన్ డిస్క్రెషనరీ పిఎంఎస్: ఈ పద్ధతిలో పోర్ట్‌ఫోలియో మేనేజర్ ఏయే పెట్టుబడి మార్గాలలో పెట్టుబడి పెడితే మంచిదో సూచనలిస్తారు. వాటిలో పెట్టాలా లేదా ఎప్పుడు పెట్టాలి అనేది ఖాతాదారుడు నిర్ణయించుకోవచ్చు. పోర్ట్‌ఫోలియో ఎలా ఉండాలి, ఏమేమి చార్జీలు వర్తిస్తాయి, ఎంత శాతం అనేది ఖాతాదారుడు, పోర్ట్‌ఫోలియో మేనేజర్ ఖాతా ప్రారంభించినప్పుడు రాసుకున్న రాసుకున్న అగ్రిమెంట్ ప్రకారం ఉంటాయి. సాధారణంగా రెండు రకాలైనటువంటి ఫీజును చార్జి చేస్తారు. పెట్టుబడులు నిర్వహించడానికి అయ్యే ఖర్చుని ఒక ఫిక్స్డ్ శాతంగానూ, రాబడి ఒక నిర్ణీత శాతం కన్నా ఎక్కువ వస్తే ఆ ఎక్కువ వచ్చిన రాబడి మీద కొంత శాతాన్ని ఫీజుగా చార్జి చేస్తారు. ఖాతాదారులు తప్పనిసరిగా డిమ్యాట్ ఖాతాను కలిగి ఉండాలి. డిస్క్రిషనరీ పద్ధతిలో ఖాతా ప్రారంభించేటప్పుడు ఒకవేళ ఖాతాదారుడు ఏవైనా షేర్లు కొనగూడదు అనుకున్నా, లేదా లార్జ్‌కాప్, మిడ్కాప్ మాత్రమే కొనాలి అని ఉన్నా, వాటిని అగ్రిమెంట్లో పొందుపరిచి వాటి ప్రకారం మేనేజ్ చేయమని చెప్పవచ్చు. ఎన్ఆర్ఐలు కూడా పిఎంఎస్ పద్ధతిలో పెట్టుబడులు పెట్టవచ్చు. ఇందుకోసం ఎన్ఆర్ఐలు పిఐఎస్ ఖాతాను ప్రారంభించవలసి ఉంటుంది. ఎన్ఆర్ఐలకి, రెసిడెంట్ ఇండియన్స్‌కి పిఎంఎస్ ఖాతాని ప్రారంభించడానికి అవసరమైన డాక్యుమెంట్స్ వేరుగా ఉంటాయి. పోర్ట్‌ఫోలియో మేనేజర్వద్ద ఉన్నటువంటి చెక్‌లిస్ట్ ఆధారంగా డాక్యుమెంట్స్ అందజేయాలి. ఈ పిఎంఎస్ ఖాతాలో ప్రతి ఒక్క ఖాతాదారుని పెట్టుబడులు వారి వారి లక్ష్యాలకు అనుగుణంగా నిర్వహించబడతాయి. ప్రతి ఆరు నెలలకొకసారి స్టేట్మెంట్ పొందవచ్చు. లేదా ఎప్పుడైనా పెట్టుబడులు పరిశీలించాలంటే పోర్ట్‌ఫోలియో మేనేజర్స్ స్టేట్మెంట్ అందజేస్తారు. కొంచెం పెద్దమొత్తంలో పెట్టుబడులు పెట్టాలనుకునేవారికి ఈ పిఎంఎస్ పద్ధతిలో పెట్టుబడులు పెట్టడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. - రజని భీమవరపు ఫైనాన్షియల్ ప్లానర్, ‘జెన్ మనీ’ -
రిస్క్ తక్కువ.. వడ్డీ ఎక్కువ
ఉమెన్ ఫైనాన్స్ / లిక్విడ్ బీస్ స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే మదుపుదారులు పెట్టుబడి పెట్టడానికి మంచి అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఆ పెట్టుబడి సొమ్మును బ్యాంకు ఖాతాలో గాని లేదా స్టాక్ బ్రోకర్ వద్ద మార్జిన్ ఖాతాలో గాని ఉంచుతూ ఉండి, ఎప్పుడైతే వారికి వారు అనుకున్నటువంటి షేర్లో మంచి అవకాశం వస్తుందో అప్పుడు ఆ సొమ్ముతో కొనుగోలు చేస్తారు. కొనుగోలు చేసేంత వరకు ఆ సొమ్మును బ్యాంకులోనైతే చాలా తక్కువ వడ్డీ వస్తుంది, మార్జిన్ ఖాతాలోనైతే ఏమీ రాదు. ఇలాంటి వారికి కొనుగోలు చేసేంత వరకూ కూడా రాబడి పొందే మార్గమే ‘లిక్విడ్ బీస్’. ఈ లిక్విడ్ బీస్ను గోల్డ్‌మాన్ సాచ్స్ అసెట్ మేనేజ్మెంట్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహిస్తుంటుంది. ఇది ఓపెన్ ఎండెడ్ స్కీమ్. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి లిక్విడ్ ఇటిఎఫ్ (ఎక్స్ఛేంజ్ ట్రీటెడ్ ఫండ్). ఒక షేర్ ఎలాగైతే ఎక్సేజ్లో లిస్ట్ అయ్యి ట్రేడ్ జరుగుతుందో అదే మాదిరిగా ఈ లిక్విడ్ బీస్ కూడా ఎన్ఎస్ఇ, బిఎస్ఇలలో లిస్ట్ అయ్యి ట్రేడ్ జరుగుతుంది. తక్కువ రిస్క్ కలిగి ఉండి. బ్యాంకు వడ్డీకన్నా ఎక్కువ రాబడిని ఇస్తూ ఎప్పుడు కావాలంటే అప్పుడు సొమ్మును వెనక్కి తీసుకునే సదుపాయాన్ని కల్పించడమే ఈ స్కీం ముఖ్య ఉద్దేశం. * ఇందులో పెట్టుబడి పెట్టిన సొమ్మును కాల్‌మనీ మార్కెట్, స్వల్పకాలిక గవర్నమెంట్ సెక్యూరిటీస్, ట్రెజరీ బిల్స్ తదితర స్వల్పకాలిక మార్గాలలో ఫండ్ మేనేజర్స్ పెట్టుబడి పెడుతూ ఉంటారు. * లిక్విడ్ బీస్ ఒక్కొక్క యూనిట్ ధర 1000 రూపాయలుగా ఉంటుంది. ఎక్సేంజ్‌లో ఒక యూనిట్‌ని మొదలుకొని ఎన్నైనా కొనుగోలు చేయవచ్చు. * ఈ స్కీమ్ డైలీ డివిడెండ్, డివిడెండ్ రీ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్. అంటే డైలీ వచ్చే డివిడెండ్‌ని నగదు రూపేణా కాకుండా ఆ సొమ్ముతో యూనిట్స్‌ని అందజేస్తారు. * ప్రతి 30 రోజులకొకసారి ఈ డివిడెండ్ రీ ఇన్వెస్ట్మెంట్ యూనిట్స్‌ని పెట్టుబడిదారుని డీ-మాట్ ఖాతాకు జమచేస్తారు. ఈ యూనిట్స్‌ని 3 డెసిమల్స్ వరకూ అలాట్ చేస్తారు. * సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ చార్జీలు ఈ లిక్విడ్ బీస్కి వర్తించవు. * షేర్లు అమ్మినరోజే ఈ లిక్విడ్ బీస్‌ని కొనవచ్చు. అలాగే ఎప్పుడైతే మరలా షేర్లు కొనుగోలు చేయదలచుకున్నారో ఆరోజు లిక్విడ్ బీస్‌ని అమ్మేసి షేర్లు కొనవచ్చు. * ఈ లిక్విడ్ బీస్‌ని ఈక్విటీ డెరివేటివ్స్‌కి 10 శాతం హైర్ కట్‌తో మార్జిన్ లాగా కూడా వాడుకోవచ్చు. * వీటిని ఎక్స్ఛేంజ్లో కాకుండా ఫండ్ వద్ద నేరుగా కొనాలి. అంటే ముందుగా మినిమమ్ 2,500 రూపాయల యూనిట్స్ కొనాలి. అదే ఎక్స్సేంజీలో అయితే ఒక యూనిట్ కొనుగోలు చేయవచ్చు. * తప్పనిసరిగా డీ-మాట్ కలిగి ఉండాలి. * యూనిట్స్‌ని అమ్మదలచుకొన్నప్పుడు ఎక్సేంజ్కైతే ఒక యూనిట్ మొదలుకొని ఎన్నెన్నో అమ్మవచ్చు. కాని డెసిమల్ యూనిట్స్‌ని అనుమతించరు. ఈ డెసిమల్ యూనిట్స్‌ని డెరైక్ట్‌గా ఫండ్‌కి రెడీమ్ పంపి సొమ్ము తీసుకోవచ్చు. * ఈ లిక్విడ్ బీస్‌లో పెట్టుబడి పెట్టేటప్పుడు మీకు సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ చార్జీ పడదు. కానీ ఇతర చార్జీలైనటువంటి బ్రోకరేజీ, సర్వీసుటాక్స్, స్టాంప్ డ్యూటీ తదితరాలు వర్తిస్తాయి కనుక వాటిని కూడా ఒకసారి గమనించి పెట్టుబడి పెట్టడం మంచిది. లేదంటే వచ్చిన రాబడి ఖర్చులకే సరిపోతుంది. - రజని భీమవరపు ఫైనాన్షియల్ ప్లానర్, ‘జెన్ మనీ’