బంగారం కన్నా బాండ్లు బెటర్
ఉమెన్ ఫైనాన్స్ / గోల్డ్ బాండ్స్
బంగారం డిమాండును తగ్గించాలనే ముఖ్య ఉద్దేశంతో ప్రభుత్వం వారు గోల్డ్ బాండ్ స్కీమును ప్రారంభించారు. ఈ గోల్డ్ బాండ్స్‌ని ఆర్.బి.ఐ. (రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా) జారీ చేస్తుంది. వీటిని డీమ్యాట్ పద్ధతిలో, పేపర్ రూపేణ కూడా జారీ చేస్తారు. వీటిని నిర్ణీత బ్యాంకు శాఖలు, పోస్ట్ ఆఫీసు బ్రాంచీల ద్వారా నిర్వహిస్తారు. గోల్డ్ బాండ్‌లు కొనాలని ఆసక్తి ఉన్నవారు వాటిపై కనీస అవగాహన కలిగి ఉండాలి.
* గోల్డ్ బాండ్‌లలో పెట్టుబడి పెట్టాలనుకునేవారు కనీసం 2 గ్రాములు మొదలుకొని 500 గ్రాముల వరకు ఒక ఆర్థిక సంవత్సరానికి కొనుకోలు చేయవచ్చు.
* ఈ బాండ్‌లను జారీ చేసేటప్పుడు గ్రాము విలువ ఎంత? అప్లికేషన్ గడువు తేదీలు ఏమిటి? అన్నది ఆర్.బి.ఐ. నిర్ణయిస్తుంది.
* కాల పరిమితి 8 సంవత్సరాలు. 8 సంవత్సరాల తర్వాత గ్రాము విలువ ఎంతైతే ఉంటుందో అంత మొత్తాన్ని ఖాతాదారునికి అందజేస్తారు. బాండ్లు కొన్న తర్వాత కూడా ఐదవ సంవత్సరం నుండీ డబ్బు అవసరం అయితే ఆ సమయానికి ఉన్న గ్రాము ధర ఆధారంగా సొమ్మును పొందవచ్చు.
* పెట్టుబడిదారులకు 2.75 శాతం (సంవత్సరానికి) చొప్పున వడ్డీ అందజేస్తారు. ఈ వడ్డీని ఆరు నెలలకు ఒకసారి ఖాతాదారుని ఖాతాకు జమ చేస్తారు.
* ఈ గోల్డ్ బాండ్స్ మీద వచ్చే కాపిటల్ గైన్‌కు పన్ను మినహాయింపు ఉంటుంది.
* గోల్డ్ బాండ్ రేటును ఇండియా బులియన్ అండ్ జెవెల్స్ అసోసియేషన్ (ఐ.బి.జె.ఎ) వారు అంతకు క్రితం వారంలోని 999 ప్యూరిటీ బంగారం క్లోజింగ్ రేటు సింపుల్ యావరేజీ ఆధారంగా నిర్ణయించిన ధరను బట్టి నిర్ణయిస్తారు.
* ఈ గోల్డ్ బాండ్స్ స్టాక్ ఎక్సేంజీలలో లిస్ట్ అయి, ట్రేడ్‌అవుతూ ఉంటాయి కనుక ఒకవేళ ఐదేళ్లకు ముందే సొమ్మును వెనక్కి తీసుకోవాలంటే వాటిని అమ్మవచ్చు.
* ఈ గోల్డ్ బాండ్స్‌ను లోన్ తీసుకోవడానికి కోల్లేటరల్‌గా కూడా వాడుకోవచ్చు. పెట్టుబడి కోసమే బంగారం కొనేవారికి ఈ గోల్డ్ బాండ్స్ అనేవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి.
బంగారానికి బదులు ఈ గోల్డ్ బాండ్స్ కొనడం వల్ల ఎలాంటి దొంగల భయం, ప్యూరిటీ భయం ఉండదు. అంతేకాకుండా బంగారం బదులు బాండ్స్ కొనడం వల్ల బంగారం డిమాండు తగ్గి, తద్వారా బంగారం దిగుమతులు తగ్గుముఖం పడతాయి. ఈ విధంగా మన దేశ ఉన్నతికి కూడా సహాయపడగలుగుతారు.
- రజని భీమవరపు
ఫైనాన్షియల్ ప్లానర్, ‘జెన్ మనీ’