
బంగారం ధరలు రోజు రోజుకి పెరుగుదల దిశగా.. పరుగులు పెడుతూనే ఉన్నాయి. డొనాల్డ్ ట్రంప్.. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తరువాత ఈ ధోరణి ఏర్పడింది. ట్రంప్ రక్షణాత్మక విధానం, యుఎస్ డాలర్ హెచ్చు & తగ్గుల కారణంగా ఏర్పడిన భౌగోళిక రాజకీయ ఉద్రిక్తత, వాణిజ్య యుద్ధ భయం మరియు ఆర్థిక అనిశ్చితి పసిడి ధరలు పెరగడానికి హేతువులవుతున్నాయి.
శుక్రవారం మార్కెట్ సెషన్ ముగిసిన తర్వాత.. బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్లో వరుసగా ఎనిమిదవ వారం లాభాన్ని & దేశీయ మార్కెట్లో వరుసగా ఏడవ వారం లాభాన్ని నమోదు చేశాయి. ఈ ఏడు వారాల్లో, 10 గ్రాముల బంగారం రేటు రూ. 76,544 నుంచి రూ. 86,020లకు చేరింది. దీన్ని బట్టి చూస్తే.. 10 గ్రాముల గోల్డ్ రేటు ఏడు వారాల్లో సుమారు రూ. 9,500 కంటే ఎక్కువ పెరిగింది.
2025 జనవరి ప్రారంభం నుంచి బంగారం ధరలు నిరంతరం పెరగడానికి అనేక కీలక అంశాలు కారణమయ్యాయి. ఇందులో ట్రంప్ ప్రారంభించిన సుంకాలు, భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, పెరిగిన ఈటీఎఫ్ ఇన్‌ఫ్లోలు, ప్రధాన కేంద్ర బ్యాంకుల రేటు కోతలు ఉన్నాయి. ఇవి మాత్రమే కాకుండా బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంకులకు, ముఖ్యంగా USకి బంగారం వెళ్లడం కూడా ధరల పెరుగుదలకు కారణమని నిపుణులు చెబుతున్నారు.
యూరోపియన్ దేశాల నుంచి USకి ఎగుమతి చేసే బంగారంపై డొనాల్డ్ ట్రంప్ సుంకాలు విధించిన నేపథ్యంలో.. అమెరికాలో బంగారానికి డిమాండ్ పెరిగింది. దీని ఫలితంగా యూరప్ కంటే అమెరికాలో బంగారం ధరలు పెరిగాయి. కాబట్టి కేంద్ర బ్యాంకులు లండన్ వాల్ట్‌ల నుంచి బంగారాన్ని తరలిస్తున్నాయి. గత ఎనిమిది వారాల్లో NY COMEX వాల్ట్‌లలో బంగారం నిల్వలు సుమారు 20 మిలియన్లు పెరిగాయి, ఇది లండన్ క్యాష్ గోల్డ్ కాంట్రాక్ట్ డిఫాల్ట్ బజ్‌ను ప్రేరేపించింది.
స్టాక్ మార్కెట్లలో బంగారం ధరలు నిరంతరం పెరగడానికి కారణాలను గురించి, ఎస్ఎస్ వెల్త్‌స్ట్రీట్ వ్యవస్థాపకురాలు 'సుగంధ సచ్‌దేవా' మాట్లాడుతూ.. అమెరికా & యూరప్ మధ్య సుంకాల వివాదం ప్రపంచ వాణిజ్యంలో అనిశ్చితులను సృష్టించింది. ఇది బంగారం ధరలను ప్రభావితం చేసిందని అన్నారు. అల్యూమినియం, ఉక్కుపై ఇటీవల 25 శాతం దిగుమతి సుంకాలు విధించిన తర్వాత ట్రంప్ పరిపాలన బంగారంపై సుంకాలు విధించవచ్చనే ఆందోళనలు ఉన్నాయి. ఈ అంచనా అమెరికాలో డిమాండ్‌ను పెంచింది, బంగారం ధరలను పెంచిందని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: భారత్‌లో బంగారం ధరలు ఎవరు నిర్ధారిస్తారు.. గోల్డ్ రేటు ఎందుకు పెరుగుతోంది?
హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌కు చెందిన 'అనుజ్ గుప్తా' మాట్లాడుతూ.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అమెరికన్ బ్యాంకుల కంటే వెనుకబడి లేదు. భారత సెంట్రల్ బ్యాంక్ 2024 మే, అక్టోబర్‌లలో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ఖజానాల నుంచి 100, 102 టన్నుల బంగారాన్ని రవాణా చేసిందని ఆయన అన్నారు. దీనితో ఆర్బీఐ మొత్తం బంగారు నిల్వలు 855 టన్నులకు చేరుకున్నాయి, వీటిలో 510.5 టన్నులు భారతదేశంలో నిల్వ ఉన్నాయని అన్నారు.
మొత్తం మీద.. బంగారం ధరలు నిరంతరం పెరగడానికి ట్రంప్ సుంకాల విధానం మాత్రమే కారణం కాదు. భౌగోళిక రాజకీయ ఆందోళనలు, ద్రవ్యోల్బణం మళ్లీ పెరిగే ముప్పు, తక్కువ ఆర్థిక వృద్ధి గురించి ఆందోళనలు కూడా. భారతదేశంలో కొనుగోలుదారుల సంఖ్య, లేదా బంగారం మీద పెట్టుబడి పెట్టే వారి సంఖ్య విపరీతంగా పెరగడం కూడా ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment