రూ.91,000 దాటిన బంగారం | Gold continues record run breaches Rs 91000 in Delhi | Sakshi
Sakshi News home page

రూ.91,000 దాటిన బంగారం

Published Wed, Mar 19 2025 4:14 AM | Last Updated on Wed, Mar 19 2025 7:59 AM

Gold continues record run breaches Rs 91000 in Delhi

10 గ్రాములకు రూ.500 ప్లస్‌

ఢిల్లీలో రూ.91,250కు చేరిక

అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్‌ 3,047 డాలర్లు; 40 డాలర్లు జంప్‌

న్యూఢిల్లీ: పసిడి మరో కొత్త గరిష్టాన్ని తాకింది. ఢిల్లీ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత బంగారం 10 గ్రాములకు రూ.500 లాభపడడంతో రూ.91,250 స్థాయికి చేరింది. అంతకుముందు రోజు సైతం బంగారం రూ.1,300 ర్యాలీ చేయడం తెలిసిందే. 99.5 శాతం స్వచ్ఛత బంగారం సైతం రూ.450 లాభపడి రూ.90,800 స్థాయికి చేరింది. ‘‘అంతర్జాతీయ మార్కెట్‌తోపాటు దేశీ మార్కెట్లోనూ బంగారం రికార్డు నూతన గరిష్టాలను తాకింది.

యూఎస్‌ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వాణిజ్య విధానాలపై నెలకొన్న అనిశ్చితుల నేపథ్యంలో సురక్షిత సాధనంగా బంగారం ఇన్వెస్టర్లను ఆకర్షిస్తోంది’’అని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ కమోడిటీస్‌ సీనియర్‌ అనలిస్ట్‌ సౌమిల్‌ గాంధీ తెలిపారు. ఇటీవలి అమెరికా ఆర్థిక గణాంకాలు సైతం యూఎస్‌ ఫెడ్‌ ఈ ఏడాది ఒకటి కంటే ఎక్కువసార్లు వడ్డీ రేట్లను తగ్గించొచ్చన్న అంచనాలను పెంచినట్టు చెప్పారు. ఇది కూడా బంగారానికి మద్దతునిచ్చేదిగా పేర్కొన్నారు.

మరోవైపు ఢిల్లీ మార్కెట్లో వెండి కిలో ధర ఫ్లాట్‌గా రూ.1,02,500 వద్ద ట్రేడ్‌ అయింది. ఎంసీఎక్స్‌ మార్కెట్లో బంగారం ఫ్యూచర్స్‌ కాంట్రాక్టు (10 గ్రాములు) రూ.649 లాభపడి రూ.88,672కు చేరుకుంది. అంతర్జాతీయంగా చూస్తే కామెక్స్‌ మార్కెట్లో పసిడి ఔన్స్‌కు 40 డాలర్లు లాభపడి 3,047 డాలర్ల నూతన గరిష్టాలకు చేరుకుంది. అమెరికాలో మాంద్యం రావొచ్చన్న అంచనాల నేపథ్యంలో బంగారం రికార్డు గరిష్టాలకు చేరినట్టు అబాన్స్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సీఈవో చింతన్‌ మెహతా తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement