కౌంట్ వాళ్లది.. క్యాష్ మనది
ఉమెన్ ఫైనాన్స్ / పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్ సర్వీసు
ఆర్థిక లక్ష్యాలను సాధించుకోవటానికి, ఉన్న సంపదను పెంపొందించుకోవడానికి వివిధ పెట్టుబడి మార్గాలైనటువంటి ఈక్విటీ, డెట్‌లలో పెట్టుబడి పెడుతూ ఉంటారు చాలామంది. కాని, వాటిమీద పూర్తి అవగాహన లేకపోతే తరచూ వాటిని చూసుకుంటూ, అవసరమైతే మార్పులు చేర్పులు చేసుకోవటానికి వీలు కుదరకపోవచ్చు. ఇలాంటి వారికోసమే పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్ సర్వీసు (పిఎంఎస్) ప్రారంభమయింది. ఈ సర్వీసు అందజేసే కంపెనీ సెబి (సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా)తో పోర్ట్‌ఫోలియో మేనేజర్‌గా రిజిస్టర్ చేసుకోవాలి.
ఈ సర్వీసు పొందగోరే వ్యక్తులు ఎవరైనా సెబీతో రిజిష్టర్ అయిన పోర్ట్‌ఫోలియో మేనేజర్ వద్ద ఖాతాని ప్రారంభించవచ్చు. కనీస మొత్తం 25 లక్షలు మొదలుకుని ఎంత మొత్తానికైనా సర్వీసు పొందవచ్చు. ఈ సొమ్మును చెక్, ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్ రూపేణా లేదా షేర్ల రూపేణా జమచేయవచ్చు.
ఈ ఖాతాను రెండు రకాలుగా కలిగి ఉండవచ్చు..
1. డిస్క్రెషనరీ పిఎంఎస్: ఈ పద్ధతిలో ఏయే పెట్టుబడి మార్గాలలో పెట్టుబడి పెట్టాలి అనేది ఫండ్ మేనేజర్ నిర్ణయిస్తారు.
2. నాన్ డిస్క్రెషనరీ పిఎంఎస్: ఈ పద్ధతిలో పోర్ట్‌ఫోలియో మేనేజర్ ఏయే పెట్టుబడి మార్గాలలో పెట్టుబడి పెడితే మంచిదో సూచనలిస్తారు. వాటిలో పెట్టాలా లేదా ఎప్పుడు పెట్టాలి అనేది ఖాతాదారుడు నిర్ణయించుకోవచ్చు.
పోర్ట్‌ఫోలియో ఎలా ఉండాలి, ఏమేమి చార్జీలు వర్తిస్తాయి, ఎంత శాతం అనేది ఖాతాదారుడు, పోర్ట్‌ఫోలియో మేనేజర్ ఖాతా ప్రారంభించినప్పుడు రాసుకున్న రాసుకున్న అగ్రిమెంట్ ప్రకారం ఉంటాయి.
సాధారణంగా రెండు రకాలైనటువంటి ఫీజును చార్జి చేస్తారు. పెట్టుబడులు నిర్వహించడానికి అయ్యే ఖర్చుని ఒక ఫిక్స్‌డ్ శాతంగానూ, రాబడి ఒక నిర్ణీత శాతం కన్నా ఎక్కువ వస్తే ఆ ఎక్కువ వచ్చిన రాబడి మీద కొంత శాతాన్ని ఫీజుగా చార్జి చేస్తారు.
ఖాతాదారులు తప్పనిసరిగా డిమ్యాట్ ఖాతాను కలిగి ఉండాలి. డిస్క్రిషనరీ పద్ధతిలో ఖాతా ప్రారంభించేటప్పుడు ఒకవేళ ఖాతాదారుడు ఏవైనా షేర్లు కొనగూడదు అనుకున్నా, లేదా లార్జ్‌కాప్, మిడ్‌కాప్ మాత్రమే కొనాలి అని ఉన్నా, వాటిని అగ్రిమెంట్‌లో పొందుపరిచి వాటి ప్రకారం మేనేజ్ చేయమని చెప్పవచ్చు.
ఎన్‌ఆర్‌ఐలు కూడా పిఎంఎస్ పద్ధతిలో పెట్టుబడులు పెట్టవచ్చు. ఇందుకోసం ఎన్‌ఆర్‌ఐలు పిఐఎస్ ఖాతాను ప్రారంభించవలసి ఉంటుంది. ఎన్‌ఆర్‌ఐలకి, రెసిడెంట్ ఇండియన్స్‌కి పిఎంఎస్ ఖాతాని ప్రారంభించడానికి అవసరమైన డాక్యుమెంట్స్ వేరుగా ఉంటాయి. పోర్ట్‌ఫోలియో మేనేజర్‌వద్ద ఉన్నటువంటి చెక్‌లిస్ట్ ఆధారంగా డాక్యుమెంట్స్ అందజేయాలి.
ఈ పిఎంఎస్ ఖాతాలో ప్రతి ఒక్క ఖాతాదారుని పెట్టుబడులు వారి వారి లక్ష్యాలకు అనుగుణంగా నిర్వహించబడతాయి. ప్రతి ఆరు నెలలకొకసారి స్టేట్‌మెంట్ పొందవచ్చు. లేదా ఎప్పుడైనా పెట్టుబడులు పరిశీలించాలంటే పోర్ట్‌ఫోలియో మేనేజర్స్ స్టేట్‌మెంట్ అందజేస్తారు. కొంచెం పెద్దమొత్తంలో పెట్టుబడులు పెట్టాలనుకునేవారికి ఈ పిఎంఎస్ పద్ధతిలో పెట్టుబడులు పెట్టడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
- రజని భీమవరపు
ఫైనాన్షియల్ ప్లానర్, ‘జెన్ మనీ’