financial targets
-
అక్టోబర్ 1 నుంచి అమలయ్యే కొత్త మార్పులు, నిబంధనలు ఇవే..
మ్యూచువల్ ఫండ్ ఫోలియోలు, డీమ్యాట్ ఖాతా, ట్రేడింగ్ ఖాతాలు, రూ.2000 నోట్ల డిపాజిట్ వంటి ఆర్థికంగా ముఖ్యమైన పలు అంశాలకు డెడ్‌లైన్ సెప్టెంబర్ 30తో ముగియనుంది. అలాగే పలు కొత్త నిబంధనలు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. అవేంటో ఒక్కొక్కటిగా ఈ కథనంలో తెలుసుకుందాం. మ్యూచువల్ ఫండ్లకు నామినీల చేర్పు ప్రస్తుతం ఉన్న అన్ని మ్యూచువల్ ఫండ్ ఫోలియోలకు నామినీలను చేర్చడానికి గడువు సెప్టెంబర్ 30తో ముగుస్తుంది. ఆ తర్వాత డెబిట్‌లకు వేలు లేకుండా ఫోలియోలు ఫ్రీజ్ అవుతాయి. (RBI Rules: వారికి 6 నెలలే సమయం.. ఆర్బీఐ కీలక నిబంధనలు) కొత్త టీసీఎస్ నియమాలు క్రెడిట్ కార్డ్‌లపై విదేశీ ఖర్చులు రూ. 7 లక్షలు దాటితే 20 శాతం టీసీఎస్ అక్టోబర్ 1 నుంచి అమలు కానుంది. వైద్య లేదా విద్యా ప్రయోజనాల కోసం రూ. 7 లక్షలకు మించి ఖర్చు చేస్తే 5 శాతం టీసీఎస్ విధిస్తారు. ఇక విదేశీ విద్య కోసం రుణాలు రూ.7 లక్షల పరిమితి దాటితే 0.5 శాతం టీసీఎస్ చెల్లించాల్సి ఉంటుంది. డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతాలకు నామినేషన్ కరెంట్ ట్రేడింగ్, డీమ్యాట్ ఖాతాదారులకు లబ్ధిదారుని నామినేట్ చేయడానికి చివరి తేదీ సెప్టెంబర్ 30తో ముగుస్తుంది. మార్కెట్ రెగ్యులేటర్ సర్క్యులర్ ప్రకారం.. 'ట్రేడింగ్, డీమ్యాట్ ఖాతాల అసెస్మెంట్ ఆధారంగా నామినేషన్ వివరాల ఎంపిక (అంటే నామినేషన్ లేదా నామినేషన్ నుంచి వైదొలగడానికి డిక్లరేషన్ అందించడం) గడువు తర్వాత అప్డేట్ చేయడానికి వీలుండదు. వాటాదారుల నుంచి స్వీకరించిన ప్రతిపాదనలు, ఖాతాల స్తంభనకు సంబంధించి 2022 ఫిబ్రవరి 24 నాటి సెబీ సర్క్యులర్‌లోని 3 (ఎ) పేరా, 2021 జూలై 23 నాటి సెబీ సర్క్యులర్‌లోని పేరా 7లో పేర్కొన్న నిబంధనలు సెప్టెంబర్ 30 నుంచి అమల్లోకి వస్తాయి. రూ. 2,000 నోట్ల మార్పిడి రూ.2000 నోట్లను ఆర్బీఐ చలామణి నుంచి ఉపసంహరించిన విషయం తెలిసిందే. ఈ రూ.2000 నోట్లను మార్చుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ సెప్టెంబర్ 30ని డెడ్ లైన్ గా నిర్ణయించింది. ఇప్పటికీ తమ వద్ద రూ. 2,000 నోట్లు ఉన్న వారు గడువు తేదీలోపు బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలి. బర్త్ సర్టిఫికెట్ తప్పనిసరి ఆధార్ నుంచి విద్యా సంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల దరఖాస్తు కోసం జనన ధృవీకరణ పత్రాలను సింగిల్ డాక్యుమెంట్‌గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించిన జనన మరణాల నమోదు (సవరణ) చట్టం-2023 అక్టోబర్ 1 నుంచి అమలులోకి వస్తుంది. -
కౌంట్ వాళ్లది.. క్యాష్ మనది
ఉమెన్ ఫైనాన్స్ / పోర్ట్‌ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసు ఆర్థిక లక్ష్యాలను సాధించుకోవటానికి, ఉన్న సంపదను పెంపొందించుకోవడానికి వివిధ పెట్టుబడి మార్గాలైనటువంటి ఈక్విటీ, డెట్‌లలో పెట్టుబడి పెడుతూ ఉంటారు చాలామంది. కాని, వాటిమీద పూర్తి అవగాహన లేకపోతే తరచూ వాటిని చూసుకుంటూ, అవసరమైతే మార్పులు చేర్పులు చేసుకోవటానికి వీలు కుదరకపోవచ్చు. ఇలాంటి వారికోసమే పోర్ట్‌ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసు (పిఎంఎస్) ప్రారంభమయింది. ఈ సర్వీసు అందజేసే కంపెనీ సెబి (సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా)తో పోర్ట్‌ఫోలియో మేనేజర్‌గా రిజిస్టర్ చేసుకోవాలి. ఈ సర్వీసు పొందగోరే వ్యక్తులు ఎవరైనా సెబీతో రిజిష్టర్ అయిన పోర్ట్‌ఫోలియో మేనేజర్ వద్ద ఖాతాని ప్రారంభించవచ్చు. కనీస మొత్తం 25 లక్షలు మొదలుకుని ఎంత మొత్తానికైనా సర్వీసు పొందవచ్చు. ఈ సొమ్మును చెక్, ఆన్లైన్ ట్రాన్స్ఫర్ రూపేణా లేదా షేర్ల రూపేణా జమచేయవచ్చు. ఈ ఖాతాను రెండు రకాలుగా కలిగి ఉండవచ్చు.. 1. డిస్క్రెషనరీ పిఎంఎస్: ఈ పద్ధతిలో ఏయే పెట్టుబడి మార్గాలలో పెట్టుబడి పెట్టాలి అనేది ఫండ్ మేనేజర్ నిర్ణయిస్తారు. 2. నాన్ డిస్క్రెషనరీ పిఎంఎస్: ఈ పద్ధతిలో పోర్ట్‌ఫోలియో మేనేజర్ ఏయే పెట్టుబడి మార్గాలలో పెట్టుబడి పెడితే మంచిదో సూచనలిస్తారు. వాటిలో పెట్టాలా లేదా ఎప్పుడు పెట్టాలి అనేది ఖాతాదారుడు నిర్ణయించుకోవచ్చు. పోర్ట్‌ఫోలియో ఎలా ఉండాలి, ఏమేమి చార్జీలు వర్తిస్తాయి, ఎంత శాతం అనేది ఖాతాదారుడు, పోర్ట్‌ఫోలియో మేనేజర్ ఖాతా ప్రారంభించినప్పుడు రాసుకున్న రాసుకున్న అగ్రిమెంట్ ప్రకారం ఉంటాయి. సాధారణంగా రెండు రకాలైనటువంటి ఫీజును చార్జి చేస్తారు. పెట్టుబడులు నిర్వహించడానికి అయ్యే ఖర్చుని ఒక ఫిక్స్డ్ శాతంగానూ, రాబడి ఒక నిర్ణీత శాతం కన్నా ఎక్కువ వస్తే ఆ ఎక్కువ వచ్చిన రాబడి మీద కొంత శాతాన్ని ఫీజుగా చార్జి చేస్తారు. ఖాతాదారులు తప్పనిసరిగా డిమ్యాట్ ఖాతాను కలిగి ఉండాలి. డిస్క్రిషనరీ పద్ధతిలో ఖాతా ప్రారంభించేటప్పుడు ఒకవేళ ఖాతాదారుడు ఏవైనా షేర్లు కొనగూడదు అనుకున్నా, లేదా లార్జ్‌కాప్, మిడ్కాప్ మాత్రమే కొనాలి అని ఉన్నా, వాటిని అగ్రిమెంట్లో పొందుపరిచి వాటి ప్రకారం మేనేజ్ చేయమని చెప్పవచ్చు. ఎన్ఆర్ఐలు కూడా పిఎంఎస్ పద్ధతిలో పెట్టుబడులు పెట్టవచ్చు. ఇందుకోసం ఎన్ఆర్ఐలు పిఐఎస్ ఖాతాను ప్రారంభించవలసి ఉంటుంది. ఎన్ఆర్ఐలకి, రెసిడెంట్ ఇండియన్స్‌కి పిఎంఎస్ ఖాతాని ప్రారంభించడానికి అవసరమైన డాక్యుమెంట్స్ వేరుగా ఉంటాయి. పోర్ట్‌ఫోలియో మేనేజర్వద్ద ఉన్నటువంటి చెక్‌లిస్ట్ ఆధారంగా డాక్యుమెంట్స్ అందజేయాలి. ఈ పిఎంఎస్ ఖాతాలో ప్రతి ఒక్క ఖాతాదారుని పెట్టుబడులు వారి వారి లక్ష్యాలకు అనుగుణంగా నిర్వహించబడతాయి. ప్రతి ఆరు నెలలకొకసారి స్టేట్మెంట్ పొందవచ్చు. లేదా ఎప్పుడైనా పెట్టుబడులు పరిశీలించాలంటే పోర్ట్‌ఫోలియో మేనేజర్స్ స్టేట్మెంట్ అందజేస్తారు. కొంచెం పెద్దమొత్తంలో పెట్టుబడులు పెట్టాలనుకునేవారికి ఈ పిఎంఎస్ పద్ధతిలో పెట్టుబడులు పెట్టడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. - రజని భీమవరపు ఫైనాన్షియల్ ప్లానర్, ‘జెన్ మనీ’ -
ఫైనాన్షియల్ బేసిక్స్..
ఆర్థిక లక్ష్యాలు చేరుకోవటమెలా? ప్రతి వ్యక్తికీ జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలనే ఆశ, ఆలోచన ఉంటాయి. వాటికి అనుగుణంగానే వారు కొన్ని ఆర్థిక లక్ష్యాలను నిర్దేశించుకుంటారు. ఎవరైనా రాత్రికి రాత్రే ధనవంతులు కాలేరు కదా..! అలాగే అనుకున్న లక్ష్యాలను చేరడానిక్కూడా కొంత సమయం పడుతుంది. దానికి సరైన వ్యూహ రచన అవసరం. సరైన మార్గంలో నడిస్తేనే లక్ష్యాలను చేరుకోగలం. లక్ష్యాల ఏర్పాటు ఎలా? లక్ష్యాలను రూపొందించుకునేటప్పుడు స్మార్ట్‌గా వ్యవహరించాలి. ముందుగా భవిష్యత్తు అవసరాలను గుర్తించాలి. వాటికి అనువుగా ప్రాపర్టీ కొనుగోలు, రిటైర్మెంట్ ప్లానింగ్ వంటి లక్ష్యాలను ఏర్పాటు చేసుకోవాలి. ఈ లక్ష్యాలు స్వల్ప కాలానివా? లేక మధ్య, దీర్ఘకాలికమైనవా అనేది చూడాలి. ఇప్పుడు ప్రతి లక్ష్యానికి కొంత నిర్ణీత కాలాన్ని కేటాయించుకోవాలి. అలాగే వాటికి ఎంత మొత్తంలో డబ్బులు అవసరమౌతాయో దృష్టిలో ఉంచుకోవాలి. లక్ష్యాలను ప్రాధాన్యతా క్రమంలో చూడాలి. అంటే మనకు దాహమేస్తే అందుబాటులో ఉన్న నీటిని తాగుతాం.. కానీ బావిని తవ్వం కదా? కాబట్టి లక్ష్యాలను ఒక ప్రాధాన్యతా క్రమంలో రాసుకోవడం చాలా ముఖ్యం. ఉదాహరణకు ఇప్పుడు మీకు ఇల్లు అవసరం అనుకోండి. 2025 నాటికి మీరు రూ.75 లక్షల విలువైన ఇంటిని కొనాలని లక్ష్యించారు. దానికి అనుగుణంగా ఏ ఏ పెట్టుబడి సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తే అంత డబ్బులు వస్తాయో తెలుసుకోవాలి. దానికి తగినట్లుగానే సేవింగ్స్ చేయాలి. ఇక్కడ పరిస్థితులు, కాలాన్ని బట్టి ప్రాధాన్యాలు మారుతుంటాయి. దీన్ని దృష్టిలో ఉంచుకోవాలి. పునఃసమీక్ష చాలా ముఖ్యం లక్ష్యాలను నిర్దేశించుకోవడం, దానికి తగినట్లుగా ఇన్వెస్ట్ చేయడం ఒక ఎత్తయితే, కొన్నాళ్ల తర్వాత లక్ష్యాల కోసం చేసే ఇన్వెస్ట్‌మెంట్స్‌ను సమీక్షించుకోవడం మరో ఎత్తు. కార్యదీక్ష చేపట్టిన వ్యక్తి దాన్ని మధ్యలో వదిలేస్తే కలిగే ఫలితం శూన్యం. అలాగే లక్ష్యాల కోసం ప్రారంభించిన ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కూడా మధ్యలో వదిలేసినా ఎలాంటి ఫలితం ఉండదు. కాబట్టి ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా ఇన్వెస్ట్‌మెంట్స్‌ను మధ్యలో వదిలేయకూడదు. -
ఈసారి ఇలా ప్లాన్ చేద్దాం..
అనిల్ రెగో సీఈవో, రైట్ హొరెజైన్స్ ఎటువంటి ఇబ్బంది, ఒత్తిడి లేకుండా ఎంచుకున్న ఆర్థిక లక్ష్యాలను చేరుకోవాలంటే చక్కటి ప్రణాళిక అవసరం. మనలో చాలామంది లక్ష్యాలను నిర్దేశించుకున్నా సరైన అవగాహన, ప్రణాళికలు లేక విఫలమవుతుంటారు. కొన్ని అంశాలను తు.చ. తప్పకుండా పాటిస్తే భవిష్యత్తు ఆర్థిక అవసరాలపై నిశ్చింతగా ఉండొచ్చు. బడ్జెట్‌తో మొదలు పెట్టాలి.. ఆర్థిక ప్రణాళికలో అత్యంత కీలకమైన అంశం బడ్జెట్ రూపకల్పన. మీ మొత్తం ఆదాయం, ఖర్చులు, ఆర్థిక లక్ష్యాల కాలపరిమితి వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. వృథా ఖర్చులు తగ్గించి నెలవారీ ఆదాయంలో పొదుపు కోసం కొంత మొత్తం కేటాయించాలి. ఆదాయ, వ్యయాలను ఏ నెలకు ఆ నెల సమీక్షించుకునే వాళ్లు ప్రతీ ఏడాది ఆర్థిక ప్రణాళికలో విజయం సాధిస్తారు. అనవసర వ్యయాలను తగ్గించి, దీర్ఘకాలం పొదుపు చేయడానికి బడ్జెట్ దోహదం చేస్తుంది. పథకాల ఎంపికా ముఖ్యమే... పొదుపు విషయానికి వస్తే ఎంచుకున్న పథకాలపైనే ఆర్థిక విజయం ఆధారపడి ఉంటుంది. సరైన పథకంలో పెడితేనే అది వృద్ధి చెంది ఆర్థిక ఫలాలను అందించగలుగుతుంది. మీ దగ్గర ఉన్న అదనపు మొత్తాన్ని అనవసరంగా బ్యాంకు సేవింగ్స్ ఖాతాలో ఉంచకుండా వాటిని ఫిక్స్డ్ డిపాజిట్లు, డెట్, మ్యూచువల్, గోల్డ్ ఫండ్స్ వంటి అధిక రాబడిని ఇచ్చే పెట్టుబడి సాధనాలకు కేటాయించండి. ప్రస్తుతం ఫిక్స్డ్ డిపాజిట్లు, డెట్ ఫండ్స్ అధిక రాబడులను అందిస్తున్నాయి. బ్యాంకు డిపాజిట్లు అయితే 9% వడ్డీని ఇస్తున్నాయి. ఇంతకంటే కొద్దిగా రిస్క్ చేయగలిగితే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ విధానంలో ఈక్విటీ సేవింగ్స్ స్కీం (ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్ -ఈఎల్ఎస్ఎస్) చక్కటి ఇన్వెస్ట్మెంట్ సాధనంగా చెప్పొచ్చు. వీటిల్లో మూడేళ్ల లాకిన్ పీరియడ్ ఉండటం వల్ల ఫండ్ మేనేజర్లు దీర్ఘకాలంలో మంచి రాబడి ఇవ్వడానికి అవకాశం ఉన్న షేర్లలో ఇన్వెస్ట్ చేసే వెసులుబాటు ఉంటుంది. అలాగే సిప్ విధానం ఎంచుకోవడం వల్ల మార్కెట్ కదలికలపై ఆందోళన ఉండదు. మార్కెట్ పడితే మన చేతికి ఎక్కువ యూనిట్లు వస్తాయి. అదే పెరుగుతుంటే మనం ఇన్వెస్ట్ చేసిన మొత్తం కూడా పెరుగుతుంది. ఇన్వెస్ట్మెంట్ సాధనం ఎంచుకోవడంలో ఆర్థిక లక్ష్యాలు, రిస్క్ సామర్థ్యం వంటి అంశాలు చాలా కీలకమైనవి. ఉదాహరణకు మీ అమ్మాయి/అబ్బాయికి విదేశాల్లో ఉన్నత చదువు చెప్పించడం మీ లక్ష్యం అనుకుందాం. ఇలాంటి స్థిరమైన లక్ష్యాలున్నప్పుడు రిస్క్ తక్కువగా ఉండి స్థిరమైన ఆదాయాన్నిచ్చే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) వంటి పథకాలు ఉత్తమం. ఇవి రాబడితో కూడిన స్థిరమైన ఆదాయాన్ని ఇవ్వడమే కాకుండా, వడ్డీపై పన్ను భారమూ ఉండదు. సకాలంలో బకాయిలు ఏమైనా బకాయిలు ఉంటే వాటిని సకాలంలో చెల్లించండి. రుణాలు, ఆదాయపు పన్ను, ఇతర చెల్లింపులు ఏమైనా సరే అశ్రద్ధ చేయొద్దు. బకాయిలు సకాలంలో చెల్లించకపోతే అది మీపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. క్రెడిట్ రేటింగ్ తగ్గడంతోపాటు ఆర్థిక క్రమశిక్షణను దెబ్బతీస్తుంది. క్రెడిట్ రేటింగ్ పడిపోతే తీసుకునే రుణాలపై అధిక వడ్డీరేట్లు చెల్లించాల్సి వస్తుంది. అత్యవసర నిధి అవసరమే బడ్జెట్ తయారీలో ఇది చివరి అంశమే అయినప్పటికీ ఇదే చాలా కీలకమైనది. ప్రతి ఒక్కరూ తమ బడ్జెట్లో అత్యవసర నిధికి కొంత మొత్తం కేటాయించాలి. ఏ క్షణంలో ఎప్పుడు డబ్బులు అవసరమవుతాయో తెలియదు కాబట్టి అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలి. ఉదాహరణకు ఉద్యోగం పోతే కొత్తది వెతుక్కునే లోపు కనీసం ఇంటి అవసరాలు, ఈఎంఐలు చెల్లించడానికి సరిపోయే విధంగా ఈ నిధిని ఏర్పాటు చేసుకోవాలి. లక్ష్యం చేరుకుందామిలా... - ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే ప్రణాళికను ప్రారంభించండి. - రిస్క్ సామర్థ్యం, ఆర్థిక లక్ష్యం ఆధారంగా ఇన్వెస్ట్మెంట్ సాధనం ఎంచుకోవాలి - ముందుగానే బడ్జెట్ తయారు చేసుకొని, దానికి కట్టుబడి ఉండాలి. - సాధారణ పొదుపునకు సంబంధం లేకుండా అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలి.