ఫైనాన్షియల్ బేసిక్స్..
ఆర్థిక లక్ష్యాలు చేరుకోవటమెలా?
ప్రతి వ్యక్తికీ జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలనే ఆశ, ఆలోచన ఉంటాయి. వాటికి అనుగుణంగానే వారు కొన్ని ఆర్థిక లక్ష్యాలను నిర్దేశించుకుంటారు. ఎవరైనా రాత్రికి రాత్రే ధనవంతులు కాలేరు కదా..! అలాగే అనుకున్న లక్ష్యాలను చేరడానిక్కూడా కొంత సమయం పడుతుంది. దానికి సరైన వ్యూహ రచన అవసరం. సరైన మార్గంలో నడిస్తేనే లక్ష్యాలను చేరుకోగలం.
లక్ష్యాల ఏర్పాటు ఎలా?
లక్ష్యాలను రూపొందించుకునేటప్పుడు స్మార్ట్‌గా వ్యవహరించాలి. ముందుగా భవిష్యత్తు అవసరాలను గుర్తించాలి. వాటికి అనువుగా ప్రాపర్టీ కొనుగోలు, రిటైర్మెంట్ ప్లానింగ్ వంటి లక్ష్యాలను ఏర్పాటు చేసుకోవాలి. ఈ లక్ష్యాలు స్వల్ప కాలానివా? లేక మధ్య, దీర్ఘకాలికమైనవా అనేది చూడాలి. ఇప్పుడు ప్రతి లక్ష్యానికి కొంత నిర్ణీత కాలాన్ని కేటాయించుకోవాలి. అలాగే వాటికి ఎంత మొత్తంలో డబ్బులు అవసరమౌతాయో దృష్టిలో ఉంచుకోవాలి.
లక్ష్యాలను ప్రాధాన్యతా క్రమంలో చూడాలి. అంటే మనకు దాహమేస్తే అందుబాటులో ఉన్న నీటిని తాగుతాం.. కానీ బావిని తవ్వం కదా? కాబట్టి లక్ష్యాలను ఒక ప్రాధాన్యతా క్రమంలో రాసుకోవడం చాలా ముఖ్యం. ఉదాహరణకు ఇప్పుడు మీకు ఇల్లు అవసరం అనుకోండి. 2025 నాటికి మీరు రూ.75 లక్షల విలువైన ఇంటిని కొనాలని లక్ష్యించారు. దానికి అనుగుణంగా ఏ ఏ పెట్టుబడి సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తే అంత డబ్బులు వస్తాయో తెలుసుకోవాలి. దానికి తగినట్లుగానే సేవింగ్స్ చేయాలి. ఇక్కడ పరిస్థితులు, కాలాన్ని బట్టి ప్రాధాన్యాలు మారుతుంటాయి. దీన్ని దృష్టిలో ఉంచుకోవాలి.
పునఃసమీక్ష చాలా ముఖ్యం
లక్ష్యాలను నిర్దేశించుకోవడం, దానికి తగినట్లుగా ఇన్వెస్ట్ చేయడం ఒక ఎత్తయితే, కొన్నాళ్ల తర్వాత లక్ష్యాల కోసం చేసే ఇన్వెస్ట్‌మెంట్స్‌ను సమీక్షించుకోవడం మరో ఎత్తు. కార్యదీక్ష చేపట్టిన వ్యక్తి దాన్ని మధ్యలో వదిలేస్తే కలిగే ఫలితం శూన్యం. అలాగే లక్ష్యాల కోసం ప్రారంభించిన ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కూడా మధ్యలో వదిలేసినా ఎలాంటి ఫలితం ఉండదు. కాబట్టి ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా ఇన్వెస్ట్‌మెంట్స్‌ను మధ్యలో వదిలేయకూడదు.