Portfolio Management service
-
సంపద నిర్వహణ సేవలకు డిమాండ్
సంపద వృద్ధికి మెరుగైన అవకాశాల కోసం చిన్న పట్టణాల్లోని వారు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో వెల్త్ మేనేజ్మెంట్ సేవల్లోని కంపెనీలు టైర్–2, 3 పట్టణాల వైపు చూస్తున్నాయి. సాధారణంగా చిన్న పట్టణాల్లోని అధిక ధనవంతులు (హెచ్ఎన్ఐలు) సంప్రదాయ సాధనాలైన బంగారం, రియల్ ఎస్టేట్‌లో ఎక్కువగా పెట్టుబడులు పెడుతుంటారు. ఇప్పుడు బంగారం, రియల్టీ కాకుండా ఇతర సాధనాల్లోకి తమ పెట్టుబడులను విస్తరించుకోవాలని అనుకుంటున్నారు. ఈ ధోరణి వెల్త్ మేనేజ్మెంట్ సేవలకు డిమాండ్‌ను తెస్తోంది. ముఖ్యంగా కరోనా తర్వాత చిన్న పట్టణాల్లో కొన్ని వ్యాపారాలకు కొత్త జీవం రావడాన్ని వెల్త్ మేనేజర్లు ప్రస్తావిస్తున్నారు. సంపద నిర్వహణ సేవలు అందించే సంస్థలు (వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీలు) ఆర్థిక ప్రణాళిక, పన్నుల కు సంబంధించిన సలహాలు, ఎస్టేట్ ప్లానింగ్ వంటి ఎన్నో సేవలు అందిస్తుంటాయి. ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ, పోర్ట్‌ఫోలియో మేనేజ్మెంట్ సంస్థలతో పోలిస్తే వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీలు విస్తృతమైన సేవలను ఆఫర్ చేస్తుంటాయి. అధిక శాతం మంది వెల్త్ మేనేజర్లు కనీసం రూ.కోటి నుంచి రూ.25 కోట్ల వరకు పెట్టుబడుల నిర్వహణ చూస్తుంటారు. కరోనా తర్వాతే.. కరోనా ముందు నాటికి మా మొత్తం క్లయింట్లలో ద్వితీయ శ్రేణి పట్టణాల్లోని క్లయింట్లు 17 శాతంగా ఉంటే, ఇప్పుడు 22 శాతానికి పెరిగినట్టు ఆస్క్ ప్రైవేటు వెల్త్ వెల్లడించింది. ద్వితీయ శ్రేణి పట్టణాల్లోని ఈ సంస్థ క్లయింట్ల ఆస్తులు 13 శాతం నుంచి 22 శాతానికి చేరాయి. నువమా వెల్త్ క్లయింట్లలోనూ కరోనా ముందు టైర్–2 నుంచి 15 శాతంగా ఉంటే, కరోనా తర్వాత 20 శాతానికి పెరిగారు. ద్వితీయ శ్రేణి పట్టణాల్లోనూ ప్రైవేటు వెల్త్ మేనేజ్మెంట్ సేవలు విస్తరించడానికి ఎక్కువ సంస్థలు ఈ రంగంలోకి ప్రవేశిస్తుండడం కూడా ఒక కారణంగా చెప్పుకోవాలి. మరిన్ని సంస్థలు రావడంతో అవి ఎక్కువ మంది ధనవంతులను చేరుకోగలుగుతున్నాయి. దేశవ్యాప్తంగా సేవల విస్తరణకు కొన్ని సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. ‘‘కరోనా తర్వాత స్పెషాలిటీ కెమికల్స్ గొప్ప పనితీరు చూపించింది. దీంతో ప్రమోటర్లకు, ఈ వ్యాపారాల్లో ఉన్న వారి సంపద పెరిగింది. ద్వితీయ శ్రేణి పట్టణాల్లోని వారికి ఖర్చు చేయగల ఆదాయం అసాధారణంగా పెరిగింది’’అని మోతీలాల్ ఓస్వాల్ ప్రైవేటు వెల్త్ డైరెక్టర్ జయేష్ ఫరీదా వివరించారు. అంతేకాదు చిన్న పట్టణాల్లో స్టార్టప్‌లు ఏర్పాటు అవుతుండడాన్ని వెల్త్ మేనేజర్లు గుర్తు చేస్తున్నారు. 50 శాతం స్టార్టప్‌లు టైర్–2, 3 పట్టణాల నుంచి ఉన్నాయని 2022 మార్చిలో కేంద్ర సర్కారు పార్లమెంటుకు తెలియజేయడం గమనార్హం. ‘‘టైర్–2, 3 పట్టణాల్లో మౌలిక సదుపాయాలు మెరుగు పడుతున్నాయి. దీంతో వ్యాపారాల నిర్వహణ సులభంగా మారుతోంది. పన్ను మినహాయింపులు, సబ్సిడీలు, ప్రోత్సాహకాలతో ప్రభుత్వం నుంచి మద్దతు కూడా తోడయింది’’అని నువమా ప్రైవేట్ ప్రెసిడెంట్ అలోక్ సైగల్ పేర్కొన్నారు. మెరుగైన రాబడుల కోసం.. చిన్న పట్టణాల్లో హెచ్ఎన్ఐలు పెరగడం ఒక్కటే కాకుండా, కరోనా తర్వాత పరిస్థితుల్లో వచ్చిన మార్పులను వెల్త్ మేనేజర్లు ప్రస్తావిస్తున్నారు. సంప్రదాయ సాధనాలైన బ్యాంక్ ఎఫ్డీలపై రాబడులు కనిష్ట స్థాయికి చేరడం ఇందులో ఒకటిగా ఉంది. కరోనా మహమ్మారి తర్వాత ఆర్బీఐ వడ్డీ రేట్లను కనిష్ట స్థాయికి తగ్గించడం గుర్తుండే ఉంటుంది. అంతేకాదు ఈ మహమ్మారి కారణంగా రియల్ ఎస్టేట్ మార్కెట్ కూడా డల్‌గా మారింది. ఇది ఈక్విటీ, ఫిక్స్డ్ ఇన్కమ్ తదితర సాధనాల వైపు చూసేలా చేసినట్టు చెబుతున్నారు. తమ కొత్త క్లయింట్లలో ఎక్కువ మంది ఇంత కాలం బంగారం, ఎఫ్డీలు, రియల్ ఎస్టేట్ మినహా మరో సాధనంలో పెట్టుబడులు పెట్టని వారేనని వెల్త్ మేనేజర్లు వెల్లడించారు. ఆనంద్‌రాఠి వెల్త్ మేనేజ్మెంట్ కరోనా ముందు టైర్–2 పట్టణాల క్లయింట్లకు సంబంధించి రూ.814 కోట్ల ఆస్తులను నిర్వహిస్తుండగా, కరోనా అనంతరం రూ.3,500 కోట్లకు పెరిగిపోయాయి. జో«ద్‌పూర్,, నాగ్‌పూర్ తదితర పట్టణాల్లో వ్యాపారం రెట్టింపైది. దీంతో టికెట్ సైజు (పెట్టుబడి మొత్తం) తక్కువగా ఉన్నా, వెల్త్ మేనేజ్ మెంట్ కంపెనీలు చిన్న పట్టణాలపైనా ప్రత్యేక దృష్టి సారించాయి. 2022లో వెల్త్ మేనేజ్మెంట్ సేవలు ప్రారంభించిన ఎప్సిలాన్ మనీ తన క్లయింట్లలో 70 శాతం టైర్ 2, 3 పట్టణాలకు చెందిన వారేనని వెల్లడించింది. ‘‘చాలా మంది క్లయింట్లు సంప్రదాయ సాధనాలతోపాటు, వ్యాపారాలకే పెట్టుబడులు పరిమితం చేసుకుంటున్నారు. వ్యాపారాలు, రియల్ ఎస్టేట్, బంగారం, ఎఫ్డీలు కాకుండా ఇతర సాధనాల పట్ల వారిలో అవగాహన కలి్పంచాల్సిన అవసరం ఉంది’’అని ఆస్క్ ప్రైవేటు వెల్త్ ఎండీ రాజేష్ సలూజా అభిప్రాయపడ్డారు. -
పీఎంఎస్‌కు సెబీ మార్గదర్శకాలు
న్యూఢిల్లీ: పోర్ట్‌ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసుల(పీఎంఎస్)కు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా అదనపు మార్గదర్శకాలు జారీ చేసింది. దీంతో ఇకపై పోర్ట్‌ఫోలియో మేనేజర్స్ క్లయింట్ల నిధులను నిర్వహించేటప్పుడు ఇన్వెస్ట్మెంట్ వ్యూహాలు పేరుతో అదనపు రక్షణాత్మక మార్గదర్శకాలను అనుసరించవలసి ఉంటుంది. పనితీరు(పెర్ఫార్మెన్స్), ప్రామాణికత(బెంచ్‌మార్కింగ్)లకు సంబంధించి సెబీ తాజా గైడ్‌లైన్స్‌ను ప్రకటించింది. క్లయింట్ల పెట్టుబడి ఆశయాలకు అనుగుణంగా నిధులను నిర్వహించేటప్పుడు పోర్ట్‌ఫోలియో మేనేజర్స్ ఇన్వెస్ట్మెంట్ అప్రోచ్(ఐఏ)ను పాటించవలసి ఉంటుంది. పనితీరు, ప్రామాణికతలపై సమీక్షకు ఇవి అవసరమని సెబీ తెలియజేసింది. 2023 ఏప్రిల్ నుంచి అమల్లోకిరానున్న తాజా మార్గదర్శకాలు పోర్ట్‌ఫోలియో మేనేజర్ల పనితీరును తెలుసుకునేందుకు సహాయకారిగా నిలవనున్నట్లు పేర్కొంది. చదవండి: ఆర్థిక మాంద్యంలోనూ అదరగొట్టిన మల్టీబ్యాగర్ స్టాక్.. కలలో కూడా ఊహించని లాభం! -
ప్రతి ఆర్థిక లక్ష్యానికి ప్రత్యేక పోర్ట్‌ఫోలియో కావాలా?
నాకు ఏడు నుంచి ఎనిమిది వరకు ఆర్థిక లక్ష్యాలు ఉన్నాయి. ప్రతీ లక్ష్యానికి విడిగా పోర్ట్‌ఫోలియో ఉండాలా? అలా అయితే పర్యవేక్షణకు ఇబ్బంది కాదా? – దేవరాజ్ చౌదరి లక్ష్యాలు, పోర్ట్‌ఫోలియో మధ్య సమతూకం ఉండాలి. ముందుగా సమీప కాలంలోని లక్ష్యాలను వేరు చేయండి. అలాగే, మధ్య కాలం, దీర్ఘకాల లక్ష్యాలను కూడా వేరు చేయండి. ఇప్పుడు స్వల్పకాల, మధ్యకాల లక్ష్యాల్లోనూ.. రాజీ పడతగ్గ, రాజీపడలేని అనే రెండు విభాగాలు చేయండి. రాజీపడలేని అంటే రిస్క్ విషయమని అర్థం చేసుకోవాలి. రిస్క్ తీసుకోలేని మధ్యకాలం వరకు లక్ష్యాల కోసం ఉద్దేశించిన పెట్టుబడులను ఫిక్స్డ్ ఇన్కమ్ (స్థిరాదాయ/డె) సాధనాల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. వీటికోసం విభిన్న పోర్ట్‌ఫోలియోలను నిర్వహించాల్సిన అవసరం లేదు. ఈ పెట్టుబడుల కోసం ఈక్విటీలపై ఆధారపడకూడదు. అవసరమైనప్పుడు వెంటనే తీసుకునేందుకు అనుకూలంగా ఉండాలి. ఇక దీర్ఘకాలం కోసం ఉద్దేశించిన పెట్టుబడులను అంటే తదుపరి ఐదేళ్ల కాలం వరకు అవసరం లేని పెట్టుబడులను ఈక్విటీలకు కేటాయించుకోవాలి. ప్రతీ లక్ష్యానికి విడిగా ఎంత చొప్పున కావాలి, ఎంత వ్యవధి ఉందనే దాని ఆధారంగా ఇన్వెస్ట్ చేసుకోవాలి. అంటే ఆయా సమయాల్లో మీ లక్ష్యానికి కావాల్సిన నగదు లభించేలా ప్రణాళిక ఉండాలి. ఉదాహరణకు వచ్చే మూడేళ్ల కాలంలో రూ.5 లక్షలు కావాలి, ఐదేళ్లలో రూ.5 లక్షల కావాలనుకుంటే లేదా 25–30 ఏళ్లలో రూ.కోటి రూపాయలు (రిటైర్మెంట్) కావాలనుకుంటే అందుకు అనుకూలంగా ప్రణాళిక రూపొందించుకోవాలి. వేర్వేరు పోర్ట్ఫోలియోలన్నవి కాలవ్యవధికి అనుగుణంగానే ఉండాలి. స్వల్పకాల లక్ష్యాల కోసం ఫిక్స్డ్ ఇన్కమ్లో ఇన్వెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఐదేళ్లకు మించిన ఏ లక్ష్యానికైనా డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్‌ను ఎంపిక చేసుకోవచ్చు. అప్పుడు లక్ష్యాల వారీగా కాకుండా, కాలవ్యవధి ఆధారంగా ప్రత్యేక పోర్ట్‌ఫోలియోలు ఉంటాయి. ఇందుకోసం వ్యాల్యూరీసెర్చ్ ఆన్లైన్లో ‘మై ఇన్వెస్ట్మెంట్’ టూల్‌ను వినియోగించుకోవచ్చు. ఒకటికి మించిన పథకాల్లో ఇన్వెస్ట్ చేసుకున్నప్పుడు వివిధ లక్ష్యాలకు అనుగుణంగా ఈ టూల్‌తో వేరు చేసుకోవచ్చు. ఒకే విధమైన పనితీరు కలిగిన రెండు మ్యూచువల్ ఫండ్ పథకాల్లో నాకు పెట్టుబడులున్నాయి. లాభాలు స్వీకరించడం ద్వారా పెట్టుబడులను వెనక్కి తీసుకోవాలని అనుకుంటున్నాను. ఎగ్జిట్ లోడ్, మూలధన లాభాలు లేని పథకం ఏది? ఏ పథకం నుంచి వైదొలగాలి? – అరవింద్ కుమార్ ఈక్విటీ పథకాల్లో పెట్టుబడులను ప్రారంభించిన నాటి నుంచి ఏడాదిలోపు వెనక్కి తీసుకుంటే మూలధనలాభంలో 15 శాతం పన్ను చెల్లించాలి. ఏడాది తర్వాత తీసుకుంటే, లాభంలో 10 శాతం పన్ను చెల్లించాలి. దీర్ఘకాల మూలధన లాభం (ఏడాదికి మించిన పెట్టుబడులపై లాభం) మొదటి రూ.లక్షపై ఒక ఆర్థిక సంవత్సరంలో పన్ను ఉండదు. ఇవన్నీ చూసిన తర్వాతే ఏ పథకం అన్నది మీరే నిర్ణయించుకోండి. ఒకవేళ మార్కెట్లు పెరిగాయని లాభాలు తీసుకోవాలని అనుకుంటే అలా చేయవద్దు. పెట్టుబడులు వృద్ధి చెందాయనే లాభాలు తీసుకోవాలని చాలా మంది అనుకుంటుంటారు. ఈ తరహా ఆలోచనతో పెట్టుబడులను వెనక్కి తీసుకుని.. ఆ తర్వాత మార్కెట్లు పడిపోతే తిరిగి ఇన్వెస్ట్ చేయాలని వేచి చూస్తుంటారు. ఒకవేళ భారీ కరెక్షన్ చోటు చేసుకుంటే అప్పుడు ఇన్వెస్ట్ చేయకుండా, భయంతో మరింత కిందకు పడిపోతాయన్న ఆలోచనతో ఇన్వెస్ట్ చేయకుండా ఉండిపోతారు. అక్కడి నుంచి మార్కెట్లు 10–15 శాతం పెరిగిపోయిన తర్వాత మంచి అవకాశాన్ని కోల్పోయామని విచారిస్తుంటారు. మార్కెట్లో సరైన సమయంలో ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటే ఉండే రిస్క్ ఇదే. అందుకే డబ్బుతో అవసరం పడితేనే పెట్టుబడులను వెనక్కి తీసుకోండి. - ధీరేంద్ర కుమార్, సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ చదవండి:సీనియర్ సిటిజన్లకు ‘పన్ను’ లాభాలు -
రూ.50 లక్షల కోట్లకు పీఎంఎస్, ఏఐఎఫ్ ఆస్తులు.. ఎప్పుడంటే ?
న్యూఢిల్లీ: సంప్రదాయ రిటైల్ సాధనాలకు ప్రత్యామ్నాయంగా.. పోర్ట్‌ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ (పీఎంఎస్), ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ (ఏఐఎఫ్) వైపు ఇన్వెస్టర్లు చూస్తున్న నేపథ్యంలో భవిష్యత్తులో వీటికి మరింత ఆదరణ రానుందని పీఎంఎస్ బజార్ పేర్కొంది. పీఎంఎస్, ఏఐఎఫ్‌ల నిర్వహణలోని ఆస్తులు (ఏయూఎం) ఏటా 20 శాతం కాంపౌండెడ్‌గా వృద్ధి చెందుతూ 2031 నాటికి రూ.50లక్షల కోట్లకు చేరుకోవచ్చని అంచనా వేసింది. పీఎంఎస్, ఏఐఎఫ్‌లలో పెట్టుబడుల సేవలను పీఎంఎస్ బజార్ ఆఫర్ చేస్తుంటుంది. నియంత్రణల పరంగా ఈ సాధనాలకు సానుకూలత నెలకొందని, మెరుగైన రాబడులను ఇస్తున్నట్టు తెలిపింది. అధికారిక గణాంకాల ఆధారంగా చూస్తే.. పీఎంఎస్ (నాన్ ఈపీఎఫ్‌వో) ఆస్తులు ఈ ఏడాది అక్టోబర్ నాటికి రూ.3.97 లక్షల కోట్లుగా ఉన్నట్టు పీఎంఎస్ బజార్ పేర్కొంది. ‘‘ఇది ఆరు రెట్లు పెరిగి 2031 నాటికి రూ.24 లక్షల కోట్లకు చేరుకోవచ్చు. అదే విధంగా ఏఐఎఫ్ సాధనాల నిర్వహణలోని ఆస్తులు రూ.4.87 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఇవి సైతం ఆరు రెట్లకు పైగా పెరిగి రూ.30 లక్షల కోట్లకు వచ్చే పదేళ్లలో వృద్ధి చెందుతాయి’’ అని పీఎంఎస్ బజార్ అంచనా వేసింది. సంపద సృష్టిలో ఈ సాధనాలు ముఖ్య పాత్ర పోషిస్తాయని ‘పీఎంఎస్ బజార్’ నిర్వహించిన సదస్సులో భాగంగా వైట్ఓక్ క్యాపిటల్ మేనేజ్మెంట్ సీఈవో ఆశిష్ పీ సోమయ్య అభిప్రాయపడ్డారు. ఇటీవలి కాలంలో ప్రత్యామ్నాయ పెట్టుబడి సాధనాలు వేగంగా వృద్ధి చెందుతున్నట్టు ఎమ్కే ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్ సీఈవో వికాస్ ఎం సచ్దేవ చెప్పారు. రాబడులను పెంచుకోవడం, వైవిధ్యాన్ని విస్తృతం చేసుకోవడం వల్లే వీటికి ఆదరణ పెరుగుతున్నట్టు ఆయన విశ్లేషించారు. -
డిఫాల్ట్ నిబంధనలు మరింత కఠినం
ముంబై: రుణ చెల్లింపుల్లో వైఫల్యానికి సంబంధించిన వెల్లడి నిబంధనలను మార్కెట్ నియం త్రణ సంస్థ సెబీ కఠినతరం చేసింది. రైట్స్ ఇష్యూ ప్రక్రియ కాలాన్ని 55 రోజుల నుంచి 31 రోజులకు కుదించింది. అంతే కాకుండా పోర్ట్‌ఫోలియో మేనేజ్మెంట్ స్కీమ్(పీఎమ్ఎస్)కు సంబంధించి కనీస పెట్టుబడి మొత్తాన్ని ప్రస్తుతమున్న రూ. 25 లక్షల నుంచి రూ.50 లక్షలకు పెంచింది. ఈ మేరకు సెబీ బోర్డ్ బుధవారం తీసుకున్న నిర్ణయాల వివరాలను సెబీ చైర్మన్ అజయ్ త్యాగి వెల్లడించారు. వివరాలు.... డిఫాల్ట్ 30 రోజులకు మించితే.... స్టాక్ మార్కెట్లో లిస్టైన ఏదైనా కంపెనీ రుణ చెల్లింపుల్లో విఫలమై 30 రోజులు దాటితే, 24 గంటల్లోనే ఈ విషయాన్ని స్టాక్ ఎక్సే్చంజ్‌లకు వెల్లడించాల్సి ఉంటుంది. రుణాలకు సంబంధించి అసలు, వడ్డీ చెల్లింపులకు కూడా ఇది వర్తిస్తుంది. కంపెనీలకు సంబంధించిన సమాచారం వాటాదారులకు, ప్రజలకు మరింతగా అందుబాటులోకి తేవడం కోసమే సెబీ ఈ నిబంధనను తెచ్చింది. ఈ కొత్త వెల్లడి నిబంధనలు వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయి. రైట్స్ ఇష్యూ కాలం 31 రోజులకు కుదింపు.... రైట్స్ ఇష్యూ ప్రక్రియ కాలాన్ని సెబీ తగ్గించింది. ఈ ప్రక్రియ గతంలో 55 రోజుల్లో పూర్తయ్యేది. దీనిని 31 రోజులకు తగ్గించింది. అలాగే రైట్స్ ఇష్యూకు దరఖాస్తు చేసే అన్ని కేటగిరీల ఇన్వెస్టర్లు ఆస్బా (అప్లికేషన్స్ సపోర్టెడ్ బై బ్లాక్డ్ అమౌంట్)విధానంలోనే చెల్లింపులు జరపాల్సి ఉంటుంది. పీఎమ్ఎస్ కనీస పెట్టుబడి పెంపు.. పోర్ట్‌ఫోలియో మేనేజ్మెంట్ స్కీమ్(పీఎమ్ఎస్) నుంచి రిటైల్ ఇన్వెస్టర్లను దూరం చేయడమే లక్ష్యంగా పీఎమ్ఎస్ కనీస పెట్టుబడి పరిమితిని సెబీ పెంచింది. గతంలో రూ.25 లక్షలుగా ఉన్న పరిమితిని రూ.50 లక్షలకు పెంచింది. అంతే కాకుండా పోర్ట్‌ఫోలియో మేనేజర్ల నెట్‌వర్త్‌ను రూ.2 కోట్ల నుంచి రూ.5 కోట్లకు పెంచింది. ఈ నెట్‌వర్త్‌ను చేరుకోవడానికి పోర్ట్‌ఫోలియో మేనేజర్లకు మూడేళ్ల గడువును ఇచ్చింది. ఈ తాజా నిబంధనల కారణంగా మ్యూచువల్ ఫండ్స్‌ల్లో పెట్టుబడులు పెరుగుతాయని నిపుణుల అంచనా. వ్యాపార బాధ్యత నివేదిక... మార్కెట్లో లిస్టైన టాప్ 1,000 కంపెనీలు వార్షిక వ్యాపార బాధ్యత నివేదికను సెబీకి సమర్పించాలి. వాటాదారులతో సంబంధాలు, పర్యావరణ సంబంధిత అంశాలతో కూడిన ఈ నివేదికను ఈ కంపెనీలు సమర్పించాల్సి ఉంటుంది. ప్రస్తుతం టాప్ 500 కంపెనీలకే వర్తించే ఈ నిబంధన ఇప్పుడు టాప్ 1000 కంపెనీలకు వర్తించనున్నది. -
కౌంట్ వాళ్లది.. క్యాష్ మనది
ఉమెన్ ఫైనాన్స్ / పోర్ట్‌ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసు ఆర్థిక లక్ష్యాలను సాధించుకోవటానికి, ఉన్న సంపదను పెంపొందించుకోవడానికి వివిధ పెట్టుబడి మార్గాలైనటువంటి ఈక్విటీ, డెట్‌లలో పెట్టుబడి పెడుతూ ఉంటారు చాలామంది. కాని, వాటిమీద పూర్తి అవగాహన లేకపోతే తరచూ వాటిని చూసుకుంటూ, అవసరమైతే మార్పులు చేర్పులు చేసుకోవటానికి వీలు కుదరకపోవచ్చు. ఇలాంటి వారికోసమే పోర్ట్‌ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసు (పిఎంఎస్) ప్రారంభమయింది. ఈ సర్వీసు అందజేసే కంపెనీ సెబి (సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా)తో పోర్ట్‌ఫోలియో మేనేజర్‌గా రిజిస్టర్ చేసుకోవాలి. ఈ సర్వీసు పొందగోరే వ్యక్తులు ఎవరైనా సెబీతో రిజిష్టర్ అయిన పోర్ట్‌ఫోలియో మేనేజర్ వద్ద ఖాతాని ప్రారంభించవచ్చు. కనీస మొత్తం 25 లక్షలు మొదలుకుని ఎంత మొత్తానికైనా సర్వీసు పొందవచ్చు. ఈ సొమ్మును చెక్, ఆన్లైన్ ట్రాన్స్ఫర్ రూపేణా లేదా షేర్ల రూపేణా జమచేయవచ్చు. ఈ ఖాతాను రెండు రకాలుగా కలిగి ఉండవచ్చు.. 1. డిస్క్రెషనరీ పిఎంఎస్: ఈ పద్ధతిలో ఏయే పెట్టుబడి మార్గాలలో పెట్టుబడి పెట్టాలి అనేది ఫండ్ మేనేజర్ నిర్ణయిస్తారు. 2. నాన్ డిస్క్రెషనరీ పిఎంఎస్: ఈ పద్ధతిలో పోర్ట్‌ఫోలియో మేనేజర్ ఏయే పెట్టుబడి మార్గాలలో పెట్టుబడి పెడితే మంచిదో సూచనలిస్తారు. వాటిలో పెట్టాలా లేదా ఎప్పుడు పెట్టాలి అనేది ఖాతాదారుడు నిర్ణయించుకోవచ్చు. పోర్ట్‌ఫోలియో ఎలా ఉండాలి, ఏమేమి చార్జీలు వర్తిస్తాయి, ఎంత శాతం అనేది ఖాతాదారుడు, పోర్ట్‌ఫోలియో మేనేజర్ ఖాతా ప్రారంభించినప్పుడు రాసుకున్న రాసుకున్న అగ్రిమెంట్ ప్రకారం ఉంటాయి. సాధారణంగా రెండు రకాలైనటువంటి ఫీజును చార్జి చేస్తారు. పెట్టుబడులు నిర్వహించడానికి అయ్యే ఖర్చుని ఒక ఫిక్స్డ్ శాతంగానూ, రాబడి ఒక నిర్ణీత శాతం కన్నా ఎక్కువ వస్తే ఆ ఎక్కువ వచ్చిన రాబడి మీద కొంత శాతాన్ని ఫీజుగా చార్జి చేస్తారు. ఖాతాదారులు తప్పనిసరిగా డిమ్యాట్ ఖాతాను కలిగి ఉండాలి. డిస్క్రిషనరీ పద్ధతిలో ఖాతా ప్రారంభించేటప్పుడు ఒకవేళ ఖాతాదారుడు ఏవైనా షేర్లు కొనగూడదు అనుకున్నా, లేదా లార్జ్‌కాప్, మిడ్కాప్ మాత్రమే కొనాలి అని ఉన్నా, వాటిని అగ్రిమెంట్లో పొందుపరిచి వాటి ప్రకారం మేనేజ్ చేయమని చెప్పవచ్చు. ఎన్ఆర్ఐలు కూడా పిఎంఎస్ పద్ధతిలో పెట్టుబడులు పెట్టవచ్చు. ఇందుకోసం ఎన్ఆర్ఐలు పిఐఎస్ ఖాతాను ప్రారంభించవలసి ఉంటుంది. ఎన్ఆర్ఐలకి, రెసిడెంట్ ఇండియన్స్‌కి పిఎంఎస్ ఖాతాని ప్రారంభించడానికి అవసరమైన డాక్యుమెంట్స్ వేరుగా ఉంటాయి. పోర్ట్‌ఫోలియో మేనేజర్వద్ద ఉన్నటువంటి చెక్‌లిస్ట్ ఆధారంగా డాక్యుమెంట్స్ అందజేయాలి. ఈ పిఎంఎస్ ఖాతాలో ప్రతి ఒక్క ఖాతాదారుని పెట్టుబడులు వారి వారి లక్ష్యాలకు అనుగుణంగా నిర్వహించబడతాయి. ప్రతి ఆరు నెలలకొకసారి స్టేట్మెంట్ పొందవచ్చు. లేదా ఎప్పుడైనా పెట్టుబడులు పరిశీలించాలంటే పోర్ట్‌ఫోలియో మేనేజర్స్ స్టేట్మెంట్ అందజేస్తారు. కొంచెం పెద్దమొత్తంలో పెట్టుబడులు పెట్టాలనుకునేవారికి ఈ పిఎంఎస్ పద్ధతిలో పెట్టుబడులు పెట్టడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. - రజని భీమవరపు ఫైనాన్షియల్ ప్లానర్, ‘జెన్ మనీ’