నాకు ఏడు నుంచి ఎనిమిది వరకు ఆర్థిక లక్ష్యాలు ఉన్నాయి. ప్రతీ లక్ష్యానికి విడిగా పోర్ట్‌ఫోలియో ఉండాలా? అలా అయితే పర్యవేక్షణకు ఇబ్బంది కాదా? – దేవరాజ్ చౌదరి
లక్ష్యాలు, పోర్ట్‌ఫోలియో మధ్య సమతూకం ఉండాలి. ముందుగా సమీప కాలంలోని లక్ష్యాలను వేరు చేయండి. అలాగే, మధ్య కాలం, దీర్ఘకాల లక్ష్యాలను కూడా వేరు చేయండి. ఇప్పుడు స్వల్పకాల, మధ్యకాల లక్ష్యాల్లోనూ.. రాజీ పడతగ్గ, రాజీపడలేని అనే రెండు విభాగాలు చేయండి. రాజీపడలేని అంటే రిస్క్ విషయమని అర్థం చేసుకోవాలి. రిస్క్ తీసుకోలేని మధ్యకాలం వరకు లక్ష్యాల కోసం ఉద్దేశించిన పెట్టుబడులను ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ (స్థిరాదాయ/డె) సాధనాల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. వీటికోసం విభిన్న పోర్ట్‌ఫోలియోలను నిర్వహించాల్సిన అవసరం లేదు. ఈ పెట్టుబడుల కోసం ఈక్విటీలపై ఆధారపడకూడదు. అవసరమైనప్పుడు వెంటనే తీసుకునేందుకు అనుకూలంగా ఉండాలి. ఇక దీర్ఘకాలం కోసం ఉద్దేశించిన పెట్టుబడులను అంటే తదుపరి ఐదేళ్ల కాలం వరకు అవసరం లేని పెట్టుబడులను ఈక్విటీలకు కేటాయించుకోవాలి.
ప్రతీ లక్ష్యానికి విడిగా ఎంత చొప్పున కావాలి, ఎంత వ్యవధి ఉందనే దాని ఆధారంగా ఇన్వెస్ట్ చేసుకోవాలి. అంటే ఆయా సమయాల్లో మీ లక్ష్యానికి కావాల్సిన నగదు లభించేలా ప్రణాళిక ఉండాలి. ఉదాహరణకు వచ్చే మూడేళ్ల కాలంలో రూ.5 లక్షలు కావాలి, ఐదేళ్లలో రూ.5 లక్షల కావాలనుకుంటే లేదా 25–30 ఏళ్లలో రూ.కోటి రూపాయలు (రిటైర్మెంట్) కావాలనుకుంటే అందుకు అనుకూలంగా ప్రణాళిక రూపొందించుకోవాలి. వేర్వేరు పోర్ట్‌ఫోలియోలన్నవి కాలవ్యవధికి అనుగుణంగానే ఉండాలి.
స్వల్పకాల లక్ష్యాల కోసం ఫిక్స్‌డ్ ఇన్‌కమ్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఐదేళ్లకు మించిన ఏ లక్ష్యానికైనా డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్‌ను ఎంపిక చేసుకోవచ్చు. అప్పుడు లక్ష్యాల వారీగా కాకుండా, కాలవ్యవధి ఆధారంగా ప్రత్యేక పోర్ట్‌ఫోలియోలు ఉంటాయి. ఇందుకోసం వ్యాల్యూరీసెర్చ్ ఆన్‌లైన్‌లో ‘మై ఇన్వెస్ట్‌మెంట్’ టూల్‌ను వినియోగించుకోవచ్చు. ఒకటికి మించిన పథకాల్లో ఇన్వెస్ట్ చేసుకున్నప్పుడు వివిధ లక్ష్యాలకు అనుగుణంగా ఈ టూల్‌తో వేరు చేసుకోవచ్చు.
ఒకే విధమైన పనితీరు కలిగిన రెండు మ్యూచువల్ ఫండ్ పథకాల్లో నాకు పెట్టుబడులున్నాయి. లాభాలు స్వీకరించడం ద్వారా పెట్టుబడులను వెనక్కి తీసుకోవాలని అనుకుంటున్నాను. ఎగ్జిట్ లోడ్, మూలధన లాభాలు లేని పథకం ఏది? ఏ పథకం నుంచి వైదొలగాలి? – అరవింద్ కుమార్
ఈక్విటీ పథకాల్లో పెట్టుబడులను ప్రారంభించిన నాటి నుంచి ఏడాదిలోపు వెనక్కి తీసుకుంటే మూలధనలాభంలో 15 శాతం పన్ను చెల్లించాలి. ఏడాది తర్వాత తీసుకుంటే, లాభంలో 10 శాతం పన్ను చెల్లించాలి. దీర్ఘకాల మూలధన లాభం (ఏడాదికి మించిన పెట్టుబడులపై లాభం) మొదటి రూ.లక్షపై ఒక ఆర్థిక సంవత్సరంలో పన్ను ఉండదు. ఇవన్నీ చూసిన తర్వాతే ఏ పథకం అన్నది మీరే నిర్ణయించుకోండి. ఒకవేళ మార్కెట్లు పెరిగాయని లాభాలు తీసుకోవాలని అనుకుంటే అలా చేయవద్దు. పెట్టుబడులు వృద్ధి చెందాయనే లాభాలు తీసుకోవాలని చాలా మంది అనుకుంటుంటారు. ఈ తరహా ఆలోచనతో పెట్టుబడులను వెనక్కి తీసుకుని.. ఆ తర్వాత మార్కెట్లు పడిపోతే తిరిగి ఇన్వెస్ట్ చేయాలని వేచి చూస్తుంటారు. ఒకవేళ భారీ కరెక్షన్ చోటు చేసుకుంటే అప్పుడు ఇన్వెస్ట్ చేయకుండా, భయంతో మరింత కిందకు పడిపోతాయన్న ఆలోచనతో ఇన్వెస్ట్ చేయకుండా ఉండిపోతారు. అక్కడి నుంచి మార్కెట్లు 10–15 శాతం పెరిగిపోయిన తర్వాత మంచి అవకాశాన్ని కోల్పోయామని విచారిస్తుంటారు. మార్కెట్‌లో సరైన సమయంలో ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటే ఉండే రిస్క్ ఇదే. అందుకే డబ్బుతో అవసరం పడితేనే పెట్టుబడులను వెనక్కి తీసుకోండి.
- ధీరేంద్ర కుమార్, సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్
Comments
Please login to add a commentAdd a comment