రూ.1.5 కోట్లు వచ్చాయి.. ఎక్కడ ఇన్వెస్ట్‌ చేయాలి? | Equity Investment expert advice | Sakshi
Sakshi News home page

రూ.1.5 కోట్లు వచ్చాయి.. ఎక్కడ ఇన్వెస్ట్‌ చేయాలి?

Published Mon, Nov 11 2024 7:19 AM | Last Updated on Mon, Nov 11 2024 9:04 AM

Equity Investment expert advice

ఒక ప్రాపర్టీ అమ్మగా రూ.1.5 కోట్లు వచ్చాయి. వచ్చే 12 ఏళ్ల వరకు వీటితో నాకు అవసరం లేదు. కనుక వీటిని ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేద్దామని అనుకుంటున్నాను. నేను సహేతుక స్థాయిలో రిస్క్‌ తీసుకోగలను. ఏ తరహా మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాలు ఎంపిక చేసుకోవాలి? రూ.1.5 కోట్లను మొత్తం ఎన్ని నెలల కాలంలో ఈక్విటీల్లోకి మళ్లించాలి? నిఫ్టీ మిడ్‌క్యాప్‌ 150 ఇండెక్స్‌ మాదిరి ఇండెక్స్‌ ఫండ్స్‌ ఎంపిక చేసుకోవచ్చా?     – రాజన్‌

ప్రాపర్టీ అమ్మగా వచ్చిన రూ.1.5 కోట్లు.. మీ మొత్తం సంపద విలువలో 50–60 శాతంగా ఉంటే కనుక, ఇక్కడి నుంచి మూడేళ్ల కాలంలో ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేసుకోవాలి. మీరు ఇన్వెస్ట్‌ చేసిన వెంటనే మార్కెట్‌ ఓ పది శాతం మేర పడిపోతే అప్పుడు భావోద్వేగ పరమైన రిస్క్‌ సులభంగా అధిగమించేందుకు ఇలా చేయాలి. ఒకవేళ మీరు చెప్పిన రూ.1.5 కోట్లు మీ మొత్తం సంపదలో కేవలం 10–15 శాతంగానే ఉంటే అప్పుడు ఆరు నెలల నుంచి ఏడాది కాలంలో పలు వాయిదాలుగా ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు.

12 ఏళ్ల కాలం ఈక్విటీ పెట్టుబడులకు అనుకూలమైనది. కనుక మీ పెట్టుబడుల్లో 20–50 శాతం మేర మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్, మైక్రోకాŠయ్‌ప్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. అదే సమయంలో లార్జ్‌క్యాప్‌ ఫండ్స్‌కు ఎక్కువ మొత్తం కేటాయించుకోవడం వల్ల అనిశ్చిత సమయాల్లో పోర్ట్‌ఫోలియోకి స్థిరత్వం ఉంటుంది. నిఫ్టీ మిడ్‌క్యాప్‌ 150 ఇండెక్స్‌ ఫండ్‌ మంచి ఆప్షన్‌. ఇది ప్యాసివ్‌ పథకం.

కనుక నిఫ్టీ మిడ్‌క్యాప్‌ 150 ఇండెక్స్‌లోని కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేస్తుంది. యాక్టివ్‌గా పనిచేసే మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్‌ ఫండ్స్‌ను సైతం పరిగణనలోకి తీసుకోవచ్చు. యాక్టివ్, ప్యాసివ్‌ ఫండ్స్‌ మిశ్రమంగా ఉండడం పోర్ట్‌ఫోలియోకి మంచిది. సరైన యాక్టివ్‌ ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవడం కష్టంగా అనిపిస్తే, అప్పుడు ప్యాసివ్‌ ఫండ్స్‌కు పరిమితం కావొచ్చు.  

ఒకే సూచీని అనుసరించి పనిచేసే వివిధ ఇండెక్స్‌ ఫండ్స్‌ ఎన్‌ఏవీల్లో వ్యత్యాసం ఎందుకు ఉంటుంది?  
    – వేణుగోపాల్‌

ఒకే సూచీని అనుసరించి ఇన్వెస్ట్‌ చేసే వివిధ ఇండెక్స్‌ ఫండ్స్‌ అన్ని ఒకేసారి కాకుండా వివిధ సమయాల్లో ప్రారంభమవుతుంటాయి. ఉదాహరణకు 2000 సంవత్సరంలో ప్రారంభమైన ఇండెక్స్‌ ఫండ్‌ ఎన్‌ఏవీ.. 2022లో ప్రారంభమైన ఇండెక్స్‌ ఫండ్‌తో పోల్చితే 22 ఏళ్ల కాలం పాటు వృద్ధి చెందుతూ వచ్చింది. కనుక దీర్ఘకాలంగా పనిచేస్తున్న ఇండెక్స్‌ ఫండ్స్‌ ఎన్‌ఏవీ ఎక్కువగా ఉంటుంది. ఎన్‌ఏవీ రూ.10 అయినా లేక రూ.100 అయినా ఇండెక్స్‌ పనితీరు ఆధారంగానే రాబడులు ఉంటాయని అర్థం చేసుకోవాలి. 

ఇండెక్స్‌లో ఎంత శాతం మేర మార్పు వచ్చిందన్నదే ముఖ్యంగా చూడాలి కానీ, ఎన్‌ఏవీ కాదు. సెన్సెక్స్‌ 10 శాతం పెరిగితే అప్పుడు సెన్సెక్స్‌లో ఇన్వెస్ట్‌ చేసే వివిధ ఫండ్స్‌ ఎన్‌ఏవీ రూ.10, రూ.100గా ఉన్నప్పటికీ అవి కూడా 10 శాతమే పెరిగి ఉంటాయ్‌. కనుక ఎన్‌ఏవీతో సంబంధం లేకుండా ఇండెక్స్‌ ఆధారితంగా పథకం ఎన్‌ఏవీలో వృద్ధి ఉంటుంది.

ఇదీ చదవండి: పాన్‌ కార్డ్‌ కొత్త రూల్‌.. డిసెంబర్‌ 31లోపు తప్పనిసరి!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement