పన్ను ఎగవేతను పట్టించే చట్టాలివే.. తస్మాత్‌ జాగ్రత్త! | Understanding Tax Evasion and Penalties in India | Sakshi
Sakshi News home page

పన్ను ఎగవేతను పట్టించే చట్టాలివే.. తస్మాత్‌ జాగ్రత్త!

Published Mon, Oct 28 2024 8:14 AM | Last Updated on Mon, Oct 28 2024 8:14 AM

Understanding Tax Evasion and Penalties in India

పన్ను తప్పకపోవచ్చు. అలాంటప్పుడు కట్టడమే.. నాగరిక పౌరుల బాధ్యత. కట్టాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు పన్ను చెల్లించకపోవడమే ‘ఎగవేత’. ఈ ‘ఎగవేత’ సముద్రంలో ఎందరో గజ ఈతగాళ్లను ఏరిపారేసిన చట్టాలున్నాయి. దాని ఊసెత్తకండి. ఎన్నెన్నో మార్గాలు.

ఆదాయాన్ని చూపించకపోవడం, ఆదాయం తక్కువ చేయడం, పన్ను చెల్లించకపోవటం, తప్పుడు లెక్కలు చూపడం, లెక్కలు రాయకపోవడం, స్మగ్లింగ్, దొంగ కంపెనీలు, తప్పుడు బిల్లులు, బ్లాక్‌ వ్యవహారాలు .. ఇలా శతకోటి మార్గాలు. కొన్ని పరిశ్రమ రంగాల్లో అవకాశం ‘ఎండమావి’లాగా ఎదురుచూస్తుంది. సినిమా రంగం, రియల్‌ ఎస్టేట్, కొన్ని వస్తువుల ఉత్పత్తిలో, బంగారంలో, షేరు మార్కెట్, వ్యవసాయం, బెట్టింగ్, పందాలు, అస్తవ్యస్తమైన రంగాలు.. ఇలా ఎన్నో. చట్టాన్ని అనుసరించడానికి ఒకే మార్గం. రాచమార్గం ఉంటుంది. అతిక్రమించడానికి అన్నీ అడ్డదార్లే.

ఆదాయపు పన్ను చట్టం ప్రకారం.. 
1.    తనిఖీ చేయడం 
2.    సమన్లు ఇవ్వటం 
3.    పిలిచి ఎంక్వైరీ చేయడం 
4.    సెర్చ్‌ 
5.    సీజ్‌ చేయడం 
6.    సర్వే చేయడం 
7.    ఇతరులను కూడా ఎంక్వైరీ చేయడం 
8.    సాక్ష్యాలను సేకరించటం 
9.    పన్ను కట్టించడం (కక్కించడం) 
10. వడ్డీ, రుసుములు, పెనాల్టీ విధించడం 
11. జైలుకి పంపడం 
ఇలా ఎన్నో విస్తృత అధికారాలు ఉన్నాయి.

బినామీ వ్యవహారాల చట్టం.. 
ఇది సునామీలాంటి చట్టం. బినామీ వ్యవహారాల ద్వారా పన్ను ఎగవేత చేస్తుంటారు. ఈ చట్టం ప్రకారం అధికార్లకు నోటీసులు ఇవ్వడం, ఎంక్వైరీలు, వ్యవహారంలో ఉన్న ఆస్తులను జప్తు చేయడం మొదలైన అధికారాలు ఉన్నాయి. 
ఫారిన్‌ ఎక్స్చేంజ్‌ మేనేజ్‌మెంట్‌ చట్టం ప్రపంచంలో జరిగే వ్యవహారాల మీద నిఘా ఉంటుంది. విదేశీయులతో వ్యవహారాలు, ఎక్స్చేంజ్‌ వ్యవహారాలు, అనుమతులు లేకుండా ఆస్తుల సేకరణ, ఆస్తులను ఉంచుకోవడం, వ్యవహారాలు చేయడం, వాటి ద్వారా లబ్ధి పొందడం .. ఇలాంటి వాటిపై అధికార్ల వీక్షణం తీక్షణంగా ఉంటుంది. అన్యాయంగా వ్యవహారాలు చేస్తే, తప్పులు చేస్తే ఉపేక్షించదు ఈ చట్టం. అతిక్రమణ జరిగితే ‘అంతే సంగతులు’ .. శంకరగిరి మాన్యాలు పట్టాల్సిందే.

మనీలాండరింగ్‌కి సంబంధించిన చట్టం.. 
అక్రమంగా పొందిన డబ్బుని  దాచి.. కాదు దోచి.. దాని మూలాలను భద్రపర్చి.. పన్ను కట్టకుండా.. లెక్కలు చూపకుండా .. దానికి ‘లీగల్‌’ రంగు పూసే ప్రయత్నమే మనీలాండరింగ్‌. ఈ ప్రక్రియ చట్టవిరుద్ధం. ఇందులో ఎందరో బడాబడా బాబులు ఇరు క్కుని జైలు పాలయ్యారు. హవాలా వ్యవహారాలు మొదట్లో హల్వాలాగా ఉంటాయి. హలీంలాగా నోట్లో కరిగిపోతాయి. కానీ అవి చాలా డేంజర్‌. అలవాట్లకు బానిస అయి, తాత్కాలిక ఆర్థిక ఒత్తిళ్లకు తలవంచి ‘లంచావతారం’గా మారిన వారు ఉద్యోగాలు కోల్పోయి.. ఉనికినే కోల్పోయారు. కాబట్టి, సారాంశం ఏమిటంటే ‘ఎండమావి’ భ్రమలో పడకండి. చక్కటి ప్లానింగ్‌ ద్వారా చట్టప్రకారం సరైన దారిలో వెళ్లే ప్రయత్నం చేయండి.

పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.comకు ఈ–మెయిల్‌ పంపించగలరు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement