
నగరాలలో పొట్టకూటి కోసం చిరుద్యోగాలు చేసుకునే కష్టజీవులు చాలా మంది కనిపిస్తారు. వీరిలో ముఖ్యంగా ఈ-కామర్స్ సంస్థలకు డెలివరీ ఏజెంట్లుగా పనిచేస్తూ పొట్టపోసుకునేవారే ఎక్కువ. రోజంతా రోడ్లపై తిరుగుతూ కష్టపడితే పదో పాతికో సంపాదిస్తారు. వీళ్లనే టార్గెట్ చేశారు బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు. చిన్న చిన్న ఉల్లంఘనల పేరుతో జరిమానాల రూపంలో లక్షల రూపాయలు పిండేశారు.
నిబంధనలు ఉల్లంఘించే ఈ-కామర్స్ వాహనాలపై ట్రాఫిక్ పోలీసులు శనివారం (మార్చి 1) స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. మొత్తం 1,859 మంది నుంచి జరిమానాల రూపంలో రూ.9.6 లక్షలు వసూలు చేశారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించేలా చూడటం రహదారి భద్రతను మెరుగుపరచడం లక్ష్యంగా, ఈ-కామర్స్ డెలివరీ వాహనాల ద్వారా పెరుగుతున్న ట్రాఫిక్ ఉల్లంఘనలను పరిష్కరించే విస్తృత ప్రయత్నంలో భాగంగా ఈ డ్రైవ్ చేపట్టినట్లు పోలీసులు చెబుతున్నారు.
స్పెషల్ డ్రైవ్ లో ఎక్కువగా ఈ-బైకులే నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్టు గుర్తించామని జాయింట్ పోలీస్ కమిషనర్ (ట్రాఫిక్) ఎంఎన్ అనుచేత్ తెలిపారు. ఈ వాహనాలు ఎక్కువగా మైక్రో మొబిలిటీ వాహనాలు, వాటి వినియోగదారులకు నిబంధనలు తెలియవు. మైక్రో మొబిలిటీ వాహనాలకు రిజిస్ట్రేషన్ నంబర్లు లేవని, వాటి వినియోగదారులు హెల్మెట్ ధరించాల్సిన అవసరం లేదని ట్రాఫిక్ పోలీసు ఉన్నతాధికారి ఒకరు వివరించారు.
చిరు ఉల్లంఘనలు
ఫుట్ పాత్ లపై ప్రయాణించినందుకు 79 మంది, నో ఎంట్రీ నిబంధనను ఉల్లంఘించినందుకు 389 మంది, వన్ వేకు విరుద్ధంగా ప్రయాణించినందుకు 354 మంది, సిగ్నల్ జంప్ చేసినందుకు 209 మంది, హెల్మెట్ ధరించనందుకు 582 మంది, రాంగ్ పార్కింగ్ చేసినందుకు 98 మంది, ట్రాఫిక్ కు ఆటంకం కలిగించినందుకు 148 మందిని పోలీసులు పట్టుకున్నారు. అక్కడికక్కడే జరిమానా చెల్లించేందుకు తమ వద్ద డబ్బులు లేవని రైడర్లు చెప్పడంతో పోలీసులు 794 వాహనాలకు నోటీసులు జారీ చేశారు.
అవగాహన లేమి
చాలా మంది రైడర్లు తమకు నిబంధనలపై అవగాహన లేదని చెప్పడంతో, వారికి గంటకు పైగా ఆయా పరిధుల్లో రూల్ ట్రైనింగ్ ఇచ్చినట్లు అనుచేత్ తెలిపారు. ఈ-కామర్స్ కు అనుబంధంగా ఉన్న ఎల్లోబోర్డు వాహనాలను ట్రాఫిక్ పోలీసులు టార్గెట్ చేస్తున్నారనే ప్రచారం జరిగింది. అయితే దీన్ని పోలీసులు ఖండించారు. వాహనం నంబర్ ప్లేట్ రంగుతో సంబంధం లేకుండా ఈ-కామర్స్ డెలివరీ కోసం ఉపయోగించే అన్ని రకాల వాహనాలు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినట్లు కేసులు నమోదు చేసినట్లు అనుచేత్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment