సంపద వృద్ధికి మెరుగైన అవకాశాల కోసం చిన్న పట్టణాల్లోని వారు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో వెల్త్ మేనేజ్‌మెంట్ సేవల్లోని కంపెనీలు టైర్–2, 3 పట్టణాల వైపు చూస్తున్నాయి. సాధారణంగా చిన్న పట్టణాల్లోని అధిక ధనవంతులు (హెచ్‌ఎన్‌ఐలు) సంప్రదాయ సాధనాలైన బంగారం, రియల్ ఎస్టేట్‌లో ఎక్కువగా పెట్టుబడులు పెడుతుంటారు. ఇప్పుడు బంగారం, రియల్టీ కాకుండా ఇతర సాధనాల్లోకి తమ పెట్టుబడులను విస్తరించుకోవాలని అనుకుంటున్నారు. ఈ ధోరణి వెల్త్ మేనేజ్‌మెంట్ సేవలకు డిమాండ్‌ను తెస్తోంది.
ముఖ్యంగా కరోనా తర్వాత చిన్న పట్టణాల్లో కొన్ని వ్యాపారాలకు కొత్త జీవం రావడాన్ని వెల్త్ మేనేజర్లు ప్రస్తావిస్తున్నారు. సంపద నిర్వహణ సేవలు అందించే సంస్థలు (వెల్త్ మేనేజ్‌మెంట్ కంపెనీలు) ఆర్థిక ప్రణాళిక, పన్నుల కు సంబంధించిన సలహాలు, ఎస్టేట్ ప్లానింగ్ వంటి ఎన్నో సేవలు అందిస్తుంటాయి. ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజరీ, పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్ సంస్థలతో పోలిస్తే వెల్త్ మేనేజ్‌మెంట్ కంపెనీలు విస్తృతమైన సేవలను ఆఫర్ చేస్తుంటాయి. అధిక శాతం మంది వెల్త్ మేనేజర్లు కనీసం రూ.కోటి నుంచి రూ.25 కోట్ల వరకు పెట్టుబడుల నిర్వహణ చూస్తుంటారు.
కరోనా తర్వాతే..
కరోనా ముందు నాటికి మా మొత్తం క్లయింట్లలో ద్వితీయ శ్రేణి పట్టణాల్లోని క్లయింట్లు 17 శాతంగా ఉంటే, ఇప్పుడు 22 శాతానికి పెరిగినట్టు ఆస్క్ ప్రైవేటు వెల్త్ వెల్లడించింది. ద్వితీయ శ్రేణి పట్టణాల్లోని ఈ సంస్థ క్లయింట్ల ఆస్తులు 13 శాతం నుంచి 22 శాతానికి చేరాయి. నువమా వెల్త్ క్లయింట్లలోనూ కరోనా ముందు టైర్–2 నుంచి 15 శాతంగా ఉంటే, కరోనా తర్వాత 20 శాతానికి పెరిగారు. ద్వితీయ శ్రేణి పట్టణాల్లోనూ ప్రైవేటు వెల్త్ మేనేజ్‌మెంట్ సేవలు విస్తరించడానికి ఎక్కువ సంస్థలు ఈ రంగంలోకి ప్రవేశిస్తుండడం కూడా ఒక కారణంగా చెప్పుకోవాలి.
మరిన్ని సంస్థలు రావడంతో అవి ఎక్కువ మంది ధనవంతులను చేరుకోగలుగుతున్నాయి. దేశవ్యాప్తంగా సేవల విస్తరణకు కొన్ని సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. ‘‘కరోనా తర్వాత స్పెషాలిటీ కెమికల్స్ గొప్ప పనితీరు చూపించింది. దీంతో ప్రమోటర్లకు, ఈ వ్యాపారాల్లో ఉన్న వారి సంపద పెరిగింది. ద్వితీయ శ్రేణి పట్టణాల్లోని వారికి ఖర్చు చేయగల ఆదాయం అసాధారణంగా పెరిగింది’’అని మోతీలాల్ ఓస్వాల్ ప్రైవేటు వెల్త్ డైరెక్టర్ జయేష్ ఫరీదా వివరించారు.
అంతేకాదు చిన్న పట్టణాల్లో స్టార్టప్‌లు ఏర్పాటు అవుతుండడాన్ని వెల్త్ మేనేజర్లు గుర్తు చేస్తున్నారు. 50 శాతం స్టార్టప్‌లు టైర్–2, 3 పట్టణాల నుంచి ఉన్నాయని 2022 మార్చిలో కేంద్ర సర్కారు పార్లమెంటుకు తెలియజేయడం గమనార్హం. ‘‘టైర్–2, 3 పట్టణాల్లో మౌలిక సదుపాయాలు మెరుగు పడుతున్నాయి. దీంతో వ్యాపారాల నిర్వహణ సులభంగా మారుతోంది. పన్ను మినహాయింపులు, సబ్సిడీలు, ప్రోత్సాహకాలతో ప్రభుత్వం నుంచి మద్దతు కూడా తోడయింది’’అని నువమా ప్రైవేట్ ప్రెసిడెంట్ అలోక్ సైగల్ పేర్కొన్నారు.
మెరుగైన రాబడుల కోసం..
చిన్న పట్టణాల్లో హెచ్‌ఎన్‌ఐలు పెరగడం ఒక్కటే కాకుండా, కరోనా తర్వాత పరిస్థితుల్లో వచ్చిన మార్పులను వెల్త్ మేనేజర్లు ప్రస్తావిస్తున్నారు. సంప్రదాయ సాధనాలైన బ్యాంక్ ఎఫ్‌డీలపై రాబడులు కనిష్ట స్థాయికి చేరడం ఇందులో ఒకటిగా ఉంది. కరోనా మహమ్మారి తర్వాత ఆర్‌బీఐ వడ్డీ రేట్లను కనిష్ట స్థాయికి తగ్గించడం గుర్తుండే ఉంటుంది. అంతేకాదు ఈ మహమ్మారి కారణంగా రియల్ ఎస్టేట్ మార్కెట్ కూడా డల్‌గా మారింది. ఇది ఈక్విటీ, ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ తదితర సాధనాల వైపు చూసేలా చేసినట్టు చెబుతున్నారు.
తమ కొత్త క్లయింట్లలో ఎక్కువ మంది ఇంత కాలం బంగారం, ఎఫ్‌డీలు, రియల్ ఎస్టేట్ మినహా మరో సాధనంలో పెట్టుబడులు పెట్టని వారేనని వెల్త్ మేనేజర్లు వెల్లడించారు. ఆనంద్‌రాఠి వెల్త్ మేనేజ్‌మెంట్ కరోనా ముందు టైర్–2 పట్టణాల క్లయింట్లకు సంబంధించి రూ.814 కోట్ల ఆస్తులను నిర్వహిస్తుండగా, కరోనా అనంతరం రూ.3,500 కోట్లకు పెరిగిపోయాయి. జో«ద్‌పూర్,, నాగ్‌పూర్ తదితర పట్టణాల్లో వ్యాపారం రెట్టింపైది.
దీంతో టికెట్ సైజు (పెట్టుబడి మొత్తం) తక్కువగా ఉన్నా, వెల్త్ మేనేజ్ మెంట్ కంపెనీలు చిన్న పట్టణాలపైనా ప్రత్యేక దృష్టి సారించాయి. 2022లో వెల్త్ మేనేజ్‌మెంట్ సేవలు ప్రారంభించిన ఎప్సిలాన్ మనీ తన క్లయింట్లలో 70 శాతం టైర్ 2, 3 పట్టణాలకు చెందిన వారేనని వెల్లడించింది. ‘‘చాలా మంది క్లయింట్లు సంప్రదాయ సాధనాలతోపాటు, వ్యాపారాలకే పెట్టుబడులు పరిమితం చేసుకుంటున్నారు. వ్యాపారాలు, రియల్ ఎస్టేట్, బంగారం, ఎఫ్‌డీలు కాకుండా ఇతర సాధనాల పట్ల వారిలో అవగాహన కలి్పంచాల్సిన అవసరం ఉంది’’అని ఆస్క్ ప్రైవేటు వెల్త్ ఎండీ రాజేష్ సలూజా అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment