కోట్ల రూపాయలు లాటరీ (lottery) గెలిస్తే ఎంత ఆనందం కలుగుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎగిరి గంతులేస్తాం. ఆ ఊహే గాల్లో తేలేలా చేస్తుంది కదూ.. మరి తీరా కోట్ల రూపాయలు చేతికి అందుతున్నాయన్న తరుణంలో తూచ్.. టికెట్ తిరిగి ఇచ్చేయండి అంటే.. పాపం ఇలాంటి పరిస్థితే చైనాలో (China) ఓ ఉద్యోగికి ఎదురైంది.
2019 మార్చిలో చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్‌లోని నింగ్‌బోలో ఒక కంపెనీ వార్షిక సంవత్సరాంతపు పార్టీని నిర్వహించింది. వేడుకలో మరింత ఉత్సాహాన్ని నింపేందుకు ఉద్యోగులకు 500 లాటరీ టిక్కెట్‌లను పంపిణీ చేసింది. అందులో ఒక టిక్కెట్టుకు 6 మిలియన్ యువాన్లు (సుమారు రూ.7.14 కోట్లు) అత్యధిక బహుమతి లభించింది. అయితే ఆ టికెట్‌ను కంపెనీ వెనక్కితీసేసుకుంది.
అంతా కంపెనీల మాయ!
ఇది పాత సంఘటనే అయినా స్ప్రింగ్ ఫెస్టివల్ సమీపిస్తున్న సమయంలో చైనీస్ సోషల్ మీడియాలో మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ సమయంలో చాలా కంపెనీలు ఇలాంటి ఈవెంట్‌లను నిర్వహిస్తుంటాయి. క్షీణిస్తున్న లాటరీ టిక్కెట్ల అమ్మకాలను పెంచడానికే కొన్ని కంపెనీలు ఇలా ఈవెంట్లు నిర్వహించి లాటరీలపై ఆసక్తిని పెంచే ప్రయత్నం చేస్తున్నాయని కొంతమంది ఆరోపిస్తున్నారు.
ఉద్యోగి లాటరీ గెలిచారన్న వార్తలు చాలా మంది దృష్టిని ఆకర్షించాయి. అనేక మంది ఉద్యోగులు తమ ఉత్సాహాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఉద్యోగి గెలిచిన లాటరీ టికెట్‌ను వెనక్కితీసుకున్న కంపెనీ వైఖరి పండుగ వేడుకల సందర్భంగా కార్పొరేట్ విధానాలు, ఉద్యోగుల హక్కుల గురించి చర్చలకు దారితీసింది.
ఏం జరిగిందంటే..
ఉద్యోగుల్లో ఉత్సుకతను రేకెత్తించేందుకు సదరు కంపెనీ స్థానిక మార్కెట్‌లో 500 లాటరీ టికెట్లు కొనుగోలు చేసి ఉద్యోగులకు పంపిణీ చేసింది. అందులో ఒక టికెట్‌కు జాక్‌పాట్ తగిలింది. కానీ ఆ టికెట్ తిరిగి ఇచ్చేయాలని ఉద్యోగిని కోరింది. దీంతో ఈవెంట్‌లో ఉన్న వారంత షాక్‌కు గురయ్యారు. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనం ప్రకారం.. గెలుపొందిన లాటరీ టికెట్ తిరిగి ఇచ్చేందుకు నిరాకరించడంతో ఈ వివాదం అధికారుల వద్దకు వెళ్లింది.
అవకతవకల ఆరోపణలు
ఈవెంట్‌కు జరిగిన రెండు రోజుల ముందు లాటరీ డ్రా జరిగిందని అంతర్గత వ్యక్తులు వెల్లడించడంతో మరింత వివాదం తలెత్తింది. వార్షిక పార్టీలో గెలిచిన టిక్కెట్‌లను పంపిణీ చేసే ముందు వాటిని తొలగించాలని కంపెనీ ఫైనాన్స్ బృందానికి సూచించిందని ఆరోపణలు వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment