భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో (Bharat mobility expo 2025)వివిధ కంపెనీల నుంచి నూతన ఎలక్ట్రిక్ వాహనాలు కొలువుదీరాయి. వియత్నాంకు చెందిన విన్‌ఫాస్ట్ ఆటో భారత్‌కు ఎంట్రీ ఇస్తున్నట్టు ప్రకటించింది. వీఎఫ్–7, వీఎఫ్–6 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను ఆవిష్కరించింది. ఈ ఏడాది చివరినాటికి వీటిని మార్కెట్లోకి తేనున్నట్టు తెలిపింది. తమిళనాడులోని ట్యూటికోరిన్ వద్ద 500 మిలియన్ డాలర్ల పెట్టుబడితో తయారీ కేంద్రం స్థాపించనున్నట్టు వెల్లడించింది. ఈ ఏడాది రెండవ అర్ద భాగంలో ఈ ప్లాంటు రెడీ అవుతుందని విన్‌ఫాస్ట్ ఆసియా సీఈవో పామ్ సాన్ ఛావ్ తెలిపారు.
హ్యుండై టీవీఎస్ జోడీ
హ్యుండై మోటార్ కంపెనీ, టీవీఎస్ మోటార్ కంపెనీ చేతులు కలిపాయి. అధునాతన ఎలక్ట్రిక్ త్రీ–వీలర్లు, చిన్న ఫోర్–వీలర్లను అభివృద్ధి చేసే లక్ష్యంతో భాగస్వామ్యాన్ని అన్వేషించనున్నట్లు ప్రకటించాయి. ఈ సందర్భంగా హ్యుండై తన మైక్రో మొబిలిటీ కాన్సెప్ట్ ఈవీలను ఆవిష్కరించింది. ఈ భాగస్వామ్యం కార్యరూపం దాలిస్తే డిజైన్, ఇంజనీరింగ్, సాంకేతిక నైపుణ్యాన్ని అందించాలని హ్యుండై యోచిస్తోంది. అయితే భారత్‌లో ఈ వాహనాల తయారీ, మార్కెటింగ్‌పై టీవీఎస్ దృష్టి పెడుతుంది.
కొలువుదీరిన ఎంజీ మోడళ్లు
జేఎస్‌డబ్లు్య ఎంజీ మోటార్ ఇండియా మజెస్టర్ పేరుతో మధ్యస్థాయి ఎస్‌యూవీని ఆవిష్కరించింది. కాంపాక్ట్ కార్స్ కంటే పెద్దగా, పూర్తి స్థాయి కార్స్ కంటే చిన్నగా ఉంటుందని కంపెనీ తెలిపింది. అంతర్జాతీయంగా అందుబాటులో ఉన్న ఐఎం5, ఐఎం6, ఎంజీ హెచ్‌ఎస్, ఎంజీ7 ట్రోఫీ ఎడిషన్ మోడళ్లను సైతం కంపెనీ ప్రదర్శించింది.
మోంట్రా ఎలక్ట్రిక్ కొత్త మోడళ్లు
మురుగప్ప గ్రూప్ కంపెనీ మోంట్రా ఎలక్ట్రిక్ రెండు కొత్త వాహనాలను లాంచ్ చేసింది. ఈవియేటర్ పేరుతో చిన్న తరహా వాణిజ్య వాహనాన్ని, సూపర్ కార్గో పేరుతో త్రీవీలర్‌ను ఆవిష్కరించింది. ఒకసారి చార్జింగ్‌తో ఈవియేటర్ 245 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఢిల్లీ ఎక్స్‌షోరూంలో ధర రూ.15.99 లక్షలు. సూపర్ కార్గో ఈ–త్రీవీలర్ 200 కిలోమీటర్లపైగా పరుగెడుతుంది. పూర్తి ఛార్జింగ్ కోసం 15 నిమిషాలు సమయం తీసుకుంటుంది. ఢిల్లీ ఎక్స్‌షోరూంలో ధర రూ.4.37 లక్షలు. కంపెనీ 55 టన్నుల హెవీ కమర్షియల్ ఎలక్ట్రిక్ ట్రక్ రైనో సైతం ప్రదర్శించింది.
బీవైడీ సీలయన్–7..
చైనాకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల దిగ్గజం బీవైడీ భారత్‌లో సీలయన్–7 కూపే–ఎస్‌యూవీ ఆవిష్కరించింది. కంపెనీ నుంచి ఇది భారత మార్కెట్లో నాల్గవ మోడల్‌గా నిలవనుంది. 82.5 కిలోవాట్ అవర్ బ్యాటరీ పొందుపరిచారు. ఒకసారి చార్జింగ్ చేస్తే వేరియంట్‌నుబట్టి 542–567 కిలోమీటర్లు పరుగెడుతుంది. గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని పర్ఫామెన్స్ వేరియంట్ 4.5 సెకన్లలో, ప్రీమియం వేరియంట్ 6.7 సెకన్లలో అందుకుంటుంది.
ఒలెక్ట్రా బ్లేడ్ బ్యాటరీ ఛాసీ..
హైదరాబాద్ కంపెనీ ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో వేదికగా 12 మీటర్ల పొడవున్న బ్లేడ్ బ్యాటరీ ఛాసీని ఆవిష్కరించింది. 9 మీటర్ల పొడవున్న సిటీ బస్, 12 మీటర్ల పొడవుతో కోచ్ బస్ సైతం ప్రదర్శించింది. బ్లేడ్ బ్యాటరీ ఒకసారి చార్జింగ్‌తో 500 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది. 2024 సెప్టెంబర్ 30 నాటికి 2,200లకుపైగా యూనిట్ల ఎలక్ట్రిక్ బస్‌లను సరఫరా చేసి ప్రజా రవాణా రూపు రేఖలను మార్చినట్టు ఒలెక్ట్రా సీఎండీ కె.వి.ప్రదీప్ తెలిపారు.
అశోక్ లేలాండ్ సాథీ
వాణిజ్య వాహనాలు, బస్‌ల తయారీ దిగ్గజం అశోక్ లేలాండ్ సాథి పేరుతో తేలికపాటి చిన్న వాణిజ్య వాహనాన్ని ఆవిష్కరించింది. అత్యాధునిక ఎల్‌ఎన్‌టీ సాంకేతికతతో తయారైంది. 45 హెచ్‌పీ పవర్, 110 ఎన్‌ఎం టార్క్ అందిస్తుంది. 1,120 కిలోల బరువు మోయగలదు. ధర రూ.6.49 లక్షలు. అలాగే మల్టీ యాక్సెల్, ఫ్రంట్ ఇంజన్, 15 మీటర్ల పొడవున్న గరుడ్–15 ప్రీమియం బస్ సైతం కొలువుదీరింది. 42 స్లీపర్ బెర్తులను ఈ బస్‌లో ఏర్పాటు చేశారు. కాగా, ఈ–టిరాన్ పేరుతో ఎలక్ట్రిక్ పోర్ట్ టెర్మినల్ ట్రాక్టర్‌ను సైతం కంపెనీ ఆవిష్కరించింది.
మైక్రో మొబిలిటీతో బజాజ్?
స్విట్జర్లాండ్‌కు చెందిన మైక్రో మొబిలిటీ సిస్టమ్స్‌లో వాటాను కొనుగోలు చేయడంతో సహా ఎలక్ట్రిక్ క్వాడ్రిసైకిళ్లను ఉత్పత్తి, ఎగుమతి చేయడానికి వ్యూహాత్మక భాగస్వామ్యం కోసం బజాజ్ ఆటో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. మైక్రోలీనో పేరుతో రెండు సీట్ల ఎలక్ట్రిక్ క్వాడ్రిసైకిల్‌ను, అలాగే మైక్రోలెటా పేరుతో మూడు చక్రాల ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మైక్రో మొబిలిటీ తయారు చేస్తోంది. నగరాల్లో తక్కువ దూరం ప్రయాణానికి అనువైన వాహనాల తయారీలో మైక్రో మొబిలిటీ సిస్టమ్స్‌కు పేరుంది.
జేబీఎం ఎలక్ట్రిక్ కొత్త వాహనాలు
జేబీఎం ఎలక్ట్రిక్ వెహికిల్స్ ఎక్స్‌పో వేదికగా గెలాక్సీ లగ్జరీ కోచ్, ఎక్స్‌ప్రెస్ ఇంటర్‌సిటీ బస్, లో ఫ్లోర్ మెడికల్ మొబైల్ యూనిట్ ఈ–మెడిలైఫ్, దేశంలో తొలిసారిగా 9 మీటర్ల పొడవున్న టార్మాక్ కోచ్ ఈ–స్కైలైఫ్‌ను విడుదల చేసింది. లిథియం–అయాన్ బ్యాటరీలు కలిగిన ఈ వాహనాలకు ఆల్ట్రా ఫాస్ట్ చార్జింగ్ సదుపాయం ఉంది. ఇప్పటికే కంపెనీ భారత్‌తోపాటు యూరప్, పశ్చిమాసియా, ఆఫ్రికా దేశాల్లో 1,800 ఎలక్ట్రిక్ బస్‌లను విక్రయించింది. 10,000 పైచిలుకు ఈ–బస్‌లకు ఆర్డర్ బుక్ ఉందని జేబీఎం గ్రూప్ వైస్ చైర్మన్ నిశాంత్ ఆర్య తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment