concepts
-
ట్యాక్స్ ప్లానింగ్.. సరిగమపదని..
‘హమ్మయ్య’ అని ఊపిరి పీల్చుకోండి. ’ఎగవేత’ భూతం ’కబంధ’ హస్తాల నుంచి బైటపడ్డాం. ఇప్పుడు ట్యాక్స్ ప్లానింగ్ మీద దృష్టి సారించి, ప్లానింగ్ రాగాల్లో స,రి,గ,మ,ప,ద,ని తెలుసుకుందాం. గత దశాబ్దంగా మనం వింటున్న పదం.. జనాలు నలుగురు మెచ్చిన పదం ’మేనేజ్మెంట్’.. కేవలం కంపెనీలు, కార్పొరేట్లు, వ్యాపారం, వాణిజ్య రంగాల్లోనే కాకుండా అన్ని రంగాల్లో ’మేనేజ్మెంట్’ కంపల్సరీ. సంస్థలతో బాటు వ్యక్తులకు, మనందరికీ వర్తించేది ’మేనేజ్మెంట్’. ట్యాక్స్‌ని మేనేజ్ చేయాలి. ట్యాక్స్ మేనేజ్మెంట్లో ముఖ్యమైన ప్రాథమిక అంశం, కీలకాంశం ’ట్యాక్స్ ప్లానింగ్’. ఇది క్రియాశీలక చర్య .. చర్చ!ఇదీ చదవండి: ఐటీ శాఖ కొత్త వార్నింగ్.. రూ.10 లక్షల జరిమానాచట్టరీత్యా, రాచమార్గంలో పన్నుభారాన్ని తగ్గించే మార్గం. అవసరం అయినంత, అర్హత ఉన్నంత .. అన్ని ప్రయోజనాలు, తగ్గింపులు, మినహాయింపులు పొంది, ఆదాయాన్ని తగ్గించుకోవడం లేదా పెద్ద శ్లాబు నుంచి తక్కువ/చిన్న శ్లాబుకి తెచ్చుకోవడం, 30 శాతం నుంచి 20 శాతానికి, 20 శాతం నుంచి 10 శాతానికి, ఇంకా 10 శాతం నుంచి సున్నా శాతానికి తగ్గించుకోవడం.ట్యాక్స్ ప్లానింగ్ మూడు రకాలుగా ఉంటుంది. స్వల్పకాలికం.. అంటే ఆ సంవత్సరానికి పన్ను తగ్గించుకోవడం. దీర్ఘకాలికం.. అంటే భవిష్యత్‌లో పన్నుని తగ్గించుకోవడం. మూడోది, విరాళాల ద్వారా తగ్గించుకోవడం.పన్ను తగ్గించుకోవడం: స్వల్పకాలికంగా గానీ దీర్ఘకాలికంగా గానీ పన్నులను తగ్గించుకోవడం.పోస్ట్‌పోన్ చేసుకోవడం: ఈ విధంగా ఎప్పుడు చేసుకోవచ్చంటే.. బడ్జెట్‌కు ముందు.. ముఖ్యంగా క్యాపిటల్ గెయిన్స్ విషయంలో మార్చి 31 లోపల లేదా ఏప్రిల్ 1 తర్వాత.. స్థిరాస్తుల క్రయవిక్రయాలు ఇలా పోస్ట్‌పోన్ చేసుకోవచ్చు.పన్ను భారాన్ని విభజించుట: ఒకే మనిషి మీద ఎక్కువ ట్యాక్స్ పడే పరిస్థితుల్లో ఆదాయాన్ని చట్టప్రకారం అగ్రిమెంట్ల ద్వారా ఆదాయాన్ని విభజించడం. ఉదాహరణకు ఆలుమగలు వారి పేరు మీద ఫిక్సిడ్ డిపాజిట్లను మార్చి వడ్డీ సర్దుబాటు చేసుకోవచ్చు.తప్పించుకోవడం: సుప్రీంకోర్టు జడ్జిమెంటు ప్రకారం తప్పించుకోవడాన్ని చట్టరీత్యా కూడా చేయొచ్చు. చట్టంలోని లొసుగుల్లోని అంశాలకు లోబడి పన్ను తప్పించుకోవచ్చు. ఉదాహరణకు భార్యా, భర్త ఇద్దరికీ పన్నుభారం వర్తిస్తుంది. వారికి ముగ్గురు పిల్లలు. ముగ్గురికీ స్కూల్ ఫీజులు కడుతున్నారు. అలాంటప్పుడు ఇద్దరి స్కూల్ ఫీజును ఒకరి కేసులో, మిగతా పిల్లల ఫీజును మరొక కేసులో క్లెయిం చేయొచ్చు. ఒకరకంగా కాకుండా మరో విధంగా కట్టడాన్ని ఇంగ్లీషులో disguise taxation అని అంటారు. మారువేషం కాదు. మరో వేషంలాంటిది. అంటే, చేసే వ్యాపారం భాగస్వామ్యం లేదా కంపెనీలాగా చేస్తే 30 శాతం పన్ను పడుతుంది. అలా కాకుండా సొంత వ్యాపారంగా చేస్తే శ్లాబుల వారీగా 10 శాతం, 20 శాతం, 30 శాతం చొప్పున కట్టొచ్చు. బేసిక్ లిమిట్ కూడా వర్తిస్తుంది.సంపూర్తిగా ఆలోచించాలి: పాటల ట్యూనింగ్లాగే ట్యాక్స్ ప్లానింగ్ కూడా ఉంటుంది. గీత రచనను బట్టి స్వర రచన. ఏదైనా ఏడు స్వరాల్లో ఇమడాలి. పూర్తి సమాచారం ఉండాలి. చట్టాన్ని అతిక్రమించకూడదు. పన్ను భారం తగ్గాలి, చట్టప్రకారం జరగాలి.పన్నుకు సంబంధిచిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.com కు ఈ-మెయిల్ పంపించగలరు -
మంచి మాట: దృష్టి.. ఒక జీవిత పథం
‘ఇతరులకు గోచరం కానిది చూడగలగటమే దృష్టి అంటే...’’ అన్నాడు ప్రముఖ ఆంగ్ల నవలా రచయిత జోనాథన్ స్విఫ్ట్. ఎవరూ చూడలేని వైపు ఆలోచనా దృష్టిని ప్రసరింప చేయగలగటమే దృష్టి. చాలా మందికి తట్టని ఆలోచన ఒకరికి తట్టడం, ఒక నిశితమైన చూపు. దృష్టి ఒక శోధన, అన్వేషణ, దార్శనికత, సృజన, సంస్కారం, అద్భుత ఊహ. ఒక జీవిత పథం. చర్మ చక్షువులు మనకి బాహ్య దృష్టిని మాత్రమే ఇస్తాయి. దానివల్ల ఈ సమస్త ప్రపంచాన్ని చూడగలం. దీనిని కేవలం చూపు అంటాం. మనం చూసే ప్రపంచాన్ని, దాని పోకడను, వైఖరిని , వర్తనను చూపిస్తున్న మన నయనానికి ఆలోచనను కలిపి చూడటమే అంతర దృష్టి. దీనినే మనోనేత్ర మంటాం. ఈ దృష్టి కొందరికి సహజం. కొందరికి చదువు వల్ల వస్తుంది. ఇంకొందరికి జీవితం నేర్పుతుంది. సాధన వల్ల కూడ సాధ్యమే. మస్తిష్క సాగరంలో వచ్చే ఆలోచనా తరంగాలను దాటి చాలా లోతుగా వెళ్ళటం దృష్టే. మనకందరకూ ఆలోచనలు వస్తాయి. కొన్ని క్లిష్టమైన సందర్భాలలో, సమస్యల విషయంలో మనం తీవ్రంగా యోచించి పరిష్కారం లేదా సమాధానం కనుక్కోవలసివస్తుంది. అప్పుడు ఒక పరిధి.. పరిమితి లేకుండా ప్రసరించే మన ఆలోచనా కిరణాలను సమీకరించుకుని ఒక చోట కేంద్రీకృతం చేయాలి. ఇలా అందరూ చేయలేరు. మనలో కొందరికే ఆ శక్తి సామర్థ్యాలుంటాయి. వారు సమస్య మూలాలలోకి తమ దృష్టిని ప్రవహింప చేయగలరు. అపుడది శక్తిమంతమై మనం వెతుకుతున్న ప్రశ్నకు సమాధానం దొరికేటట్టు చేస్తుంది. మన దృష్టిని సమస్య అన్ని కోణాలవైపు చొప్పించాలి. అన్ని దిశలలో వెళ్ళాలి. లోతుల్ని తాకాలి. మన చుట్టూ ఎంతో ప్రపంచముంది. దానిలో అగణితమైన మనుష్యులున్నారు. ఎన్నో సుందర దృశ్యాలున్నాయి. హృదయ విదారకమైన దృశ్యాలు వున్నాయి. వాటిని మన కళ్ళు పరిశీలిస్తాయి. మన దృష్టిని బట్టి ఒక బలమైన ముద్ర పడుతుంది. ఓ అనుభూతి.. కొన్ని భావనలు ఏర్పడతాయి. అవి ఏ రకంగా ఉంటాయి, ఏ స్థాయి లో ఉంటాయన్నది మన దృష్టి వల్ల ఏర్పడిన సంస్కారాన్ని బట్టి ఉంటుంది. ఒక మల్లెమొగ్గ రేకులు విప్పుకుని, వికసించి తన పరిమళాన్ని నలుదిశలా వెదజల్లుతుంది. కొన్ని గంటల తరువాత వాడి.. రేకులు ఒక్కొక్కటిగా భూమి మీదకు విడుస్తూ పూర్తిగా నశించిపోతుంది. ఇది చాలా సహజం..అతి సాధారణం. ఇలా అనుకునే వారు మనలో చాలా మంది వుంటారు. ఇది ఒక దృష్టి. ఈ సహజ పరిణామాన్ని కొందరు జీవితానికి అన్వయించి లోతుగా ఆలోచిస్తారు. మనిషి జీవితం కూడ ఆ మల్లె పువ్వు లాగా అశాశ్వతమైనది. మనిషి ప్రాణం విడవక తప్పదని గ్రహించి మూన్నాళ్ళ ముచ్చటే ఈ జీవితమన్న ఎరుకతో దాన్ని మల్లెపువ్వులా పరిమళ భరితం చేసుకోవాలని చూసే దృష్టి మరికొందరిది. జీవితాని కొక విలువ.. సార్థకత తెచ్చుకోవాలని వారి వైఖరి. మంచితనంతోనే అది సాధ్యం. ఆ దృష్టే వారి పేరును.. వారు చేసిన పనులను ప్రజల మనస్సుల్లో తరతరాలు నిలిచిపోయేటట్లు చేస్తుంది. అపుడా మనస్సులు సుగంధ పారిజాతాలవుతాయి. ఇది నిశిత దృష్టి. శాశ్వతత్వానికి.. ఆశాశ్వతత్వానికి ఉన్న భేదాన్ని గుర్తెరిగే అద్భుత దృష్టి. చేపట్టే పనులు.. వ్యాపారాలలో కొందరి బుద్ధి కొత్త పుంతలు తొక్కుతుంది. రకరకాల మార్గాలలో అన్వేషణ చేస్తారు ఎలాగైనా విజయం సాధించాలని పట్టుదలతో కష్టిస్తారు. ఇది ఒక రకమైన దృష్టి. ఒక పుస్తకాన్ని చదివే క్రమంలో.. ఆకళింపు చేసుకోవటంలో కూడా దృష్టి వుంటుంది. పైపైన చదివి అర్ధం చేసుకునేవారు కొందరైతే, ఆ కనిపించే వాక్యాల అంతరార్థాన్ని పట్టుకునే యత్నం కొందరు చేస్తారు. ఈ దృష్టికలవారే రచయిత ఆలోచనను పట్టుకుని.. రచనలోని ఆత్మను చేరుకుంటారు. ఎంత లోతుగా వెళ్ళగలరో అంతవరకూ వెళ్ళగలరు. అంతే కాదు . వారి దృష్టి చెదరదు. తోవను వీడదు. చేర వలసిన చోటుకు చేరుకొని సఫలీకృతులవుతారు. తమ కాలానికి .. దూరంగా తమ ఆలోచనా దృష్టిని ప్రసరింప చేయగలిగే ప్రతిభా సంపన్నులు కొందరుంటారు. సమాజంలో అనేక రంగాలలో చోటు చేసుకునే అనేక పరిణామాలు భవిష్యత్తులో ఏ రూపాన్ని తీసుకుంటాయి... వాటి ప్రభావం ఎలా వుంటుంది, సమస్యలకు పరిష్కారం ఏమిటనే యోచనే వీరిది. ఈ దృష్టికే దార్శనికతని పేరు. వీరు నాయకులు కావచ్చు... సామాజిక విశ్లేషకులూ కావచ్చు.. వేదాంతులూ కావచ్చు. తమ చుట్టూ ఉన్న బాధార్తులు... దాహార్తుల గురించి ఆలోచించే వారుంటారు. వారందించే ఆపన్న హస్తం మానవత్వానికి చిహ్నం. కరుణకు సంకేతం. ఇది ఒక రకమైన దృష్టి. విద్యావేత్తలు విద్యావిధానాలను సమాజానికి కనుగుణంగా తయారు చేస్తారు. దాని కెంతో మేధోమధనం కావాలి. ఈ విద్యావిధానాలనే విత్తనాలు భవిష్యత్తులో ఫలానా విధంగా ఫలవంతమవుతాయనే అద్భుత ఊహాశక్తి, ఆలోచన... దృష్టి వల్లే సాధ్యమవుతాయి. ‘కేవలం చూవు మాత్రమే ఉండి.. దృష్టి లేనివాడు ఈ ప్రపంచంలో అతి దయనీయుడైన వ్యక్తి..’ అన్నారు హెలెన్ కెల్లర్. ఎంత అద్భుతమైన మాటలు! చూపు ఉన్నవారందరికి దృష్టి ఉండాలని కానీ.. చూపు లేనివారికి దృష్టి ఉండకూడదన్న నియమం గాని లేదన్న భావనను ఎంత బాగా చెప్పారో! నదిలో కొట్టుకుపోతున్నది ఆడ.. మగా అని కాక ఒక జీవి అన్న భావనలో రక్షించానన్న శిష్యుడి మాటల్లో.. రసవిహీనంగా ఉండి గంటపాటు సాగిన ఒక ఉపన్యాసాన్ని విని.. ఎలా మాట్లాడకూడదో నేర్చుకున్నానన్న వ్యక్తి మాటల్లో వ్యక్తమయ్యేది వారి దృష్టి మాత్రమే. అది ఎంత లోతైనదో.. స్పష్టమైనదో చూడండి. అటువంటి మనోనేత్రం మనకందరకూ కావాలి. దాన్ని అలవరచుకునే ప్రయత్నం చేయాలి. పొందాలి. దాన్ని కార్యరూపంలోకి తీసుకురావాలి. అలా కానట్లయితే అది పుస్తకాలనుండి నేర్చుకున్న జ్ఞానంలా మిగిలిపోతుంది. పుస్తకజ్ఞానాన్ని సందర్భానికి తగిన విధంగా, ఆపద్ధర్మంగా మంచి కోసం వాడుకోవాలి. దీనినే ఇంగిత జ్ఞానమంటారు. అలా వాడటానికి వివేచన అనే దృష్టి కావాలి. జీవితమంటే ఏమిటి.. దాని పథం ఏమిటో స్పష్టమైన దృష్టిని ఏర్పరచుకుని పయనించాలి. మనం నేర్చిన విద్య యొక్క సారాన్ని జీర్ణించుకోవాలి. జీవన క్రమంలో ఎదురయ్యే అనుభవాలను.. సత్యాలను పొదవుకోవాలి. అటువంటి జీవితం ఎటువంటి కుదుపులొచ్చినా అతలాకుతలమవ్వక ఒక ప్రశాంత స్థితిలో సాగుతుంది. మనం ప్రపంచాన్ని.. మనుష్యుల స్వభావాలను.. మనస్తతత్వాలను ఆకళింపు చేసుకున్న తీరు మన దృష్టికి దర్పణం. మన దృష్టి మన వ్యక్తిత్వాన్ని... ఆలోచనా విధానాన్ని... జీవిత దృక్పథాన్ని.. మనం జీవితాన్ని అర్థం చేసుకున్న తీరును తేటతెల్లం చేస్తుంది. దృష్టి ఆవశ్యకత ఏమిటి.. దాన్ని ఏర్పరచు కోవాలా అనే సందేహాలు వచ్చే వారుంటారు. దృష్టి మన జీవితాన్ని పరిపుష్టం చేస్తుంది. ఒక గౌరవం.. ఒక హుందాతనాన్నిస్తుంది. జీవితానికొక సమతౌల్యతనిస్తుంది. దృష్టి వ్యక్తి వికాసానికెంత అవసరమో... దేశవికాసానికి అంతే అవసరం. కేవలం చూవు మాత్రమే ఉండి.. దృష్టి లేనివాడు ఈ ప్రపంచంలో అతి దయనీయుడైన వ్యక్తి.. – లలితా వాసంతి -
డేంజరస్ ఎంటర్టైన్మెంట్!
రియాలిటీ షోలు వచ్చిన తరువాత వినోదం కొత్తదారి పట్టింది. ఇలాగే ఉండాలి అన్న నియమమేమీ లేకపోవడం, ఒకదాన్ని మించి ఒకటి ఉండాలన్న పోటీతత్వం పెరిగిపోవడం వంటి కారణాలతో కొత్త కొత్త కాన్సెప్టులు పుట్టుకొచ్చాయి. వాటిలో కొన్ని షోలు ఎంటర్టైన్ చేయడమే లక్ష్యంగా సాగిపోతుంటే... మరికొన్ని ఉత్కంఠను రేపి ఊపిరాడనివ్వని టెన్షన్‌ని క్రియేట్ చేయడమే ధ్యేయంగా రూపొందుతున్నాయి. ఒత్తిడి నుంచి విముక్తి కోసం, ఆహ్లాదం కోసమే వినోదం అన్న భావనలను చాలా చానెళ్లు తీసి పారేస్తున్నాయి. నరాలు తెగిపోయే ఉత్కంఠను రేపి మరీ టీవీ సెట్లకు ప్రేక్షకులని కట్టిపడేయాలని చూస్తున్నాయి. అందుకే ఖత్రోంకే ఖిలాడీ, ఫియర్ ఫ్యాక్టర్, సర్వైవర్, సూపర్, ఎండ్యూరెన్స్ లాంటి కార్యక్రమాలు ఊపిరి పోసుకున్నాయి. ప్రేక్షకులు ఊపిరి బిగబట్టి చూసేలా చేస్తున్నాయి. ఒక వ్యక్తిని వాహనం ముందువైపున కట్టేస్తారు. వేగంగా వాహనాన్ని పోనిస్తూ అడ్డొచ్చినవన్నీ గుద్దేస్తుంటారు. అయినా ఆ వ్యక్తి తట్టుకుని నిలబడాలి. అలాగే... ఓ తొట్టినిండా పాములు, తేళ్లు తదితర విష ప్రాణులను వేసి, అందులో దిగమంటారు. ఎవరు ఎక్కువసేపు ఉంటే వాళ్లే విజేత. ఓ నది మీదో, కొలను మీదో ఎత్తులో ఒక చక్రాన్ని బిగిస్తారు. అది గిరగిరా తిరుగుతూ ఉంటుంది. దాని మీద నడుస్తూ విన్యాసాలు చేయాలి. పడిపోతే మార్కులు పోయినట్టే. ఓ కేక్‌ని తెచ్చి పార్టిసిపెంట్స్ ముందు పెడతారు. దాన్నిండా పురుగులు ఉంటాయి. అయినా అసహ్యించుకోకుండా తినాలి. కక్కితే పోటీ నుంచి చెక్కేయాల్సిందే. ఇవన్నీ చూడ్డానికే మనకి భయమేస్తే... చేసేవాళ్లకి ఎన్ని గట్స్ ఉండాలి! అయినా కూడా చేసేందుకు బోలెడంతమంది సిద్ధంగా ఉంటున్నారు. విదేశాల్లో ప్రసారమయ్యే ఈ తరహా షోలలో మామూలు వ్యక్తుల్నే తీసుకుంటారు. కానీ మన దేశంలో ప్రసారమయ్యే ‘ఖత్రోంకే ఖిలాడీ’లాంటి షోలలో సెలెబ్రిటీలు పాల్గొంటారు. వాళ్లకంత అవసరం ఏమొచ్చింది అనుకోవచ్చు. లక్షల్లో ప్రైజ్ మనీ వస్తుంటే వాళ్లు మాత్రం కాదంటారా? కాసేపు ఊపిరి బిగబడితే, గుండె దిటవు చేసుకుంటే బోలెడంత సొమ్ము, దానికితోడు అంతవరకూ లేని ఓ డిఫరెంట్ ఇమేజ్! అందుకే వాళ్లు ఈ విన్యాసాలకు ఓకే అంటున్నారు. అయితే... దీన్ని వినోదం అనగలమా? వాళ్లు ఎత్తుల మీది నుంచి ఎక్కడ పడిపోతారోనని ఇక్కడ ప్రేక్షకుడు టెన్షన్ పడి పోతుంటాడు. ఒంటిమీద పాకుతున్న విష పురుగులు కరుస్తాయేమో, ఏ పామో కాటేస్తుందేమోనని పార్టిసిపెంట్ కంటే ప్రేక్షకుడే ఎక్కువ కంగారుపడుతుంటాడు. అక్కడ వాళ్లు పురుగులున్న ఫుడ్ తింటుంటే ఇక్కడ వీళ్లు డోక్కుంటూ ఉంటారు. జుగుప్స కలిగించే, మానసిక ఒత్తిడిని పెంచే ఇలాంటి వినోదం అవసరమా చెప్పండి! అయినా ఎవరినీ చూడొద్దని అనలేం. చూసేవాళ్లు ఉన్నప్పుడు తీయొద్దనీ అనలేం. కాబట్టి ఈ డేంజరస్ ఎంటర్టైన్మెంట్ని కామ్‌గా భరించాల్సిందే!