డేంజరస్ ఎంటర్‌టైన్‌మెంట్!
రియాలిటీ షోలు వచ్చిన తరువాత వినోదం కొత్తదారి పట్టింది. ఇలాగే ఉండాలి అన్న నియమమేమీ లేకపోవడం, ఒకదాన్ని మించి ఒకటి ఉండాలన్న పోటీతత్వం పెరిగిపోవడం వంటి కారణాలతో కొత్త కొత్త కాన్సెప్టులు పుట్టుకొచ్చాయి. వాటిలో కొన్ని షోలు ఎంటర్‌టైన్ చేయడమే లక్ష్యంగా సాగిపోతుంటే... మరికొన్ని ఉత్కంఠను రేపి ఊపిరాడనివ్వని టెన్షన్‌ని క్రియేట్ చేయడమే ధ్యేయంగా రూపొందుతున్నాయి.
ఒత్తిడి నుంచి విముక్తి కోసం, ఆహ్లాదం కోసమే వినోదం అన్న భావనలను చాలా చానెళ్లు తీసి పారేస్తున్నాయి. నరాలు తెగిపోయే ఉత్కంఠను రేపి మరీ టీవీ సెట్లకు ప్రేక్షకులని కట్టిపడేయాలని చూస్తున్నాయి. అందుకే ఖత్రోంకే ఖిలాడీ, ఫియర్ ఫ్యాక్టర్, సర్వైవర్, సూపర్, ఎండ్యూరెన్స్ లాంటి కార్యక్రమాలు ఊపిరి పోసుకున్నాయి. ప్రేక్షకులు ఊపిరి బిగబట్టి చూసేలా చేస్తున్నాయి.
ఒక వ్యక్తిని వాహనం ముందువైపున కట్టేస్తారు. వేగంగా వాహనాన్ని పోనిస్తూ అడ్డొచ్చినవన్నీ గుద్దేస్తుంటారు. అయినా ఆ వ్యక్తి తట్టుకుని నిలబడాలి. అలాగే... ఓ తొట్టినిండా పాములు, తేళ్లు తదితర విష ప్రాణులను వేసి, అందులో దిగమంటారు. ఎవరు ఎక్కువసేపు ఉంటే వాళ్లే విజేత. ఓ నది మీదో, కొలను మీదో ఎత్తులో ఒక చక్రాన్ని బిగిస్తారు. అది గిరగిరా తిరుగుతూ ఉంటుంది. దాని మీద నడుస్తూ విన్యాసాలు చేయాలి. పడిపోతే మార్కులు పోయినట్టే. ఓ కేక్‌ని తెచ్చి పార్టిసిపెంట్స్ ముందు పెడతారు. దాన్నిండా పురుగులు ఉంటాయి. అయినా అసహ్యించుకోకుండా తినాలి. కక్కితే పోటీ నుంచి చెక్కేయాల్సిందే.
ఇవన్నీ చూడ్డానికే మనకి భయమేస్తే... చేసేవాళ్లకి ఎన్ని గట్స్ ఉండాలి! అయినా కూడా చేసేందుకు బోలెడంతమంది సిద్ధంగా ఉంటున్నారు. విదేశాల్లో ప్రసారమయ్యే ఈ తరహా షోలలో మామూలు వ్యక్తుల్నే తీసుకుంటారు. కానీ మన దేశంలో ప్రసారమయ్యే ‘ఖత్రోంకే ఖిలాడీ’లాంటి షోలలో సెలెబ్రిటీలు పాల్గొంటారు. వాళ్లకంత అవసరం ఏమొచ్చింది అనుకోవచ్చు. లక్షల్లో ప్రైజ్ మనీ వస్తుంటే వాళ్లు మాత్రం కాదంటారా? కాసేపు ఊపిరి బిగబడితే, గుండె దిటవు చేసుకుంటే బోలెడంత సొమ్ము, దానికితోడు అంతవరకూ లేని ఓ డిఫరెంట్ ఇమేజ్! అందుకే వాళ్లు ఈ విన్యాసాలకు ఓకే అంటున్నారు.
అయితే... దీన్ని వినోదం అనగలమా? వాళ్లు ఎత్తుల మీది నుంచి ఎక్కడ పడిపోతారోనని ఇక్కడ ప్రేక్షకుడు టెన్షన్ పడి పోతుంటాడు. ఒంటిమీద పాకుతున్న విష పురుగులు కరుస్తాయేమో, ఏ పామో కాటేస్తుందేమోనని పార్టిసిపెంట్ కంటే ప్రేక్షకుడే ఎక్కువ కంగారుపడుతుంటాడు. అక్కడ వాళ్లు పురుగులున్న ఫుడ్ తింటుంటే ఇక్కడ వీళ్లు డోక్కుంటూ ఉంటారు. జుగుప్స కలిగించే, మానసిక ఒత్తిడిని పెంచే ఇలాంటి వినోదం అవసరమా చెప్పండి! అయినా ఎవరినీ చూడొద్దని అనలేం. చూసేవాళ్లు ఉన్నప్పుడు తీయొద్దనీ అనలేం. కాబట్టి ఈ డేంజరస్ ఎంటర్‌టైన్‌మెంట్‌ని కామ్‌గా భరించాల్సిందే!