నేను మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసిన ప్రతిసారీ నాకు కేటాయించే యూనిట్ల విలువ కొంత తక్కువగా ఉంటుంది. కాకపోతే నా పెట్టుబడులు, నాకు కేటాయించే యూనిట్ల మధ్య వ్యత్యాసం చాలా స్వల్పంగానే ఉంటోంది. ఎందుకు ఇలా? - నంబూద్రి ప్రసాద్
మీరు గుర్తించిన ఈ స్వల్ప వ్యత్యాసం అన్నది మీ ప్రతి పెట్టుబడికి సంబంధించి మినహాయించే స్టాంప్ డ్యూటీ. అన్ని మ్యూచువల్ ఫండ్స్ కొనుగోళ్లకు దీన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది. పెట్టుబడి విలువపై 0.005 శాతాన్ని స్టాంప్ డ్యూటీ చార్జీ కింద వసూలు చేస్తారు.
ప్రతి పెట్టుబడి మొత్తంలో ఈ మేరకు మినహాయించగా, మిగిలిన మొత్తానికి యూనిట్ల కేటాయింపు జరుగుతుంది. ఉదాహరణకు సిప్ రూపంలో రూ.5,000 ఇన్వెస్ట్ చేశారు. ఇందులో 0.005 శాతం అంటే రూ.0.25 అవుతుంది. అప్పుడు రూ.4,999.75 మొత్తం పెట్టుబడి కిందకు వెళుతుంది. సిప్‌లు, ఏక మొత్తంలో పెట్టుబడులు, డివిడెండ్ రీ ఇన్వెస్ట్‌మెంట్ లావాదేవీలు అన్నింటికీ వర్తిస్తుంది.
ఒక మ్యూచువల్ ఫండ్ నుంచి మరో మ్యూచువల్ ఫండ్‌లోకి బదిలీ, మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడుల ఉపసంహరణకు స్టాంప్ డ్యూటీ వర్తించదు. చట్టపరమైన ఈ చార్జీల గురించి పెద్దగా ఆలోచించకుండా, పెట్టుబడుల ప్రణాళిక, దీర్ఘకాలిక లక్ష్యాలపై దృష్టి సారించండి.
నా మూడేళ్ల మనవడి భవిష్యత్ అవసరాల కోసం ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నాను. ఇందుకు అనుకూలించే ఫండ్స్ ఏవి? వాటి విషయంలో ఎలా వ్యవహరించాలి? - రవిగుప్తా
పిల్లల ఉన్నత విద్య కోసం ఈక్విటీ, అగ్రెస్సివ్ ఈక్విటీ ఫండ్స్ అనుకూలంగా ఉంటాయి. ఈక్విటీ పెట్టుబడుల పట్ల సౌకర్యంగా లేకపోతే అప్పుడు అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవచ్చు. దీనికి అదనంగా ఒకటి లేదా రెండు మిడ్‌క్యాప్ ఫండ్స్‌ను పరిశీలించొచ్చు. 15 ఏళ్ల కాలంలో మార్కెట్లు ఎన్నో ఎత్తు పల్లాలు చూసినప్పటికీ డైవర్సిఫైడ్ పోర్ట్‌ఫోలియో (వైవిధ్యమైన పెట్టుబడులతో కూడిన) మెరుగైన రాబడులు ఇస్తుంది. కాకపోతే పెట్టుబడులు అలాగే కొనసాగించి, మధ్య మధ్యలో వచ్చే మార్కెట్ పతనాలను పట్టించుకోకుండా ఉంటే చాలు.
మార్కెట్ ఊగిసలాటల్లో పెట్టుబడులు కొనసాగించడం ద్వారానే దీర్ఘకాలంలో విజయం సాధించగలరు. మనవడు, మనవరాలి భవిష్యత్ అవసరాల కోసం ఇన్వెస్ట్ చేసుకునేందుకు రెండు రకాల విధానాలను అనుసరించొచ్చు. చిన్నారి పేరు మీద బ్యాంక్ ఖాతా తెరవాలి. ఈ ఖాతాలోకి నగదు బదిలీ చేయాలి. తర్వాత ఎంపిక చేసిన పథకాల్లో ఇన్వెస్ట్ చేయాలి.
ఇదీ చదవండి: క్రెడిట్ కార్డుతో అద్దె కడుతున్నారా.. ఈ విషయాలు తెలుసా?
మనవడి పేరు మీదే ఖాతా ఉంటుంది కనుక 18 ఏళ్లు నిండిన తర్వాత సంబంధిత ఖాతా యాజమాన్య హక్కులు చిన్నారికి బదిలీ చేయవచ్చు. లేదంటే మీ మనవడికి బదులు మీ పేరు మీదే పెట్టుబడులు పెట్టుకోవడం మరొక ఆప్షన్. మనవడికి 18 ఏళ్లు నిండగానే, ఆ పెట్టుబడులను ఉపహరించుకుని ఆ మొత్తాన్ని మనవడికి గిఫ్ట్ కింద బదిలీ చేయవచ్చు. అప్పటి వరకు ఆ పెట్టుబడులకు నామినీగా మనవడి (మైనర్)ని ప్రతిపాదించొచ్చు.
Comments
Please login to add a commentAdd a comment